మొదటి ముద్దుకు కష్టపడ్డాం
ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే కథతో సాగేవే. అందులోనే మనమేదైనా కొత్తగా చూపించాలి. హీరో హీరోయిన్లు ఇద్దరూ కొత్తవాళ్లు. ఖర్చు కూడా ఎక్కువ పెట్టాం. కథనంలో కొత్తదనం చూపిస్తేనే సినిమా నిలుస్తుంది. అందుకే హీరోతోనే హీరోయిన్‌కు ఉత్తరాలు రాయిస్తూ, ఎవరో రాస్తున్నారనే భ్రమ కలిగిస్తూ.. వారిద్దరి మధ్య ప్రేమకథ ఆసక్తిగా నడిచేలా ప్రయత్నించాం. సాయికుమార్ కొడుకు ఆదిని హీరోగా పెట్టి ఈ సినిమా తీయడానికి వెనక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది.
గతంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ తీసిన 'సామాన్యుడు'లో సాయికుమార్ నటించాడు. అప్పటి నుంచి ఆయనతో మా బ్యానర్‌కు సాన్నిహిత్యం ఉంది. ఒకరోజు మాటల్లో తన కొడుకు ఆది చేసిన డ్యాన్సులు, ఫ్లైట్లు ఉన్న వీడియో క్లిప్పింగులను చూడమంటూ తన మొబైల్ నాకిచ్చాడు సాయి. అందులో వాళ్లబ్బాయి డైనమిక్‌గా కనిపించాడు. నాకు సంతృప్తి అనిపించి వెంటనే మా వెంకట్‌కు చూపిస్తే.. .'ఆది బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మంచి హీరో అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. మన బ్యానర్ మీదే అతన్ని పరిచయం చేద్దాం' అన్నాడు.
అప్పటికే దర్శకుడు విజయభాస్కర్ కొత్తవాళ్లను పెట్టి సినిమా తీసేందుకు ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథ ఆదికి సరిపోతుందనుకుని ఆయన్ని సంప్రదించాం. అదే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి 'ప్రేమ కావాలి' చిత్రానికి దర్శకత్వం బాధ్యత చేపట్టారు విజయభాస్కర్. అదీ ఈ సినిమా మొదలవ్వక ముందు జరిగిన కథ.
నాన్నా నేను హీరో అవుతా.. : ఆది
"నాన్నా, ఎంత కష్టమైనా సరే నేను హీరో అవుతాను..'' "హీరో అంటే మాటలనుకున్నావురా..? డైలాగులు చెప్పాలి. స్టెప్పులేయాలి. రిస్కు తీసుకుని ఫైట్లు చెయ్యాలి. అన్నీ చేసి అందర్నీ ఒప్పించాలి. ఆ ఒప్పించేదేదో ఒకటి రెండు సినిమాలతో ఒప్పిస్తే సరిపోదు. ప్రతి సినిమా శుభం కార్డు పడే వరకూ థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితేనే నువ్వు హీరోగా నిలబడగలవ్..?'' "మీరన్నది నిజమే నాన్నా.
నాకు కొంచెం టైమ్ ఇవ్వండి. హీరోకు కావాల్సినవన్నీ నేర్చుకుంటాను. మీరు చెప్పినవన్నీ చేస్తాను..'' "సరే, నీ పట్టుదల నాకు నచ్చింది.. అయినా సరే ఇంకోసారి ఆలోచించుకో..'' 'లేదు నాన్నా. నా ఆలోచన మారదు.. ఈ క్షణం నుంచీ సినిమా హీరో అవడమే నా ధ్యేయం..'' డైలాగ్‌కింగ్ సాయికుమార్‌కు స్వర విన్యాసాలు చేయడం ఒక్కటే కాదు. సినిమా కష్టాల లోతుపాతులు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కొన్నేళ్ల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నారు కనుక. 'హీరో'గా తెరమీద నిలదొక్కుకోవాలంటే తెరవెనుక ఎన్ని అవస్థలు పడాల్సి ఉంటుందో తన కొడుకు 'ఆది'తో ఒక రోజు వివరంగా చెప్పాడు. "ఆరోజు నాన్న చెప్పిన మాటల్ని పాఠాలుగా మలుచుకుని ఈ సినిమా చేశా..'' అంటున్న ఆది 'ప్రేమ కావాలి' సినిమా తెరవెనుక ముచ్చట్ల గురించి ఇలా చెప్పుకొచ్చారు.
