Wednesday, November 17, 2010

తారే జమీన్ పర్

ఈచిత్ర కథనం ఎనిమిదేళ్ళ బాలుడు ఇషాన్ అవస్తీ గురించి తెలియజేస్తుంది. ఈ బాబు ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. ఇషాన్‌ది ఒక రంగుల ప్రపంచం. చదువుమీద కన్నా నక్షత్రాలు, రంగులు, పక్షులు, జంతువులు, గాలిపటాలన్నా చాలా ఇష్టం. చదువులో వెనకబడటంతో ఇషాన్ తల్లిదండ్రులు బోర్డింగ్ స్కూలుకి పంపిస్తారు. అందరూచిన్నచూపు చూపు చూసే ఇలాంటి పిల్లల్లో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుందనే తెలిచెప్పే టీచర్ పాత్రలో ఆమిర్‌ఖాన్ నటించాడు.

టైటానిక్

ప్రముఖ హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం ‘టైటానిక్’. కేట్ విన్‌స్లెట్, లియోనార్డో డి కాప్రియో నాయికానాయకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా అంతా ఒక ‘టైటానిక్ నౌక’. దాని మొదటి ప్రయాణంలోనే ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించారు జేమ్స్ కేమరూన్. చలన చిత్ర పరిశ్రమలోనే రికార్డులను బ్రేక్ చేసిన చిత్రంగానే కాక 11 ఆస్కార్‌లను కైవసం చేసుకున్న ప్రేమ కథా కావ్యం

దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే

సిమ్రన్ (కాజోల్) తండ్రి లండన్‌లో స్థిరపడిన భారతీయుడు. కూతురు పట్ల ఎంతో కఠినంగా ఉంటుంటాడు. తండ్రి అనుమతితో సిమ్రన్ తన స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వెళుతుంది. అక్కడ లండన్ నుండి వచ్చిన రాజ్ (షారుఖ్ ఖాన్) పరిచయం స్నేహంగా మారుతుంది. క్రమేణా రాజ్ సిమ్రన్‌ని ప్రేమిస్తాడు. కాని ఆమెకు ప్రేమంటే అయిష్టత ఉంటుంది. ఆమె తన తండ్రి నిశ్చయించిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇంతకీ సిమ్రన్ రాజ్ ప్రేమను గుర్తిస్తుందా?

దిల్ తో పాగల్ హై

రాహుల్ (షారుఖ్‌ఖాన్) ఓ నాటక కంపెనీ దర్శకుడు. నిషా ఓ మంచి నృత్య కళాకారిణి. వారిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది. అయితే అది కేవలం తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధం లాంటిదే. ఓరోజు అనుకోకుండా రాహుల్ మీద నిషాకు ప్రేమభావం కలుగుతుంది. నిషా తానింక నాటకాలు మానేసి లండన్ వెళ్ళాలనుకుంటుంది. దాంతో రాహుల్ తప్పనిసరి పరిస్థితిలో కొత్త డ్యాన్సర్‌ను వెదుక్కోవలసి వస్తుంది. కొత్త డ్యాన్సర్ పూజతో రాహుల్ ప్రేమలో పడతాడు. అయితే పూజ అప్పటికే అజయ్ (అక్షయ్ కుమార్)ని ప్రేమిస్తుంటుంది. చివరికి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో

Tuesday, November 16, 2010

మొదటి సినిమా-శ్రీను వైట్ల


‘నీకోసం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై, మొదటి సినిమాకే ఏడు నంది బహుమతుల్ని గెలుచుకుని, ‘ఎవరీ సరికొత్త టేకింగ్ ఉన్న కుర్రాడూ..!?’ అని అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీను వైట్ల ‘ఆనందం’ తో ఎంత సక్సెస్ సాధించారో అందరికీ తెలుసు. అప్పటినుంచీ తన దిగ్విజయయాత్ర కొనసాగిస్తున్న శ్రీను వైట్ల గారు తన మొదటి సినిమా జ్ఞాపకాలని ఇలా పంచుకుంటున్నారు..

