రజనీ ‘రోబో’ అచ్చంగా ఇండియన్ మేడ్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాస్ ప్రేక్షకులను దృష్టిలో వుంచుకుని శంకర్ తయారు చేసిన టైలర్‌మేడ్. వందలాది కోట్లు పెట్టగల దమ్మూ, ధైర్యం వున్న మారన్ లాంటి నిర్మాత దొరికితే హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగల సత్తా వున్న జనం మన దగ్గరా వున్నారని, అంతటి ఊహాశక్తి, కల్పనా చాతుర్యం మనకూ వున్నాయని స్పష్టం చేసిన సినిమా ఇది. కేవలం హాలీవుడ్ స్థాయి సినిమా తీయడం ఒకటే లక్ష్యం కాకుండా, మన సినీ అభిమాన జనాల ‘లెవెల్’ను మర్చిపోకుండా తీయడంతో కచ్చితంగా గురిని చేధించగలిగింది. అదే కనుక తీసేది అంతర్జాతీయ స్థాయి సినిమా అనుకుని, ‘మేధావితనపు’ పోకడలు పోయి, సీరియస్‌గా తీసి వుంటే, పరిస్థితి వేరేలా వుండేది. అందువల్లనే సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ కొరవడినా, మన జనం అస్సలు పట్టించుకోలేదు. అవన్నీ చర్చించే ముందు కొద్దిగా కథను చూస్తే...
రోబోల యుగం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎలా వుంటుంది..రోబోల కారణంగా వచ్చే లాభ నష్టాలు ఏమిటన్నది సాదా సీదా ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా అల్లిన కథ ఇది. డాక్టర్ వశీ (రజనీకాంత్) అన్ని విధాలా పరిపూర్ణమైన రోబోను తయారుచేసి, రక్షణ రంగానికి ఇచ్చి, జననష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో విజయం సాధించి, అచ్చం తనలాంటి ఓ రోబోను తయారుచేస్తాడు. అదే చిట్టి (రజనీకాంత్). తీరాచేస్తే, చిట్టి రోబో మనుషుల్లా ఆలోచించలేదు కాబట్టి, సైన్యంలోకి అనుమతి ఇవ్వమంటారు రక్షణ రంగ నిపుణులు. దాంతో మళ్లీ శ్రమించి, ఆ రోబోకు మానవ ఆలోచనలు, మంచి చెడ్డలు అలవాటు చేస్తాడు. దీంతో కథ అడ్డం తిరిగి, ఆ చిట్టి కాస్తా, వశీ ప్రియురాలు సన (ఐశ్వర్యరాయ్)ను తాను కూడా కోరుకోవడం ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో చిట్టిని ధ్వంసం చేస్తాడు వశీ. మరోపక్క విదేశీ విద్రోహులతో చేతులు కలిపిన డాక్టర్ బోరా (డానీ) ధ్వంసమైన చిట్టిని మరమ్మతు చేసి, చెడు ఆలోచనలు కలిగిన రోబోగా తయారుచేస్తాడు. దీంతో ప్రారంభమైన విధ్యంసం ఎలా, ఏ తీరాలకు చేరిందన్నది మిగిలిన కథ.
ఇది ముమ్మాటికీ దర్శకుడు శంకర్ సినిమా. దీనికి రజనీ సూపర్ స్టార్‌డమ్ తోడయింది. రజనీ కాకుండా ఇంకెవరు ఈ సినిమా చేసినా ఓ కామెడీ సినిమాగా మిగిలిపోయి వుండేదంటే, ఆశ్చర్యం లేదా అతిశయోక్తి కాదు. కథను అల్లుకోవడం దగ్గర నుంచే దర్శకుడు శంకర్ తన సృజన అంతా ప్రదర్శించాడు. కథలో రోబోల మంచి చెడ్డలు చర్చించాలి..అవి సామాన్య జనానికి పట్టేటట్లు..అర్ధం అయ్యేటట్లు వుండాలి. అందుకు అనుగుణమైన సీన్లు రాసుకోవడం తొలి విజయం. ఇక్కడ హాలీవుడ్ సినిమా ప్రియులు ఏమనుకుంటారు , లాజిక్ వుందా లేదా అన్నవేవీ శంకర్ పట్టించుకోలేదు. సినిమా విజయానికి మూలమైన మాస్ మెంటాలిటీనీ మర్చిపోలేదు. రోబో మాగ్నెటిక్ పవర్‌కు రౌడీ మూక కత్తులన్నీ ఆకర్షించబడి, అతగాడు అమ్మవారిలా కనిపించి, భక్తులు జేజేలు పలకడం..