Sunday, December 16, 2012

సీమటపాకాయ్


ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్‌ల్లోకి వెళుతుండాలి. ఆ బ్లాక్ అండ్ వైట్ సంగతులు ఆసక్తి కలిగిస్తాయి కాబట్టి. అందుకే పదేళ్ల ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం. రవీంద్ర భారతిలో 'రాయి' నాటిక ప్రదర్శన జరుగుతోంది. 106 మంది ఔత్సాహిక నటులకు శిక్షణనిచ్చి వారితో నాటకాలు వేయిస్తున్న ప్రత్యేక సందర్భం అది.

అప్పుడు రాయి నాటికలో పోలీస్ అధికారి పాత్ర వేసిన నటుడి డైలాగులు టపాకాయల్లా పేలాయి. వృద్ధిలోకి వస్తాడనుకుని చాలామంది అనుకున్నారు. గిర్రున పదేళ్లు తిరిగేసరికి ఆ నటుడు 'సీమటపాకాయ్'లా తెలుగు పరిశ్రమలో హాస్యం పేలుస్తున్నాడు. హీరో నరేష్ ఇప్పుడో పెద్ద నవ్వుల బాంబు. ఈ కామెడీ టపాకాయ్ చెబుతున్న సీమటపాకాయ్ విశేషాలతోపాటు, ఆ సినిమా దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి, నిర్మాత డా. విజయ ప్రసాదులు వివరిస్తున్న ఆసక్తికర సంగతులు చదవండి.

అయ్యబాబోయ్... డ్రమ్ములపై డాన్స్
- నరేష్ , హీరో

ఈ సినిమాలో కోటీశ్వరుని కొడుకు పేదవానిగా నటించాలి. ఈ పాత్ర నాకు బాగా సరిపోతుంది. నాలో పేదవాడు, ధనవంతుడు ఇద్దరూ ఉన్నారు. పధ్నాలుగేళ్ల వయసులో అనుభవించిన పేదరికం నిన్ననే అనుభవించినట్టుంది. నాన్న ఇవివి సత్యనారాయణ తీసిన 'చెవిలో పువ్వు' సినిమా ఫెయిలయింది. దాంతో మా పరిస్థితి దారుణమైపోయింది. మద్రాసు శివునిగుడివీధిలో మా నివాసం. ఒక చిన్నగదిలో ఉండేవాళ్లం.

నాన్న సిగరెట్‌కు డబ్బుల్లేకపోతే నా కిడ్డీబ్యాంక్ నుంచి చిల్లర తీసి కొనుక్కునేవారు. అలాంటి పరిస్థితిలో పెరిగిన నేను కొన్నేళ్ల తరువాత మళ్లీ బోలెడు సంపదను చూశాను. అందువల్ల 'సీమటపాకాయ్'లో ధనిక యువకుడు పేదవానిగా చేయాలని చెప్పగానే హోం వర్కు అవసరం లేకపోయింది. కానీ అందువల్ల 'ఐ లవ్ యు బేబీ' పాటకు మాత్రం చాలా కష్టాలు పడ్డాను. అదో పెద్ద కామెడీ జ్ఞాపకం.

*** అప్పటికే రెండు పాటలకు డాన్స్ చేసి ఉన్నాను. 'ఐ లవ్ యు బేబీ' గీతాన్ని పాప్ శైలిలో తీస్తామనీ, హీరో చిన్న పోజులిస్తే సరిపోతుందని దర్శకుడు నాగేశ్వరరెడ్డి చెప్పారు. దీంతో నేనూ చాలా రిలాక్స్ అయిపోయాను. అదే మైండ్‌సెట్‌తో సినిమా సెట్‌లోకి వెళ్లాను. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఐ లవ్ యు బేబీ కోసం వేశారు ఆ సెట్ . ఆరోజు డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్, దర్శకుడు నాగేశ్వరరెడ్డి సెట్‌లో చాలా బిజీగా ఉన్నారు. ప్రేమ్ రక్షిత్ తన ఐపాడ్‌లో ఏదో చూపిస్తూ దర్శకునికి చెబుతున్నాడు. వాళ్ల బాధలేవో వాళ్లు పడుతున్నారనుకున్నాను. కానీ నన్ను ఓ నలభై డ్రమ్ముల మీద డాన్స్ చేయమంటార నుకోలేదు.

ఈ పాటను సీజీలో(కంప్యూటర్ గ్రాఫిక్స్)లో చేయాలి. ముందు నేను డాన్స్ చేస్తే అదే గెటప్ వెనుక ఉన్న మరో స్క్రీన్‌లో కనిపిస్తుంది. కాసేపు డాన్స్ చేస్తే గ్రాఫిక్స్‌లో మిక్స్ కావట్లేదు. షాట్ దొరకట్లేదు. దాంతో డాన్స్ మాస్టర్ పాటను కట్‌షాట్స్‌లో తీద్దామన్నారు. ఈ పద్ధతిలో ఒక స్టెప్‌ను తొమ్మిదిషాట్స్‌లో చేయాలి. ఏదైనా తేడా వస్తే అదే స్టెప్‌ను మరో తొమ్మిది సార్లు చేయాలన్నమాట. నా పిక్కల బలం ఏ రేంజ్‌లో ఉండాలో ఊహించుకోండి. ఫ్లోర్ మీద డాన్స్ మొదలైంది.

ఆ స్టెప్పులను డ్యాన్సర్లు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రాక్టీసు చేసారు. ఆపై నా వంతు. నేను ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రాక్టీసు చేశా. ఓకె అనుకుంటున్న సమయంలో ఫ్యాక్టరీలోకి రెండు లారీలు వచ్చాయి. వాటి నిండా నీళ్లు పోసే ఖాళీ డ్రమ్ములు. వాటిని సెట్‌లోకి తీసుకొచ్చి ఫ్లోర్‌పై పెట్టారు. అన్నిటినీ తాళ్లతో కట్టారు. ఇదంతా అయ్యాక డైరెక్టరొచ్చి ఆ డ్రమ్ములపై డాన్స్ చేయాలని చెప్పారు. కామెడీ కాకపోతే, డ్రమ్ముల మీద డాన్సేంటి సార్ అందామనుకున్నా. ఏమైతేనేం ఐదు రోజులు ఏకధాటిగా డ్రమ్ములపై గెంతగా....గెంతగా...ఐ లవ్ యు బేబి పాట పూర్తయింది. రామానాయుడు స్టూడియోలో తీసిన ఒకానొక సీన్ కూడా ఇలాగే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

*** దొమ్మరాట తెలుసు కదా. తాడుమీద నడక. ఎటువంటి ఆధారం లేకుండా ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లాలి. ఈ బతుకాట రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. ఇది చూడటానికి బాగానే ఉన్నా, చేయాలంటే మాత్రం ఎంతో కష్టం. రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ఏర్పాటు చేశారు. రెండు కర్రలకు బలమైన తాడు అటూ, ఇటూ కట్టారు. సినిమాలో సీన్ ఏమిటంటే...తాడుపై నడుస్తున్న వ్యక్తి జారిపడిపోతాడు.

అప్పుడు హీరోయిన్ మెప్పుకోసం నేను ఆ తాడుపై నడవాలి. నా నడుముకు, చేతులకు వీలైన చోటల్లా తాళ్లు కట్టారు. ఇన్ని జాగ్రత్తల మధ్య తాడుపై నేను నడవాలి. ఎప్పటికీ డైరెక్టర్ షాట్ ఓకె అనడే. నేనేమో తాడుపై నుంచి జారిపోతున్నా. నడవలేకపోతున్నా. దానికి తోడు ఆ తాడుపై నుంచి ఇంకా పైకెగరాలి. 10 గంటలకు షూటింగ్ మొదలైతే దాదాపు నాలుగైదు గంటలు తాడుపైనే నిల్చున్నా. సీన్ పూర్తయ్యాక ఎంత రిలాక్స్ అయ్యానో చెప్పలేను. ముద్దుసీన్ విషయంలోనైతే చర్చలు జరపడానికే రెండు రోజులు పట్టింది.

*** ఒక రోజు షూటింగ్ మధ్యలో దర్శకుడు నాగేశ్వర రెడ్డి వచ్చి లిప్ కిస్ గురించి చెప్పారు. నేను ఒప్పుకోలేదు. నా సినిమా చూడటానికి ఫ్యామిలీతో వస్తారు. కాసేపు నవ్వుకుంటారు. వెళ్లిపోతారు. అందుకే సినిమా ఎంపికలో నాకో లెక్క ఉంది. 80శాతం ఎంటర్‌టైన్‌మెంట్, 20శాతం కథ. ఇంతే నా సినిమా. అలాంటిది దర్శకుడొచ్చి ముద్దు అని చెప్పగానే వద్దని నిక్కచ్చిగా అనేశాను. ఆ సీన్‌తో సినిమా ఆడదు కదా అని వాదించాను కూడా.

దానికి బదులు మరింత కామెడీ తీద్దాం అన్నాను. ఆయన అన్ని రకాల సమాధానాలతో వచ్చారు. ముద్దంటే ఇమ్రాన్ హష్మి స్థాయిలో ఉండదని, హీరో హీరోయిన్ల మధ్య సున్నితమైన రొమాన్స్ కోసం ముద్దు అవసరమని దర్శకుడు చెప్పుకొచ్చారు. చివరికి సరే... అన్నానే గానీ మరో ఆలోచన కూడా ఉంది. ఒక వేళ బాగోలేకపోతే తీయించేద్దామని నిర్ణయించుకుని రెడీ అయ్యాను. కాని ఆ సీన్ రెండే రెండు షాట్స్‌లో ఓకె అయ్యింది. షూట్ చేసేటపుడు ఒకరో ఇద్దరో ఉన్నారంతే. ఇక నేను ఒక డ్రెస్‌ను చేతిలోకి తీసుకొన్నప్పుడు వణికిపోయిన సంఘటనయితే ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.

*** సినిమా ఆఖర్లో వచ్చే పేరడీ పాట షూటింగ్‌కు జరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటలు కావస్తోంది. ఇంటి దగ్గరి నుంచి ఫోన్ వచ్చింది. నాన్నను ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని. నేరుగా ఆసుపత్రికి వెళ్లాను. నాన్నలేని లోకం ఊహించలేను. నా సినిమా విడుదలైనపుడు ఆయన పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. సినిమా ఎలా ఉందంటూ రాష్ట్రం నలువైపులా ఫోన్ చేసి కనుక్కోనిదే మంచినీళ్లైనా ముట్టుకోరు. నా రోజు వారీ ఖర్చుకు కూడా డబ్బులు నాన్న ఇవ్వాల్సిందే. నాన్న తరువాత ఇపుడు అమ్మ ఇస్తున్నారు. అలాంటి నాన్న దూరమవ్వడం భరించలేకపోయాను.

ఇదంతా అయ్యాక కొన్నాళ్లకు మళ్లీ షూటింగ్ మొదలైంది. మధ్యలో ఆగిపోయిన పేరడీ పాటతోనే షూటింగ్ మొదలైంది. ఏ డ్రెస్‌తో పాట తీస్తుంటే సినిమా మధ్యలో ఆగిపోయిందో అదే మళ్లీ ఇచ్చారు. దాన్ని తీసుకుంటుంటే చేయి వణికిపోయింది. నాన్న గుర్తొచ్చి కళ్లలో నీళ్లు. మాట గద్గదమైపోయింది. ఎవరికీ చెప్పుకోలేను. సెట్‌లో అందరూ రెడీగా ఉన్నారు. కాసేపు అలాగే నిల్చుండిపోయాను. మామూలు స్థితికి రావడానికి కొంత సమయం పట్టింది. సినిమాలో ఆ ఎపిసోడ్ క్లైమాక్స్‌లో వస్తుంది. అదెంతో ఎనర్జటిక్‌గా ఉండాలి. అందుకని బాధనంతా లోపలే ఉంచుకుని చేసిన సీన్ అది. సినిమాలో దాన్ని చూసుకున్నపుడు ఎంతో సంతృప్తి కలిగింది.

ఆ ఇంటి కోసం15 ఇళ్లు తిరిగా...
- దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి

'సీమటపాకాయ్'లో హీరో ఇల్లు రిచ్‌గా ఉండాలి. షూటింగ్‌లో మేజర్ పార్టు అక్కడ ఉంటుంది. అందుకని ఖరీదైన మంచి ఇంటి కోసం వేట మొదలెట్టా. మంచి ఇల్లు దొరికినా బాగుంటే లోపల క్రేన్, జిమ్మీలు తిరగడానికి చోటు ఉండదు. ఇలా దాదాపు 15 ఇళ్లు తిరిగేసాను. అన్నిటికీ సరిపోయే ఇల్లు మాత్రం దొరకలేదు. అలాంటి సమయంలో 'సింహా' సినిమా విడుదలయ్యింది. అందులో హీరో నివసించే ఇల్లు బాగుంది. ఆ సెట్ రామోజీ ఫిలింసిటీలో వేశారని తెలిసింది. చూసొద్దామని వెళ్లాను. ఆ సెట్ డోర్ తెరవగానే నా అన్వేషణ ముగిసింది. ఇంటి తరువాత అత్యధికంగా తిరిగింది -పాత చిరిగిపోయిన బట్టల కోసమే.

*** హీరో కుటుంబం మొత్తం పేదోళ్ల గెటప్‌లోకి మారిపోవాలి. నిజానికి వీళ్లంతా కోటీశ్వరులు. పేదవారుగా మారినపుడు వాళ్లు ధరించడానికి బట్టలు కావాలి. అవి పాతగా ఉండాలి. వీటికోసం హైదరాబాద్‌లోని అమీర్‌పేట, లక్డీకాపూల్, మణికొండ ప్రాంతాల్లో పాత బట్టలు అమ్మేవారిని సంప్రదించాను. నేనే స్వయంగా తిరిగి కొనుక్కొచ్చి వాటిని మరింత పాతగా మార్చే పనిలో పడ్డాను. అందుకోసం కొన్నిటిని చింపడం, బురద అంటించడం కూడా జరిగింది. ఇలా చేశాక నటీనటులు ధరించరేమోనని ఒకానొక దశలో అనుమానమొచ్చింది. కాని నా అంచనా తలకిందులైంది. సెట్‌లో అందరూ ఒకటే నవ్వులు. అది చూసి హమ్మయ్య అనుకున్నాను. దీనికంటే ముందు ఊపిరిబిగబట్టిన సంఘటన మరొకటుంది.

*** 'అల్లరి' సినిమా నుంచి నరేష్‌తో అనుబంధం ఉంది. అప్పట్లో నరేష్‌తో సినిమా తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయినా వీలుకాలేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్నది 'సీమశాస్త్రి' కథ. అది కొంచెం బడ్జెట్‌తో కూడిన వ్యవహారం. ఆరేడుగురు నిర్మాతలను కలుసుకున్నాక సీమశాస్త్రి సెట్‌మీదికి వెళ్లింది.

'సీమటపాకాయ్'కు ఆ కష్టం రాలేదు. కానీ నిర్మాత, హీరోకే కాదు ఇంకొకరికి కూడా ఆ కథ నచ్చాలి. ఆయనే -ఇవివి సత్యనారాయణ. అక్కడ ముద్ర పడితే సినిమా విజయం సాధించినట్టే. ఇవివిని కలిసి రెండు గంటలపాటు కథ చెప్పాను. అంతా విని హిట్ అవుతుందని అన్నారు. అది విని ఊపిరి తీసుకున్నాను. తరువాత ఒక తమిళ యాడ్‌లో పూర్ణను చూసి కబురుపెట్టాం. ఆమె వచ్చాక ఇవివి సత్యనారాయణ చూసి ఓకె చేశారు. ఇవివి ఎంపిక చేసిన ఆఖరి సినిమా సీమటపాకాయ్ అయితే, ఆఖరి హీరోయిన్ పూర్ణ.

*** 'సింహాసనం' సినిమాలోని 'ఆకాశంలో ఒక తార' పాటను రీమిక్స్ చేద్దామన్నపుడు మొదట హీరోనరేష్, నిర్మాత విజయ ప్రసాద్ ఇద్దరూ ఆసక్తి చూపలేదు. పద్మాలయా సంస్థ దగ్గరి నుంచి అనుమతి వచ్చాక కూడా ఎలా తియ్యాలా అని ఆలోచన . ' పిడుగురాముడు' సినిమాలో ఎన్టీఆర్ గెటప్‌ను నరేష్‌కు వేశాక సంతృప్తి కలిగింది. ఈ పాట మధ్యలో యుద్ధం పెట్టాలనుకున్నాను. ఎందుకంటే భిన్నంగా ఉండకపోతే ప్రయత్నం విఫలమై అందరూ తిట్టుకుంటారు కాబట్టి.

ఇదంతా చిత్రీకరించడానికి భారీ స్థలం కావాలి. అందుకోసం ఫిలింసిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలోని 500 ఎకరాల స్థలంలో యుద్ధం ఎపిసోడ్ చిత్రీకరించాము. గుర్రాలు, రథం, సైనికులు వేసుకున్న దుస్తులన్నిటినీ హైదరాబాద్ పాతబస్తీలో నేనే వెళ్లి ఎంపిక చేసుకున్నాను. యుద్ధం సీన్ అయ్యాక, పాటలో మరికొంత భాగాన్ని ఫిలింసిటీలో ఉన్న 'చంద్రముఖి' సినిమా ఇంటి సెట్‌లో తీసాము. ఈ పాట కోసం ముంబై నుంచి ప్రత్యేకమైన లైట్లను కూడా తెప్పించుకున్నాము. బ్యాక్‌గ్రౌండ్ కోసం ఆ లైటింగ్ వాడాము.