నా అదృష్టం : ఆది
ఈ సినిమాలో హీరోయిన్ వాళ్ల నాన్న నాజర్ పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆయన ఒక క్రిమినల్‌ను పట్టుకుంటాడు. అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు హీరోయిన్‌ను వేధిస్తుంటారు విలన్లు. హీరోయిన్ వెంటపడి, తనకు తెలియకుండానే ప్రేమించడం నా పని. ఈ దృశ్యాలన్నీ అద్భుతంగా తీయాలంటే మంచి సినిమాటోగ్రఫీ చేసేవాళ్లు కావాలి. అందుకే కష్టపడి చోటా.కె.నాయుడును ఒప్పించారు నిర్మాత. ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ మా సినిమాకు పని చేయడానికి ఆయన ఒప్పుకున్నారు.
ఆయన పనితీరు ఈ సినిమాలో చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బ్రిడ్జి పక్కనే ఉన్న బిల్డింగ్ మీద ఇప్పటికే బోలెడు సినిమాలు తీశారు. మా సినిమా కూడా అక్కడే తీశాం. ఆ దృశ్యాలను చూసినవాళ్ళంతా అసలు ఇది హైదరాబాద్‌లో తీశారా..? విదేశాల్లో తీశారా..? అని ఆశ్చర్యపోయారు. చోటా సార్ అంత కొత్తదనం చూపించారు. కొన్ని దృశ్యాలను మాదాపూర్ దగ్గరున్న కొండపై నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి షూట్ చేశారు. ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి.
నాకు చిన్నప్పటి నుంచి పాములంటే చాలా భయం. ఈ సినిమాలో హీరోయిన్ ఒక పుట్ట దగ్గరికి వెళ్లి.. నాగుపాముకు పూజలు చేస్తుంది. ఈ దృశ్యాలను మాదాపూర్‌లో చిత్రీకరించారు. నాకు ఆ రోజంతా టెన్షనే. పాముల సీన్ ఎప్పుడు అయిపోతుందా అనిపించేది. సీన్‌లోకి వెళ్లాక... హీరోయిన్ పుట్ట దగ్గర పాలు పెడుతుంది. పుట్టలోంచి పాము బయటికి రాగానే నేను భయపడాలి.. అదీ సీన్. తీరా పాము బయటికి రాగానే నేను పరుగో.. పరుగు. అయితే నా భయం మంచే చేసింది. ఆ సీన్ చాలా బాగా వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు.
ఈ సినిమా మాస్‌గా ఉండాలన్నది డైరెక్టర్ విజయభాస్కర్ ఆలోచన. ఫైట్లు, పాటలు కూడా బాగా రిచ్‌గా ఉండేందుకు ప్రయత్నించారు. హీరోగా నేనే కొత్త.. నా పక్కన నాకు మిత్రులుగా పేరున్న నటులను పెడితే బావుండదని సాధారణ సహనటులను తీసుకున్నారు. ఈ సినిమాలో నాది స్టూడెంట్ పాత్ర. నాకు వాళ్లంతా మిత్రులుగా చేశారు. బ్రహ్మానందం, అలీ కామెడీ కూడా హీరోను డామినేట్ చేయకుండా చూసుకున్నారు దర్శకుడు.
హీరోయిన్ వాళ్ల నాన్న పాత్రను కొంచెం పేరున్న నటుడితోనే చేయిద్దామని మొదట్లో అనుకున్నారు. పైగా అది ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ పాత్ర. అందుకనే నాజర్ అయితే అద్భుతంగా చేస్తారని ఆయన్ని పెట్టారు. హీరోయిన్ ఇషాచావ్లా ఈ సినిమాలో నాజర్ కూతురు. తన తండ్రి పర్సనల్ కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను హీరోయిన్ తనకు తెలియకుండానే విలన్‌కు చెప్పడం ఈ సినిమా కథలో పెద్ద మలుపు. ఈ సన్నివేశాలకు తగిన నటులను కావాలనే ఎంచుకున్నారు అచ్చిరెడ్డి, విజయభాస్కర్.
