Sunday, November 27, 2011

గులాబీ



జీవితం ఎవరికైనా మొదట లేత గులాబీ రెక్కల్ని కానుకగా ఇస్తుంది. తరువాత ప్రతి మలుపులో ముళ్లను కాపలాగా పెడుతుంది. కృష్ణవంశీ విషయంలో మాత్రం జీవితం తన స్క్రిప్ట్ మార్చుకుంది. మొదట మలుపు మలుపులో ముళ్లను పేర్చి, చివరాఖరున ఒక గులాబీని కానుకగా ఇచ్చింది.

ఊహ తెలిసినప్పటినుంచీ సినిమానే నా ప్రపంచం. అప్పటికీ, ఇప్పటికీ...
నాన్న ఇరిగేషన్ అండ్ పవర్ డిపార్ట్‌మెంటులో ఇంజినీర్. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నాన్నకు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ ఊళ్లో ఇంటర్నేషనల్ మూవీస్ అనే సినిమా హాలు ఉండేది. నాన్న పరపతితో నాకు హాల్ మేనేజ్‌మెంట్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడే సినిమా నన్ను మొదటిసారి ఆకర్షించింది. ఆ సినిమా సహవాసం నన్ను నెమ్మదిగా తన వైపునకు లాక్కుంది. ఒక దశలో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేవుడు చేసిన మనుషులు... వందసార్లు, అల్లూరి సీతారామరాజు... దాదాపు వేయిసార్లు... ఎన్ని సినిమాలు, ఎన్నెన్నిసార్లు! థియేటర్ నా దేవాలయం. షోలే, దీవార్, జంజీర్, ముకద్దర్ కా సికిందర్... అమితాబ్ నా దేవుడు.

సినిమా మినహా వేరే ప్రపంచాన్ని ఊహించలేని స్టేజ్‌కు వెళ్లాను. విషయం నాన్నగారి చెవిన వేశాను. సినిమా నా గమ్యం. పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ అందుకు మార్గం అని చెప్పేశాను. డిగ్రీ లేకపోతే విలువ లేదు కాబట్టి, మొదట అది పూర్తి చేయి అన్నారు. సమాజం నిర్ణయించిన ఒక విలువ కోసం మొదటిసారిగా నా ఇష్టాన్ని చంపుకున్నాను.

డిగ్రీ పూర్తయింది. నాన్నకు మళ్లీ నా గమ్యం గుర్తుచేశాను. ఈసారి పీజీ పూర్తిచేశాక అన్నారు. రెండోసారీ నా ఇష్టాన్ని చంపుకున్నాను. దారి దూరమవుతున్నా గమ్యం స్పష్టంగానే కనిపిస్తోంది.

హిందీ సినిమాలు ఎక్కువ చూడవచ్చనే ఉద్దేశంతో ఆగ్రా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అగ్రికల్చరల్ ఎకనమిక్స్ అనే రేర్ గ్రూపుతో పీజీ చేశాను. ఆ రెండున్నర సంవత్సరాల్లో బోలెడు హిందీ క్లాసిక్స్ చూసి సినిమాను అర్థం చేసుకోవడం ప్రారంభించాను.

కోర్స్ పూర్తయ్యాక మా సొంత ఊరు తిరిగొచ్చి కొంతమంది మిత్రులతో కలిసి థర్డ్ పార్టీ బయ్యర్‌గా సినిమాలు కొనడం ప్రారంభించాను. నేను బయ్యర్‌గా కొన్న సినిమాలు నడిచే థియేటర్‌కు వెళ్లి ప్రొజెక్షన్ నేర్చుకున్నాను. మరోవైపు నాన్న నన్ను సేఫ్‌జోన్ పేరిట ఉద్యోగంలోకి నెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.

నా దృష్టిలో సేఫ్‌జోన్ ఒక పంజరం. సినిమానే నా ప్రపంచం.