కామెడీ, సందేశం కావాలని...
- నిర్మాత డా. విజయప్రసాద్ మళ్ల

మా బ్యానరులో సీమటపాకాయ్ మూడో సినిమా. ఇంతకు ముందు 'సీతారాముల కళ్యాణం లంకలో' అనే సినిమా నిర్మించాను. దీని తరువాత కథ కోసం నేనూ, ప్రొడక్షన్ మేనేజర్ వర్మ వెతుకుతున్న సమయంలో సన్నిహితుడు అమ్మిరాజు సీమటపాకాయ్ గురించి చెప్పారు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి కథ చెప్పాక అన్ని విధాలా నచ్చింది. ఇందులో కామెడీ, సందేశం రెండూ ఉన్నాయి. 'ఆకాశంలో ఒక తార' పాట షూటింగ్ జరిపేటపుడు ఎక్కడా రాజీ పడొద్దని చెప్పాను. ఆ ఒక్క పాటకే 60 లక్షల రూపాయల ఖర్చు అయ్యింది. దీని తరువాత ఎక్కువ దృష్టి పెట్టింది 'ఐ లవ్ యు బేబీ ' పాట కోసం. ఈ పాటకు కంప్యూటర్ గ్రాఫిక్స్ చేయించడంతో 25 లక్షల వ్యయం అయ్యింది. మొత్తం సినిమా అరవైరోజుల్లో ఆరుకోట్ల రూపాయల వ్యయంతో పూర్తైంది.

ముద్దంటే ఇమ్రాన్ హష్మి స్థాయిలో ఉండదని, హీరో హీరోయిన్ల మధ్య సున్నితమైన రొమాన్స్ కోసం ముద్దు అవసరమని దర్శకుడు చెప్పుకొచ్చారు. చివరికి సరే... అన్నానే గానీ మరో ఆలోచన కూడా ఉంది. ఒక వేళ బాగోలేకపోతే తీయించేద్దామని నిర్ణయించుకుని రెడీ అయ్యాను. కాని ఆ సీన్ రెండే రెండు షాట్స్‌లో ఓకె అయ్యింది. షూట్ చేసేటపుడు ఒకరో ఇద్దరో ఉన్నారంతే.

100%లవ్ స్టోరీ


రవికుమార్ అనుభవాల్లో 50 శాతం...
- దర్శకుడు సుకుమార్

నేను సినిమా రంగంలోకి రాక ముందు సంగతిది. అప్పట్లో కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసేవాడిని. విద్యార్థులను దగ్గరగా గమనించే అవకాశం అప్పుడే వచ్చింది. అక్కడ నాకు రవికుమార్ అనే ఆయన మిత్రుడయ్యాడు. స్టూడెంట్‌గా అతను చదువుకున్న రోజుల్లోని అనుభవాలు చెబుతుంటే భలే ఆసక్తిగా ఉండేది. కాలేజీ రోజుల్లో అమ్మాయిలను పడెయ్యడానికో, తరగతులను డుమ్మా కొట్టడానికో ఎత్తులు వేయడం సహజం. కాని ఈ రవికుమార్ మాత్రం ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి, ముఖ్యంగా తరగతి ఫస్టు రావడానికి ఎక్కువ ఎత్తులు వేస్తుండేవాడు.

ఇంకోలా చెప్పాలంటే అవి ఎత్తులు కాదు... ఎదుటి వారిని చీటింగ్ చేయడం. తనకూ, వేరే అబ్బాయికి మధ్య పోటీ వలన ఒకరినొకరు ఎలా చీటింగ్ చేసుకునే వాళ్లో రవికుమార్ చెప్పేవాడు. ఈ చీటింగ్ ఇద్దరబ్బాయిల మధ్య కాకుండా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మధ్యనైతే ఎలా ఉంటుంది?అన్న ప్రశ్న దగ్గరే 100 % లవ్‌స్టోరీ పుట్టింది. దీనికి నేను గమనించిన విద్యార్థుల విషయాలను జోడించాను. అలా ఈ కథ 15 సంవత్సరాల క్రితం కాకినాడలో తయారైంది. కానీ మూడేళ్ల క్రితమే ఫిల్మ్‌నగర్‌లోకి ప్రవేశించింది.

నాగచైతన్య హీరోగా 'జోష్' సినిమా విడుదలైన కొన్ని రోజులకు ఈ కథను నేను అల్లు అరవింద్‌కు వినిపించాను. ఆయనకు నచ్చింది. దీనికి ఒక కొత్త హీరో అయితే బాగుంటుందని ఆయనే సూచించారు. ఒక ఇమేజ్ అంటూ ఏర్పడని వారిలో నాగచైతన్య అయితే బెటర్ అనుకున్నాం. నాగచైతన్యకూ కథ నచ్చింది. అతని పక్కన హీరోయిన్‌గా తమన్నా సరిపోతారని డిసైడ్ అయ్యాం. ఇదొక సున్నితమైన కథ.

అంచేత బరువైన పాత్రలేవీ కనిపించవు. దాదాపుగా మనకు రోజూ ఎదురుపడే వ్యక్తులే ఉంటారు. అందువలన మిగతా పాత్రల ఎంపిక సులభమైంది -ఒక్క జాన్ ఆచార్య(ధర్మవరపు సుబ్రహ్మణ్యం)తప్ప. ఇది టైమింగ్ డైలాగులు ఉండే పాత్ర. జాన్ ఆచార్య పుట్టుక కూడా నిత్య జీవితం నుంచే వచ్చింది. ఏదో వేడుకలోనో, సభల్లోన్నో ఎవరో మనకు తారసపడతారు, పలకరిస్తారు. కొన్ని సంగతులను గుర్తు చేస్తారు. మనకు జ్ఞాపకమొస్తే మంచిదే. మనం కూడా స్పందిస్తాం. గుర్తు రాకపోయినా ఒక్కోసారి మర్యాదకు వారి నెంబర్ తీసుకుని ఫోన్‌లో భద్రపరుస్తాం. ఆ తరువాత కాల్ చేస్తామో లేదో వేరే సంగతి. ఇలాంటివి అందరికీ ఉండే అనుభవాలు. అలాంటి జాన్ ఆచార్య పాత్రకు ధర్మవరపు సరిపోతారనిపించించింది. మా అంచనా నిజమైంది కూడా.

హీరోకు, హీరోయిన్‌కు ఒక పిల్లల బ్యాచ్ తోడుంటుంది. ఆ పిల్లలతోనే ఆనందం, కోపం, బాధ అంతా పంచుకోవాలి. ఇప్పటి తరం బాలలు ఎలా ప్రవర్తిస్తారో అందులో చూపించాం. తెరమీద కనిపించేది నలుగురైదుగురు పిల్లలే అయినప్పటికీ ఆడిషన్స్ మాత్రం చాలా మందినే చేశాం. బాలల్లో అంతిమంగా నలభైమంది మిగిలారు. వారి నుంచి సినిమాలో చూపిన పిల్ల గ్యాంగ్‌ను ఎంచుకున్నాం. తరువాత సినిమాలో అజిత్ (సెకెండ్ హీరో)పాత్రకు ఆడిషన్స్ చేశాం . ప్రేక్షకులకు ఎటువంటి అంచనాలు ఉండని కొత్తబ్బాయి కావాలి. అలా 20 మందిలో ఆనంద్‌ను ఎంపిక చేసుకున్నాం.

ఆ పనిలో వందశాతం టీమ్ వర్క్...
స్క్రిప్ట్ పని పకడ్బందీగా చేశాం. ఒక పాయింట్ అనుకోగానే అర్జున్, శ్రీనివాస్‌లు తమ కలాలకు పని చెప్పేవారు. ఆ స్క్రిప్ట్ అక్కడి నుంచి మాటల రచయిత రమేష్ దగ్గరకు వెళ్లేది. ఆయన వాటి నుంచి మరో వెర్షన్ రాసేవాళ్లు. రమేష్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ స్క్రీన్‌ప్లే రచయిత హరిప్రసాద్ దగ్గరకు చేరేది. ఆయన మళ్లీ దానిని ఒక పద్ధతిలో పెట్టేవారు. తద్వారా మరో వెర్షన్ వచ్చేది. ఆ తరువాత సీన్ నా దగ్గరకు వచ్చేది. నేను ఫైనల్ కాపీ అని సిద్ధం చేసుకున్నది మా టీమ్ అందరి ముందూ ఉంచేవాణ్ణి. అర్జున్, శ్రీనివాస్, రమేష్, హరిప్రసాద్, నేను చర్చించుకుని వందశాతం అందరం ఓకే అనుకున్నాకే మరో సీన్‌కు వెళ్లేవాళ్లం. అందువలన షూటింగ్‌కు వెళ్లిన తరువాత ఎక్కడా తడుముకోవడం, సీన్స్ బాగా రాలేదని మార్చడం చేయలేదు. స్క్రిప్ట్‌లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెరకెక్కించాను.

ఎక్కువ శాతం కష్టం ఐటమ్ సాంగ్ కోసమే...
దేవిశ్రీప్రసాద్ నాకిచ్చే ఆల్బమ్‌లో కచ్చితంగా ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది. అతను ఎంతో శ్రద్ధ పెట్టి కంపోజ్ చేస్తారు. దానికి సమతూకంగా చిత్రీకరణ ఉండాలన్నది నా కోరిక. అందుకే రాజమండ్రి దగ్గరలోని కొవ్వూరులో పాటను తీయాలనుకున్నాను. ఆ పాటలో హీరో, హీరోయిన్‌లు కూడా డాన్స్ చేయాలి. మా ప్రణాళిక ప్రకారం ఆరు రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలి. అంతా సిద్ధమయ్యాం.

కాని ఒకటే సమస్య. మేమూహించిన దానికంటే ఎక్కువ జనాలు షూటింగ్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. అంతమందిని అదుపు చేస్తూ షూటింగ్ చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అక్కడొక లాంచీ అద్దెకు తీసుకుని దానిని డెకరేట్ చేశాము. లొకేషన్ ఎంతో బాగా నచ్చింది. కాని ఆ ఆరు రోజులు షూటింగ్‌కు బయలు దేరుతున్న సమయంలో ఒకటే భయం. లోపల ఏదో శంక. పాట పూర్తైన రోజు ఏదో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డట్టు అనిపించింది.

పాటకు ఎంత శాతం గ్రాఫిక్స్‌వాడాలి?
'ఓ బాలు' అనే మొదటి పాట విద్యార్థుల సంశయాలను తీర్చేలా ఉండాలి. పాటలో కొన్ని సందేహాలు ఉంటాయి. అవి హీరో తీర్చాలి. సమాధానం చాలా కొత్తగా ఉండాలి. అది వారికి సంతృప్తి నివ్వాలి. ఈ పాట ప్రేక్షకులకు కూడా సంతృప్తినివ్వాలి. సాధారణంగా ఫైటుకు ఎన్ని గ్రాఫిక్స్‌నైనా వాడుకోవచ్చు. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించ వచ్చు. అదే పాట విషయానికి వస్తే ఆలోచించాల్సి ఉంటుంది.

ఈ పాటకు కంప్యూటర్ గ్రాఫిక్స్(సిజి) తప్పనిసరి అని నిర్ణయించుకున్నాక ఆ బాధ్యతలను గ్రాఫిక్ డిజైనర్లు హరికృష్ణ, యుగంధర్‌లకు అప్పగించాం. పాటలో ప్రతీ అక్షరాన్ని వాళ్లు ఎంతో పరిశీలించారు. ఇలా అనేకంటే అధ్యయనం చేసారంటే సరిపోతుందేమో. అంతలా కష్టపడ్డారు. మేం సినిమాలో క్యాంపస్ ఒకటే చూపించాం. కానీ షూటింగ్ జరిపిందేమో హైదరాబాద్‌లోని గురునానక్ కాలేజీలో, బిట్స్‌పిలానీలో. పైగా గ్రాఫిక్స్ ఈ క్యాంపస్‌లను డామినేట్ చేయకూడదు. పాట థీమ్ దెబ్బతీయకూడదు. అంతా అయ్యాక చూస్తే మాకు కావలసిందే వచ్చిందనపించింది.

టైటిల్స్ ప్రయోగంలో రిస్కు శాతం తక్కువ...
100 % లవ్ సినిమాలో చదువు గురించి చెబుతాం. ఎ స్క్వేర్స్, బి స్క్వేర్స్...అల్‌జిబ్రా, మ్యాథ్స్ సూత్రాలు - సిద్ధాంతాలు ....ఇవన్నీ వస్తుంటాయి. సినిమాలో తరచూ కనిపిస్తాయి కూడా. ఇలా సబ్జెక్ట్స్‌కు సంబంధించిన విషయాలు వస్తాయి కనుక సినిమా టైటిల్స్‌లో ఒక ప్రయోగం చేద్దామనుకున్నాం.

అందుకని ఒక ప్రశ్న ఇచ్చి దానికి నాలుగు ఆప్షన్స్ సూచించే సిలబస్ ప్రశ్నలనే టైటిల్స్‌కు ఉపయోగించాం. ఈ ప్రయోగం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అప్పుడే అనుకున్నాం. అందుకే హీరో పేరు నుంచి దర్శకుని పేరు వరకు ఆ పద్ధతినే పాటించాం.

అందుకే నాన్నకు నూరు శాతం అంకితమిచ్చా...
సినిమా ముగియగానే 'నాన్నకు ప్రేమతో' అని టైటిల్స్ చూసినపుడు నాకు అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. నాన్న పేరు తిరుపతిరావు, అమ్మ వీరవేణి. మా అమ్మా నాన్నలకు వాచీ ఇవ్వచ్చు, సెల్‌ఫోన్ ఇవ్వచ్చు. దేన్నైనా ఇవ్వచ్చు. కానీ ఏది ఇచ్చినా వారికది చిన్న వస్తువే అవుతుంది. అందుకే ఎప్పటి నుంచో నేను తీసిన మంచి సినిమాను అంకితమివ్వాలని అనుకున్నాను.

100% లవ్ సినిమా చూసిన వెంటనే మా నాన్న ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారు. అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఇంకేమీ ఉండదని చెప్పగలను. చాలామంది అడుగుతున్నారు -నాన్నకే ఎందుకు అంకితమిచ్చానని. మా అమ్మకు అన్నిటికంటే మా నాన్నంటేనే ఇష్టం. ఒక వేళ నాన్నకు కాకుండా ఆమెకు అంకితమిస్తున్నా అన్నా సరే అమ్మ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ నాన్నకు అంకితం అంటే మాత్రం పొంగిపోతారు.
ఇంటర్వ్యూ: బల్లెడ నారాయణ మూర్తి

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..

Mr.పర్‌ఫెక్ట్


1940: యువత తపన -దేశానికి స్వాతంత్య్రం
1970: యూత్ కోరిక -ఒక ప్రభుత్వ ఉద్యోగం
2000: కుర్రకారు కల -కార్పొరేట్ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్
2011: డూడ్స్ లక్ష్యం -కెరీర్‌ను తమకు నచ్చినట్టు మలచుకోవడంలో నో కాంప్రమైజ్
యువత ఆలోచ నలు మారడానికి మొదట్లో ముప్పై సంవత్సరాలు పడితే, ఆ తరువాత వారి దృక్పథ ం కొత్త దారులు తొక్కడానికి పది సంవత్సరాలే సరిపోయాయి. అనుకున్న పనిని పర్‌ఫెక్ట్‌గా సాధించాలంటే మాత్రం సర్దుకుపోతే కుదరదని నేటి తరం భావిస్తోంది. కెరీర్‌లోనూ, జీవితంలోనూ ఎంత వరకు సర్దుకుపోవాలో చెప్పే ఫిలాసఫీయే మా మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా అని దర్శకుడు దశరథ్, నిర్మాత దిల్‌రాజులు అంటున్నారు. ఆ ఫిలాసఫీని ఎలా సెల్యులాయిడ్ మీదికి తెచ్చారో చదవండి...

సినిమా సోల్ ఫిలాసఫీ:
"కెరీర్‌లో ఏదైనా సాధించాలంటే సర్దుకుపోకూడదు. సర్దుకుపోతే ఓడిపోతాం. కుటుంబ సంబంధాలను నిలబెట్టుకోవడానికి మా త్రం సర్దుకుపోవాలి. సర్దుకుపోవడం వల్ల ఇప్పుడు ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయి ఆత్మీయతల్ని గెలుస్తాం.''

