Saturday, October 30, 2010

సత్తే పే సత్తా - మా అన్నయ్య బంగారం

ఇది ఏడుగురు అన్నదమ్ముల కథ. రవి (అమితాబ్ బచన్) ఇంట్లో అందరికన్నా పెద్దవాడు. చిన్నతనం నుంచి తమ్ముళ్ళ అలనాపాలనా అన్నీ తానే చూసేవాడు. తల్లిదండ్రి తానే అయి వారిని పెంచుతాడు. వారిదొక అందమైన కుటుంబం. ఒకరి నుంచి ఒకరికి విడతీయలేని అనుబంధం. రవి తరచుగా పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఇందు (హేమమాలిని)తో పరిచయం అవుతుంది. అది కాస్తా ప్రేమగా మారి వారిద్దరూ పెళ్ళిచేసుకుంటారు.

అసలు విషయమేమిటంటే అత్తగారింట్లో అడుగుపెట్టేవరకు తన భర్తకి ఇంత పెద్ద కుటుంబం ఉందనే విషయం ఇందుకి తెలియదు ...! ఈ విషయాన్ని ఇందు జీర్ణించుకోలేకపోతుంది. ఆకుటుంబంలో ఇందు ఎలా మెలగిందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, ఆ తరవాత జరిగిన కథేంటో