ఈ సినిమా షూటింగ్ సమయంలో నేను ఎలాంటి ఇబ్బందులు పడలేదు కానీ, రామానాయుడు స్టూడియోలో ఒక వాన పాట తీస్తున్నప్పుడు అక్కడికి నాన్న వచ్చారు. ఆ పాటలో కాస్త రొమాన్స్, ఎక్స్‌పోజింగ్ ఉంటాయి. శృంగార భావనలను సున్నితంగా పలికించాలి. అవన్నీ నాన్న ఎదురుగా చేయడానికి మాత్రం కాస్త బెరుకు అనిపించింది. నా కష్టాలను చూసిన డైరెక్టర్ విజయభాస్కర్ మా నాన్నను సెట్‌లోంచి వెళ్లిపొమ్మన్నారు. నా అవస్థ చూసిన నాన్న అర్థం చేసుకుని వెళ్లిపోవడంతో 'హమ్మయ్య' అంటూ నేను ఊపిరి పీల్చుకుని పాటను పూర్తి చేశాను.
ఇక, పాటల కోసం విదేశాలకు వెళ్లడం కొత్తకాదు. ఇటలీ, దుబాయ్, వెనిస్ నగరాలను ఎంచుకున్నారు మా వాళ్లు. ఎందుకంటే ఇటలీలో అప్పుడు భారీగా మంచు కురుస్తోంది. ఆ తెల్లటి మంచులో పాటలను చిత్రీకరిస్తే ప్రేక్షకులు చాలా తాజా అనుభూతిని పొందుతారని ఆ దేశంలో తీశారు. ఇటలీలోని క్యానసీ ఒక చిన్న పట్టణం. మహా అంటే రెండువేల మంది ఉంటారేమో అక్కడ. షూటింగ్ కూడా హాయిగా, జాలీగా జరిగిపోయింది. హీరోయిన్ ఇషా మాత్రం మంచుతో కష్టాలు పడింది. ఆ విశేషాలు ఆమెనే అడగండి చెబుతుంది.
మంచులాంటి అనుభవం : ఇషా
అమ్మో, ఆ మంచును చూస్తేనే గుండె గుభేల్మంటుంది. ఎంత మంచంటే అసలు ఊహించడానికే కష్టం. చోటా.కె.నాయుడు 'షాట్ రెడీ' అంటారు. నేను అడుగు తీసి అడుగు వేశానో లేదో ఆ మంచులో కాలు మోకాలిలోతు వరకు వెళుతోంది. మంచులో కూరుకుపోయిన కాలు బయటికి తీసే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోవడం.. అది చూసి చోటాసార్, ఆది నవ్వడం.. మళ్లీ వాళ్లిద్దరూ కిందపడినప్పుడు నేను నవ్వడం... అదంతా ఓ మరిచిపోలేని అనుభవం. దుబాయ్‌లో కూడా ఒక పాట తీశారు. అక్కడ షూటింగ్ అయిపోయిన వెంటనే షాపింగ్‌కు వెళ్లే వాళ్లం. ఈ సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు అయితే, కొన్ని సీన్లు తీసేముందు పెద్ద చర్చలు జరగడం మరో ఎత్తు. 'ప్రేమ కావాలి'లో హీరో, హీరోయిన్ ఇద్దరూ పార్కుకు వెళతారు. అక్కడ బెంచి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో హీరోయిన్ హీరోని ముద్దు పెట్టుకోవాలి.
