కమర్షియల్ సినిమాకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన సాజిద్ ఖాన్ - ఫాంటసీని నమ్ముకోడు. క్రైం జోలికి వెళ్లడు. ఉన్నంతలో లాజిక్‌కి దొరకడు. హృషీకేశ్ ముఖర్జీ అంటే బోలెడంత ఇష్టపడే సాజిద్ - ఈ మండువేసవిలో చిరునవ్వుల జల్లు కురిపించి ఆహ్లాదాన్ని పంచే విషయంలో ప్రేక్షకుల్ని ‘హౌస్‌ఫుల్’గా సాటిఫై చేస్తాడు. అదో తుత్తి. చల్లచల్లని కూల్‌డ్రింక్స్ తాగిస్తాడు. హృషీకేశ్ ముఖర్జీ కూడా అంతేకదా. లోబడ్జెట్ కథలతో ప్రేక్షకుల మదిని ఉర్రూతలూగించాడు. ఈ నేపథ్యాన్ని వొంటబట్టించుకున్న సాజిద్ మూడు గంటలపాటు ఏకధాటిగా ఏ క్షణం వృథా చేయకుండా నవ్వుల సంద్రాన్ని సునాయాసంగా ఈదేలా చేస్తాడు.
అందమైన అబద్ధం అప్పటికప్పుడు అవసరాల్ని గడిపేలా చేసినా - దాని తాలూకు నీలినీడలు మరిన్ని అబద్ధాలకు పునాదులు వేస్తారుూ ఇరుకున పెడతాయి అన్న సీరియస్ కానె్సప్ట్ నుంచీ - నీలి పొరలాంటి హాస్యాన్ని అల్లుకుని గజిబిజి గందరగోళాలకు తావివ్వకుండా - ముందు ఏం జరగబోతోందోనన్న ఆలోచనలోకి నెట్టకుండా - సాఫీగా ఏ/సి థియేటర్‌లో నవ్వుల్ని ఉగ్గబట్టుకునేలా చేసిన సాజిద్ కథ ఎటు చూసినా ‘హౌస్‌ఫుల్’. ‘లాఫింగ్ గ్యాస్’లో నవ్వుపుట్టించే లక్షణం ఉన్నట్టే - సాజిద్ ప్రతి సన్నివేశంలో నవ్వులను దొర్లించే లక్షణాలున్నాయి. అదో అందమైన అబద్ధం. ఒక్క అబద్ధాన్ని పాతేయటానికి వంద అబద్ధాల్ని మూట కట్టుకోవటం అంటే ఇదే. ఆ మాటకొస్తే- అరుష్ (అక్షయ్‌కుమార్)కి అబద్ధమంటే అసహ్యం. ఇతగాడు ప్రపంచంలోనే నీచాతి నీచమైన దరిద్రపుగొట్టు అదృష్టహీనుడు. ఎక్కడ కాలుమోపితే అక్కడ మటాష్. చిన్ననాటి ఫ్రెండ్ బాబ్ (రితేష్ దేశ్‌ముఖ్). ఇతగాడి భార్యామణి హేతల్ (లారాదత్తా). ఉద్యోగం దొరికేవరకూ అంటే ఓ మూడ్నాలుగేళ్లు ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోతానంటాడు అరుష్. కొత్తగా పెళ్లయిన జంట మధ్య. హేతల్ ఫ్లాష్ బ్యాక్‌లో బోలెడన్ని అబద్ధాలు. తండ్రికి ఇష్టంలేని పెళ్లి. దాంతో బాయ్‌ఫ్రెండ్ ప్లస్ మొగుడు కోటీశ్వరుడనీ, కార్లూ బంగళాలూ నౌకర్లు చాకర్లు బొచ్చుకుక్క ఉన్నాయంటుంది. వీటికి తోడు ఓ పిల్లాడు కూడా ఉన్నాడంటుంది. ఈ నేపథ్యంలో - హేతల్, బాబ్ బాస్ కూతురు దేవిక (జియాఖాన్)కి ‘్భరతీయ’ పెళ్లి సంబంధాలు చూస్తూండటంతో - సంప్రదాయసిద్ధంగా ఉంటుందని అరుష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తారు. దీంతో నష్టజాతకుడు అనుకున్న అరుష్ 500 మిలియన్ల ఆస్తికి ఓనర్ అవుతాడు. ఇంతవరకూ బానే ఉంది. కానీ -సంఘం కట్టుబాట్లంటూ నాన్న వెర్రిమొర్రి ఆలోచనలతో - పక్కా భారతీయుణ్ణి వివాహం చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందన్న చిన్న లాజిక్‌ని అంటగట్టాడని, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాననీ, ఆస్తి చేతికి