మాది తూర్పు గోదావరి జిల్లా లో రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు.. వాళ్ళు, అత్తయ్యలూ కలిసి చాలా పెద్ద ఫేమిలీ. అందరి మధ్యలో నా బాల్యం సరదాగా గడిచిపోయింది. ఎప్పుడు ఎలా మొదలైందో మొదలైందో తెలీదు కానీ చిన్నప్పటి నుంచీ సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెయ్యాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే ఉండేది.. ఏమి చెయ్యాలో తెలీదు, అది ఎలా సాధ్యపడుతుందో కూడా ఆలోచించలేని వయసు. పైగా మాదొక చిన్న పల్లెటూరు, సినిమా రంగమంతా ఉండేది మద్రాసులో.. అస్సలు ఎక్కడా పొసగని దూరాలు. ఐనా నా ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతుండేవి..
ఇంటర్మీడియట్‍కి వచ్చేసరికి, 1984 లో, కాకినాడ వెళ్ళి చదువుకుంటానని ప్రపోజల్ పెట్టాను. పక్కనే రామచంద్రాపురంలో కాలేజీ ఉన్నా, కాకినాడ ఎందుకు వెళ్తానన్నానంటే అక్కడైతే మనల్నెవరూ చూడరూ, విడిగా రూమ్ లో ఉంటూ ఇష్టమొచ్చినన్ని సినిమాలు చూడొచ్చు అని.. ఆ విధంగా 1984-86 మధ్యలో కాకినాడలో ఇంటర్మీడియట్‍ చదువుతూ ఎడాపెడా సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేవాడిని. ఫ్రెండ్స్ అందరూ హీరోల్ని ఆభిమానిస్తుంటే నేను మాత్రం మణిరత్నం గారిని అభిమానిస్తుండేవాడిని. డైరెక్టర్ కావాలన్న ఆలోచన అప్పట్లోనే ఉండేదేమో అంతగా గుర్తులేదు. చదువు విషయానికొస్తే, మరీ తప్పితే తిడతారు కాబట్టి పాసవడానికి కావల్సినంత చదివి ఎలాగైతేనేం ఇంటర్మీడియట్‍ పూర్తిచేశాను. కథలు వ్రాయడం, నాటకాలు వేయడం.. ఇలాంటివేమీ లేవు. ఉన్న టైమంతా సినిమాలు చూడ్డమే.!
తరువాత బి.ఎస్సీ చదవడానికి మళ్ళీ కాకినాదకే వచ్చాను. ఐతే ఇంక అప్పటికే సినిమా జ్ఞానమంతా ఒంటబట్టేసింది కాబట్టి మద్రాసు వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చేశాను. బి.ఎస్సీ లో చేరిన నాలుగైదు నెలలకే ఫీజులు కట్టడానికని ఇంట్లో ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని బొకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కేశాను మద్రాసుకి..!
మద్రాసు ఎలా ఉంటుందో తెలీదు.. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు.. ప్రయాణం మొదలైంది. ట్రైన్‍లో ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. అతనిది మద్రాసు దగ్గరలోనే ఏదో ఒక ఊరు. అతని స్నేహితుడు జాస్తి చౌదరి అనే అతను మద్రాసులో ఉంటాడని చెప్పి అడ్రసూ ఇచ్చి, ఎప్పుడైనా వీలైతే కలుసుకోమని చెప్పాడు.. మన బుర్ర వేగంగా పనిచేసింది, ముక్కూ మొహం తెలీని మద్రాసులో దిగగానే ఏం చెయ్యాలో అప్పుడే నిర్ణయించుకున్నాను.
మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో దిగగానే తెలిసిందేమిటంటే అక్కడ సిటీ బస్సులన్నీ సమ్మె ఆ రోజు. చేతిలో జాస్తి చౌదరి అనే అపరిచిత స్నేహితుడి చిరునామా ఉంది. పాండీ బజార్.. ఎంత దూరం ఉంటుందో తెలీదు. నడవడం మొదలుపెట్టాను. అలా దాదాపు 15 కి.మీ. దూరం నడిచి వెళ్ళి జాస్తి చౌదరి రూమ్ తలుపు తట్టాను. రైల్లో కలిసిన కుర్రాడు నాకు బాగా ఫ్రెండు అనీ, అతనే నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడనీ నమ్మకం కుదిరేలా చెప్పాను. అతను సరేనని నేను తనతో మూడు రోజులు ఉండడానికి ఒప్పుకున్నాడు.. ‘అది చాలు, మిగతా విషయాలు మూడు రోజుల తర్వాత ఆలోచిద్దాంలే’ అని అక్కడ తాత్కాలికంగా సెటిలయ్యాను.
ఆ మూడు రోజుల్లోనే బయటికి భోజనానికి వెళ్ళినప్పుడు కృష్ణవంశీ పరిచయమయ్యాడు. ‘నాకు వసతి కావాలని’ అడిగితే తన రూమ్‌లో ఉండమని అన్నాడు. అలా కృష్ణవంశీ రూమ్మేట్‍గా సెటిలయ్యాను. చేతిలో డబ్బులున్నాయి కాబట్టి తిండికేమీ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. అలా మద్రాసు వచ్చిన పదిహేను రోజులకి ఇంటికి ఉత్తరం వ్రాశాను.. ‘ఇలా మద్రాసులో ఉన్నాను, నాకోసమేమీ బెంగపడకండి, నేను క్షేమంగానె ఉంటున్నాను. నేనే మళ్ళీ ఉత్తరం వ్రాస్తాను’ అని. అప్పటికే ఇంట్లో వాళ్ళు నా కోసం తీవ్రంగా వెదుకుతున్నారంట.. నా అడ్రసు తెలిస్తే వచ్చి నన్ను లాక్కెళ్ళిపోవడం ఖాయం.. అందుకే అడ్రసు లేకుండా అప్పుడప్పుడూ నేనే ఉత్తరాలు వ్రాస్తుండేవాడిని. ( ఓ ఆరునెలల తరువాత ఇంటికి వెళ్ళి అందరినీ ఒప్పించి మద్రాసు చేరుకోవడం.. అదంతా మరో కథా. )
