
జీవితం ఎవరికైనా మొదట లేత గులాబీ రెక్కల్ని కానుకగా ఇస్తుంది. తరువాత ప్రతి మలుపులో ముళ్లను కాపలాగా పెడుతుంది. కృష్ణవంశీ విషయంలో మాత్రం జీవితం తన స్క్రిప్ట్ మార్చుకుంది. మొదట మలుపు మలుపులో ముళ్లను పేర్చి, చివరాఖరున ఒక గులాబీని కానుకగా ఇచ్చింది.
ఊహ తెలిసినప్పటినుంచీ సినిమానే నా ప్రపంచం. అప్పటికీ, ఇప్పటికీ...
నాన్న ఇరిగేషన్ అండ్ పవర్ డిపార్ట్‌మెంటులో ఇంజినీర్. నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నాన్నకు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ ఊళ్లో ఇంటర్నేషనల్ మూవీస్ అనే సినిమా హాలు ఉండేది. నాన్న పరపతితో నాకు హాల్ మేనేజ్‌మెంట్‌తో పరిచయం ఏర్పడింది. అక్కడే సినిమా నన్ను మొదటిసారి ఆకర్షించింది. ఆ సినిమా సహవాసం నన్ను నెమ్మదిగా తన వైపునకు లాక్కుంది. ఒక దశలో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. దేవుడు చేసిన మనుషులు... వందసార్లు, అల్లూరి సీతారామరాజు... దాదాపు వేయిసార్లు... ఎన్ని సినిమాలు, ఎన్నెన్నిసార్లు! థియేటర్ నా దేవాలయం. షోలే, దీవార్, జంజీర్, ముకద్దర్ కా సికిందర్... అమితాబ్ నా దేవుడు.
సినిమా మినహా వేరే ప్రపంచాన్ని ఊహించలేని స్టేజ్‌కు వెళ్లాను. విషయం నాన్నగారి చెవిన వేశాను. సినిమా నా గమ్యం. పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ అందుకు మార్గం అని చెప్పేశాను. డిగ్రీ లేకపోతే విలువ లేదు కాబట్టి, మొదట అది పూర్తి చేయి అన్నారు. సమాజం నిర్ణయించిన ఒక విలువ కోసం మొదటిసారిగా నా ఇష్టాన్ని చంపుకున్నాను.
డిగ్రీ పూర్తయింది. నాన్నకు మళ్లీ నా గమ్యం గుర్తుచేశాను. ఈసారి పీజీ పూర్తిచేశాక అన్నారు. రెండోసారీ నా ఇష్టాన్ని చంపుకున్నాను. దారి దూరమవుతున్నా గమ్యం స్పష్టంగానే కనిపిస్తోంది.

హిందీ సినిమాలు ఎక్కువ చూడవచ్చనే ఉద్దేశంతో ఆగ్రా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అగ్రికల్చరల్ ఎకనమిక్స్ అనే రేర్ గ్రూపుతో పీజీ చేశాను. ఆ రెండున్నర సంవత్సరాల్లో బోలెడు హిందీ క్లాసిక్స్ చూసి సినిమాను అర్థం చేసుకోవడం ప్రారంభించాను.
కోర్స్ పూర్తయ్యాక మా సొంత ఊరు తిరిగొచ్చి కొంతమంది మిత్రులతో కలిసి థర్డ్ పార్టీ బయ్యర్‌గా సినిమాలు కొనడం ప్రారంభించాను. నేను బయ్యర్‌గా కొన్న సినిమాలు నడిచే థియేటర్‌కు వెళ్లి ప్రొజెక్షన్ నేర్చుకున్నాను. మరోవైపు నాన్న నన్ను సేఫ్‌జోన్ పేరిట ఉద్యోగంలోకి నెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.
నా దృష్టిలో సేఫ్‌జోన్ ఒక పంజరం. సినిమానే నా ప్రపంచం.
