రూమ్‌లో పడుకుని నిద్రపోతున్నాడు మధు ముట్టమ్. అతను మలయాళ సినీ రచయిత. ఏడాది కిందట అతని మొదటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు రెండో సినిమా కోసం కథ ఆలోచిస్తున్నాడు. ఎలాంటి కథ రాయాలి? అదెంత కొత్తగా ఉండాలి? ఆలోచిస్తూ భోజనం చేస్తున్నాడు, ఆలోచిస్తూ నడుస్తున్నాడు, ఆలోచిస్తూ పడుకుంటున్నారు. కొద్దికాలంగా అతనికి ఇదే ఆలోచన. ఆ రోజు కూడా ఆలోచిస్తూనే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ... హఠాత్తుగా... కలలాగా... అతనికి ఏదో ఫ్లాష్ అయింది.
దెయ్యం!
ఓ భూత్‌బంగ్లా... అందులో నాగవల్లి అనే దెయ్యం ఉందని అందరికీ భయం. ఒకప్పుడు అది రాజమహల్. ఇప్పుడు దాన్ని ఒక వ్యక్తి కొంటాడు. అతని భార్య గంగ. నాగవల్లి దెయ్యం ఆమెను పట్టుకుంటుంది. అప్పటి నుంచి ఇంట్లో అన్నీ విపరీతాలు జరుగుతుంటాయి. దెయ్యం పట్టిన గంగ తన భర్తనే చంపాలనుకుంటుంది. కాని భర్త ఫ్రెండు ఓ సైకియాట్రిస్ట్. అతనే హీరో. దెయ్యాన్ని పాతకాలం పద్ధతుల్లో వదలించడం పాత కథ. కాని దెయ్యం అనేది మానసికమైన బలహీనత... ముందు మనలోని భయాల్ని వదిలించుకుంటే ఎలాంటి దెయ్యాలు పట్టవు. కాబట్టి గంగకు సైకలాజికల్ ట్రీట్‌మెంట్ ఇస్తాడు హీరో. అదెలా జరిగింది?
ఠక్కున లేచాడు మధు. వెంటనే తనకు వచ్చిన ఐడియాని కాగితం మీద పెట్టేశాడు. అతనికి ఇప్పుడు లీలగా ఓ సినిమా మనస్సులోనే కనిపిస్తోంది. మరు ఉదయాన్నే అతను ఫాజిల్ ముందు నిలబడ్డాడు.
మలయాళంలో టాప్ డెరైక్టర్ ఫాజిల్. ఒక్క కేరళలో కాదు, దేశంలోనే టాప్ డెరైక్టర్స్‌లో ఒకడిగా ఫాజిల్‌కి గౌరవం ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఓ కాగితం ఉంది. అందులో రైటర్ మధు ముట్టమ్ రాసిన కథ చదువుతున్నాడు ఫాజిల్.
‘‘లైన్ బాగానే ఉంది. దీన్ని డెవలప్ చేసి చూపించు...’’ అన్నారు ఫాజిల్.
క్రియేటివిటి ఉన్న వ్యక్తి ఉత్సాహానికి ఎంత ప్రోత్సాహం ఉంటే అంత హుషారుగా ఉంటాడు.
ఫాజిల్ రెస్పాన్స్ మధులో నీరసం నింపింది. బాగానే ఉందన్నారు కాని ఎగ్జయిట్ కాలేదు. దాంతో మధు ముట్టమ్ ఆ కథను పక్కన పెట్టేశాడు. నాగవల్లి దెయ్యం... ఆ కాగితంలోనే ఉండిపోయింది. ఆ కాగితం ఎక్కడో మూలన పడిపోయింది.
******
అన్ని ఫైల్సూ, కాగితాలూ తీసి చూస్తున్నారు ఫాజిల్. చివరికి ఈ కాగితం కూడా ఆయన కంటపడింది. తీసి చదివారు. ఇది మధు ముట్టమ్ రాసిన కథ... బాగుందే! అనుకున్నారు ఫాజిల్.
రొటీన్ సినిమాలు తీసి బోరు కొట్టినప్పుడు ఇలాంటి కథలు నచ్చుతాయి. విచిత్రంగా ఈ కథలో నాగవల్లి అనే దెయ్యం భయపెట్టడం లేదు, ప్రేమించేలా ఉంది. దెయ్యం అనే భయానికి సైకలాజికల్ ట్రీట్‌మెంట్. ఇందులో మెసేజ్ ఉంది. ఫాజిల్ మరి ఆలస్యం చేయలేదు. వెంటనే మధుకి కబురు పెట్టారు. కొద్దిరోజులు ఇద్దరూ కలిసి కథ వండేశారు. తర్వాత దాన్నే సినిమాగా తీశారు. అదే - మణిచిత్రతళు. అంటే నగిషీలు చెక్కిన తలుపు గడియ. అది ఓపెన్ చేస్తేనే కదా... అసలు కథంతా మొదలవుతుంది.
మలయాళం సినిమా సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపి హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అసలే గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ శోభన. ఆ పాత్రలో చెలరేగిపోయింది. 1993 రిలీజ్ అయింది మణిచిత్రతళు. సూపర్‌హిట్. శోభనకు ఆ సంవత్సరం ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ప్రకటించారు.