2008 సంవత్సరం ఏప్రిల్ నెల మధ్యలో ఈ డైలాగు పుట్టింది. మా మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలో హీరో విక్కీ(ప్రభాస్) క్లైమాక్స్‌లో చెప్పే డైలాగు ఇది. సినిమా అంతా అయిపోయాక సీట్ల నుంచి లేస్తుండగా హీరో వాయిస్ ఓవర్‌లో వస్తుంది. సినిమా చివర్లో వినిపించే ఈ మాట నుంచే అసలు సినిమా అంతా పుట్టింది. దాని వయసు మూడు సంవత్సరాలన్నమాట. దీని చుట్టూ ఒక కథ అనుకుని ప్రభాస్‌కు వినిపించాం. అతనికి ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కుటుంబ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా మలచిన లైన్ ఇది. ప్రభాస్‌కు నచ్చింది. ఇంకా డెవలప్ చేయమన్నారు.

రచనా సహకారానికి సోలమ్, ప్రవీణ్ వర్మ, బాబీ, కిషోర్, రిషిలను ఎంచుకున్నాం. సినిమాను ఓపెన్ చేసే సీన్ చిన్న పిల్లల క్రికెట్ సీన్ అనుకోకుండా తట్టింది. ఓ రోజు రిషి వచ్చి ఓ పుస్తకంలో ప్రింట్ అయిన కథ చూపించారు. అది చదివాము. బాగుంది. దాన్నే సినిమా ఆరంభానికి ఉపయోగించుకోవచ్చుగా అనిపించింది. ఏదైనా సాధించాలంటే కాంప్రమైజ్ కాకూడదని హీరో అనుకుంటాడు. కెరీర్‌లో అది ఓకె కానీ మానవ సంబంధాల్లో అది కుదరదు. క్షమించడం నేర్చుకోకపోతే జీవితంలో నీ కంటూ ఎవరూ మిగలరు...అనే సూక్తి ఒకటి ఉంది. దాన్నే మేం సర్దుకుపోకపోతే అని మార్చుకుని కథ రెడీ చేశాం.

ఇచ్చే ఫిలాసఫీ:
"మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుంది.''

విక్కీ తనకు నచ్చ లేదని ప్రియ(కాజల్) తండ్రి(మురళీ మోహన్)తో చెబితే, దానికి స్పందించి ఆయన పై డైలాగు చెబుతాడు. హీరో ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. వీళ్లది పల్లెటూరు. నగరంతో పోలిస్తే పల్లెటూరిలో సర్దుకుపోయేతత్వం ఎక్కువ. అయితే ఈ సీన్‌లో మనుషులు మాత్రమే సర్దుకుపోయేలా ఉంటే సరిపోదు. వారి దృక్పథాలను ప్రతిబింబించే పరిసరాలు కూడా వారి మనసుల్లాగే గొప్పగా ఉండాలి.

అలాంటి పల్లెటూరి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మన రాష్ట్రంలో అలాంటి ఊళ్లు చాలానే ఉన్నాయి. కాని అక్కడ ప్రభాస్, కాజల్, ఇతర తారలను చూడటానికి అభిమానులు ఎగబడవచ్చు. అందుకని వేరే ఊరు చూడాలనుకున్నాము. అలా తమిళనాడులోని పోలాచిని ఎంపిక చేసుకున్నాం. అక్కడే ఎక్కువ భాగం షూట్ చేశాం. విక్కీ, ప్రియల మధ్య సీన్స్ కోసం మాత్రం 'రోజా' సినిమాలో కనిపించే 'టెంకాసీ' అనే ప్రదేశంలో షూట్ చేశాం. ఈ ప్రదేశాలన్నీ సినిమాకు కలిసొచ్చాయి. ఇదే పల్లెటూరి సీన్స్‌లో గుడి దగ్గర ఫైట్ ఉంటుంది.

ఆ ఫైట్‌ను పీటర్ హెయిన్స్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. హీరోను కొట్టడానికి ఎవడైతే మనుషుల్ని తీసుకొస్తాడో, ఆ మనుషులే వాణ్ణి కొడతారు. దానికి తగ్గట్టుగా ఉంటుంది ఆ ఫైట్. అంతేకాకుండా ఈ సన్నివేశంలో హీరోయిన్‌కు గాయం కూడా అవ్వాలి. అయితే పోలాచి, టెంకాసీ ఈ రెండు చోట్లా ఫైట్ సీక్వెన్స్ మేమనుకున్నంత బాగా రాలేదు. దాంతో ఆ ఫైట్‌ను అహోబిలంలో తీశాము. 'మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుందన్న' మాట చుట్టూ ఉండే సీన్స్ బాగా రావడానికి మేం ఎంచుకున్న పల్లెటూరి లొకేషన్స్ బాగా సహకరించాయి.

తీసుకునే ఫిలాసఫీ:
"ఏడిస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే జీవితాంతం ఏడవగలను. అలా కానపుడు ఏడ్వడంలో అర్థం లేదు కదా!''

విక్కీ తనను ఓదార్చబోయేటపుడు ప్రియ చెప్పే డైలాగు ఇది. ఒక అందమైన అమ్మాయి తనను వద్దన్న అబ్బాయినే కోరుకోవాలంటే ఆ అబ్బాయి ఎలా ఉండాలి? మనిషి మంచితనం సంగతి అలా ఉంచితే, అతని రూపం, ఛరిష్మా ఆమెతో పోటీ పడాలి. అవసరమైతే ఆమెను మించిపోవాలి. ఇలా ఉండాలంటే ప్రభాస్‌ను చాలా హ్యాండ్‌సమ్‌గా చూపించాలి. ముందుగా మా అందరి దృష్టి హెయిర్‌స్టైల్ మీద పడింది. ఆ పనిని హెయిర్ స్టైలిష్ హకీమ్ అలీకి అప్పగించాం. రెండు మూడు స్కెచ్‌ల తరువాత హెయిర్‌స్టైల్ వచ్చేసింది. అతను వేసుకునే దుస్తులకూ అదే పద్ధతి. ప్రభాస్ ఇంతకు ముందు 'డార్లింగ్' సినిమాలో లవర్‌బాయ్‌గా కనిపించారు.

ఇందులోని పాత్ర లుక్ దానికి కొనసాగింపుగా ఉండకూడదనుకున్నాము. ఆ బాధ్యతలు డిజైనర్ భాస్కర్ తీసుకున్నారు. ఈ తరం అబ్బాయిలు కొంచెం రఫ్‌నెస్ కూడా కోరుకుంటారు. కొంచెం స్మార్ట్...కొంచెం రఫ్ కోసం మేకప్‌మ్యాన్ శ్రీనివాసరావు కష్టపడ్డారు. అందుకే అంత అందమైన అమ్మాయి ప్రేమను హీరో పొందగలిగాడు. ప్రియ పాత్ర కోసం కాజల్ ఎంపిక సులభంగా జరిగింది. పైగా ప్రభాస్, కాజల్ కాంబినేషన్ డార్లింగ్‌లో వర్కవుట్ అయ్యింది కూడా. మాగీ పాత్రకు ఎవరినైనా కొత్త వారిని తీసుకుందాం అనుకున్నాము. విదేశాల్లో పెరిగిన అమ్మాయి కోసం ప్రయత్నిస్తుండగా తాప్సీ సరిపోతారనిపించింది. ఆమెతో ఆడిషన్స్ చేశాక మాగీ అన్వేషణ ముగిసింది.

ఆస్ట్రేలియాలో షూటింగ్ ఫిలాసఫీ:
"ప్రేమంటే ఒకే బ్రాండ్ కాఫీ ఇద్దరికీ నచ్చడం కాదు. ఇద్దరూ కలిసి ఒకే బ్రాండ్ కాఫీని తయారు చేసుకోవడం.''

కెరీర్, జీవితం... ఏ విషయంలోనైనా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకునే విక్కీ, మాగీ(తాప్సీ)లను ఉద్దేశించి మాగీ తండ్రి(ప్రకాష్‌రాజ్) చెప్పే డైలాగు ఇది. ఆరున్నర లక్షలమంది ఆలోచనల్లో మా ఇద్దరి ఆలోచనలే ఒక్కలా ఉన్నాయని వీళ్లు అనుకుంటే, దానికి భిన్నంగా మిగతా వారంతా కలిసి వీళ్లిద్దరినీ రిజెక్ట్ చేశారని ప్రకాష్‌రాజ్ అంటారు. ఈ సీన్‌లో పల్లెటూరు ఉండదు. నగరమే. చాలాకాలం క్రితం ఇండియా నుంచి వెళ్లి వ్యాపారంలో ఎన్నో సంస్థలు స్థాపించి తల పండిపోయిన పాత తరం(ప్రకాష్‌రాజ్), చిన్న వయసులోనే పెద్ద డీల్స్ ఎగరేసుకుపోయిన నేటి తరం (ప్రభాస్) మధ్య వార్ అది.

ఈ సీన్ రిచ్‌గా రావాలని సిడ్నీలో షూట్ చేశాము. టెక్నీషియన్స్‌తో పాటు దాదాపు నలభై మందిని ఇక్కడి నుంచి తీసుకెళ్లాం. ఆస్ట్రేలియాలో షూటింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని. కీలకమైన సన్నివేశాలు, క్లైమాక్స్ అంతా ఆస్ట్రేలియాలో ప్లాన్ చేసుకున్నాం. కానీ అక్కడ మేమనుకున్న దానికంటే రెట్టింపు ఖర్చు, కష్టాలు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియాలో షూటింగ్ కంటే యూఎస్‌లో షూటింగ్ చాలా సులభమని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మా ప్రొడక్షన్‌లో విదేశాల్లో షూటింగ్ జరుపుకొన్న సినిమా మిస్టర్ పర్‌ఫెక్ట్ ఒక్కటే. మిగతా సినిమాలన్నిటికీ పాటల కోసమే విదేశాలకు వెళ్లడం అలవాటు. కాని మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా టాకీ పార్టు కూడా అక్కడ తీయాలని నిర్ణయించుకున్నాము.

అక్కడ కోటిన్నర రూపాయల బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. యూఎస్‌లో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. ఇక్కడా ప్లాన్ చేసుకున్నాం. కాని షూటింగ్ స్పాట్‌కు వెళ్లగానే ఏదో ఒక సమస్య. మీడియేటర్ తప్పు దోవ పట్టించినా సరే కాంబినేషన్, కాల్షీట్లు గుర్తుపెట్టుకుని సర్దుకుపోవాల్సి వచ్చింది. దాంతో ఖర్చు పెరిగింది. యూఎస్‌లో అయితే ఇలా జరిగుండేది కాదు. అయినా సరే మేమనుకున్న రిచ్ లుక్ రాబట్టుకున్నాం. సీన్ షూట్ చేశాక రఫ్ చూసున్నప్పుడు మాత్రం ఆ కష్టం మరచిపోయే వాళ్లం.

*** హీరో తనకు నచ్చకపోవడంతో హీరోయిన్ తండ్రి అతనిపైకి రౌడీలను పంపించడం వల్ల జరిగే ఫైట్ ఆస్ట్రేలియాలో తీయాలి. ఇక్కడైతే రౌడీల చేతిలో కర్రలు, కత్తులు చూస్తాం. అదే ఆస్ట్రేలియాలో అయితే ఏం ఉందా? దీనికి పీటర్ హెయిన్స్ ఒక ఆలోచన చెప్పారు. ప్లాన్ బాగుంది కాని అది వర్కవుట్ అవుతుందా అవదా అన్న భయం కలిగింది. ఎందుకంటే పీటర్ హెయిన్స్ ఆ ఫైట్‌ను 'పార్కోస్'( గోడల మీద దూకేవాళ్లు)తో ప్లాన్ చేశారు.

ప్రపంచం మొత్తం మీద పార్కోస్ ఉన్నదే పదిమంది. అందులో పారిస్‌లో ఇద్దరు, వియత్నాంలో ముగ్గురు, ఆస్ట్రేలియాలో ఇద్దరు ఉన్నారు. మీడియేటర్ ద్వారా ఈ ఏడుగుర్ని పట్టుకోగలిగాం. ఖర్చు కూడా ఎక్కువయ్యిందనుకోండి. మొత్తానికి వీళ్లు వెంబడిస్తుండగా హీరో పరిగెత్తే సీన్ సినిమాలో వస్తుంది. ఇది చూసి చాలామంది డూప్‌లతో చేశామని, గ్రాఫిక్ ఉపయోగించామని అనుకున్నారు. సిడ్నీ నగరం మధ్యలో వచ్చే ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌లను గెంతుతూ హీరో పరుగుతీయడం ఒరిజినల్‌గా చేసినదే.

*** రెండో హీరోయిన్ తాప్సీని పరిచయం చేసే సీన్ కూడా ఆస్ట్రేలియాలోనే ప్లాన్ చేశాం. ఈ సీన్‌లో ఆమె బైక్ రేస్‌లో ప్రథమ స్థానం దక్కించుకుంటుంది. సినిమాలో ఈ సీన్ అటూ ఇటూగా ఒక నిమిషం మాత్రమే కనిపిస్తుందేమో. కాని దీనికోసం ఎంతో శ్రమించాం.

ఒక హెలికాప్టర్‌తోపాటు, నాలుగు కెమెరాలు వాడాల్సి వచ్చింది. దీనికంటే కష్టమైన పనేమిటంటే ఆ సీన్ షూట్ 'సీక్లిఫ్' బ్రిడ్జ్‌పైన తీయాలనుకున్నాం. అది చాలా అందమైన లొకేషన్. చాలా ఖరీదైనది కూడా. అంతేకాకుండా ఒక పూట మాత్రమే షూట్ చేయాలి. దాని కోసం అనుమతులు తెచ్చుకున్నాక షూటింగ్ ఉదయం మొదలుపెడితే మధ్యాహ్నం వరకు నో బ్రేక్. ఏకధాటిగా షూటింగ్ జరిపాం. అలా రెండు రోజుల్లో షూట్ చేసి సినిమాలో మాత్రం దాన్ని ఒక నిమిషమే చూపించగలిగాం.

కామెడీ ఫిలాసఫీ:
"అందరూ జల్సా కిషోర్‌లా బతకాలంటే కుదరదు.''

హీరో తనకు నచ్చేది మాత్రమే చేస్తాడు. అతని అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఒక పాత్ర ఉండాలి. అది కామెడీ పాత్ర కావాలి. వాళ్లిద్దరి మధ్య కామెడీ పండాలి. దీని కోసం చాలా ఆలోచించాం. చివరకు రచయిత బాబీ ఒక మాట చెప్పారు. హీరో తనకు నచ్చేదే చేస్తాడు... కమెడియన్ మాత్రం తనకు నచ్చింది అందరి మీదా రుద్దుతుంటాడు. ఈ పాత్ర కోసం జల్సా కిషోర్(బ్రహ్మానందం) పుట్టాడు. జల్సాకిషోర్, విక్కీ మధ్య వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ సన్నివేశాలన్నీ దాదాపు బాబీయే అందించారు. ఇంటర్వ్యూ: బల్లెడ నారాయణ మూర్తి
టేక్ -5
* సినిమా మొత్తం 130 రోజుల్లో పూర్తి చేశాం.
* మొదట అనుకున్న బడ్జెట్ కంటే సినిమా పూర్తయ్యేసరికి 20 శాతం పెరిగింది.
* తాప్సీ తన డబ్బింగ్ తనే చెప్పుకొన్నారు. కాజల్‌కు మాత్రం వేరే వాళ్లతో చెప్పించాం.
* ఆస్ట్రేలియాలో 18 రోజుల పాటు షూటింగ్ జరిగింది.
* సిీక్లిఫ్ బ్రిడ్జ్‌పై తీసిన రెండో హీరోయిన్ ఇంట్రడక్షన్ రేస్ సీన్‌కు 'మాట్రిక్స్', 'మిషన్ ఇంపాజిబుల్ -2' సినిమాలకు పని చేసిన సాంకేతిక నిపుణుడు హీలీ పనిచేశారు. 

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..


