ఏ సినీ కథనైనా ఏ మాత్రం ఆలోచనల్లేకుండా - ఏ/సి థియేటర్‌లో గప్‌చిప్‌గా కూర్చుని - హాయిగా ఎంజాయ్ చేయ్యొ చ్చు. కానీ - ఈ కథ అలా కాదు. కాస్తంత శ్రద్ధగా చూడాలి. ఒక్కసారి మనసు పక్కకి మళ్లించారా? మళ్లీ మొదలెట్టాల్సిందే. అంతమాత్రానికే - ఇదేదో అర్థంకాని వ్యర్థ పదార్థం కాదు. సైన్స్ ఫిక్షన్ వైపు వెళుతూనే - ఒక్కోసారి మన ఆలోచనల్లోకి మనల్నే వెళ్లేలా చేస్తుంది. మన కలల్లోకి మనమే వెళ్లేలా ఉంటుంది. ఎటెన్షన్‌గా ఉండకపోతే - కాబ్ (లియోనార్డో డికాప్రియో) మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి జొరబడి అల్లకల్లోలం సృష్టిస్తాడు. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కలలు కననివాణ్ణి ఈ భూపెపంచకంమీద ఒక్కణ్ణి చూపించండి. ఏ తెల్లవారుఝామునో మగతా కమ్మే నిదురలో కూసింతసేపు కలల లోకంలో విహరించందే ఎవరి మనసూ ఆగదు. కొన్ని కలలు గుర్తుంటాయి. కొన్ని ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తాయి. ఇంకొన్ని మస్తిష్కంలో రికార్డు కావు. మరికొన్ని ఏళ్ల తరబడి జ్ఞాపకం ఉంటాయి. కాన్షియస్ మైండ్‌లో కన్నా సబ్ కాన్షియస్ స్థితిలోనే ఆలోచనా స్రవంతి సుదీర్ఘంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది. కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ కానె్సప్ట్‌తో సాగిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఇన్‌సెప్షన్’.
ఊహకి సైతం అందని జాబ్ కాబ్ (లియోనార్డో)ది. ఆలోచనల్ని దొంగిలించటం. మదిలో మెదిలే ఐడియాలను సబ్‌కాన్షియస్ మైండ్ లో వెలికితీయటం. అతడిదో కలల ప్రపంచం. కలకి సరిహద్దులుండవు. ఏళ్ళ తరబడి ఎనె్నన్నో లోకాల్ని సృష్టించుకోవచ్చు. ఆ కలల్లోనే బతికేయ్యొచ్చు. ఆ కలల్తోనే జీవితాన్ని అందంగా అల్లుకోవచ్చు. కాబ్ తన భార్యని అలాంటి లోకంలోకి తీసుకెళ్తాడు.
ఇతడి టార్గెట్ రాబర్ట్ ఫిషర్ జూనియర్ (సిలియన్ మర్ఫీ). మల్టీబిలియన్ డాలర్ల కార్పొరేషన్‌కి అధిపతి. రాబర్ట్ తండ్రి చనిపోతూ ఒక లాకర్‌కి సంబంధించిన ‘కోడ్’ని చెబుతాడు. అందులో ఏముందో ఎవరికీ తెలీదు. రాబర్ట్ బిజినెస్ ప్రత్యర్థి సైటో (కెన్ వాటనెబ్) రాబర్ట్ ఆలోచనల్ని ముందుగానే పసిగట్టగలిగితే తన వ్యాపార సామ్రాజ్యానికి ఎదురే లేదని భావిస్తాడు. కాబ్‌కి ఈ పని అప్పజెబుతాడు. రాబర్ట్ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఏముందో తెలుసుకుంటే - లాకర్‌కి సంబంధించిన సమాచారం కూడా తెలుస్తుంది. కాబ్ తన అసిస్టెంట్‌గా ఆర్కిటెక్ట్ అరియాడ్నే (ఎల్లెన్ పేజ్)ని ఎంపిక చేస్తాడు. ఆమెను తన కలల ప్రపంచంలోకి పంపిస్తాడు. తన సబ్‌కాన్షియస్ మైండ్‌తో అరియాడ్నే ఆలోచనల్ని మళ్లిస్తుంటాడు. ఆర్థర్ (జోసెఫ్ గోర్డన్ లెవిట్), ఏమ్స్ (టామ్ హార్డీ), యూసుఫ్ (దిలీప్ రావ్)ల సహకారంతో రాబర్ట్‌ని కిడ్నాప్ చేస్తాడు కాబ్. ఇలా ప్రతి ఒక్కరూ కాబ్ సబ్‌కాన్షియస్ మైండ్‌తో మరో కలల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఇందులో మళ్లీ అనేకానేక స్థాయిలుంటాయి. వాటిని దాటుకుంటూ రాబర్ట్‌ని తమతోపాటు సబ్ కాన్షియస్ మైండ్‌ని వెతుక్కుంటూ వెళతారు. చివరికి రాబర్ట్ లాకర్‌కి సంబంధించిన ‘కోడ్’ని డీకోడ్ చేయగలిగారా? ఆ లాకర్‌లో ఏముంది? రాబర్ట్ తండ్రి చివరిసారిగా ‘నన్ను నువ్వు నిరాశ పరిచావ్?’ అని ఎందుకన్నాడు? కాబ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో తరచూ వచ్చి ప్రతి ఒక్కరినీ హత్య చేసేందుకు కాబ్ భార్య ఎందుకు చూస్తోంది? ఇలా అర్థంకాని అంశాలెన్నో బుర్రని వేడెక్కిస్తాయి. ఐతే - ఎక్కడా అది కలల ప్రపంచం అని కానీ, మరో లోకంలోకి వెళుతున్నట్టు గానీ కన్‌ఫ్యూజ్ కాకండా స్క్రీన్‌ప్లేని పకడ్బందీగా చేసుకుని నడిపించిన కథకుడు, దర్శకుడు క్రిస్ట్ఫర్ నెలోన్ ‘ఇన్‌సెప్షన్’ని అద్భుతంగా చిత్రీకరించాడు.
లేడీ ఆర్కిటెక్ట్‌ని తన కలల జగత్తులోకి పంపించే సన్నివేశంలోనూ - తాను సబ్ కాన్షియస్ మైండ్‌లో సృష్టించిన పాత్రలతోనూ - ప్రదేశాలతోనూ తీసుకెళ్లినప్పుడు - అక్కడ ఆర్కిటెక్ట్ ఊహించిన లోకాన్ని సరైన రీతిలో చిత్రీకరించారు. ఊహకి హద్దుల్లేవు. అలాంటిదే ఈ లోకం కూడా. ఇలాంటి లోకాలు ఈ చిత్రంలో బోలెడన్ని. ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో తనదైన సబ్ కాన్షియస్ మైండ్‌తో ప్రేక్షకుల్ని ఊహకు అందని లోకాలకు తీసుకెళ్లాడు
No comments:
Post a Comment