గమ్యం చేరాలంటే మొదట ప్రయాణం ఆరంభించాలి. అనుకున్నదే తడవుగా రెక్కలు విప్పి మద్రాసు నగరం వైపు ఎగరటం ప్రారంభించాను. మద్రాసులో మొదట నా దూరపు బంధువు, ప్రముఖ కెమెరామెన్ పి.ఎస్.ప్రకాష్ ఇంటి ముందు వాలాను. ఆయన రికమెండేషన్‌తో రవిప్రసాద్ అవుట్‌డోర్ యూనిట్‌లో లైట్‌బాయ్‌గా చేరాను. నో శాలరీ, ఓన్లీ ఫుడ్. తరువాత కెమెరా అసిస్టెంట్‌గా ప్రమోషన్. కానీ ఏదో అసంతృప్తి, నిరాశ. లక్ష్యం తొందరగా చేరాలంటే గతుకులు లేని రోడ్డులో వెళ్లాలి గానీ, గల్లీల్లోంచి కాదని అర్థమైంది.
వెళ్లని సినిమా ఆఫీసు లేదు. కలవని దర్శకుడు లేడు. కె.విశ్వనాథ్‌గారి ఇంటి ముందైతే నెలల తరబడి నిల్చున్నా ఫలితం లేదు. ఒకే ఒక్క చాన్స్ కోసం కాళ్లరిగేలా, కళ్లు వాచేలా ఎదురుచూశాను. ఉంగరాలు, గోల్డ్ చెయిన్ తాకట్టు పెట్టాను. రూమ్ రెంటు కోసం ఓ మలయాళ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా కూడా చేశాను.
కసి కన్నీళ్లుగా మారే సమయంలో ఒక చేయి నా వెన్ను తట్టింది. పద్మాలయా స్టూడియోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మా ఊరతను దర్శకుడు త్రిపురనేని చిట్టి దగ్గర నన్ను అసిస్టెంట్‌గా పెట్టించాడు. జీవితంలో చిన్న చిన్న అవకాశాలు ఒక్కోసారి ఎంత పెద్ద మార్పులకు దారి తీస్తాయో తెలిసింది.
సిల్క్‌స్మిత వరుసగా నిర్మించిన రెండు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ రెండూ రిలీజయ్యాయో లేదో కూడా తెలీదు. మళ్లీ నిరాశ ముళ్లు. కనిపించని నెత్తుటి గాయాలు. ఇక్కడే నా జీవితాన్ని మలుపు తిప్పే ఓ అద్భుతం జరగబోతోందని అనిపించింది. నా చీకటి ప్రపంచాన్ని వెలుగులతో నింపడానికి వస్తున్న మెరుపును పరిచయం చేయడానికి శివనాగేశ్వరరావు అనే ఉరుము ముందు నన్ను కలిసింది. ఆ మెరుపు పేరు రామ్‌గోపాల్‌వర్మ.
‘శివ’తో ప్రారంభించి వర్మ సాహచర్యంలో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను. ఆయన ఆలోచనల అగ్నిలో కాలి పునర్జన్మించాను. క్షణక్షణం, రాత్రి, రాత్, అంతం, ద్రోహి, మనీ, గాయం... సినిమా సినిమాకూ మా బంధం మరింత స్ట్రాంగ్ అయింది. వర్మ ‘రంగీలా’తో హిందీలోకి షిఫ్ట్ అవుతూ నన్ను డెరైక్టర్‌గా పరిచయం చేద్దామనుకున్నారు. పాప అనే సబ్జెక్ట్ చెప్పాను. వర్మ సేస్ నో.
నెక్స్ట్...