తీన్‌మార్

ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను తెలపడానికి ఏళ్లు గడిచే రోజులు పోయాయి. ఇప్పుడన్నీ నిమిషాల్లో జరిగిపోవాలి. కలవడమైనా...విడిపోవడమైనా. మనసులో పుట్టింది ప్రేమా లేక ఆకర్షణా..తెలుసుకునేలోపే జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ముప్పై ఏళ్ల క్రితం ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉండేదో, ఇప్పుడంత అయోమయంగా మారింది. డేటింగ్, బ్రేకప్‌లతో సాగే మోడ్రన్ ప్రేమికులకి నిజమైన ప్రేమ విలువను తెరమీద చూపించడం కోసం 'తీన్‌మార్' తీసామంటున్నారు నిర్మాత గణేశ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేసి క్లాస్‌ని, మాస్‌ని మెప్పించే ప్రయత్నం చేశాడు. మెప్పించినట్టే ఉన్నాడు. ఇది హిందీ రీమేక్ సినిమా అయినా దీని వెనక కూడా బోలెడు సంగతులున్నాయి. అవే ఈ రోజు మేకింగ్ ఆఫ్ ద మూవీ.
పదేళ్లక్రితం ప్లాన్ చేస్తే... - జయంత్ సి. పరాన్జీ, డైరెక్టర్
పవన్‌కళ్యాణ్‌తో సినిమా తీయాలని ఎప్పట్నించో అనుకుంటున్నాను. 1997లో ఒక మంచి స్క్రిప్టు పట్టుకుని కళ్యాణ్ దగ్గరికి వెళ్లాను. ఆయనకి కథ నచ్చింది. కాని ఇంతలో చిరంజీవి నన్ను పిలిచి సినిమా చేయాలన్నారు. కళ్యాణ్‌తో ప్లాన్ చేస్తున్నానని చెబితే వినలేదు. అప్పుడు కళ్యాణే వచ్చి 'మనం తర్వాత చేద్దాం...ముందు అన్నయ్య సినిమా గురించి ఆలోచించండి' అని అన్నాడు. ఆ సమయంలోనే నేను చిరంజీవితో 'బావగారు బాగున్నారా' తీసాను. అప్పటి కోరిక ఇప్పుడు తీరింది. 'లవ్ఆజ్‌కల్' రిమేక్ కావాలని కళ్యాణ్ అడగ్గానే గుడ్ చాయిస్ అనుకున్నాను. కాని మక్కికి మక్కి దింపితే గొడవలైపోతాయన్నాను. అబ్బే...ఏం కాదన్నాడు. 'నీకేంటి నాయనా...నీకు ఇంటి ముందు సెక్యూరిటీ ఉంటారు. నాకలా కాదు. మా హీరోని ఇలా చూపించావేమిటని నీ ఫ్యాన్స్ అందరూ నా ఇంటిమీదకొస్తారు' అని అన్నాను. సైఫలీఖాన్ పెద్ద క్రేజ్ ఉన్న హీరో కాదు. ఎలా చూపించినా అక్కడి ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. కాని కళ్యాణ్‌ని అలా చూపిస్తే ఒప్పుకోరు. దాంతో కథకి కొన్ని కొత్త రంగులద్దాం. లవ్ఆజ్‌కల్‌లో రిషీకపూర్ చేసిన పాత్ర కూడా కళ్యాణ్‌తో చేయిస్తే ప్రేక్షకులకి కావలసిన మాస్ ఎలిమెంట్స్ చూపించే అవకాశముంటుందని అనుకున్నాను. డబుల్ యాక్షన్‌కి కళ్యాణ్ ఓకే చెప్పారు.

డబుల్‌యాక్షన్‌లో కళ్యాణ్...
మొదటిసారి డబుల్‌యాక్షన్ చేస్తున్నాడు. రెండు పాత్రల్ని భిన్నంగా చూపించాలి. స్క్రీన్‌ప్లే, మాటలు బాగుంటేనే నా ప్రయోగం సక్సెస్ అవుతుంది. కళ్యాణ్ ఫోన్ చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితేనే మన కథకి బలం వస్తుందని చెప్పాడు. శ్రీనివాస్ పేరు వినగానే నాకు ఉత్సాహం రెట్టింపయింది. నెల రోజుల తర్వాత శ్రీనివాస్ స్క్రిప్టు పట్టుకుని వచ్చాడు. డైలాగులు చదివి వినిపిస్తున్నాడు...మధ్యలో హీరోయిన్ చెప్పే డైలాగు దగ్గర నా చెయ్యి శ్రీను భుజాన్ని తట్టింది. 'అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదులుకోలేం కదా...అలాగే వాడ్ని కూడా వదులుకోను' అన్న డైలాగ్ నాకు బాగా నచ్చింది. ప్రేక్షకుడి నాడి దొరికితే సరిపోదు...సన్నివేశం వారి మనసుని కదిలించాలి. ఆ పని శ్రీను చేయగలడు. సినిమాలో ఎక్కువగా విదేశీయులు కనిపిస్తారు. పాటలు, కొన్ని సరదా సన్నివేశాలు, ఫైటింగ్ సన్నివేశాల్లో చాలామంది విదేశీయులు కావాలి.

వారిని టీనువర్మ అనే అతను ఎంపిక చేశాడు. నటించడంలో వారు ప్రొఫెషనల్స్ కాబట్టి నేను పెద్ద ఇబ్బంది పడలేదు. న్యూయార్క్‌లో చేయాల్సిన ఫైటింగ్ సీన్‌కి ఫైట్ మాస్టర్ మనవాడే. సరిగ్గా చేయగలడో లేదోనని టెన్షన్ పడ్డాం. కాని బాగానే వచ్చింది. హీరో తర్వాత అందరి కళ్లు వెతికేది హీరోయిన్స్‌ని. మైఖేల్ పాత్రకు జోడి(మీరా)గా మొదట దీపికా పడుకునే అయితే బాగుంటుందని అనుకున్నాం. కుదరకపోవడంతో త్రిషని ఎంచుకున్నాం. చక్కని రూపం, ప్రతిభ గల నటనతో త్రిష అందరినీ మెప్పించగలదని నమ్మాం. అర్జున్‌పాల్వాయి పాత్రకు జోడి(వసుమతి)గా నటించాల్సిన అమ్మాయి కోసం నేను ముంబయిలో ఇరవైరోజులు తిరిగాను. ఎవ్వరూ నచ్చలేదు. హైదరాబాద్‌లో ఒక సినిమా వేడుకలో కృతి కర్బందాని చూశాను. వెంటనే కళ్యాణ్‌కి ఫోన్ చేసి 'వసుమతి దొరికింది' అని చెప్పాను. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మ్యూజిక్. దాదాపు నా సినిమాలన్నింటికీ మణిశర్మే మ్యూజిక్ ఇస్తాడు. దీనికి కూడా ఆయనతోనే చేయించాలనుకున్నాను.

చాలా భయపడ్డాను...
మామూలుగా అయితే తెలుగు సినిమాలో హీరోయిన్‌ని హీరో కాకుండా ఇంకెవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే సరిగ్గా పెళ్లి పందిట్లో మూడుముళ్లు వేసేముందు హీరో వచ్చి పెళ్లి ఆపేస్తాడు. ఈ సినిమా కథలో కూడా అలాంటి సందర్భం ఒకటి ఉంది. ఎప్పటిలాగే చేస్తే రొటీన్ అవుతుంది. ఏం చేయాలి? ధైర్యం చేసి హిందీలోలాగే హిీరోయిన్‌కి పెళ్లి చేసేశాం. తరువాత ఆ అమ్మాయి అతనితో విడాకులు తీసుకుని, హీరో దగ్గరికి వెళుతుంది. ఇది మన సంప్రదాయానికి విరుద్ధమే అయినా ప్రేమని రక్షించుకోవడం కోసం ఇలాంటి పనులు చేయడం తప్పు కాదని సినిమా కథ చెబుతుంది. దానికి తగ్గట్టే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాం. ఈ సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో...ఏమోనని నేను చాలా భయపడ్డాను.

తీన్‌మార్‌లా ఉండాలని... - గణేశ్, నిర్మాత
నిర్మాతగా నా మొదటి సినిమా ఆంజనేయులు. తర్వాత సినిమా ఇదే. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలని 2009 నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటికి కుదిరింది. యాక్షన్ సినిమా, రొమాంటిక్ సినిమా, కామెడీ సినిమా..ఏదైతే కళ్యాణ్‌కి సూటవుతుంది? ప్రస్తుతం ప్రేక్షకులు కళ్యాణ్ నుంచి ఏది కోరుకుంటున్నారు? అనే అంశాలపై చాలా వర్క్ చేశాను. రెండేళ్ల నుంచి కళ్యాణ్‌కి నాలుగు కథలు చెప్పాను. ఏవీ నచ్చలేదు. చివరికి ఇది చేద్దామని ఆయనే లవ్ఆజ్‌కల్ సినిమా పేరు చెప్పారు. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం. నాక్కూడా బాగా నచ్చింది. ఇందులో నేను కోరుకున్న మూడు అంశాలు ఉన్నాయి. పూర్తిస్థాయి ప్రేమికుడి పాత్రలో కళ్యాణ్‌ని చూడాలని ప్రేక్షకులు కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకి డైరెక్టరు ఎవరయితే బాగుంటుంది? అని అనుకుంటుంటే..ప్రేమించుకుందాం..రా, ప్రేమంటే ఇదేరా వంటి సూపర్ హిట్ సినిమాలందించిన జయంత్ గుర్తుకొచ్చారు. కళ్యాణ్ కూడా ఆయనైతేనే బాగుంటుందని అన్నారు. ఇక నటీనటుల గురించి చెప్పాలంటే...హీరోయిన్ సెలక్షన్ అంతా డైరెక్టర్, హీరోలే చూసుకున్నారు. మిగతా నటుల విషయానికొస్తే...అన్ని తెలుగు సినిమాల్లో విలన్‌లుగా కనిపించే పరేష్ రావెల్, సోనూసూద్‌ని ఇందులో మంచివారిగా చూపించాలనుకున్నాం. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని కొంత ఆలోచించినా.. కొత్తగా ఉండాలంటే ఇలాంటి ప్రయోగం చేయడం తప్పదని వారినే ఎంచుకున్నాం. షూటింగ్ సమయంలో సోనూ...తన పాత్రని ఇంత పాజిటివ్‌గా చూపించడం పట్ల చాలా హ్యాపీ ఫీలయ్యేవాడు. కళ్యాణ్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన హాలీవుడ్ నటి మిస్చెల్ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో స్క్రీన్‌ప్లే, మాటలు రాయించుకుని షూటింగ్ మొదలుపెట్టాం.

96 రోజుల్లో...
మొదట ముప్పైఏళ్ల కిత్రం ప్రేమికుడు అర్జున్‌పాల్వాయి పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వారణాసిలో చిత్రీకరించాం. సినిమా షూటింగ్ నిమిత్తం మూడు దేశాలు వెళ్లాం. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్యాంకాక్. స్వదేశంలో అయితే కాశీ, మైసూర్, అహ్లాబాద్, హైదరాబాద్‌లలో షూటింగ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 100 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోవాలని అనుకున్నాం. 96 రోజుల్లో సినిమా రెడీ అయిపోయింది. సినిమాకి ఏం పేరు పెట్టాలి? అనే విషయంపై చాలా వర్క్ చేశాం. కథకు దగ్గరగా పెట్టాలా? ప్రేక్షకుడికి దగ్గరగా పెట్టాలా? ఈ రెండు అంశాల గురించి ఆలోచిస్తే...కళ్యాణ్‌కి ప్రేక్షకులే ముఖ్యమనిపించారు. తీన్‌మార్ అయితే మాస్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుందని అదే ఖాయం చేశాం. పాటలు ఎవరితో రాయించాలనుకుంటున్న సమయంలో జయంత్‌గారు, మణిశర్మగారు భాస్కరభట్లని సెలక్ట్ చేసుకున్నారు.

ఆయన రాసిన ఓహో...బస్తీ దొరసాని, అలె..అలె బాగా హిట్ అయ్యాయి. మిగిలిన పాటలు రహమన్ అనే కొత్తబ్బాయి, విశ్వ రాశారు. అవి కూడా చాలా బాగున్నాయి. ఇక బడ్జెట్ విషయానికొస్తే కథ డిమాండ్‌ని బట్టి నేను ముందుకు వెళ్లాను. వారణాసిలో చిత్రీకరించిన దేవుడి పాటకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్టింగ్ వేశాం. కొన్ని సన్నివేశాలు వారణాసిలో తీసినా చాలావరకూ సెట్టింగ్‌లోనే తీయాల్సివచ్చింది. ఈ ఒక్క పాటకు కోటి రూపాయలు ఖర్చు అయింది. అలాగే అర్జున్‌పాల్వాయి పాత్ర చుట్టూ ఉన్న సన్నివేశాల్ని కూడా చాలావరకు సెట్టింగ్‌లతోనే నడిపించాం.

స్టెప్పులదిరాయి... - రాజు సుందరం, కొరియోగ్రాఫర్
ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో కొత్తగా అనిపించింది తీన్‌మార్. ఈ సినిమాలో మూడు పాటలకు నేను కొరియోగ్రఫీ చేశాను. మిగతా వాటికి మరో కొరియోగ్రాఫర్ కళ్యాణ్ చేశాడు. డుబా..డుబా, అలె..అలె, ఓహో బస్తీదొరసాని పాటలు చాలా బాగున్నాయి. నేను అనుకున్నట్టుగానే చేయగలిగాను. హీరో చాలా సపోర్టివ్ పర్సన్. అలాగే నిర్మాత గణేష్ కూడా. వయసులో చిన్నవాడైనా సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. కాకపోతే రకరకాల ప్రదేశాల్లో షూటింగ్ ఉండడం వల్ల వీసాల విషయంలో కొంత ఇబ్బంది పడ్డాం. డుబా...డుబా అనే సాంగ్ అంతా బ్యాంకాక్‌లో చిత్రీకరించాం.

అందులో అందరూ విదేశీ వనితలే కనిపిస్తారు. ఎలా చిత్రీకరిస్తే బాగుంటుందనే విషయంపై చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశాను. ఎందుకంటే అది సినిమా ఓపెనింగ్ సాంగ్. పాతికమంది అమ్మాయిల మధ్యన పవన్ హావభావాలు చాలా చక్కగా వచ్చాయి. ఒకటికి రెండు సార్లు చూసుకుని మరీ చేసేవాడు. అలె...అలె..సాంగ్ చిత్రీకరణ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. ఆ పాటలో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ రకరకాల ఫీలింగ్స్‌తో కనిపించాలి. ప్రాక్టీసు చేసి మరీ చేశారు. మొత్తానికి తీన్‌మార్ కొరియోగ్రఫీ నాకు చాలా సంతోషానిచ్చింది. నిర్మాతగా గణేశ్‌కి మంచి భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను.
-భువనేశ్వరి

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..

శక్తి

రాజమౌళి, వివి వినాయక్, సురేందర్, పైడిపల్లి వంశీ, బోయపాటి శీను -వీళ్లెవరూ 'శక్తి' సినిమా దర్శ కులు కాదు. కాని అన్నపూర్ణ స్టూడియోలోని మొదటి అంతస్తులో జరుగుతున్న శక్తి షూటింగ్‌కు తరచూ వెళ్లేవాళ్లు. షూటింగ్ గురించి అడిగి తెలుసుకునే వాళ్లు. కారణం -అక్కడి కాళికాదేవి ఆలయం సెట్. అష్టాదశ శక్తి పీఠాలకు కేంద్రమైన కాళికాదేవి ఆలయం సెట్‌ను కళా దర్శకుడు ఆనంద్‌సాయి అక్కడ నిర్మించారు. శక్తి అనే సోషియో ఫాంటసీ సినిమాలో కాళికాదేవి ఆలయంతోపాటు ఇంకా ... ఈజిప్ట్ రాజభవనాలు, ఆభరణాలు, గుహలు, జైపూర్ వీధులు, హంసల సొగసులు కనిపించొచ్చు కానీ, ఆనంద్ సాయి సృష్టించిన ఈ కళాఖండాలేవీ ఫాంటసీ కాదు...
ఆ సెట్‌కు రెండు కోట్ల రూపాయల ఖర్చు
- కళా దర్శకుడు ఆనంద్ సాయి

జగదేక వీరుడు -అతిలోకసుందరి, అశ్వమేధం, గోవిందా గోవిందా సినిమాలకు మా నాన్న చలం కళాదర్శకత్వం వహించారు. అలా వైౖజయంతీ మూవీస్‌తో మా కుటుంబానికి మొదట్నించి సాన్నిహిత్యం ఉంది. నేను ఆర్ట్ డైరెక్షన్‌లోకి వచ్చాక ఎప్పటికైనా అలాంటి సినిమాలకు ఆర్ట్‌డైరెక్షన్‌లో పని చేయాలని లోలోపల అనిపిస్తూ ఉండేది. శక్తి సినిమా కథ విన్నాక నా కల నెరవేరుతుందనుకున్నా. కథ విన్నాక అష్టాదశ శక్తి పీఠాలకు కేంద్రమైన కాళికాదేవి ఆలయమే ఈ సినిమాలో కీలకం అని అర్థమయ్యింది. కాళికాదేవి ఆలయం అనగానే ఎవరికైనా పాతాళభైరవి సినిమా గుర్తొస్తుంది. అది కలకాలం నిలిచిపోÄేయిన సెట్. అలా ఎప్పటికీ చెప్పుకునే సెట్ వేయాలని అనుకున్నాను. నేను వేసిన స్కెచ్ దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అశ్వనీదత్‌లకు నచ్చింది. కాని చివరి నిమిషం వరకు సెట్ ఎక్కడ వేయాలా అన్న విషయం తేలలేదు.

*** అశ్వనీదత్, మెహర్ రమేష్, నేను ముగ్గురం కూర్చున్నాం. రామోజీ ఫిలింసిటీలో అయితే స్థలం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడే బాగుంటుందని దర్శక నిర్మాతల అభిప్రాయం. నేను అంత స్థలం అక్కర్లేదని చెప్పాను. అన్నపూర్ణ స్టూడియోలోని మొదటి అంతస్తు గురించి వివరించాను. ఒప్పుకున్నారు. ఇంతకు ముందే అక్కడ చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు స్వర్గం, యమలోకం, కొన్ని దేవాలయాల సెట్స్ వేసి మెప్పించి ఉన్నారు.