గమ్యం చేరాలంటే మొదట ప్రయాణం ఆరంభించాలి. అనుకున్నదే తడవుగా రెక్కలు విప్పి మద్రాసు నగరం వైపు ఎగరటం ప్రారంభించాను. మద్రాసులో మొదట నా దూరపు బంధువు, ప్రముఖ కెమెరామెన్ పి.ఎస్.ప్రకాష్ ఇంటి ముందు వాలాను. ఆయన రికమెండేషన్‌తో రవిప్రసాద్ అవుట్‌డోర్ యూనిట్‌లో లైట్‌బాయ్‌గా చేరాను. నో శాలరీ, ఓన్లీ ఫుడ్. తరువాత కెమెరా అసిస్టెంట్‌గా ప్రమోషన్. కానీ ఏదో అసంతృప్తి, నిరాశ. లక్ష్యం తొందరగా చేరాలంటే గతుకులు లేని రోడ్డులో వెళ్లాలి గానీ, గల్లీల్లోంచి కాదని అర్థమైంది.

వెళ్లని సినిమా ఆఫీసు లేదు. కలవని దర్శకుడు లేడు. కె.విశ్వనాథ్‌గారి ఇంటి ముందైతే నెలల తరబడి నిల్చున్నా ఫలితం లేదు. ఒకే ఒక్క చాన్స్ కోసం కాళ్లరిగేలా, కళ్లు వాచేలా ఎదురుచూశాను. ఉంగరాలు, గోల్డ్ చెయిన్ తాకట్టు పెట్టాను. రూమ్ రెంటు కోసం ఓ మలయాళ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేశాను.

కసి కన్నీళ్లుగా మారే సమయంలో ఒక చేయి నా వెన్ను తట్టింది. పద్మాలయా స్టూడియోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మా ఊరతను దర్శకుడు త్రిపురనేని చిట్టి దగ్గర నన్ను అసిస్టెంట్‌గా పెట్టించాడు. జీవితంలో చిన్న చిన్న అవకాశాలు ఒక్కోసారి ఎంత పెద్ద మార్పులకు దారి తీస్తాయో తెలిసింది.

సిల్క్‌స్మిత వరుసగా నిర్మించిన రెండు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ రెండూ రిలీజయ్యాయో లేదో కూడా తెలీదు. మళ్లీ నిరాశ ముళ్లు. కనిపించని నెత్తుటి గాయాలు. ఇక్కడే నా జీవితాన్ని మలుపు తిప్పే ఓ అద్భుతం జరగబోతోందని అనిపించింది. నా చీకటి ప్రపంచాన్ని వెలుగులతో నింపడానికి వస్తున్న మెరుపును పరిచయం చేయడానికి శివనాగేశ్వరరావు అనే ఉరుము ముందు నన్ను కలిసింది. ఆ మెరుపు పేరు రామ్‌గోపాల్‌వర్మ.

‘శివ’తో ప్రారంభించి వర్మ సాహచర్యంలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను. ఆయన ఆలోచనల అగ్నిలో కాలి పునర్జన్మించాను. క్షణక్షణం, రాత్రి, రాత్, అంతం, ద్రోహి, మనీ, గాయం... సినిమా సినిమాకూ మా బంధం మరింత స్ట్రాంగ్ అయింది. వర్మ ‘రంగీలా’తో హిందీలోకి షిఫ్ట్ అవుతూ నన్ను డెరైక్టర్‌గా పరిచయం చేద్దామనుకున్నారు. పాప అనే సబ్జెక్ట్ చెప్పాను. వర్మ సేస్ నో.

నెక్స్ట్...
‘మనీ’ సక్సెస్‌తో శివనాగేశ్వరరావు బిజీ అవడంతో వర్మ ‘మనీ మనీ’ దర్శకత్వ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆ సినిమా అవుట్‌పుట్ చూసి వర్మ చాలా హ్యాపీ. ఘోస్ట్ డెరైక్టర్‌గా అది నా మొదటి సినిమా. మరి నా పేరుతో నా కైండ్ ఆఫ్ సినిమా ఎప్పుడు?