‘మనీ’ సక్సెస్‌తో శివనాగేశ్వరరావు బిజీ అవడంతో వర్మ ‘మనీ మనీ’ దర్శకత్వ బాధ్యతలు నాకు అప్పగించారు. ఆ సినిమా అవుట్‌పుట్ చూసి వర్మ చాలా హ్యాపీ. ఘోస్ట్ డెరైక్టర్‌గా అది నా మొదటి సినిమా. మరి నా పేరుతో నా కైండ్ ఆఫ్ సినిమా ఎప్పుడు?
‘అనగనగా ఒక రోజు’ రూపంలో మళ్లీ అవకాశం వచ్చింది. కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా వర్మ డెరైక్షన్ సీట్లోంచి నన్ను తప్పించి తను బాధ్యతలు స్వీకరించారు. నేను బాస్‌గా ఉండాల్సిన సినిమాకు మా బాస్ దగ్గరే మళ్లీ అసిస్టెంట్‌గా చేశాను.
రెక్కలు కాలి కిందపడ్డాక బూడిదలోంచి లేచి కొత్త కథతో ఎగిరే ప్రయత్నాలు మొదలుపెట్టాను. రామానాయుడు స్టూడియోలో టబును కలిసి కథ చెప్పాను. కన్నీరు మున్నీరైంది. నాయుడుగారి ద్వారా సురేష్‌బాబు తెలుసుకుని మరుసటిరోజు కబురు పంపించారు. కథ చెప్పమన్నారు. నాతో సినిమా తీస్తానని మాటిస్తే కథ చెప్తానన్నాను. కథ నచ్చితే వెంకటేష్‌ను ఇస్తానన్నారు. నాకు జె.డి.చక్రవర్తి చాలన్నాను. అయితే కథ చెప్పమన్నారు. లేదు, ముందు మాటివ్వండన్నాను.
ముందు కథ... సురేష్‌బాబుగారు
ముందు మాట... నేను
రేపు సాయంత్రం దాకా ఆలోచించుకోమన్నారు. నేను నా మాట నుంచీ తగ్గలేదు... ఆయన తన మాట నుంచీ తగ్గలేదు. మళ్లీ అవకాశం పోయింది. పోనీ... రాజీపడటం నా రక్తంలో లేదు.
ఇంతలో రామూగారి నుంచి పిలుపు. ఏబీసీఎల్ సమర్పణలో వర్మ కార్పొరేషన్‌కు సినిమా చేయమన్నారు. యాభై లక్షల్లో సినిమా ఫినిష్ చేస్తానని చెప్పాను. డెబ్భై అయిదు లక్షలిస్తానని చెప్పారు. అయితే, మధ్యలో కాలు కాదు కదా, వేలు కూడా పెట్టొద్దని కండిషన్ పెట్టాను. సంచలనం సృష్టించిన పాతబస్తీ ‘అమీనా’ ఇన్‌స్పిరేషన్‌తో ఒక ప్రేమకథను తయారుచేసుకున్నాను. కథ కత్తిలా కుదిరింది. హీరో జె.డి.చక్రవర్తి, మరి హీరోయిన్.
‘అమ్మాయి కాపురం’లో నటించిన మహేశ్వరి నచ్చడంతో ఆమె సోదరి శ్రీదేవితో చెప్పి ఓకే చేసుకున్నాం. అప్పటిదాకా ఊరూ పేరూ లేని శశిప్రీతమ్ మ్యూజిక్. పదేళ్ల కింద ఇండస్ట్రీ వదిలేసి, గుంటూరులో పడి తిరుగుతున్న జీవాను వెదికిపట్టుకుని మెయిన్ విలన్‌గా పెట్టాను. విలన్ పాత్రలకు బ్రాండ్‌నేమ్‌గా ఉన్న చలపతిరావుది హీరోయిన్ తండ్రిగా సాఫ్ట్ రోల్. చంద్రమోహన్ ఒక్కడే సినిమా మొత్తంలో బాగా సీనియర్ నటుడు.