అవన్నీ ప్రేక్షకుల మెదడులో ఫిక్స్ అయిపోయున్నాయి. అందువలన వాటిని మార్చాల్సిన అవసరం లేదు. అంతేకాదు వాటిని చెడగొట్టారని కూడా అనిపించుకోనక్కర్లేదు. ఇంకా బాగా చేస్తే చాలు. కాళికాలయం సెట్ విషయంలో అదే నా లక్ష్యం. వేకువ జాము మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సెట్ స్కెచ్ ప్రిపరేషన్. సెట్‌కు అంతా సిద్ధం. అన్నపూర్ణ స్టూడియోలోని మొదటి అంతస్తు ఎంపికయ్యింది. అయితే గుడిలోపల 35 అడుగుల కాళికా విగ్రహం పెట్టాలి. సాధారణంగా అందరూ సెట్ లోపలే వీటన్నిటినీ తయారు చేస్తారు. కాని నా ఆలోచన మాత్రం వేరేగా ఉంది.

*** అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిబింబించే పద్దెనిమిది స్తంభాలు, వాటి మధ్యన కాళికాదేవి విగ్రహం చేయాలి. ఏ విగ్రహం లోనైనా కాళికాదేవి నాలుక బయటకు ఉంటుంది. ముఖం రౌద్రంగా ఉంటుంది. అయితే నేను తయారు చేసిన విగ్రహం ప్రసన్నవదనంతో ఉండేలా చూసుకున్నాను. దానికోసం చాలా షేడ్స్ తయారు చేశాను. పద్దెనిమిది స్తంభాలు అష్టాదశ శక్తుల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. వాటిపై ఆయా శక్తి స్వరూపాల బొమ్మలు చెక్కాను. క్లైమాక్స్‌లో అవసరార్థం అవన్నీ ఒకవైపుకి పడిపోవాలి.

మళ్లీ తిరిగి యథాస్థానానికి వచ్చేయాలి. అందుకోసం రోప్‌వేసి స్తంభాలను కట్టాను. స్తంభాల తయారీకి ఫైబర్ ఉపయోగించాను. అంతేకాకుండా వాటిని హీరో తాకినపుడు వాటి నుంచి మెరుపులు రావాలి. అవి సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్)లో కాకుండా సెట్‌లోనే వచ్చేట్టుగా ఏర్పాటు చేశాను. వీటన్నిటినీ బయట రూపొందించి నాకు సంతృప్తి కలిగాకే సెట్ లోపల అమర్చాము. అయితే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఫైట్‌కోసం ఇదే సెట్ స్థలంలో మరొక సెట్ వేయాల్సి వచ్చింది.

*** కాళికాదేవి విగ్రహం దర్శించుకోవడానికి ముందు శివలింగం ఒకటి ఉండాలి. ఇది ఫ్లాష్‌బ్యాక్‌లో అవసరమవుతుంది. అందుకని ముందు శివలింగం సెట్ వేసి తరువాత అదే స్థలంలో కాళికాదేవి విగ్రహం సెట్ నిర్మించాలనుకున్నాను. అనుకున్నట్టుగానే ముందు శివలింగం ప్లాన్ చేసుకున్నాను. ఆ తరువాత కాళికాదేవి విగ్రహం. దీని నిర్మాణం పూర్తయ్యింది కాని నా పని మాత్రం పూర్తి కాలేదు. ఎందుకంటే నేననుకున్నట్టుగా విగ్రహం వచ్చిందో లేదో చూడటానికి సెట్‌ను ఎన్నో వందల సార్లు ఫోటోలు తీశాను. ఒక్కో నిర్మాణం చుట్టూ రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు వచ్చాయి. అవన్నీ ముందేసుకుని కూర్చునేవాణ్ణి. అంతా ఓకే అయ్యాకే యూనిట్ సభ్యులు లోపల షూటింగ్ మొదలు పెట్టారు.

విగ్రహం ముందు ఒక నీటి గుంట ఉంటుంది. సెట్‌లోపల రాళ్లు పగుళ్ల నుంచి వాటర్ లీకేజీ అవుతుంది. అదంతా గుడి బయట చూపించే జలపాతానికి కొనసాగింపుగా ఉండాలని సెట్‌లో పగుళ్లు వచ్చేలా చేశాను. వాటి నుంచి నీరు ఉబికి రావడం చూసే ఎవరికైనా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. షూటింగ్‌కు ముందు సెట్ చూసిన మెహర్ రమేష్ నన్ను అమాంతం కౌగిలించుకున్నారు. సీజీలో కూడా ఇంత అద్భుతంగా చూపించలేమన్నారు. కాళికాదేవి ఆలయం సెట్ పూర్తయ్యాక ఈజిప్ట్ రాజభవనాల కోసం చలో పద్మాలయా స్టూడియో.

*** ఈజిప్ట్, కాశ్మీర్, హరిద్వార్, జైపూర్, రాజస్థాన్ ఎడారి - శక్తి సినిమాలో ఇవన్నీ ఉంటాయి. మెహర్ 'శక్తి' కథ నాతో చెప్పినపుడు ఇదంతా వినడానికి బాగున్నా వీటిని చూపించడానికి, ఆ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడానికి చాలా కాలం పడుతుందని, ఖర్చెక్కువవుతుందని అన్నాను. అశ్వనీదత్ చేయగలమన్నారు. అందులో ఈజిప్ట్ బ్యాక్ గ్రౌండ్ సినిమాకు అతికినట్టు సరిపోవాలన్నారు. అందువలన ఈజిప్ట్ పిరమిడ్లు చూడటంతోపాటు, అక్కడి ఇంటీరియర్‌ను నేను స్కెచ్ గీసుకుని వచ్చాను. ఈజిప్ట్‌లో మూడు రోజులు ఇదే పని. ఈజిప్ట్ పిరమిడ్లు ఉండే చోట అవుట్‌డోర్ షూటింగ్ చేసుకోవచ్చనిపించింది.

మెహర్, నేను దానికే డిసైడ్ అయ్యాము. పిరమిడ ్ల నుంచి కోట లోపలికి వెళ్లే సీను మాత్రం సెట్ వేసుకుంటే మంచిదనిపించింది. ఈజిప్ట్ రాణి కోటను పద్మాలయా స్టూడియోలో నిర్మించాను. ఈజిప్ట్ రాజభవనాలకు ఉండే నగిషీలు, ఆర్భాటాలు, మమ్మీల రూపాలు ఇవన్నీ సృష్టించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఇవన్నీ చేసినా సరే ఇంత భారీ సెట్‌లో హీరో కనిపించడు అనే ఊహే నన్ను ఇబ్బంది పెట్టింది. అదే మాట మెహర్ రమేష్‌తో అన్నాను. కథా పరంగా తప్పదు అని చెప్పిన రమేష్ దుబాయ్ లొకేషన్స్‌లో మాత్రం నా మాట నెరవేర్చాడు.

*** అండర్‌వరల్డ్ డాన్ జానీ(జాకీష్రాఫ్) దుబాయ్‌లో స్థావరం ఏర్పరుచుకుంటాడు. ఆ పాత్ర సినిమాను ఇంటర్‌లింక్ చేస్తుంటుంది. ఇప్పటి వరకు దుబాయ్‌లో చాలా సినిమాలు తీశారు. మంచి లొకేషన్స్ అన్నీ ఇప్పటికీ చాలా సినిమాల్లో చూపించారు. అయినా శక్తి సినిమాలో డాన్ ఉండే ప్రదేశాలు నూతనంగా కనిపించాలి. ఆయన హైఫై లైఫ్‌ను ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకోసం లొకేషన్స్ చూడటానికి నేనూ, మెహర్ వెళ్లాము. ఇక్కడ రెండు ఆలోచనలు -ఒకటి అక్కడి లొకేషన్స్ ఎంచుకోవడం, రెండు అవసరమైతే అక్కడి ఇంటీరియర్‌ను ఇక్కడ సెట్ వేయడం. అయితే రెండోది అవసరం రాలేదు. లొకేషన్స్ చూస్తున్నపుడు మెహర్‌ను అడిగాను -'హీరో ఇక్కడ కనిపిస్తాడా?' అని.

మెహర్ రమేష్ నవ్వుతూ 'అవును' అన్నాడు. ఎందుకంటే అంత ఖరీదైన లొకేషన్స్‌లో షూటింగ్‌కు అనుమతి రావడం అసాధ్యం. అది కేవలం అశ్వనీదత్ వల్లనే సాధ్యమయ్యింది. ఇంతా చేస్తే అక్కడ హీరో లేకపోతే ఎలా అనుకున్నాను. దుబాయ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ లొకేషన్. దానిని ఎఫ్ -1 ట్రాక్ అంటారు. ఇంతవరకు ఎవరూ షూటింగ్ జరపని స్థలమది. దానిని ఎంచుకోవడానికి నాలుగు రోజులు పట్టింది. ఈ లొకేషన్ కోసం తిరుగుతున్నపుడే ' ప్రేమ దేశపు యువరాణి' పాట మెహర్ రమేష్ లాప్‌ట్యాప్‌లో వినిపించారు. పాట విన్నాక, దానిపై అతని ఆలోచన తెలిశాక మాయాబజార్ రోజులకు వెళ్లిపోయాను.

*** మాయాబజార్‌లో 'లాహిరి లాహరి లాహిరి', 'చూపులు కలిసిన శుభవేళ' పాటల్లో కనిపించే ప్రకృతి మనల్ని పరవశింప జేస్తుంది. అలాంటి ఫాంటసీనే 'ప్రేమ దేశపు యువరాణి' పాటలో చూపించాల నుకున్నాను. ఈ పాటలోని సంగీతం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. లిరిక్స్ కూడా ట్యూన్‌కు సపోర్టునిచ్చాయి. అందుకని పాటను పూర్తిగా సెట్‌లోనే తీయాలని నిర్ణయించుకున్నాము. హంసలు కదలడం, సన్నగా సెలయేరు, బ్యాక్ గ్రౌండ్‌లో మేఘాలు కదలడం వీటన్నిటినీ స్కెచ్ వేసుకున్నట్టే తయారు చేశాను. షూటింగ్ అంతా లోపలే కాబట్టి ఈ పాట విషయంలో సమస్యలేమీ ఎదురవ్వలేదనే చెప్పాలి.

కాని హైదరాబాద్ శివారులో జరిపిన ఫైట్ షూటింగ్ మాత్రం అనుకున్నంత సులభం కాలేదు. అక్కడ బోలెడంత ఖాళీ ప్రదేశం. పైగా హెలికాప్టర్ నుంచి కింద జరుగుతున్న ఫైట్‌ను షూట్ చేయాలి. సినిమాను ఈ ఫైట్ మలుపు తిప్పుతుంది. అయితే అంత పెద్ద స్థలంలో ఎన్ని బడ్డీలు, హోటల్స్, ఇళ్లు, ఇతర స్థలాలు నిర్మించినా ఇంకా ఖాళీ కనబడుతూనే ఉంది. అందుకని గ్యాప్ లో ఒక్కో బడ్డీ, ఇంటి సెట్ వేసుకుంటూ వెళ్లాను. ఇక జైపూర్‌లో జరిగే ఓపెనింగ్ ఫైట్ మాత్రం అక్కడ మొదలెట్టి హైదరాబాద్‌లో పూర్తి చేయాల్సి వచ్చింది.

*** 'తానియా...తానియా' - ఇది సినిమాలో మొదటి పాట. జైపూర్‌లో ఈ పాట చేయాలి. అనుకున్నట్టుగానే పాట పూర్తయింది. ఆ పాటకు ముందు ఉండే ఫైట్ మాత్రం అక్కడ షూట్ చేయలేకపోయాము. అప్పటికే వాళ్లిచ్చిన గడువు పూర్తయింది. దాంతో ఆ ఫైట్‌ను అక్కడ మొదలు పెట్టి మిగతా అంతా హైదరాబాద్‌లో పూర్తి చేయాల్సి వచ్చింది. అందుకని జైపూర్ సెట్ ఇక్కడే వేసి ఫైట్ తీశాము.

ఈ ఫైట్‌కు ఫైటర్లు ఉంటే సరిపోతుంది కాని, హరిద్వార్‌లో తీసిన కుంభమేళా సీన్‌కు మాత్రం అలా కుదరదు. హరిద్వార్ లొకేషన్ చూడటానికి వెళ్లిన వారిలో నేనూ ఉన్నాను. ఆ కుంభ మేళాలో దాదాపు కోటికి పైగా జనం పాల్గొంటారు. అంతమంది మధ్య షూటింగ్ నడపడమంటే చిన్న విషయం కాదు. కాని దాన్ని చాలా రిచ్‌గా షూట్ చేశారు. సినిమాలో చాలా తక్కువ మంది యాక్టర్లు, జూనియర్ యాక్టర్లు పాల్గొన్న సీన్ ఇదే.

ఇంటర్వ్యూ: బల్లెడ నారాయణ మూర్తి
టేక్ -10
*లడఖ్‌లో తీసిన ఆఖరి పాటలో చెట్టు ఉండాలి. సెట్‌లో ఒక చెట్టును ఏర్పాటు చేయడానికి లక్షరూపాయలు ఖర్చు పెట్టి వేరే దగ్గరి నుంచి చెట్టు తెప్పించాం.

*కాళికా దేవి ఆలయం సెట్‌కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. మూడు నెలల పాటు 200 మంది నిర్విరామంగా పనిచేశారు.

* కాళికాదేవి ఆలయం సెట్ పూర్తి చేసిన మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూస్తే దాదాపు 20 మంది అర్చకులు అక్కడ హోమం చేస్తూ కనిపించారు. అశ్వినీదత్ హోమం చేయించారని తరువాత తెలిసింది.

* శక్తి సినిమా సెట్స్ వేస్తున్న సమయంలోనే ఎన్టీఆర్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. మే ఐదున జరగబోయే ఆయన వివాహానికి భారీ సెట్ వేయమని.

* ఈజిప్ట్ రాణి నివాస ముండే రాజభవనం సెట్‌కోసం 40 లక్షల రూపాయలు ఖర్చయ్యింది.

*ఈజిప్ట్ సైనికులు ఉపయోగించే కాస్ట్యూమ్స్, మారణాయుధాలు...ఇవన్నీ ఇక్కడే డిజైన్ చేసి, తయారు చేసి ఫ్లైట్‌లో దుబాయ్ పంపించాము.

* శక్తి సినిమా పూర్త్తయ్యాక 35 అడుగుల కాళికా దేవి విగ్రహాన్ని ఒక దేవాలయానికి అశ్వనీదత్ ఇచ్చేశారు.

* ప్రేమ దేశపు యువరాణి పాటలో బోట్లు వాడాము.

* కాళికాదేవి ఆలయం సెట్ చూడటానికి అక్కినేని నాగేశ్వరరావు వచ్చినపుడు కొద్దిసేపు ఉద్వేగానికి గురయ్యాను. బాగుందని ఆయన అభినందించాక స్థిమిత పడ్డాను.

* కాళికాదేవి ఆలయం, ఈజిప్ట్ రాజమందిరం తొలగిస్తున్నాం అని చెప్పినపుడు చాలా బాధ కలిగింది. అందుకే వాటిని తీసేసేటపుడు అక్కడికి వెళ్లలేదు.

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..

అహ నా పెళ్లంట

40 మంది పెద్దలు60 రోజుల పెళ్లి

వంద అబద్దాలాడైనా ఒక కల్యాణం జరిపించొచ్చన్నారెవరో. కాని 'మ్యాచ్ ఫిక్సింగ్' పెళ్లి అందులో ఉందో లేదో. దర్శకునిగా తన మొదటి సినిమా ఒక హాస్య వివాహ చిత్రం అవుతుందని వీరభద్రమ్ కూడా అనుకోలేదు.

'అహ నా పెళ్లంట' సినిమాతో తనకు మూడుముళ్లు పడొచ్చనిపించాక ఆయన ఆకాశమంత పందిరి వేయలేదుకానీ 40 మందికి కథ చెప్పి 'బావుంది'అనే ప్రీ మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం సంపాదించుకున్నారు. అంతేకాదు ఇచ్చిన మాట ప్రకారం 60రోజుల్లో షూటింగ్ తంతు ముగించి వీరభద్రమ్ అంటే 'కామెడీ' కాదు సుమా అనిపించుకున్నారు. థియేటర్‌లో నవ్వుల భజంత్రీల కోసం బిజీ బాలరాజును సృష్టిస్తే సినిమా విడుదలయ్యాక ఈ సినిమా కోసం పనిచేసిన చాలామంది నిజంగానే బిజీ బాలరాజులయ్యారు.

యాక్షన్ నుంచి కామెడీ వచ్చింది...
వీరభద్రమ్, దర్శకుడు రెండేళ్ల క్రితం 'సంఘం' సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లాను. ఆ సినిమాకు నేను కో-డైరెక్టర్ని. అక్కడ ఉన్న నిర్మాత అనిల్‌కు నా గురించి తెలిసింది. నన్ను కలవడానికి ఆయన వచ్చారు. కాసేపు మాట్లాడాక తను హైదరాబాద్ వస్తున్నానని, ఏదైనా కథ చెబితే దర్శకునిగా అవకాశం ఇస్తానని అన్నారు. అప్పటికే నా దగ్గర ఒక కథ ఉంది. అల్లు అర్జున్, గోపీచంద్ వంటి యాక్షన్ హీరోలకు సరిపోయే కథ అది. అనిల్‌కు నచ్చింది. ఒప్పుకున్నారు. ఇది అయిపోయాక నేను తిరుగు ప్రయాణమాయ్యాను. కొన్నాళ్ల తరువాత అనిల్ హైదరాబాద్ వచ్చారు. కాని నా కల సాకారమవడానికి మాత్రం సమయమింకా రాలేదు. అయితే అదెంతో దూరంలో లేదని కూడా మనసు చెప్పింది.