‘అనగనగా ఒక రోజు’ రూపంలో మళ్లీ అవకాశం వచ్చింది. కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా వర్మ డెరైక్షన్ సీట్లోంచి నన్ను తప్పించి తను బాధ్యతలు స్వీకరించారు. నేను బాస్‌గా ఉండాల్సిన సినిమాకు మా బాస్ దగ్గరే మళ్లీ అసిస్టెంట్‌గా చేశాను.

రెక్కలు కాలి కిందపడ్డాక బూడిదలోంచి లేచి కొత్త కథతో ఎగిరే ప్రయత్నాలు మొదలుపెట్టాను. రామానాయుడు స్టూడియోలో టబును కలిసి కథ చెప్పాను. కన్నీరు మున్నీరైంది. నాయుడుగారి ద్వారా సురేష్‌బాబు తెలుసుకుని మరుసటిరోజు కబురు పంపించారు. కథ చెప్పమన్నారు. నాతో సినిమా తీస్తానని మాటిస్తే కథ చెప్తానన్నాను. కథ నచ్చితే వెంకటేష్‌ను ఇస్తానన్నారు. నాకు జె.డి.చక్రవర్తి చాలన్నాను. అయితే కథ చెప్పమన్నారు. లేదు, ముందు మాటివ్వండన్నాను.

ముందు కథ... సురేష్‌బాబుగారు
ముందు మాట... నేను
రేపు సాయంత్రం దాకా ఆలోచించుకోమన్నారు. నేను నా మాట నుంచీ తగ్గలేదు... ఆయన తన మాట నుంచీ తగ్గలేదు. మళ్లీ అవకాశం పోయింది. పోనీ... రాజీపడటం నా రక్తంలో లేదు.

ఇంతలో రామూగారి నుంచి పిలుపు. ఏబీసీఎల్ సమర్పణలో వర్మ కార్పొరేషన్‌కు సినిమా చేయమన్నారు. యాభై లక్షల్లో సినిమా ఫినిష్ చేస్తానని చెప్పాను. డెబ్భై అయిదు లక్షలిస్తానని చెప్పారు. అయితే, మధ్యలో కాలు కాదు కదా, వేలు కూడా పెట్టొద్దని కండిషన్ పెట్టాను. సంచలనం సృష్టించిన పాతబస్తీ ‘అమీనా’ ఇన్‌స్పిరేషన్‌తో ఒక ప్రేమకథను తయారుచేసుకున్నాను. కథ కత్తిలా కుదిరింది. హీరో జె.డి.చక్రవర్తి, మరి హీరోయిన్.

‘అమ్మాయి కాపురం’లో నటించిన మహేశ్వరి నచ్చడంతో ఆమె సోదరి శ్రీదేవితో చెప్పి ఓకే చేసుకున్నాం. అప్పటిదాకా ఊరూ పేరూ లేని శశిప్రీతమ్ మ్యూజిక్. పదేళ్ల కింద ఇండస్ట్రీ వదిలేసి, గుంటూరులో పడి తిరుగుతున్న జీవాను వెదికిపట్టుకుని మెయిన్ విలన్‌గా పెట్టాను. విలన్ పాత్రలకు బ్రాండ్‌నేమ్‌గా ఉన్న చలపతిరావుది హీరోయిన్ తండ్రిగా సాఫ్ట్ రోల్. చంద్రమోహన్ ఒక్కడే సినిమా మొత్తంలో బాగా సీనియర్ నటుడు.