గతంలో మన పెద్దవాళ్లు ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడేవారు. ఇప్పుడొస్తున్న మనుషులు బాగా చదువుకున్నా మనసులు కుంచించుకుపోయి చిన్న కుటుంబాలంటేనే ఇష్టం పెంచుకుంటున్నారు. ఎక్కువమంది వుంటే ఎక్కువ పనిచేయాలని వాళ్ల భయం. పనిని చూసి భయపడే జాతిలోకి మానవజాతి వెళ్లిపోతోంది. పనిచేయలేని, బలంలేని మనుషుల సమాజాన్ని మనమే (సమిష్టి కుటుంబాలను నాశనం చేసి) నిర్మించుకుంటున్నాం. చిన్న కుటుంబాలు, అందులో పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలనుకునే వాళ్లు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. ఎంతసేపు ఏకాంతం, ఏకాంతం అంటూ ఏడుస్తున్నారే గానీ నలుగురు కలిసి నవ్వేచోట వసంతం విరబూస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి మనస్తత్వం వున్న ఓ అమ్మాయి ఓ పెద్దకుటుంబంలోకి వస్తే ఎలా ఉంటుంది అన్న పాయింటుతో సాగిన చిత్రమే మా అన్నయ్య బంగారం. కథాపరంగా... శివాజీ (రాజశేఖర్)కు ఆరుగురు తమ్ముళ్లు. తల్లిదండ్రులు తన చిన్ననాటనే చనిపోగా తమ్ముళ్లకు తానే అన్నీ అవుతాడు. తముళ్ల కోరికతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని మంజు (కమలినీ ముఖర్జీ)ని తన ఇల్లాలిగా ఆహ్వానిస్తాడు. పెద్ద కుటుంబంలో తన అక్క నందిని (ఝాన్సీ) అనుభవించిన పనిమనిషి హోదాను మరిచిపోలేని మంజు పెద్దకుటుంబాలను ఇష్టపడదు. శివాజీ బాబాయి (జయప్రకాష్‌రెడ్డి) వంద అబద్ధాలాడినట్టుగా తమ్ముళ్ల విషయం దాచిపెట్టి పెళ్లి జరిపిస్తాడు. నిజాన్ని గ్రహించిన మంజు తన పుట్టింటికి వెళ్లిపోతుంది. శివాజీ తమ్ముళ్లున్న ఆ ఇంట్లో అడుగుపెట్టనని మొరాయిస్తుంది. అన్నయ్య బాధ చూడలేక తమ్ముళ్లు త్యాగం చేసి వదినని ఇంటికి ఎలా రప్పించారన్నది మిగతా కథ.
కథలో పెద్ద విషయం కనిపించదు. గతంలో చెల్లెలి కాపురంపై అక్క పెత్తనం చేసే చిత్రాలు మనకు వచ్చాయి. ఆ చిత్రాల్లో వున్నట్టు ఈ కథలో స్పష్టత కరువైంది. ఒక్క అన్నకు ఐదుగురు చెల్లెళ్ల కథలు కూడా మనం చూసాం. ఇప్పుడు చెల్లెళ్ల బదులు తమ్ముళ్లు వచ్చారు. అయితే చిత్రమంతా ఒకేగాటున కట్టినట్టుగా అదేకథపైనే నడుస్తుంది. కామెడీకి ఎక్కడా స్థానం లేదు. పావలా శ్యామల, ఎల్బీ శ్రీరాం, బ్రహ్మానందంలు ఒకటీ రెండు షాట్స్‌లో కనిపించినా ఏమాత్రం హాస్యం పండించలేదు. అన్నదమ్ముల మధ్య సెంటిమెంటు కూడా బలంగా చూపే ప్రయత్నం జరగలేదు. ఎంతసేపూ బిర్యానీలు తెచ్చి తమ్ముళ్లకు తినిపిస్తే సరిపోతుందా? హీరో తన తమ్ముళ్లకు, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే సన్నివేశాలు మాత్రం బాగా వచ్చాయి. తమ్ముళ్లందరు వదినకోసం ఒక్కొక్కరు ఇల్లు విడిచి వెళ్లిపోయే సన్నివేశాలను బాగా తీసారు. అసలు అబద్ధాలపై చేసిన పెళ్లిలో ఎప్పటికైనా తిప్పల పాలు కాకతప్పదని చెప్పే ప్రయత్నం చేసినా, స్క్రిప్ట్‌లో దమ్ము లేకపోడంతో చాలా సన్నివేశాలు తేలిపోతాయి. తరువాత వచ్చే సన్నివేశం ఏదో, అది ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. దాంతో చూసేవారికి ఉత్సాహం రాదు. సోసోగా సాగిపోతుందని అర్ధమవుతుంది. ‘సూర్యుడెప్పుడొస్తాడో చెప్పగలం, చంద్రుడెప్పుడొస్తాడో చెప్పగలం, అటు ఇటు కాకుండా అసుర సంధ్యలో వదిలి వెళ్లిన ఆమె ఎప్పుడొస్తుందో చెప్పలేం’ అని ఓ డైలాగ్ వుంది. సెంటిమెంట్ అవసరమే! కానీ మాటల్లో ఓపలేనంత బరువైన డైలాగుల సెంటిమెంట్ అవసరమా? అన్న అనుమానం వస్తుంది. తమ్ముళ్ల పాత్రలన్నీ ఆటలో అరటిపండ్లే! వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు.
నటనలో రాజశేఖర్ తన పాత పద్ధతినే పాటిస్తూ వెళ్లాడు. కమలినీకి నటించే పాత్ర వున్నా, స్క్రిప్ట్‌లో బలం లేకపోవడంతో వెలవెలబోయింది. మిగతా వాళ్లంతా సోసోనే. ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీతంలో ‘నీ అసలు పేరు’, ‘మళ్లీ మళ్లీ మనసు తుళ్లి తుళ్లి’ పాటలు ఫరవాలేదు. నేపధ్యసంగీతం హోరు ఎక్కువైంది. పరుచూరి మాటలు గుర్తుంచుకునేలా ఏం లేవు. ప్రసాద్‌బాబు కెమెరా బాగా పనిచేసింది. ముఖ్యంగా పాటల్లో విజువల్స్ బాగున్నాయి. దర్శకత్వపరంగా పెద్దగా చెప్పుకునేదేం లేదు. సోసోగా సాదాసీదాగా తీసాడు. హీరో రాజశేఖర్ ఇక ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కథలకు స్వస్తి చెప్పి కొత్తదనం వున్న కథలను ఎంచుకుంటే అతడి కెరీర్ మరికొంతకాలం సజావుగా సాగగలదు. మొత్తం మీద ఈ అన్నయ్య రొటీన్ చిత్రాల జాబితాలోనే చేరిపోయాడు.

No comments:

Post a Comment