*** అమెరికాలో చెప్పిన కథ అనిల్‌కు నచ్చిన మాట వాస్తవమే. కాని నేను కొత్త దర్శకున్ని, ఆయనకు తొలిచిత్రం -ఇక్కడే అనిల్ ఆలోచనలో పడ్డారు. అందుకే హైదరాబాద్‌లో ఆయన్ని కలిసినపుడు నాతో మరొక కథ ఏదైనా తయారు చేయమని అన్నారు. దర్శకత్వమే ఏకైక లక్ష్యమైన నాకు మరో కథ రాసుకోవడం కష్టమైన పనేమీ కాలేదు. ఇలా ఎందుకంటున్నానంటే ఈసారి అనిల్ ముందు ఒకటి కంటే ఎక్కువ కథలే ఉంచగలిగాను కాబట్టి. వాటిల్లో 'అహ నా పెళ్లంట' ఓకే అయ్యింది. నా మనసు కుదుట పడింది -అయితే ఆ తరువాతే నాకు అసలు పరీక్ష మొదలైంది.

*** సరదాగా, ఉల్లాసంగా సాగే ఈ సినిమా కథ మున్ముందు నలభైమందిని మెప్పించాల్సి వుందని నేను ఊహించలేదు. అంతేకాదు దీనికి అల్లరినరేష్‌ను హీరోగా నేను మొదట అనుకోలేదు. అసలు ఆయన మా దృష్టిలో లేనే లేరు. అందుకే ఈ కథను మేమనుకున్న హీరోకు చెప్పాల్సి వచ్చింది. అలా ఈ కథను విన్నవారి సంఖ్య నలభై వరకు చేరింది. తొమ్మిదినెలల వరకు ఇలా వింటూనే ఉన్నారు. విశేషమేమిటంటే బాగులేదని ఒక్కరూ అనలేదు, కాని సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇలా కాలం గడుస్తుండగా మొదట అనుకున్న హీరో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అప్పుడు మళ్లీ మా సెర్చ్ మొదలైంది.

*** ఒక రోజు సాయంత్రం నేనూ, రైటర్ గోపీమోహన్ పార్కులో వాకింగ్ చేస్తున్నాం. అప్పుడు గోపీమోహన్‌కు దర్శకుడు శ్రీనువైట్ల నుంచి ఫోన్ వచ్చింది. అతని 'రెడీ' సినిమాకు సితార అవార్డు వచ్చిందని, ఆ ఫంక్షన్‌కు రావాలని ఆయన కోరారు. నేను, గోపీమోహన్ అక్కడకు వెళ్లాము. ఆ ఫంక్షన్‌లో నేను అల్లరి నరేష్‌ను చూశాను. అతనైతే కథకు సరిపోతారనిపించింది. నరేష్ నా గురువు ఇ.వి.వి సత్యనారాయణ కొడుకు. ఇ.వి.వి దగ్గరే నేను అక్షరాలు దిద్దుకున్నాను. కాబట్టి నరేష్ నాకు బాగానే పరిచయం.

మనసులో అనుకున్నానో లేదో నేరుగా వెళ్లి నరేష్‌తో మాట్లాడాను. ఈ ప్రాజెక్టు గురించి చెప్పాను. కథ వినాలని కోరాను. విన్నారు. ఆయనకు నచ్చింది. నా కష్టాలు తీరాయి. షూటింగ్ తేదీ నిర్ణయించాము. క్లాప్ కొట్టడమే మిగిలి వుందనగా నరేష్ దగ్గరి నుంచి ఫోన్ -నాన్న కథ వినాలంటున్నారని.

*** ఇ.వి.వి సత్యనారాయణ దగ్గరకు భయం భయంగా వెళ్లాను. ఏమంటారోనని లోలోపల గుబులు. కథను మార్చమన్నా, బాగోలేదన్నా మరికొద్ది రోజుల్లో మొదలవ్వాల్సిన నా ప్రాజెక్టు ఆగిపోతుంది. ఆయన ఆఫీసులో సిట్టింగ్. డైలాగులతో సహా చెప్పేశాను. మొత్తం విన్నాక ఆయన నుండి కాసేపు నిశ్శబ్దం. 'అయిపోయింది సార్' అన్నాను. ఇ.వి.వి సత్యనారాయణ చిరునవ్వుతో 'చాలా బాగుంది. సూపర్ హిట్ అవుతుంది' అన్నారు. గాల్లో తేలినట్టయ్యింది.

ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుని బయటపడ్డాను. శ్రీహరిని కలిసినపుడు కూడా లోపల పీకుతూ ఉండేది. ఆయన పాత్ర ఎలా ఉంటుందన్న విషయంతోపాటు కథ కూడా చెప్పాను. ఆయన చేస్తానని చెప్పడమే కాకుండా కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని అన్నారు. ఒక పనైపోయింది అనుకున్నాను.

హీరోయిన్‌గా ఎవరిని పెడితే బావుంటుందోనని చాలా ఆలోచించాము. మేమనుకున్న వాళ్లు బిజీ. అందుకే కొత్త వాళ్ల కోసం వేట మొదలెట్టాం. నలభై, యాభైమందిని స్క్రీన్ టెస్ట్ చేశాం. చివరకు రితూ బర్మేచాను ఎంపిక చేసుకున్నాం. షూటింగ్ మొదలైంది. స్క్రిప్ట్ రాసుకున్న సమయంలోనే ట్యాగ్‌లైన్‌గా 'మ్యాచ్ ఫిక్సింగ్' అనుకున్నాను. కాని టైౖటిల్ డిసైడ్ చేయలేకపోయాను. అలాంటి సమయంలో డా. డి.రామానాయుడు ఆదుకున్నారు.

*** పెళ్లి నేపథ్యంగా హాస్యంతో నిండిన సినిమా ఇది. కాబట్టి 'అహ నా పెళ్లంట' అని పెడితే బాగుంటుందనుకున్నాము. కాని సమస్యేమిటంటే ఆ టైటిల్ రామానాయుడిది. అందుకే ఆయన్ని కలిసాము. అభ్యంతరం వ్యక్తం చేయకుండా పెట్టుకోమన్నారు. ఈ టైటిల్‌నే ఎందుకు కోరుకున్నామంటే సహజంగా పెళ్లి రెండు రకాలు -ఒకటి పెద్దలు నిశ్చయించేది. రెండోది ప్రేమ పెళ్లి. ఇందులో ఈ రెండూ ఉండవు. ఇదో ఫిక్సింగ్ పెళ్లి.

అందుకే హీరో ఎక్కడికి వెళ్లినా హీరోయిన్ సోదరులు వదిలిపెట్టరు. ఇలాంటి పరిస్థితిలో గోవాలో దాక్కోవాలని వెళ్లిన నరేష్, బ్రహ్మానందం చాపర్‌లో తిరుగు ప్రయాణమవ్వాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో బ్రహ్మానందం భయపడుతుంటే నరేష్ చాపర్ నడపడం, వీరికి భగవాన్ సూచనలివ్వడం - ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్న సీన్స్‌లో ఇదొకటి. అయితే నరేష్ నడిపిన చాపర్ నిజమైనది కాదు. దానికోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది.

"' ఎప్పుడూ చూసే సీన్స్ కాకుండా కొత్తవి ఉండాలని చాపర్ సీన్ రాసుకున్నాను. కాని దానిని తెరమీద చూపించాలంటే ఒక చాపర్ అవసరం. మరొకటి ఎయిర్ కంట్రోల్ రూమ్. ఏదో చేశామన్నట్టు కాకుండా ఉండాలంటే కచ్చితంగా ప్రేక్షకులు వాస్తవదృశ్యాన్ని అనుభవించాలి. అందులోంచే కామెడీ పుడుతుంది. అందుకోసమే ఖర్చైనా పరవాలేదని చేవెళ్లలో చాపర్, కంట్రోల్ రూమ్ సెట్ వేశాము.

చాపర్ ఆకాశంలో తేలియాడటం, హోర్డింగ్ నుంచి దూసుకుపోవడం, రన్‌వేపై ఆగడం వంటివన్నీ సిజి(కంప్యూటర్ గ్రాఫిక్స్)లో చేసుకున్నాం. నాకు ఎంతో ఇష్టమైన పాట'చినుకులా రాలి'... దీనినే రీమిక్స్ చేయించాను. ఈ పాట బాగా రావడానికోసం బ్యాంకాక్‌లో షూట్ చేశాము. పిక్చరైజేషన్ పరంగా, లిరికల్‌గా ఆ పాట నాకు బాగా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైనదేమిటంటే ఈ సినిమాను 60 రోజుల్లో పూర్తి చేస్తానని చెప్పాను. షెడ్యూల్ కూడా అలాగే తయారుచేసుకున్నాను. అనుకున్న సమయంలోనే పూర్తి చేయగలగడం నాకు మరింత ఆనందాన్నిచ్చింది.

రీమిక్స్ విషయంలో చర్చ...
రఘు కుంచె, సంగీత దర్శకుడు

సంగీత దర్శకునిగా నాకిది రెండో సినిమా. దర్శకుడు వీరభద్రమ్ చాలా కాలంగా నాకు పరిచయం. బంజారాహిల్స్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఆయన నాకు ఈ కథ చెప్పారు. ఎలాంటి సంగీతం కావాలో వివరించారు. సన్నివేశాలనుకనుగుణంగా నేను ట్యూన్స్ సిద్ధం చేసుకున్నాను. టైటిల్స్ పడేటపుడు ఒక పబ్ పాట పెడితే బాగుంటుందని నిర్మాత అనిల్ అన్నారు.

ఇక్కడున్న పబ్బుల్లో ఎప్పుడూ హాలీవుడ్, బాలీవుడ్ పాప్ పాటలే వేస్తుంటారనీ, ఈసారి మన సినిమాలో పాట వేసేట్టు పాటను కంపోజ్ చేయాలన్నారు. డీజేల బేస్‌సౌండ్స్‌తో గిటార్ వంటి పరికరాలు ఉపయోగించి పాటను సిద్ధం చేశాను. అందరికీ నచ్చింది. ఏ సమస్యా లేదు. కాని దర్శకుడు వీరభద్రమ్ తనకిష్టమైన పాటంటూ చెప్పిన పాటతోనే పెద్ద చిక్కొచ్చిపడింది.

*** 'చినుకులా రాలి...వరదగా మారి...'- దీనిని ఆయన రీమిక్స్ చేయమన్నారు. రెండో సినిమాలోనే రీమిక్స్ ప్రయోగాలు చేస్తే బాగుండదేమో అనిపించింది. మరోవైపు పాట బాగలేకపోతే మంచిపాటను పాడుచేశానని తిట్టుకుంటారు. ఇలాంటి భయాలన్నీ ఉన్నాయి. అందుకే ఆ పాట వద్దని దర్శకుడు వీరభద్రమ్‌తో వాదించాను. ఆయన పట్టువదల్లేదు. చివరకు రీమిక్స్ చేశాను. అయితే నాకు ఆనందం కలిగించే విషయమేమిటంటే ఆ పాటను నేనే పాడటం. అంత మంచి పాటకు నా గొంతుకనివ్వడం మరిచిపోలేని అనుభూతి. ఆ పాటను థియేటర్‌లో చూసి ఊపిరిపీల్చుకున్నాను. ఇక నేను ఎంతో ఇష్టపడ్డ మరో పాటను మాత్రం యూనిట్‌లో మొదట చాలామంది వద్దన్నారు.

*** హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య సన్నివేశం. మెయిన్ హీరోయిన్ తన మనసులోని భావాలను హీరోకు చెప్పాలని అనుకుంటుంది. ఆ సందర్భంలో మెలోడి పాట. నెమ్మదిగా మొదలవుతుంది. ట్యూన్ సిద్ధం చేసి వినిపించాను. ఎవరూ ఒప్పుకోవడం లేదు. జనాలు లేచి వెళ్లిపోతారని అన్నారు. అయినా పట్టువదల్లేదు. సాహిత్యం రాయించుకున్నాను. ఎప్పటి నుంచో గాయని చిత్రతో పాడించాలనే కోరిక ఉంది.

ఈ పాటను ఆమెతోనే పాడించాను. పాట పూర్తైయ్యాక చిత్ర మెచ్చుకున్నారు. ఆనందం కలిగింది. అదే ఉత్సాహంతో యూనిట్‌లో అందరికీ వినిపించాను. అందరికీ నచ్చింది. ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగా రావడంతో క్రమంగా అందరూ పాడుకుంటున్నారు. బంపర్ఆఫర్ సినిమాలో 'పెళ్లెందుకే రమణమ్మ' పాట మా నిర్మాత అనిల్‌కు చాలా ఇష్టం.

దానినే ఆయన రీమిక్స్ చేయమన్నారు. నేను ఒక ప్రపోజల్ పెట్టాను. రమణమ్మ పాట పెళ్లి వద్దని చెబుతుంది. మన పాటలో వివాహం, భార్య గొప్పతనం చెబుతాం. కాబట్టి రమణమ్మ పాటలోని ట్యూన్ వినిపించి తరువాత కొత్త ట్యూన్‌లోకి వెళదాం అన్నాను. ఆ పాటకు ఉత్తరాంధ్ర జానపదం ఉపయోగించు కున్నా కాబట్టి, ఈ పాటకు తెలంగాణ తీన్‌మార్‌ను పెట్టుకుందాం అని చెప్పాను. చెప్పినట్టే ట్యూన్ రెడీ చేశాను. రమణమ్మ పాటలాగే ఈ పాట కూడా పాపులర్ అవుతోంది.

బిజీ బాలరాజు కామెడీ పంచ్
* బిల్లంటే కట్టగలం గాని బార్లెక్కడ కడతాం సార్ * ఒరే సుబ్బు... నీ ఓదార్పుయాత్రకు నేనెందుకురా! * మేం చెబితే 'డబ్బా' అంటారు...అదే మీరు చెబితే 'అబ్బా' అంటారు... * ఎందుకో సార్...కొన్ని సార్లు ఎంత తాగినా లోపలి అపరిచితుడు బయటకు రాడు * తతత... అని చేయి అంత బారు చాపింది... కొట్టడానికి కాదు సార్ గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఇంటర్వ్యూ: బల్లెడ నారాయణ మూర్తి

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..

 

ప్రేమ కావాలి

మొదటి ముద్దుకు కష్టపడ్డాం

కొత్తగా చూపించాం : అచ్చిరెడ్డి
ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే కథతో సాగేవే. అందులోనే మనమేదైనా కొత్తగా చూపించాలి. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లు. ఖర్చు కూడా ఎక్కువ పెట్టాం. కథనంలో కొత్తదనం చూపిస్తేనే సినిమా నిలుస్తుంది. అందుకే హీరోతోనే హీరోయిన్‌కు ఉత్తరాలు రాయిస్తూ, ఎవరో రాస్తున్నారనే భ్రమ కలిగిస్తూ.. వారిద్దరి మధ్య ప్రేమకథ ఆసక్తిగా నడిచేలా ప్రయత్నించాం. సాయికుమార్ కొడుకు ఆదిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయడానికి వెనక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది.

గతంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ తీసిన 'సామాన్యుడు'లో సాయికుమార్ నటించాడు. అప్పటి నుంచి ఆయనతో మా బ్యానర్‌కు సాన్నిహిత్యం ఉంది. ఒకరోజు మాటల్లో తన కొడుకు ఆది చేసిన డ్యాన్సులు, ఫ్లైట్లు ఉన్న వీడియో క్లిప్పింగులను చూడమంటూ తన మొబైల్ నాకిచ్చాడు సాయి. అందులో వాళ్లబ్బాయి డైనమిక్‌గా కనిపించాడు. నాకు సంతృప్తి అనిపించి వెంటనే మా వెంకట్‌కు చూపిస్తే.. .'ఆది బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మంచి హీరో అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. మన బ్యానర్ మీదే అతన్ని పరిచయం చేద్దాం' అన్నాడు.

అప్పటికే దర్శకుడు విజయభాస్కర్ కొత్తవాళ్లను పెట్టి సినిమా తీసేందుకు ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథ ఆదికి సరిపోతుందనుకుని ఆయన్ని సంప్రదించాం. అదే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి 'ప్రేమ కావాలి' చిత్రానికి దర్శకత్వం బాధ్యత చేపట్టారు విజయభాస్కర్. అదీ ఈ సినిమా మొదలవ్వక ముందు జరిగిన కథ.

నాన్నా నేను హీరో అవుతా.. : ఆది
"నాన్నా, ఎంత కష్టమైనా సరే నేను హీరో అవుతాను..'' "హీరో అంటే మాటలనుకున్నావురా..? డైలాగులు చెప్పాలి. స్టెప్పులేయాలి. రిస్కు తీసుకుని ఫైట్లు చెయ్యాలి. అన్నీ చేసి అందర్నీ ఒప్పించాలి. ఆ ఒప్పించేదేదో ఒకటి రెండు సినిమాలతో ఒప్పిస్తే సరిపోదు. ప్రతి సినిమా శుభం కార్డు పడే వరకూ థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితేనే నువ్వు హీరోగా నిలబడగలవ్..?'' "మీరన్నది నిజమే నాన్నా.

నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. హీరోకు కావాల్సినవన్నీ నేర్చుకుంటాను. మీరు చెప్పినవన్నీ చేస్తాను..'' "సరే, నీ పట్టుదల నాకు నచ్చింది.. అయినా సరే ఇంకోసారి ఆలోచించుకో..'' 'లేదు నాన్నా. నా ఆలోచన మారదు.. ఈ క్షణం నుంచీ సినిమా హీరో అవడమే నా ధ్యేయం..'' డైలాగ్‌కింగ్ సాయికుమార్‌కు స్వర విన్యాసాలు చేయడం ఒక్కటే కాదు. సినిమా కష్టాల లోతుపాతులు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కొన్నేళ్ల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నారు కనుక. 'హీరో'గా తెరమీద నిలదొక్కుకోవాలంటే తెరవెనుక ఎన్ని అవస్థలు పడాల్సి ఉంటుందో తన కొడుకు 'ఆది'తో ఒక రోజు వివరంగా చెప్పాడు. "ఆరోజు నాన్న చెప్పిన మాటల్ని పాఠాలుగా మలుచుకుని ఈ సినిమా చేశా..'' అంటున్న ఆది 'ప్రేమ కావాలి' సినిమా తెరవెనుక ముచ్చట్ల గురించి ఇలా చెప్పుకొచ్చారు.

నా అదృష్టం : ఆది
ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ల నాన్న నాజర్ పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆయన ఒక క్రిమినల్‌ను పట్టుకుంటాడు. అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు హీరోయిన్‌ను వేధిస్తుంటారు విలన్లు. హీరోయిన్ వెంటపడి, తనకు తెలియకుండానే ప్రేమించడం నా పని. ఈ దృశ్యాలన్నీ అద్భుతంగా తీయాలంటే మంచి సినిమాటోగ్రఫీ చేసేవాళ్లు కావాలి. అందుకే కష్టపడి చోటా.కె.నాయుడును ఒప్పించారు నిర్మాత. ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమాకు పని చేయడానికి ఆయన ఒప్పుకున్నారు.

ఆయన పనితీరు ఈ సినిమాలో చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బ్రిడ్జి పక్కనే ఉన్న బిల్డింగ్ మీద ఇప్పటికే బోలెడు సినిమాలు తీశారు. మా సినిమా కూడా అక్కడే తీశాం. ఆ దృశ్యాలను చూసినవాళ్ళంతా అసలు ఇది హైదరాబాద్‌లో తీశారా..? విదేశాల్లో తీశారా..? అని ఆశ్చర్యపోయారు. చోటా సార్ అంత కొత్తదనం చూపించారు. కొన్ని దృశ్యాలను మాదాపూర్ దగ్గరున్న కొండపై నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి షూట్ చేశారు. ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి.

నాకు చిన్నప్పటి నుంచి పాములంటే చాలా భయం. ఈ సినిమాలో హీరోయిన్ ఒక పుట్ట దగ్గరికి వెళ్లి.. నాగుపాముకు పూజలు చేస్తుంది. ఈ దృశ్యాలను మాదాపూర్‌లో చిత్రీకరించారు. నాకు ఆ రోజంతా టెన్షనే. పాముల సీన్ ఎప్పుడు అయిపోతుందా అనిపించేది. సీన్‌లోకి వెళ్లాక... హీరోయిన్ పుట్ట దగ్గర పాలు పెడుతుంది. పుట్టలోంచి పాము బయటికి రాగానే నేను భయపడాలి.. అదీ సీన్. తీరా పాము బయటికి రాగానే నేను పరుగో.. పరుగు. అయితే నా భయం మంచే చేసింది. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు.

ఈ సినిమా మాస్‌గా ఉండాలన్నది డైరెక్టర్ విజయభాస్కర్ ఆలోచన. ఫైట్లు, పాటలు కూడా బాగా రిచ్‌గా ఉండేందుకు ప్రయత్నించారు. హీరోగా నేనే కొత్త.. నా పక్కన నాకు మిత్రులుగా పేరున్న నటులను పెడితే బావుండదని సాధారణ సహనటులను తీసుకున్నారు. ఈ సినిమాలో నాది స్టూడెంట్ పాత్ర. నాకు వాళ్లంతా మిత్రులుగా చేశారు. బ్రహ్మానందం, అలీ కామెడీ కూడా హీరోను డామినేట్ చేయకుండా చూసుకున్నారు దర్శకుడు.

హీరోయిన్ వాళ్ల నాన్న పాత్రను కొంచెం పేరున్న నటుడితోనే చేయిద్దామని మొదట్లో అనుకున్నారు. పైగా అది ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పాత్ర. అందుకనే నాజర్ అయితే అద్భుతంగా చేస్తారని ఆయన్ని పెట్టారు. హీరోయిన్ ఇషాచావ్లా ఈ సినిమాలో నాజర్ కూతురు. తన తండ్రి పర్సనల్ కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను హీరోయిన్ తనకు తెలియకుండానే విలన్‌కు చెప్పడం ఈ సినిమా కథలో పెద్ద మలుపు. ఈ సన్నివేశాలకు తగిన నటులను కావాలనే ఎంచుకున్నారు అచ్చిరెడ్డి, విజయభాస్కర్.

ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, రామానాయుడు స్టూడియోలో ఒక వాన పాట తీస్తున్నప్పుడు అక్కడికి నాన్న వచ్చారు. ఆ పాటలో కాస్త రొమాన్స్, ఎక్స్‌పోజింగ్ ఉంటాయి. శృంగార భావనలను సున్నితంగా పలికించాలి. అవన్నీ నాన్న ఎదురుగా చేయడానికి మాత్రం కాస్త బెరుకు అనిపించింది. నా కష్టాలను చూసిన డైరెక్టర్ విజయభాస్కర్ మా నాన్నను సెట్‌లోంచి వెళ్లిపొమ్మన్నారు. నా అవస్థ చూసిన నాన్న అర్థం చేసుకుని వెళ్లిపోవడంతో 'హమ్మయ్య' అంటూ నేను ఊపిరి పీల్చుకుని పాటను పూర్తి చేశాను.

ఇక, పాటల కోసం విదేశాలకు వెళ్లడం కొత్తకాదు. ఇటలీ, దుబాయ్, వెనిస్ నగరాలను ఎంచుకున్నారు మా వాళ్లు. ఎందుకంటే ఇటలీలో అప్పుడు భారీగా మంచు కురుస్తోంది. ఆ తెల్లటి మంచులో పాటలను చిత్రీకరిస్తే ప్రేక్షకులు చాలా తాజా అనుభూతిని పొందుతారని ఆ దేశంలో తీశారు. ఇటలీలోని క్యానసీ ఒక చిన్న పట్టణం. మహా అంటే రెండువేల మంది ఉంటారేమో అక్కడ. షూటింగ్ కూడా హాయిగా, జాలీగా జరిగిపోయింది. హీరోయిన్ ఇషా మాత్రం మంచుతో కష్టాలు పడింది. ఆ విశేషాలు ఆమెనే అడగండి చెబుతుంది.

మంచులాంటి అనుభవం : ఇషా
అమ్మో, ఆ మంచును చూస్తేనే గుండె గుభేల్మంటుంది. ఎంత మంచంటే అసలు ఊహించడానికే కష్టం. చోటా.కె.నాయుడు 'షాట్ రెడీ' అంటారు. నేను అడుగు తీసి అడుగు వేశానో లేదో ఆ మంచులో కాలు మోకాలిలోతు వరకు వెళుతోంది. మంచులో కూరుకుపోయిన కాలు బయటికి తీసే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోవడం.. అది చూసి చోటాసార్, ఆది నవ్వడం.. మళ్లీ వాళ్లిద్దరూ కిందపడినప్పుడు నేను నవ్వడం... అదంతా ఓ మరిచిపోలేని అనుభవం. దుబాయ్‌లో కూడా ఒక పాట తీశారు. అక్కడ షూటింగ్ అయిపోయిన వెంటనే షాపింగ్‌కు వెళ్లే వాళ్లం. ఈ సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు అయితే, కొన్ని సీన్లు తీసేముందు పెద్ద చర్చలు జరగడం మరో ఎత్తు. 'ప్రేమ కావాలి'లో హీరో, హీరోయిన్ ఇద్దరూ పార్కుకు వెళతారు. అక్కడ బెంచి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో హీరోయిన్ హీరోని ముద్దు పెట్టుకోవాలి.

ఈ దృశ్యాలు సినిమా కథకు చాలా సహాయపడతాయి. 'ఈ సీన్‌ను మనకు తప్పనిసరి. ఇషా.. సెన్సార్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ముద్దు సీన్ చేయడానికి నువ్వు అంగీకరించాలి..' అన్నారు దర్శకుడు విజయభాస్కర్. నాతో పాటు ఆదికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించినా 'ఓకే' అన్నాం. పైగా ఆ సన్నివేశాలు సినిమాలో వస్తున్నప్పుడు మా నాన్న, అమ్మ నా పక్కనే ఉన్నారు. దీంతో ఆ సీన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందాని నేను టెన్షన్ పడ్డాను. మరో పాటలో కన్నీళ్లు పెట్టుకోవాలి. 'గ్లిజరిన్ కళ్లకు రాసుకోకుండా నువ్వు కన్నీళ్లు పెడితేనే ఈ దృశ్యం పండుతుంది. కథలో లీనమైపోవడం నేర్చుకో' అన్నారు దర్శకుడు. నిజంగానే ఆ సన్నివేశంలో నేను ఏడ్చేశాను. షూటింగ్‌లో పాల్గొన్నవాళ్లంతా నా నిజమైన కన్నీళ్లు చూసి మొదట బిత్తరపోయారు.. ఆ తర్వాత చప్పట్లు కొట్టారు.

'ఇషా ఒక పాటలో నువ్వు చీర కట్టుకుని వర్షంలో డ్యాన్సులు చెయ్యాలి..' అన్నారు డైరెక్టర్. నాకు చీర కట్టుకోవడం ఇదివరకే అలవాటు. నేను పంజాబీ అమ్మాయిని కదా! చీరకట్టుకుని వానలో తడిసినా ఎలాంటి ఇబ్బంది పడకుండా డ్యాన్స్ చేయగలిగాను. ఈ పాట సినిమాను ఒక మలుపు తిప్పుతుంది. అప్పటి వరకు సీరియస్‌గా సాగే కథతో ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ కూడా ఇస్తుంది. కథలో అప్పటి వరకు స్టూడెంట్‌గా ఉన్న నేను చీరకట్టులో కనిపించే సరికి సినిమాకు బలం వస్తుంది. ఈ సినిమాలో నేను కాలేజ్‌లో స్టూడెంట్‌గా, ఇంట్లో కూతురిగా, బయట ప్రేమికురాలిగా నటించాలి. ఈ పాత్రలన్నీ నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోతాయనే నన్ను ఎంపిక చేసుకున్నారు.

అసలు నేను ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎలా ఎంపికయ్యానంటే- మాది పంజాబ్. ప్రస్తుతం బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సైకాలజీ చదువుదామనుకున్నా. నటన మీద ఇష్టంతో ఢిల్లీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఒకసారి- ఇంటర్‌నెట్‌లో నా ఫోటోలను చూసిన చోటా.కె.నాయుడు ఇంప్రెస్ అయ్యారు. ఆయన అచ్చిరెడ్డిగారికి నా ఫోటోలు చూపిస్తే, వాళ్లకూ నచ్చాయి. వెంటనే నాకు కాల్ చేశారు. హైదరాబాద్ వచ్చాక ఒక్కరోజులోనే స్క్రీన్ టెస్ట్ కూడా అయిపోయింది. అయితే అప్పుడేం చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. 'ప్రేమ కావాలి'లో హీరోయిన్‌గా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కథ విన్నాక నాకు సరిగ్గా సరిపోయే పాత్ర దొరికిందనిపించింది.

అన్నీ చెయ్యాలి : హీరో
'నేను ఈ సినిమా కథ విన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్ పాత్ర కాబట్టి నాకు సరిపోతుందనుకున్నాను. ఇది నాకు మొదటి సినిమా. ఇందులో ఫైట్లు, పాటలు, కామెడీ అన్నీ కలిపి మాస్ మసాలా మాదిరిగా ప్రేక్షకులకు అందించాలని దర్శక, నిర్మాతలు భావించారు. హీరోగా ఈ సినిమాలో రావడానికంటే ముందే నాన్నతో షూటింగ్‌లకు వెళ్లడం నాకు అలవాటు. ఒకరోజు లలితకళా తోరణంలో డ్యాన్స్ చేశాను. అక్కడ ముఖ్య అతిథి చిరంజీవి. నా డ్యాన్స్ చూసి ఆయన చాలా మెచ్చుకున్నారు. 'నువ్వు సినిమాల్లో ప్రయత్నించు.

తప్పకుండా సక్సెస్ అవుతావ్' అన్నారు. అప్పుడే నాన్నకు నా మీద కొంత నమ్మకం ఏర్పడింది. ఇక 'ప్రేమ కావాలి' సినిమా కోసం నేను కొంత శిక్షణ కూడా తీసుకున్నా. లారెన్స్ దగ్గర డ్యాన్స్, పాండ్యన్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాను. డైలాగ్స్ ఎలా చెప్పాలో కాకరాల వద్ద నేర్చుకున్నా. ఇవన్నీ జరుగుతున్నప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలన్నీ ఎప్పటికప్పుడు నా మొబైల్‌లో షూట్ చేసి నాన్నకు పంపిస్తూ ఉండేవాణ్ణి. వాటిని నాన్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వాళ్లకు చూపించడంతో.. ఇదిగో ఇలా 'ప్రేమ కావాలి'తో మీ ముందుకు వచ్చాను..' అంటూ మేకింగ్ ఆఫ్ ద మూవీ విశేషాలు ముగించారు ఆది.

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..

అలామొదలైంది

ఎ క్రేజీ స్క్రీన్ ప్లే

అమ్మాయి, అబ్బాయి కలుసుకున్నారు. అతను ప్రేమలో పడ్డాడు. ఆమెకు అప్పటికే వేరొకరితో వివాహం నిశ్చయమైపోయింది- ఇలా కథను చెబితే కాసేపయ్యాక వింటున్నవారే క్లైమాక్స్ చెప్పేస్తారు. ఎలా? అని ప్రశ్నిస్తే ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్ చూడటం లేదూ? అంటూ ఎదురు ప్రశ్నిస్తారు. ఇలాంటి కథనే చక్కని సన్నివేశాల స్క్రీన్‌ప్లేతో చెబితే అది అలామొదలైంది సినిమా అవుతుంది. ఈ సినిమాకు క్యాప్షన్ ఎ క్రేజీ లవ్ స్టోరీ. కాని సినిమా చూసిన ఎవరైనా ఎ క్రేజీ స్క్రీన్‌ప్లే అనే అంటారు.
ఎలా మొదలైందంటే.. - డైరెక్టర్ నందినీరెడ్డి

నాని -షారూఖ్ ఖాన్ నిత్య -అమీర్ ఖాన్ నేనెప్పుడూ వీళ్లని డైరెక్ట్ చేయలేదు. కేవలం సూచనలు చేశాను. నా దారి ఇదని చూపించాను. వాళ్లు ఆ దారిలో వెళ్లిపోయారు. మొదట వాళ్లు కలుసుకున్న సీన్ దగ్గర నుంచి చివరిదాకా వాళ్ల నటన ఎక్కడా మొనాటనీ అనిపించదు. అన్ని షేడ్సూ వుంటాయి. అందుకే నాని షారూఖ్ ఖాన్ అయితే, నిత్య అమీర్‌ఖాన్ అయింది. నా పని సులభంగా జరగటం కోసం అలాంటి నటీనటులను ఎంచుకున్నాను. సినిమా ఇప్పటి తరం పల్స్ పట్టుకోవాలని ముందు నుంచీ అనుకున్నాను. దానికి తగ్గట్టే కథ రాసుకున్నాను. తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం, అమ్మాయి, అబ్బాయిల మధ్య సున్నితమైన ప్రేమ. ఇదే నా కాన్సెప్ట్. ఇందులో పాత్రలే సినిమాను నడిపిస్తాయి. వాటి చుట్టూ సీన్ క్రియేట్ చేయడమే నేను చేసింది. ఒక్కో ఆలోచనకు మళ్లీ సినిమా అంత కథ వుంది.

ఫొటో ఆలోచన అలా వచ్చింది...
టైటిల్స్ పడేటపుడు చిన్ననాటి ఫోటోలు పెట్టాలన్న ఆలోచన ముందునుంచీ వున్నదేమీ కాదు. హీరోయిన్ నిత్యతో మాట్లాడుతున్నప్పుడు తట్టిన ఆలోచన అది. ఎక్కడ పుట్టింది, తను పదేళ్ల వయసులో ఏం చేసేది.. ఇలా చెబుతూపోయేది. అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. సినిమాకు ముందు మాలో ఒకరికి మరొకరితో పరిచయం లేదు. ఎవరెవరో ఎక్కడెక్కడో పుట్టారు. కానీ పుట్టిన ఇన్నేళ్ల తరువాత అందరం కలిసి ఒక దగ్గర పనిచేస్తున్నాము.