చివర్లో ఒక పాట పెడదామనుకుని ఇంకేమైనా వినిపించు అన్నాను. తన దగ్గర తనకోసం స్టాక్ పెట్టుకున్న నూట యాభై పాటల్ని నాముందు కుమ్మరించాడు శశిప్రీతమ్. అందులో ఒక ట్యూన్ బాగా నచ్చింది. ఆ ట్యూన్‌ను మా గురువు సీతారామశాస్త్రికి వినిపించి ఓ పాట రాయమన్నాను. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ పాట రాసిపడేశారు. ఆ పాటను మహాప్రసాదంలా కళ్లకద్దుకుని, సునీత అనే కొత్త సింగర్‌తో పాడించాం.

‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ పాటను రికార్డు చేస్తున్నప్పుడు, అనుకోకుండా ఆ పాట విన్న రామూగారు అది సినిమాలో ఉండాల్సిందేనని పట్టుబట్టారు. సిచ్యుయేషన్ లేదన్నాను. అనుకుంటే అదే వస్తుందన్నారు. ఆలోచించి ఈ సాంగ్ బైక్‌మీద షూట్ చేస్తానన్నాను.

నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలంటే ఇరవై లక్షలిస్తాను. అద్భుతంగా షూట్ చేయమన్నారు రామూగారు.
నేను మొండిగా అరకు వెళ్లి బైక్‌మీద సాంగ్ షూట్ చేశాను. ఎడిటింగ్ అయ్యాక చూసిన వర్మ అబ్బురపడ్డారు. అప్పుడు పక్కన థియేటర్‌లో ‘రంగీలా’ డబ్బింగ్ జరుగుతోంది. ఆ పని ఆపేసి సాంగ్‌ను ఆమిర్‌ఖాన్‌కు చూపించి, నా గురించి గొప్పగా చెప్పి తెగ మురిసిపోయారు. తరువాత వర్మ ఎక్కడికి వెళ్లినా ఆ సాంగ్‌ను అందరికీ చూపించారు.

నాకున్న లిమిటెడ్ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టిస్టులను, స్టూడియోలను వాడుకున్నాను. రామానాయుడు స్టూడియోలో సరైన ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో అక్కడ రికార్డింగ్ పెట్టుకోవడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. నేను సాహసించి, నా మొదటి పాట ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ పాటను అక్కడ రికార్డు చేశాను. నా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ వర్క్స్ అక్కడే పూర్తిచేశాను.

సినిమా కథకు తగ్గట్టుగా మొదట ‘చార్మినార్’ టైటిల్‌గా అనుకున్నా. ప్రేమకథకు అది సూటవదని అన్నారు వర్మ. పూల పేర్లలో ఏదో ఒకటి బాగుంటుందేమో ఆలోచించమన్నారు. ఈ కథకు ‘గులాబీ పువ్వు’ అనే టైటిల్ కరెక్ట్ అన్నాను. పువ్వు తీసేసి ‘గులాబీ’ అన్నారు వర్మ. ఆయన కూడా రిలీజ్ అయ్యాకే థియేటర్‌లో చూశారు. సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొన్ని కోట్ల క్షణాలు పడిన తపన, అనుభవించిన ఆవేదన ఆ క్షణంలో తుడిచిపెట్టినట్టయింది.

లక్ష బాధల తరువాత దొరికే ఒక ఆనందానికి చాలా విలువ ఉంటుంది. ఎన్నో ముళ్లు దాటాక దొరికే గులాబీకి ఎక్కువ పరిమళం అంటుతుంది. చాలా గాయాలు తగిలిన పక్షి పాడే పాట మరింత మధురంగా ఉంటుంది. ఇదీ నా మొదటి సినిమా నాకు మిగిల్చిన అపురూపమైన అనుభవం. అమూల్యమైన జ్ఞాపకం.
ఇంటర్వ్యూ: పులగం, క్రాంతి

Friday, November 25, 2011

నా మొదటి సినిమా -వంశీ


 


 





చీకటి దాటేస్తే కనిపించేదంతా వెలుగే. ముళ్లు తప్పిస్తే తగిలేవన్నీ మెత్తని పూలరేకులే. వంశీ సినీజీవన యానమంతా అంతే. అందుకే సముద్ర కెరటాలకే పోటెక్కువ, నా జీవితం మాత్రం ప్రశాంత గోదావరిలా సాగింది అంటారు వంశీ తాత్వికంగా, కొంచెం తన్మయంగా.