రావటంతోనే డైవోర్స్ ఇస్తానని ఘంటాపథంగా చెప్పి, తన బాయ్‌ఫ్రెండ్ బన్నీతో ఉండిపోతానని అంటుంది దేవిక. దాంతో ఫస్ట్‌నైట్ గురించి ‘ఐ డోన్ట్ నో వాట్టూ డూ’ అంటూ కలలు కంటున్న అరుష్ ఈ ఘోరాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడతాడు. ఎక్కడైనా హీరో హీరోయిన్‌ని రక్షిస్తాడు. కానీ ఈ నష్టజాతకుణ్ని శాండీ (దీపికా పదుకొనె) రక్షిస్తుంది. అరుష్ గురించి ఇటలీ హోటల్ యజమాని ‘జోక్’ అంటూనే - అతగాడి పెళ్లాం చనిపోయిందని, అందుకే ఆత్మహత్య చేసుకోబోయాడనీ - లేనిపోనివి చెప్తాడు. దాంతో - అరుష్ పట్ల ఉన్న సానుభూతి కాస్తా ప్రేమగా మారుతుంది శాండీ విషయంలో. ఇక అక్కడ్నుంచీ అబద్ధాల హోరు మొదలవుతుంది. ఓవైపు శాండీ, మరోవైపు హేతల్. శాండీ తన అన్నకి అరుష్ గురించి గొప్పగా చెబుతుంది. హేతల్ చెప్పిన అబద్ధాలన్నీ నిజమని నమ్మిన ఆమె తండ్రి - శాండీ అన్న కృష్ణ ఒకేసారి ఇటలీ వస్తున్నట్టు కబురు పంపుతారు. ఉన్నపళంగా - పెద్ద బంగళా, నెలల పిల్లాడు, కార్లూ.. నౌకర్లూ ఎక్కడ్నుంచీ వస్తారు. అందునా - తండ్రి పోలికలతో ఉన్న పిల్లాడు. ఈ అబద్ధాల కాపురం చివరికి క్లైమాక్స్‌లో ‘లాఫింగ్ గ్యాస్’తో బట్టబయలవుతుంది. ఇంత సీరియస్ సబ్జెక్ట్‌ని నవ్వుల నావలో వేసి హాస్య సంద్రంలో నడపటం ఆషామాషీ వ్యవహారం కాదు.
కొన్ని కొన్ని సన్నివేశాలు గుక్క తిప్పుకోనివ్వవు. అరుష్ చేసిన తింగరి పనికి (వాక్యూమ్ క్లీనర్‌తో ఇల్లు తుడవటం.. ఈ నేపథ్యంలో పెంపుడు చిలుక సైతం వాక్యూమ్ క్లీనర్‌లోకి వెళ్లిపోతుంది ఈకల్తో సహా) ప్రదా డార్లింగ్ (చిలుక) స్వర్గస్థురాలవుతుంది. అదే పేరుగల ‘పెట్’ ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్టంతా వెతికితే దొరికింది - ఏమిటి? అదే పేరుగల పులి. ఇక అదే సీక్వెన్స్‌లో పిల్లాడి విషయం. భారతీయుడిలా ఉండాలంటే - నీగ్రో పిల్లాడు దొరుకుతాడు. ఇక - పటూ -పటేల్ ‘స్లీప్ వాక్’.. ప్రతి అబద్ధాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలో ‘హోమో సెక్సువల్’గా స్నేహితులిద్దరూ కనిపించటం - పటేల్‌ని వీడని నీడ. మేజర్ కృష్ణారావు ‘లై డిటెక్టర్’ వ్యవహారం.
ఇక - చిత్రీకరణ విషయానికి వస్తే - ఇటలీ, బకింగ్‌హామ్ ప్యాలెస్.. బీచ్ అందాలతోపాటు - ఓవైపు లారాదత్తా, మరోవైపు దీపికా పదుకొనె, ఇంకోవైపు జియాఖాన్ అందాల ఆరబోత. అసలే హాట్‌హాట్ వాతావరణం. ఆ సీన్‌లో అరకొర కాస్ట్యూమ్స్ ప్లస్ టూ పీస్ కాస్ట్యూమ్స్ ఉంటేనే రీజనబుల్‌గా - సీజనబుల్‌గా ఉంటుంది. వన్ షాట్ - త్రీ బర్డ్స్. రణధీర్ కపూర్, అర్జున్ పాల్, బొమన్ ఇరానీ - హాస్యాన్ని వొంటిచేత్తో నడిపించారు. మ్యూజిక్ ఫర్వాలేదు. హాస్యసన్నివేశాల మధ్య అంతగా వొంటబట్టదు. ఈ వేసంగిలో ‘బీచ్’ అర్ధనగ్న సీన్లతోపాటు ‘హౌస్‌ఫుల్’గా నవ్వుకోవాలంటే ఓకే.
No comments:
Post a Comment