ఈ ఆధునికయుగంలో సామాన్య మనిషి నాగరికత అనే ముసుగులో ఉండి యాంత్రిక జీవనానికి అలవాటుపడి సంబంధాలు, బంధుత్వాలను ఎలా విస్మరిస్తున్నాడో చూపడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ ‘అతిథి’ సినిమా. మనం మన పురాణాలలో, పుస్తకాలలో చదివాం ‘అతిథి దేవోభవ’ అని. సొంత తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేస్తున్న ఈరోజుల్లో ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే వారిపట్ల శ్రద్ధచూపించడంలో ఏవిధంగా వెనుకంజ వేస్తున్నామనే విషయాన్ని సహజంగానే దర్శకుడు చూపించాడు. ఈ లోకంలో చుట్టపుచూపున వచ్చి నెలలు తరబడి తిష్టవేసే ప్రబుద్ధులూ ఉన్నారు. కాని సహజంగానే వచ్చే బంధువులను మనం ఆదరిస్తున్నామా? వారిపట్ల సహనంతో సహకరిస్తున్నామా? అని దర్శకుడు ఈ సినిమాద్వారా సమాజాన్ని ప్రశ్నించాడు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ఈ కాలంలో ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉన్నా, బంధువులు వచ్చినా వారు చూపించే ఆదరణ, మన జీవన విధానంపై, పిల్లల మనస్తత్వాలపై ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని చాలా చక్కగా హాస్యాన్ని జోడించి వివరించారు. పిల్లలు కేవలం ఇంగ్లీష్ చదువులకే పరిమితమవుతున్న ఈరోజుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మన మాతృభాష ఆవశ్యకత గురించి వివరించడంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఫైటింగ్‌లు, భారీ సెట్టింగులు, పాటలు ఆర్భాటం ఏమీలేకుండా కేవలం ఐదు పాత్రల మధ్యనే కథను నడిపించాడు దర్శకుడు.
ఇక కథ విషయానికి వస్తే..పునీత్ (అజయ్‌దేవగన్) సినిమాలలో కథలు రాసే రచయితగా పనిచేస్తుంటాడు. అతని భార్య మున్‌మున్ (కొంకణాసేన్) ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. వీరిద్దరికీ ఒక బాబు ఉంటాడు. ‘అతిథి దేవోభవ’ అనే మాటకు అర్థం కూడా తెలియని వీరి ఇంటికి అనుకోకుండా ఒకరోజు ఒక బంధువు రూపంలో లంబోధర్ బాబా (పరేశ్‌రావల్) వస్తాడు. ఆ వచ్చిన అతిథి వలన వీరు పడరాని కష్టాలు పడతారు. అతనిని ఇంటినుంచి పంపే ప్రయత్నంలో ఎన్నో ఎత్తులు వేయడం జరుగుతుంది. లంబోధర్ ప్రవర్తన వలన పునీత్ తనకు వచ్చిన రచయిత అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఇంట్లో అతిథి లంబోధర్ సేవలతో విసిగిపోయిన మున్-మున్ కూడా ఆఫీసులో తన పనిపై శ్రద్ధ చూపడంలో విఫలమవుతుంది. అతిథి వలన ఏర్పడిన కష్టాలను అధిగమించుటకు వారు ఏంచేశారు. లంబోధర్ వలన వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నవి అనేదే మిగతా సినిమా!
ఎప్పుడో వచ్చిన ‘మాలమాల్ వీక్లీ’ సినిమా తరువాత మళ్లీ ‘అతిథి’ సినిమాలో పరేష్ రావల్ గ్రామీణ వాతావరణంలో నటించి అందరినీ హాస్యంతో అలరించారు. మన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగరీత్యా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్రభావాన్ని బంధువులమీద చూపించకూడదనీ, వారిపట్ల ప్రేమానురాగాలతో బాధ్యతాయుతంగా ఉండాలని చూపించారు. ఈ చిత్రం మొదలైనపుడు ‘అతిథి’ మాటకు అర్థం ఏమిటి? మన పురాణాలలో అతిథిని ఎలా సంభాషించుకున్నాం, ఈ కాలంలో అతిథికి ఇచ్చే గౌరవం ఏమిటి? అతిథివలన కలిగే నష్టం ఏమిటి? అనే విషయాలను కార్టూన్ చిత్రాల ఆధారంగా, జావేద్‌జాఫ్రీ సంభాషణలతో వివరించడం ఓ ప్రయోగమే. హాస్యపరంగా పరేశ్‌రావల్ ఇంతకుముందు వచ్చిన సినిమాలు ‘మాలమాల్ వీక్లీ’ ‘్భగమ్‌భాగ్’ ‘దే ధనాధన్’ స్థాయిలో లేకపోయినా ఫరవాలేదనిపిస్తుంది. పరేశ్‌రావల్‌తో చేసే ఏ సినిమా కథైనా చెప్పదలచుకున్నదానికి హాస్యాన్ని జోడించి చెప్పించడం గమనించదగ్గ విషయం.
ఇందులో వినాయకుని విశిష్టత, ఆదిదేవునిగా ఎందుకు పూజింపబడతాడో వివరించి చెప్పడం, తల్లిదండ్రుల ఆవశ్యకతను, మరచిపోతున్న మన పండుగల గురించి (పూజలు, హారతులు) చూపడం బాగుంది.
దుర్గామాతా 9 దిన్‌మే, గణేష్ జీ 11దిన్‌మే’ లేకిన్ అతిథిక విసర్జన్ కబ్‌హోగ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అజయ్‌దేవగన్‌తో చెప్పించిన ‘హమ్ మె యే సంస్కార్ నహీ కె అతిథిక సమ్మాన్‌కరే’ అనే డైలాగ్‌లో పంచ్ ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన ఓంకార సినిమాలోని ‘బీడీ జలైలే జిగర్ మే పియా’ అనే పాట ట్యూన్‌ను ఈ సినిమాలో దేవుని పాటకు వాడారు. అదే పాట ‘యే సంసార్’ ప్రేక్షకులను బాగా అలరించింది కూడా. ప్రీతమ్ సంగీతం సోసోగా వుంది. అజయ్‌దేవ్‌గన్, కొంకణాసేన్ తమ తమ పాత్రల్లో బాగానే రాణించారు. పరేశ్‌రావల్ వేషభాషలు గ్రామీణ వాతావరణాన్ని తలపించాయి. అసీమ్ బజాజ్ కెమెరా పనితనం బాగుంది. వినాయకుని విసర్జన సమయంలో ఆసుపత్రి సన్నివేశాలను బాగానే చిత్రించారు. అశ్విన్‌ధిర్ ఈ సినిమాలో నటించిన పాత్రల సంఖ్య విస్తరించి ఇంకా హాస్యానికి చోటు కల్పించివుంటే పరేశ్‌రావల్‌కి ఇది కూడా కామెడీ హిట్‌గా మిగిలేది. మొత్తం మీద ఫర్వాలేదనిపించే చిత్రమిది.
No comments:
Post a Comment