గోదావరి వరదై ఉప్పొంగినప్పుడు కొంతమేర సారవంతమైన ఒండ్రుమట్టిని వదిలి వెళ్తుంది. ఆ నేలలో విత్తు నాటితే బంగారం పండుతుంది. ఆ గోదావరి నుంచే వచ్చిన వంశీ అనే వరద సినిమా ప్రపంచంపైకి వెల్లువెత్తి కొన్ని అద్భుత దృశ్యకావ్యాల్ని మన ముందుకు తెచ్చింది. సితార, అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్1 విడుదల లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ సినీజీవనయానంలో తొలి మలుపు ‘మంచుపల్లకి’. దాని గురించి ఆయన మాటల్లోనే...

మా ఊరు పసలపూడి.
పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంటుంది. ఇంద్రధనుస్సు అక్కడే లంగరు వేసుకున్నట్టుగా ఉంటుంది. మా ఏరియాలో ఓ బ్రాహ్మణ పిల్ల ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. నవ్వటం తన సహజ స్వభావం అన్నట్టుగా ఉండేది. ఆమె నవ్వు ప్రేరణతో ‘సత్యసుందరి నవ్వింది’ అనే కథ రాశాను. దాన్ని విజయవాడ రేడియో నుంచి కేంద్రం ‘యువరాణి’ కార్యక్రమంలో చదివాను.

మా ఊరి లైబ్రరీలో పుస్తకాలు విపరీతంగా చదివేవాణ్ని. అప్పట్లో అమలాపురంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పైడిపాల నాకు సాహిత్యంపై ఆసక్తి కలగడానికి ఓ ప్రధాన కారణం.

నా మిత్రుడు రవి పద్నాలుగేళ్ల వయసులో ఫ్రాయిడ్ రచనల్ని తెలుగులోకి అనువదించాడు. ఆ స్ఫూర్తితో అతని రూమ్‌లో కూర్చుని ‘నల్లసుశీల’ కథ రాశాను. అది 1974లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైంది. ఆ తరువాత కర్మభూమి, మంచుపల్లకి నవలలు రాశాను. అప్పటికి నా వయసు పదహారు. రెక్కలు విప్పుకుని తూర్పుగోదావరి నుంచి దక్షిణ దిక్కుకు నేను ఎగిరిపోవాల్సిన సమయం రానే వచ్చింది.

నవలా వ్యాసంగం సాగిస్తున్న సమయంలోనే నాన్న చనిపోయాడు. పద్దెనిమిదేళ్ల లేత వయసులో అదొక పిడుగుపాటు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చీకటి ఊబిలోకి కూరుకుపోతుండగా ఓ అదృశ్య హస్తం నన్ను పైకి లాగింది. కళ్లముందు మసక నెమ్మదిగా తొలగిపోయింది. ఎదురుగా ఓ బంధువు కనిపించాడు. నాతోరా అన్నాడు. నీ అంత తెలివైనవాడు ఇక్కడ కాదు ఉండాల్సింది అని మద్రాసు తీసుకెళ్లాడు. వెళ్లేముందు ముప్ఫై రోజుల్లో తమిళ భాష పుస్తకం చదివి కొంత తమిళం ఒంటబట్టించుకున్నాను.