ఈ దృశ్యాలు సినిమా కథకు చాలా సహాయపడతాయి. 'ఈ సీన్‌ను మనకు తప్పనిసరి. ఇషా.. సెన్సార్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ముద్దు సీన్ చేయడానికి నువ్వు అంగీకరించాలి..' అన్నారు దర్శకుడు విజయభాస్కర్. నాతో పాటు ఆదికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించినా 'ఓకే' అన్నాం. పైగా ఆ సన్నివేశాలు సినిమాలో వస్తున్నప్పుడు మా నాన్న, అమ్మ నా పక్కనే ఉన్నారు. దీంతో ఆ సీన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందాని నేను టెన్షన్ పడ్డాను. మరో పాటలో కన్నీళ్లు పెట్టుకోవాలి. 'గ్లిజరిన్ కళ్లకు రాసుకోకుండా నువ్వు కన్నీళ్లు పెడితేనే ఈ దృశ్యం పండుతుంది. కథలో లీనమైపోవడం నేర్చుకో' అన్నారు దర్శకుడు. నిజంగానే ఆ సన్నివేశంలో నేను ఏడ్చేశాను. షూటింగ్‌లో పాల్గొన్నవాళ్లంతా నా నిజమైన కన్నీళ్లు చూసి మొదట బిత్తరపోయారు.. ఆ తర్వాత చప్పట్లు కొట్టారు.
అసలు నేను ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎలా ఎంపికయ్యానంటే- మాది పంజాబ్. ప్రస్తుతం బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సైకాలజీ చదువుదామనుకున్నా. నటన మీద ఇష్టంతో ఢిల్లీలో థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఒకసారి- ఇంటర్‌నెట్‌లో నా ఫోటోలను చూసిన చోటా.కె.నాయుడు ఇంప్రెస్ అయ్యారు. ఆయన అచ్చిరెడ్డిగారికి నా ఫోటోలు చూపిస్తే, వాళ్లకూ నచ్చాయి. వెంటనే నాకు కాల్ చేశారు. హైదరాబాద్ వచ్చాక ఒక్కరోజులోనే స్క్రీన్ టెస్ట్ కూడా అయిపోయింది. అయితే అప్పుడేం చెప్పలేదు. కొన్నాళ్ల తర్వాత నాకు ఫోన్ వచ్చింది. 'ప్రేమ కావాలి'లో హీరోయిన్‌గా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కథ విన్నాక నాకు సరిగ్గా సరిపోయే పాత్ర దొరికిందనిపించింది.
అన్నీ చెయ్యాలి : హీరో
'నేను ఈ సినిమా కథ విన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్ పాత్ర కాబట్టి నాకు సరిపోతుందనుకున్నాను. ఇది నాకు మొదటి సినిమా. ఇందులో ఫైట్లు, పాటలు, కామెడీ అన్నీ కలిపి మాస్ మసాలా మాదిరిగా ప్రేక్షకులకు అందించాలని దర్శక, నిర్మాతలు భావించారు. హీరోగా ఈ సినిమాలో రావడానికంటే ముందే నాన్నతో షూటింగ్‌లకు వెళ్లడం నాకు అలవాటు. ఒకరోజు లలితకళా తోరణంలో డ్యాన్స్ చేశాను. అక్కడ ముఖ్య అతిథి చిరంజీవి. నా డ్యాన్స్ చూసి ఆయన చాలా మెచ్చుకున్నారు. 'నువ్వు సినిమాల్లో ప్రయత్నించు.
తప్పకుండా సక్సెస్ అవుతావ్' అన్నారు. అప్పుడే నాన్నకు నా మీద కొంత నమ్మకం ఏర్పడింది. ఇక 'ప్రేమ కావాలి' సినిమా కోసం నేను కొంత శిక్షణ కూడా తీసుకున్నా. లారెన్స్ దగ్గర డ్యాన్స్, పాండ్యన్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాను. డైలాగ్స్ ఎలా చెప్పాలో కాకరాల వద్ద నేర్చుకున్నా. ఇవన్నీ జరుగుతున్నప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలన్నీ ఎప్పటికప్పుడు నా మొబైల్‌లో షూట్ చేసి నాన్నకు పంపిస్తూ ఉండేవాణ్ణి. వాటిని నాన్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వాళ్లకు చూపించడంతో.. ఇదిగో ఇలా 'ప్రేమ కావాలి'తో మీ ముందుకు వచ్చాను..' అంటూ మేకింగ్ ఆఫ్ ద మూవీ విశేషాలు ముగించారు ఆది.
No comments:
Post a Comment