అలా కృష్ణవంశీ రూమ్‌లో చేరిన రెండు నెలలకే తను హైదరాబాదు వెళ్ళిపోయాడు. ఇంక రూమ్‌లో ఒక్కడినే మిగిలిపోయాను. ఎలాగైనా సినిమా రంగంలో చిన్న అవకాశం రావాలి అని తిరుగుతుండేవాడిని. అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు గారు అనే ప్రొడ్యూసర్ పరిచయమయ్యారు ( చిన్ని కృష్ణుడు, పడమట సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది ) – నా ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్‍కి నన్ను పరిచయం చేశారు. అప్పుడాయన బాలకృష్ణగారితో ‘ప్రాణానికి ప్రాణం’ అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు గారి వద్ద ఆ సినిమాకి అప్రెంటిస్ గా చేరాను. అలా 1989 మార్చి నెలలో సినిమా రంగంలో నన్ను అడుగుపెట్టనిచ్చిన మొదటి సినిమా ‘ప్రాణానికి ప్రాణం’! సినిమా పుర్తయినంత వేగంగానూ అట్టర్ ఫ్లాప్ అయింది. ‘ఇదేంట్రా బాబూ, పని చేసిన మొదటి సినిమానే ఇలా బాల్చీ తన్నేసిందని’ అనుకుంటుండగా శివ రిలీజై రామ్ గోపాలవర్మ గారి పేరు ఆంధ్ర దేశమంతా మార్మోగిపోవడం మొదలైంది. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరదామని నేనూ హైదరాబాదు చేరుకున్నాను.
ఐతే ఆప్పటికే ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ కొండవీటి చాంతాడంత ఉంది. అక్కడ వీలు కాకపోవడంతో ఏం చెయ్యాలా అని వెదుకుతుండగా ‘ప్రాణానికి ప్రాణం’ రోజుల్లో పరిచయమైన డైరెక్టర్ సాగర్ గారు ఎదురయ్యారు. ఆయన్ని ఒప్పించి అసిస్టెంట్ గా చేరాను.. ఆ సినిమా పేరు ‘నక్షత్ర పోరాటం’ ; నన్ను అసిస్టెంట్‍ని చేసిన మొదటి సినిమా అది..! ఆ విధంగా సాగర్ గారి వద్దనే ‘అమ్మ దొంగా’ సినిమా వరకూ పనిచేశాను. ‘అమ్మ దొంగా’ తరువాత సొంతంగా డైరెక్షన్ చెయ్యగలననే నమ్మకం కలిగి, అసిస్టెంట్ గా మానేసి, కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాను.
తొందరలోనే సాంబిరెడ్డి అనే ఆయన నాకు డైరెక్టర్ గా మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. సినిమా పేరు ‘అపరిచితుడు’ ; రాజశేఖర్ హిరో. మొదటి షెడ్యూలు అవగానే హీరోగారికీ నిర్మాత గారికీ వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల ఆ ప్రోజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ కథ మొదలైంది..! ‘ఏం చెయ్యాలి.. నిరాశ పడి లాభంలేదు. ప్రయత్నాలు కొనసాగించాల్సిందేనని’ అనుకుని మళ్ళీ కథల మీద కూర్చోవడం మొదలెట్టాను. అప్పుడు తయారయిందే ‘నీకోసం’ కథ.
నాతో బాటు పనిచేసిన కెమెరామేన్ నాగురించి కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న బాల్‍రెడ్డి మిత్రబృందానికి చెప్పడంతో వాళ్ళే నా దగ్గరికి సినిమా తీద్దామని రావడం, ‘నీకోసం’ మొదలు పెట్టడం జరిగింది. రవితేజ, మహేశ్వరి కాంబినేషన్. సినిమా నిర్మాణం మొదలైతే ఐంది కానీ ఆది నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రోజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవడం.. మళ్ళా నేనే ఎలానో మరికొంత పెట్టుబడి పెట్టడం.. అలా అష్ట కష్టాలూ పడి సినిమాని పూర్తి చేశాను. 38 లక్షల్లో 28 వర్కింగు డేస్‌లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది.
ఆ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్జున గారు నాకు డైరెక్షన్ ఆఫర్ ఇస్తానన్నారు. అలానే ఆ సినిమ చూసిన రామోజీరావు గారు మొత్తం ఆంధ్రాకి దాన్ని కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. 1999 డిసెంబర్ 3 న రిలీజైంది. సినిమా బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా కోటి రూపాయలు వసూలు చేసి కమర్షియల్‍గా సక్సెస్ అవడమే కాకుండా డైరెక్టర్‍గా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం 7 నంది అవార్డుల్ని కూడా గెలుచుకుంది.. ఉత్తమ కొత్త దర్శకుడిగా నాకు, ఉత్తమ స్క్రీన్‌ప్లే కీ, ద్వితీయ ఉత్తమ చిత్రంగా సినిమాకి కూడా అవార్డులొచ్చాయి. ఆ విధంగా నా దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా ‘నీకోసం’
ఆ సినిమా విజయంతో నామీద నమ్మకంతో రామోజీరావు గారు నాకు ‘ఆనందం’ సినిమాకి అవకాశం ఇచ్చారు. అదెంత కమర్షియల్‍ సక్సెస్ అయిందో మీఅందరికీ తెలుసు. ఇలా చెప్పాలంటే నన్ను దర్శకుడిగా అగ్రస్థాయిన నిలిపిన మొదటి సినిమా ‘ఆనందం’!
ఇన్నాళ్ళ అనుభవంలో తెలిసినదేమిటంటే.. ‘కేవలం సినిమాల మీద ఆసక్తి మాత్రం ఉంటే సరిపోదు. బాగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా తట్టుకునే ఓర్పు ఉండాలి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు బెదిరిపోకుండా నిలిస్తేనే ఎప్పటికైనా విజయం లభిస్తుంది.. కష్టపడే వాళ్ళకి అద్భుతమైన అవకాశాల్నిస్తుందీ చిత్రసీమ..! ఇదొక వండర్‍ఫుల్ ఫీల్డ్!’