నాకు మొదటి నుంచీ సినిమాలు చూసే అలవాటుగానీ, సినిమా రంగం వైపు వెళ్లాలన్న ఆలోచన గానీ పెద్దగా లేవు. అయితే చిన్నప్పటినుంచీ బాపుగారంటే చాలా ఇష్టం. ఆయన్నెలాగైనా కలవాలనుకున్నాను. చేతిలో ఓ ఫైలు, రెండు నవలలు. డెరైక్టర్ బాపు ఇల్లెక్కడ అని కనబడినవారందరినీ అడుగుతూ వెళ్లాను. ఒక వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం స్ట్రెయిట్‌గా వెళ్లి ఫస్ట్ లెఫ్ట్ తిరగాలి. కానీ పొరబాటుగా సెకెండ్ లెఫ్ట్‌లో మలుపు తిరిగాను.

బాపుగారి ఇల్లనుకుని విక్టరీ మధుసూదనరావు ఇంటి తలుపు తట్టాను. ఆ ఒక్క మలుపు నా జీవితానికి సరికొత్త గమ్యాన్ని నిర్ధారించింది. ఆయన నా చేతిలోని నవలలు చదివి, ‘ఇవి నువ్వే రాశావా’ అని ఆశ్చర్యపోయారు. పత్రికలవాళ్లు నాకు పంపిన అనుమతి పత్రాలు చూపించాను. కొత్త రెండు రూపాయల నోట్లు ఇరవై నా చేతిలో పెట్టారు. కేసినో థియేటర్‌లో లూయిస్ గిల్బర్ట్ దర్శకత్వం వహించిన ‘ఫ్రెండ్స్’ సినిమా చూసి, సింగిల్‌లైన్ ఆర్డర్ రాసుకురమ్మని చెప్పారు.

ఆ సాయంత్రం సినిమా ఒక్కసారి చూసి రాత్రికి రాత్రి సింగిల్‌లైన్ ఆర్డర్ రాశాను. మరుసటి ఉదయం ఉత్సాహంగా వాళ్ల ఇంటికెళ్లాను. నేను వెళ్లేసరికి ఆయన ఎవరిమీదో కోపంతో అరుస్తున్నారు. నన్ను చూసి, ‘‘వారం తరువాత రమ్మన్నాను కదా’’ అని చిరాకుపడ్డారు. మీరు చెప్పిన పని పూర్తయిందనేసరికి ఆయన అవాక్కయ్యారు. నా చేతిలోంచి కాగితాలు తీసుకుని చదివి, నన్ను గట్టిగా హత్తుకున్నారు. వెంటనే తనతో పాటు ‘మల్లెపూవు’ షూటింగుకు తీసుకెళ్లారు. ఆ తరువాత తన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశమిచ్చారు.

‘ఎదురీత’ అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా మొదటి సినిమా.
ఆ తరువాత ఏడిద నాగేశ్వరరావు బ్యానర్‌లో చాలా సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాను. దాంతో విశ్వనాథ్, భారతీరాజా దగ్గర పనిచేసే అవకాశం దొరికింది. శంకరాభరణం, సీతాకోకచిలుక సినిమాలకు పనిచేయడం ఓ మరపురాని అనుభూతి.

మాకు సంవత్సరం పొడవునా పని ఉండేది కాదు. మద్రాసులో అప్పుడు డిటెక్టివ్ నవలల హవా నడుస్తుండేది. కొంతమంది రచయితల పేర్లతో ముందుగానే పుస్తకాల కవర్స్ ముద్రించి ఉండేవి. రచయితలకు ఘోస్టులుగా నవలలు రాసేవాణ్ని. నేనప్పట్లో వంద రూపాయల రైటర్‌ని. నవలకు వందిచ్చేవారు. స్వాతి, జ్యోతి, యువ పత్రికలకు కథలు రాసి మరికొంత సంపాదించేవాణ్ని. అలా రోజులు గడిచిపోయేవి. అసిస్టెంట్ డెరైక్టర్‌గా నేనేమంత స్ట్రగుల్ అనుభవించలేదు. శీతాకాలంలో వేణ్నీళ్లు పోసుకున్నంత హాయిగా గడిచిపోయింది నా జీవితం. ఇక సినిమా రంగంలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా నా పాత్ర ముగించాల్సిన సమయం వచ్చింది.