చిన్నప్పుడు ఎలా వుండే వాళ్లం? ఇలా ఆలోచిస్తూ పేర్లు వచ్చేటప్పుడు చిన్ననాటి ఫోటోలు పెడితే ఎలా వుంటుంది అనుకున్నాను. ఇదే విషయం కొందరితో చెప్పాను. బావుందన్నారు. తరువాత ఫోటోల కోసం వేట. దీనికోసం నలుగురైదుగురిని కేటాయించాము. పాపం వాళ్లు ఎన్ని వందల నెంబర్లకు ఫోన్ చేశారో వారికే తెలుసు. చాలామంది ఫోటోలు దొరికాయి, ఒక్క మార్తాండ్ కె. వెంకటేష్ ఫోటో తప్ప. బుజ్జి మార్తాండ్ ఫోటో సేకరించడానికి వెతకని చోటంటూ లేదు. చివరకు వారి ఊళ్లో నుంచి ఆ ఫోటో దొరికింది. ఆ కాన్సెప్ట్‌ను చాలామంది ఫ్రెష్‌గా ఫీలవుతున్నారు. మా టీమ్‌కు కూడా ఈ టైటిల్స్ థ్రిల్ కలిగించాయి.

జాన్ అబ్రహాం (ఆశిష్ విద్యార్థి)మొదట్లో లేడు...
సినిమా మొత్తం పూర్తయ్యింది. కానీ సినిమా ఓపెనింగ్ సీన్ ఏదీ అనుకోలేదు. అసలు జాన్ క్యారెక్టర్(ఆశిష్ విద్యార్థి) మా ఆలోచనల్లో లేదు. ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూస్తే ఏదో లింక్ మిస్సయ్యిందనిపించింది. ఏం చేయాలి? ఏ క్యారెక్టర్‌తో హీరోను పరిచయం చేయాలి? అసలు సినిమాలో ఓపెనింగ్ సీన్ ఎలా వుండాలి? ఇవన్నీ నా బుర్రలో తిరిగాయి. అప్పటికే ఏవేవో తీసినా అవి సంతృప్తిగా లేవు. అలాంటి సమయంలో నేను చూసిన జర్మన్ మూవీ 'ఇన్ జూలై' గుర్తొచ్చింది. అందులో హీరో లిఫ్ట్ కోసం ఒక వాహనాన్ని ఆపుతాడు. ఆ ట్రక్‌లో శవం వుంటుంది. లిఫ్ట్ ఇచ్చిన వాడి డ్రెస్, అతని ప్రవర్తన హీరోకు కొత్త అనుభవం.

ప్రేక్షకులకు అదొక సస్పెన్స్. ఆ ప్రయాణంలో వాడు హీరోకు తన స్టోరీ చెబుతుంటాడు. ఇంతకు ముందు చాలామంది దర్శకులు ఆ సినిమా చూశారు. దాన్ని కొంతమంది తీయాలనుకున్నారు కూడా. ఎందుకో రాలేదు. కానీ నేను ఓపెనింగ్‌లో అలాంటిదే ఒక సస్పెన్స్‌ను క్రియేట్‌చేస్తే బావుంటుందనుకున్నాను. అలా హీరో కిడ్నాప్‌తో సినిమా మొదలయ్యింది. ఆ తరువాత జాన్‌కు హీరో తన కథ చెప్పుకుంటూ పోతుంటాడు. ఇంటర్వెల్ వస్తుంది. క్లైమాక్స్ కూడా దగ్గరవుతుంది. అయినా జాన్ క్యారెక్టర్ ఓపెన్ కాదు. ఇంకో వైపు కథలో సస్పెన్స్. ఇలాంటి సీన్ సినిమాకు మరింత సపోర్ట్ ఇస్తుంది అనిపించింది. షూటింగ్ జరిగిపోయింది. సినిమాను అలాగే ఓపెన్ చేశాము. ఇప్పుడు తెరపై జాన్ క్యారెక్టర్ వస్తే చాలు ప్రేక్షకులు సస్పెన్స్‌తో పాటు వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు.

తాగుబోతు గౌతమ్ కూడా మధ్యలోనే వచ్చాడు...
సినిమాలో క్లైమాక్స్ కామెడీగా వుండాలని చర్చల్లో నిర్ణయించుకున్నాము. చివరిలో హీరోయిన్ పెళ్లి సీన్. ఆమెను హీరో వెతుక్కుంటూ వస్తుంటాడు. అప్పటికే అతని స్నేహితులు పెళ్లి మండపానికి వచ్చేస్తారు. హీరో మాత్రం ఇంకా రాలేదు. అసలు వస్తాడో రాడో తెలియదు. వీళ్లందరికీ ఏం చేయాలో తోచదు. అలాంటి పరిస్థితిలో సీన్ ఇన్నర్‌థాట్ చెడిపోకుండా కామెడీ కావాలి. షూటింగ్ జరుగుతోంది. ఆ కామెడీ కోసం ఏం చేయాలో తెలియలేదు.

అలాంటపుడు డైలాగ్‌రైటర్ లక్ష్మీ భూపాల్‌ వీరందరి మధ్యలో ఒక తాగుబోతును పెడదాం అన్నాడు. ఆలోచన బావుంది. కానీ ఆ క్యారెక్టర్‌తో కామెడీ ఎలా పండించాలన్నదే పెద్ద ప్రశ్న. ఆ పాత్ర అంతకుముందు సినిమాలో ఎక్కడా కనిపించకూడదు. ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటే 'ఐస్ఏజ్' సినిమాలో సీన్ జ్ఞాపకం వచ్చింది. అందులో స్కాట్ క్యారెక్టర్ ఏదో ఒక నట్ కోసం తవ్వుకుంటుంది. నిజానికి ఆ పాత్రకు సినిమాకు ఎటువంటి సంబంధం వుండదు. కానీ దాని చేష్టలతో వీళ్లందరికీ ఇబ్బందులెదురవుతుంటాయి.

అలా తాగుబోతు పాత్రను డిజైన్ చేసుకున్నాము. అతనికి కూడా హీరో పేరే(గౌతమ్) పెట్టాము. సినిమాలో క్యారెక్టర్ కోసం మళ్లీ ఆడిషన్స్ మొదలు పెట్టాము. మహాత్మ, భీమిలి సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన రమేష్‌కు కబురుపెట్టాం. అతను ఒక సీన్ చేసి చూపిస్తానన్నాడు. నిర్మాత, నేను చూశాము. ఇప్పుడా పాత్ర చేసే సందడిని ఎవరూ మరచిపోలేకపోతున్నారు.

ఆత్మబంధువు కోసం మేక్ ఎ విష్ కాన్సెప్ట్...
ప్రతీ ఒక్కరికీ జీవితంలో ఎవరో ఒకరు ఆత్మబంధువు ఉంటారు. అది అమ్మ కావచ్చు, నాన్న అవ్వచ్చు, భార్య కావచ్చు, ప్రేయసి కావచ్చు. వారిని మన హృదయం గుర్తిస్తుంది. ఈ సినిమాలో హీరో తల్లిలో ఎదుటివారిని అర్థం చేసుకునే లక్షణంతోపాటు సామాజిక బాధ్యత కూడా వుంటుంది. ఆమె చైల్డ్‌లేబర్‌ను వ్యతిరేకించడం అందులో భాగమే. హీరోకు అప్పటి వరకు నిత్య ప్రవర్తన పెద్ద కన్‌ఫ్యూజన్. ఏదో భరిస్తుంటాడు.

నెలరోజుల్లో చనిపోయే ఒక బాలుని కోరిక తీర్చడానికి హీరోయిన్ చూపిన శ్రద్ధలో అతను తన అమ్మను చూసుకుంటాడు. కాబోయే భార్యలో తన అమ్మ లక్షణాలు వెతుక్కోవడం అబ్బాయిలకు అలవాటైతే, కాబోయే భర్తలో తన నాన్న లక్షణాలు వుండాలని కోరుకోవడం అమ్మాయిలకు అలవాటు. ఎప్పుడైతే హీరో తన అమ్మలోని ఒక మంచిలక్షణం హీరోయిన్‌లో వుందని కనుక్కోగలుగుతాడో అప్పట్నించి హీరోయిన్‌పై అతనికి ఆసక్తి పెరుగుతుంది. మిగతా సినిమాల్లా ఇది రొటీన్‌గా తీసిన దృశ్యం కాదు. హీరోయిన్ తన ఆత్మబంధువు అని హీరో అర్థం చేసుకుంటాడు.

ఆమె కోసం అన్వేషిస్తూ బయలు దేరతాడు. ఈ లింక్ పెట్టడానికే మేక్ ఎ విష్ కాన్సెప్ట్ ఉపయోగించుకున్నాను. ఫౌండేషన్ నిర్వాహకుల్ని కలిసి అలాంటి వారి వివరాలు తెలుసుకున్నప్పుడు వాళ్లు చెప్పిన ఓ సంఘటన నన్ను కదిలించింది. మీడియాలో జరిగిన ప్రచారం ద్వారా తాను నెలరోజులే బతుకుతానని తెలుసుకున్న ఒక బాలుడు ఎంత బాధపడ్డాడో వివరించారు. అందుకే మీడియాలో జరిగే ఈ తప్పు గురించే హీరోయిన్‌తో చెప్పించాము.

'గే'తో హీరో షూటింగ్ మొదలైంది....
ఆడా, మగా కాని(గే)క్యారెక్టర్ ఒకటి వుందని చెప్పినపుడు నాని ఆశ్చర్యపడ్డాడు. తనకు హీరోయిన్ దక్కడానికి ఆ పాత్ర ఎలా ఉపయోగపడుతుందో వివరించినపుడు నాని ఎంజాయ్ చేశాడు. హీరోతో తొలిషూట్ 'గే' పాత్రతోనే మొదలైంది. ఆ సీన్ వచ్చినపుడు థియేటర్‌లో ఒకటే నవ్వులు. నాని కుక్కతో మాట్లాడే సీన్.. నిజానికి అది నా అలవాటు. మా ఇంట్లో కుక్కలతో నేను అలాగే మాట్లాడుతుంటాను. ఈ సీన్‌లో హీరో అంటాడు -'కళ్లు బాగున్నాయని, బొచ్చు బాగుందని ఎదురింటి స్నూపీని చూసి తోక ఆడించకు. ఏదో ఒక రోజు నీ బుజ్జి కుక్క కనబడితే నీ తోక దానంతటదే ఊగుతుంది' అని. ఈ జనరేషన్‌కు ఎలా చెబితే అర్థమౌతుందో అలాగే చెప్పిన డైలాగు ఇది.

యాంటీ క్లైమాక్స్ కానీ హ్యాపీ ఎండ్... - నిర్మాత దామోదర్ ప్రసాద్
నా సినిమా ద్వారా మహిళకు దర్శకురాలిగా అవకాశం ఇస్తున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా ప్యాడింగ్( ప్రముఖ హీరో, హీరోయిన్, దర్శకుడు, ఇతర ప్రముఖ నటుల కాంబినేషన్)తో చేస్తున్నది కాదు. చిన్న సినిమా. అందరూ ఫ్రెష్. ఒక వేళ తేడా వస్తే సినిమా పరిశ్రమను నమ్ముకున్న వీళ్లంతా దాదాపు మూడు, నాలుగేళ్లు కోలుకోలేరు. అందుచేత అవకాశం ఇవ్వడం కాదు, తేడా జరిగితే వాళ్ల జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని సినిమా పూర్తి చేయాలనుకున్నాను. నందిని కథ చెప్పడానికి వచ్చినపుడు ఆమె ఎన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో వున్నారో తెలుసుకున్నాను.

హీరో ఎంపిక సులభమే. నాని సంగతి ముందే తెలుసు. హీరోయిన్ సెలక్షన్‌కే చాలా సమయం పట్టింది.. వందల ఫోటోలు చూశాము. ఎవరూ నచ్చలేదు. ఒక రోజు కెమెరామ్యాన్ ఓంప్రకాష్ చెబితే నందిని రెయిన్ డాన్స్ చేసిన అమ్మాయి సి.డిని పంపించారు. సి.డిలో క్లారిటీ లేదు. దాంతో అమ్మాయికి కబురుపెట్టాము. అప్పటికే నిత్య మలయాళంలో ఒక సినిమా చేసి వున్నారు. ఆమె వచ్చాక ఫొటో షూట్ చేశాము. నాని, నిత్య ఫొటోలు పక్క పక్కనే పెట్టినప్పుడు చాలా ఫ్రెష్ పెయిర్ అనిపించింది.

అలా నిత్య ఎంపికయ్యింది. హీరోకు ఈ మధ్య ఐదుగురు స్నేహితులను పెడుతున్నారని నందినితో చెప్పాను. తను ఇద్దరు చాలంది. నేను మరొకరు పెడితే బావుంటుందన్నాను. ఆ మూడో ఫ్రెండ్ అమ్మాయి అయితే బావుంటుందనుకున్నాము. ఆ పాత్ర అబ్బాయిలను డామినేట్ చేసేలా వుండాలనుకున్నాము. దాని కోసం పాడుతాతీయగా పోటీలో ఒకసారి నేను చూసిన స్నిగ్థ సరిపోవచ్చని నందినితో చెప్పాను. అలా పింకిగా స్నిగ్థ ఎంపికయ్యింది.

ఇవన్నీ సినిమా కష్టాలు...
అంతా బాగున్నట్టు కనిపించింది కానీ ఆదిలోనే ప్రాజెక్టుకు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు డెభ్బైశాతం సినిమా ఫైనాన్స్ సహకారంతో పూర్తి కావాల్సి వుంది. సినిమా మొదలై పది రోజులు గడిచాక ఫైనాన్స్ ఇస్తామన్నవారు ముఖం చాటేశారు. ఎవరి కారణాలు వారికుంటాయి. మనమేమీ చేయలేం. మొత్తానికి సినిమా ఆగిపోయింది. అనుకున్నంతా జరిగింది. ఎలాగైనా సరే సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను. కాని మూడు నెలల్లో పూర్తవ్వాల్సిన సినిమాకు తొమ్మిదినెలలు పట్టింది. సినిమాలను రిలీజ్ చేయకముందు డిస్ట్రిబ్యూటర్లకు చూపించడం ఆనవాయితీ. మధ్యలో ఆ పద్ధతి పోయింది.

కానీ ఈ సినిమాతో మళ్లీ ఆ సంస్కృతికి శ్రీకారం చుట్టాము. అందర్నీ పిలిచి సినిమా చూపించాము. కానీ ఒక్కరూ సినిమా తీసుకోలేదు. విడుదల చేయడానికి థియేటర్లు దొరకలేదు. ఇంత కష్టపడి సినిమా తీశాక వదులుకోలేము కదా! ఇంకో కోటి రూపాయలు ఖర్చుపెట్టి ప్రింట్లు వేసి సినిమా విడుదల చేశాము. హైదరాబాద్ క్రాస్‌రోడ్‌లో థియేటర్ దొరకడం ఇంకా కష్టమయ్యింది. ఎదురుడబ్బులు అడిగారు. చివరకు ఉషామయూరిని ఎంచుకున్నాను. సినిమా విడుదలైన రోజు ఉదయం కొన్ని థియేటర్లు తిరిగాము.

'ఎ' సెంటర్ సినిమా అవుతుంది అనుకున్నాము. ఆ రోజు రాత్రి భ్రమరాంబలో ప్రేక్షకుల ఆనందాన్ని చూశాక అన్ని సెంటర్ల సినిమా అనే ధీమా కలిగింది. మా నమ్మకం నిజమయ్యింది. కొన్ని రోజులకే హిట్ టాక్ వచ్చింది. రెండో వారానికి థియేటర్లు పెరిగాయి. వద్దన్న వారే వచ్చారు. ఇదంతా అక్కసు వెళ్లగక్కుకోవడానికి చెప్పడం లేదు. చిన్న సినిమా పరిస్థితి ఇలా వుంటోంది. ఈ సినిమా హిట్ అయ్యాక చాలామంది చిన్న నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు చిన్న సినిమా నిర్మాతలను కలిసి మీ సినిమాను మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నారట. ఇదంతా తెలిసి చాలా ఆనందం కలిగింది. ఈ పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. సినిమాలో హంగూ ఆర్భాటం లేదు. అశ్లీలత లేదు. ప్యాడింగ్ సినిమా కాదు. అయినా ఆదరణ పెరుగుతూనే వుంది.

- ఇంటర్వ్యూ: బల్లెడ నారాయణ మూర్తి
ఫొటోలు: రాజ్‌కుమార్

నవ్య, ఆంధ్రజ్యోతి నుండి..

 

Tuesday, November 13, 2012

Adurs - Krish

Adurs - Krish
Abinandhana - Hum aapke hai kaun
aahvaanam - pellinaati pramaanaalu

April 1 vidudala -
maa annayya -