చివర్లో ఒక పాట పెడదామనుకుని ఇంకేమైనా వినిపించు అన్నాను. తన దగ్గర తనకోసం స్టాక్ పెట్టుకున్న నూట యాభై పాటల్ని నాముందు కుమ్మరించాడు శశిప్రీతమ్. అందులో ఒక ట్యూన్ బాగా నచ్చింది. ఆ ట్యూన్‌ను మా గురువు సీతారామశాస్త్రికి వినిపించి ఓ పాట రాయమన్నాను. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో’ పాట రాసిపడేశారు. ఆ పాటను మహాప్రసాదంలా కళ్లకద్దుకుని, సునీత అనే కొత్త సింగర్‌తో పాడించాం.
‘మేఘాలలో తేలిపొమ్మన్నది’ పాటను రికార్డు చేస్తున్నప్పుడు, అనుకోకుండా ఆ పాట విన్న రామూగారు అది సినిమాలో ఉండాల్సిందేనని పట్టుబట్టారు. సిచ్యుయేషన్ లేదన్నాను. అనుకుంటే అదే వస్తుందన్నారు. ఆలోచించి ఈ సాంగ్ బైక్‌మీద షూట్ చేస్తానన్నాను.
నీకేమైనా పిచ్చి పట్టిందా? కావాలంటే ఇరవై లక్షలిస్తాను. అద్భుతంగా షూట్ చేయమన్నారు రామూగారు.
నేను మొండిగా అరకు వెళ్లి బైక్‌మీద సాంగ్ షూట్ చేశాను. ఎడిటింగ్ అయ్యాక చూసిన వర్మ అబ్బురపడ్డారు. అప్పుడు పక్కన థియేటర్‌లో ‘రంగీలా’ డబ్బింగ్ జరుగుతోంది. ఆ పని ఆపేసి సాంగ్‌ను ఆమిర్‌ఖాన్‌కు చూపించి, నా గురించి గొప్పగా చెప్పి తెగ మురిసిపోయారు. తరువాత వర్మ ఎక్కడికి వెళ్లినా ఆ సాంగ్‌ను అందరికీ చూపించారు.
నాకున్న లిమిటెడ్ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టిస్టులను, స్టూడియోలను వాడుకున్నాను. రామానాయుడు స్టూడియోలో సరైన ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో అక్కడ రికార్డింగ్ పెట్టుకోవడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. నేను సాహసించి, నా మొదటి పాట ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ పాటను అక్కడ రికార్డు చేశాను. నా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ వర్క్స్ అక్కడే పూర్తిచేశాను.

సినిమా కథకు తగ్గట్టుగా మొదట ‘చార్మినార్’ టైటిల్‌గా అనుకున్నా. ప్రేమకథకు అది సూటవదని అన్నారు వర్మ. పూల పేర్లలో ఏదో ఒకటి బాగుంటుందేమో ఆలోచించమన్నారు. ఈ కథకు ‘గులాబీ పువ్వు’ అనే టైటిల్ కరెక్ట్ అన్నాను. పువ్వు తీసేసి ‘గులాబీ’ అన్నారు వర్మ. ఆయన కూడా రిలీజ్ అయ్యాకే థియేటర్‌లో చూశారు. సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొన్ని కోట్ల క్షణాలు పడిన తపన, అనుభవించిన ఆవేదన ఆ క్షణంలో తుడిచిపెట్టినట్టయింది.
లక్ష బాధల తరువాత దొరికే ఒక ఆనందానికి చాలా విలువ ఉంటుంది. ఎన్నో ముళ్లు దాటాక దొరికే గులాబీకి ఎక్కువ పరిమళం అంటుతుంది. చాలా గాయాలు తగిలిన పక్షి పాడే పాట మరింత మధురంగా ఉంటుంది. ఇదీ నా మొదటి సినిమా నాకు మిగిల్చిన అపురూపమైన అనుభవం. అమూల్యమైన జ్ఞాపకం.
ఇంటర్వ్యూ: పులగం, క్రాంతి
No comments:
Post a Comment