నేను మద్రాస్ వచ్చిన కొత్తలో వేమూరి సత్యనారాయణ ఎడిటర్‌గా ఉన్న ‘జ్యోతి’ మంత్లీ కోసం ‘భారతి’ నవల రాశాను. అది చదివిన వేమూరి చాలా ఇంప్రెస్ అయ్యారు. అలా నాకు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది.

తరువాత రోజుల్లో వేమూరి రాజమండ్రికి చెందిన ఎం.ఆర్.ప్రసాదరావుతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు. అందుకోసం తమిళంలో హిట్ అయిన ‘పాలయ్‌వన్ చోలై’ రైట్స్ తీసుకుని, తెలుగులో రీమేక్ చేద్దామని ఆఫీసు తెరిచారు. గతంలో శంకరాభరణం ఆఫీస్ అది. నేను ఉండే ఇంటి పక్కనే ఆ ఆఫీస్ ఉండటంతో అప్పుడప్పుడూ వెళ్లి ఫిలిం ఫెస్టివల్స్‌లో చూసిన సినిమాల గురించి అనర్గళంగా మాట్లాడుతుండేవాణ్ని. (ప్రపంచ సినిమా పట్ల నాకు ఆసక్తి కలిగించిన చలంగారి అల్లుడు వజీర్ రెహ్మాన్‌కు కృతజ్ఞతలు).

వాళ్లు తమ సినిమా డెరైక్టర్‌గా బాపు, జంధ్యాల, రేలంగి, ఈరంకి శర్మ... ఇలా చాలామందిని అనుకున్నారు. రకరకాల కారణాల వల్ల ఎవరూ కుదరలేదు. నేనప్పుడు ‘సీతాకోకచిలుక’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసి ఖాళీగా ఉన్నాను.

ఓ రోజు ఉదయాన్నే వేమూరి సత్యనారాయణ ఆటోలో మా రూమ్‌కి వచ్చారు. ఈ సినిమా నువ్వే డెరైక్ట్ చేయాలని అన్నారు. మొదట షాక్ అయ్యాను. కుదరదని చెప్పేశాను. తప్పదు అని వేమూరిగారు పట్టుబట్టారు. ఈ సినిమా ఒకవేళ ఫెయిలైతే మళ్లీ నీతో సినిమా తీస్తానని నిర్మాత ఎం.ఆర్.ప్రసాదరావు వెన్ను తట్టారు.

ముప్ఫై ఏళ్లు రాకుండా డెరైక్ట్ చేయకూడదన్న నా నిర్ణయాన్ని ఆ క్షణం పక్కన పెట్టక తప్పలేదు. నా ప్రమేయం లేకుండా, నా పూర్తి ఇష్టం లేకుండా మంచుపల్లకీ మోసే బాధ్యత నా భుజాలపై పడింది. ట్రయల్ షూట్ చేశాక, నా మీద నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది.

సినిమాకు ఏం పేరు పెడదాం అని ఆలోచిస్తున్నప్పుడు అందులో హీరోయిన్ పేరు గీత కాబట్టి ‘మా మంచి గీతకు మల్లెపూదండ’ అని పెడదాం అన్నారు వేమూరి. నేను తల అడ్డంగా ఊపాను.
‘చేత వెన్నముద్దకు చెంగల్వపూదండ’ అని యండమూరి వీరేంద్రనాథ్ సజెషన్. నేను మళ్లీ తల అడ్డంగా ఊపాను.
యండమూరి సడెన్‌గా నీ నవల ‘మంచుపల్లకి’ పేరు ఈ కథకు సరిగ్గా సరిపోతుందని అనడంతో అదే కరెక్ట్ అని డిసైడయ్యాం.