Wednesday, November 10, 2010

గురు

గురుకాంత్ దేశాయ్ (అభిషేక్ బచ్చన్) ఏదో ఒకటి సాధించాలనే తపన ఉన్న యువకుడు. అతని తండ్రి గుజరాత్‌లోని ఒక గ్రామంలో ప్రధానోపాధ్యాయుడు. గురు ఆలోచనను వ్యతిరేకించి, నిరుత్సాహపరుస్తుంటాడు అతని తండ్రి. కానీ గురు తన కార్యసాధనకోసం టర్కీకి వెళ్తాడు. అక్కడ కొంతకాలం పనిచేశాక తిరిగి స్వగ్రామానికి వస్తాడు. ముంబైలో బిజినెస్ పెట్టాలని అతని ఆలోచన. కానీ దానికి తగ్గ పెట్టుబడి అతని దగ్గర లేదు. తండ్రి అందుకు సహకరించడు. దాంతో పెళ్లి చేసుకుని, ఆ కట్నంతో వ్యాపారం మొదలెట్టాలని నిర్ణయించుకుంటాడు. సుజాత (ఐశ్వర్యారాయ్)ని పెళ్లి చేసుకుని, బావమరిది జిగ్నేష్‌తో కలిసి ముంబై చేరుకుంటాడు. అక్కడ అతని వ్యాపారం ఎలా సాగింది? అక్కడ ప్రత్యర్థులతో ఎలా నెగ్గుకొచ్చింది? వ్యాపారంలో సక్సెస్ అయ్యాడా? లేదా?

డిస్కో డాన్సర్

అనిల్ (మిధున్ చక్రవర్తికి)కి పాటలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే ధనవంతుడైన ఓబెరాయ్ తన తల్లిని అవమానించడాన్ని కళ్లారా చూసి అతని మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఎలాగైనా డబ్బు, పలుకుబడి సంపాదించాలని పాటలు పాడటాన్నే వృత్తిగా మార్చుకొని మంచి సింగర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అతని పాటల్ని ఇష్టపడిన ఓబెరాయ్ కూతురు అనిల్‌ని ప్రేమిస్తుంది. తన కూతురు ఒక స్ట్రీట్ సింగర్‌ని ప్రేమిస్తుందనే విషయం తెలుసుకున్న ఓబెరాయ్ అనిల్‌ని చంపాలని గిటార్‌లో కరెంటు పెడతాడు. ఆ తరువాత జరిగే