అప్పటికి మాంచి ఊపు మీదున్న చిరంజీవి హీరోగా చేయడానికి అంగీకరించారు. ఒరిజినల్ వెర్షన్‌లో హీరోయిన్‌గా చేసిన సుహాసిని హీరోయిన్. నేను అసోసియేట్‌గా పనిచేసిన ‘జేగంటలు’ సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పిన రాజేంద్రప్రసాద్ గుర్తుకొచ్చాడు. అతను దేవదాస్ కనకాల దగ్గర తరచుగా కలుస్తుండేవాడు. హరి పాత్రకు అతడు ఓకే. నెక్స్ట్ కుమార్ పాత్రకు ‘యువతరం కదిలింది’లో హీరోగా చేసిన సాయిచంద్ సూపర్బ్.

‘అంతులేని కథ’ని ఇరవైసార్లు చూశాను. అందులో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా చేసిన నారాయణరావు వాసు పాత్రకు పర్‌ఫెక్ట్. గాంధీ పాత్రకు ‘సప్తపది’లో ఒక హీరోగా చేసిన గిరీశ్. అంతా పేరున్న ఆర్టిస్టులే. పంతులమ్మ, నాగమల్లి చిత్రాలకు సంగీతాన్నందించిన రాజన్ నాగేంద్ర మ్యూజిక్ డెరైక్టర్స్. ‘తులసీదళం’ హిట్‌తో స్టార్ రైటర్‌గా వెలుగుతున్న యండమూరి డైలాగ్ రైటర్. హరి అనుమోలు సినిమాటోగ్రాఫర్. చిత్రకారుడు చంద్ర ఆర్ట్ డెరైక్టర్. శ్రీశ్రీ, వేటూరి, గోపీ పాటల రచయితలు.

అన్ని మేరుపర్వతాల మధ్య నేనొక పిపీలికంలా అనిపించేవాణ్ని.
అసలే కొత్తవాడు. ఎలా తీస్తాడోనని యూనిట్‌లో అందరికీ ఏ మూలో చిన్న సందేహం. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌లో షూటింగ్ మొదలుపెట్టాను. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి. చిరంజీవి వెర్షన్ పన్నెండు రోజులో కంప్లీట్. ఒక్క రోజుల్లో ‘మేఘమా దేహమా’ షూటింగ్ చేశాను. ఒకే రాత్రిలో క్లయిమాక్స్ తీశాను. 1982లో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గాను, క్రియేటివ్‌గాను నాకు సంతృప్తిని అందించింది.

‘మేఘమా దేహమా’ గీతానికి ఎస్.జానకి ఉత్తమ గాయనిగా 1982 సితార పత్రిక అవార్డు అందుకున్నారు. సినిమా బాగా నచ్చి సుహాసిని తండ్రి చారుహాసన్ ఆమె రెమ్యునరేషన్‌కు బదులుగా నెల్లూరు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు. నేను నెలకు 650 రూపాయల చొప్పున ఆరు నెలలు రెమ్యునరేషన్ తీసుకున్నాను.

అయితే ఫస్ట్ సినిమా స్ట్రెయిట్ సినిమా కాదన్న వాస్తవం తీస్తున్నంతసేపూ నన్ను సంఘర్షణకు లోను చేసింది. నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న రాజన్-నాగేంద్ర మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నంతసేపూ నన్ను ఆ గదిలోకి అడుగుపెట్టనివ్వలేదు.

ఇలాంటి చిన్న పెయిన్స్ పక్కన పెడితే డెరైక్టర్‌గా ‘మంచుపల్లకి’ నాకో మధుర జ్ఞాపకం. అలా నా కలల మంచుపల్లకి కరిగి కళ్లలోంచి ఆనందబాష్పమై రాలింది. ఆ తరువాత నా సినీజీవితం ఆనంద గోదావరిలా హాయిగా సాగింది.

ఇంటర్వ్యూ: క్రాంతి, పులగం