రోబో వందలాది మందికి వంట చేయడం, క్షణాల్లో బోలెడు పుస్తకాలు చదివేయడం, గోరింటాకు డిజైన్లు వేయడం, అచ్చంగా దక్షిణాది, అందునా తమిళ ప్రేక్షకుల నాడిని పట్టుకోవడమే. ఇక ఇటు హీరో అటు విలన్ రెండూ రజనీకాంత్ అన్నట్లుగా కథ అల్లుకోవడం, వేన వేల రజనీకాంత్‌లతో సినిమాను దాదాపు 45 నిమషాలపాటు నడపడం కూడా ఇదే కోవకు చెందుతుంది. రజనీ సినిమా అంటేనే దాదాపు తొంభై అయిదు శాతం సీన్లు అతని చుట్టూనే తిరుగుతాయి. ఈ సినిమాలో వున్నవి నాలుగే ముఖ్యమైన పాత్రలు. రజనీ,రజనీ,ఐశ్వర్య,డానీ. దీంతో తొంభై ఎనిమిది శాతం సీన్లు రజనీతో నిండాయి. ఇది మరో పెద్ధ కమర్షియల్ ఎలిమెంట్. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది శంకర్ ఇమాజినేషన్. సాధారణంగా మరే దర్శకుడైనా అరడజను హాలీవుడ్ సినిమాల స్ఫూర్తిగా, వాటికి నకలుగా, మరోసారి టెక్నికల్ వర్క్ చేయించి వుండేవాడు. అలాకాకుండా దాదాపు నూటికి తొంభైపాళ్లు తన ఊహాశక్తికి పదునుపెట్టి సీన్లు సృష్టించాడు. అందునా చివరి నలభై అయిదునిమషాల గ్రాఫిక్ వర్క్స్ వెనుక శంకర్ ఊహాశక్తి(కొండకచో గాడ్జిల్లా తదితర సినిమాలు గుర్తుకు వచ్చినా) అపారంగా వుంది. ఈ సీన్లలో వేలాది మంది రజనీలతోనే ఫీట్లు చేయించాలన్న ఆలోచన, వాటితో చేసిన మాయాజాలం ఇవ్వాళ థియేటర్లు దద్ధరిల్లేలే చేస్తోంది. శంకర్ ఊహాశక్తికి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, హాలీవుడ్ స్పెషలిస్ట్‌లు స్టాన్ విన్స్‌టన్ స్టూడియా నిపుణులు జీవం పోసారు. దీనికి పోరాట సన్నివేశాలను డిజైన్ చేసిన పీటర్ హెయిన్స్, వూ పింగ్, కృషి తోడయింది.
ఇక శంకర్ స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా సినిమా మొదటిసగంలో ఒక్క అనవసర సన్నివేశం లేకుండా జాగ్రత్తపడ్డాడు. చిట్టి క్యారెక్టర్‌తోనే కామెడీ పండించి, ఫస్ట్ఫా ముగించి, సెకండాఫ్‌కు శ్రీకారం చుట్టాడు. అందుకు తగ్గట్లే ఎడిటింగ్ పనితనం తోడ్పడింది. నిజానికి సెకండాఫ్ స్క్రిప్ట్ కాస్త నిడివి ఎక్కువైందని అనిపించినా, చివరి నలభై అయిదునిమషాల గ్రాఫిక్ మాయాజాలం, దాన్ని కాస్తా తెలియకుండా చేసింది. సాంకేతిక విషయాల్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన సంగతి రెహమాన్ నేపథ్యసంగీతం. అతను నేపథ్యసంగీతం అందించిన మంచి సినిమాల్లో రోబో కచ్చితంగా వుండి తీరుతుంది. కానీ పాటలకు అంత మంచి ట్యూన్లు సమకూరలేదు. అయితే శంకర్ చిత్రీకరణ మాయాజాలంలో ఆ లోటు చాలా వరకు కనిపించలేదు. ఎప్పటిలాగానే ఒక్కో పాటను ఒక్కో థీమ్‌తో చిత్రీకరంచారు. కానీ కిలిమంజారో పాటలో ఐశ్వర్య ధరించిన దుస్తుల నిడివి మరీ ఘోరంగా వుంది. ఒక సన్నివేశంలో ఆమె కాలు తిప్పిన భంగిమలో, ఆ కురచుదుస్తులు ఇబ్బందికరంగా అనిపించాయి. బహుశా సినిమాకు అదే అయిటమ్ సాంగ్ అనుకోవాలనేమో. ‘నీలో వలపు’, ‘కిలిమంజారో’ లొకేషన్లు సినిమా భారీ తనానికి అద్ధం పట్టాయి.
నటీనటుల విషయానికి వస్తే ఇది రజనీ విశ్వరూపానికి అద్ధంపట్టిన సినిమా. అసలే రజనీ జిమ్మిక్కులు..దానికి రోబో మాయలు తోడయితే, సూపర్‌మ్యాన్, స్పయిడర్‌మ్యాన్ లాంటి సినిమాలన్నీ కలిపి చూసినట్లే. పైగా రజనీ వయసును అరవై ఒక్క ఏళ్ల నుంచి ఒక్కసారి దాదాపు సగానికి తగ్గించిన చిత్రం...ఈ చిత్రంలోనే చూడగలం. ఇందులో రజనీ రెండు పాత్రలు పోషించినా, మూడు కింద లెక్క. సైంటిస్ట్ రజనీ, మంచి రోబో రజనీ, చెడ్డరోబో రజనీ. ఈ మూడిండికి బాడీ లాగ్వేంజ్, మూడ్స్, మ్యానరిజమ్, ఇలా అన్నింటిలోనూ స్పష్టమైన వైవిధ్యాన్ని కనబర్చాడు. ఇక ఐశ్వర్య చాలా స్లిమ్‌గా అందంగా కనిపించింది. అయితే కొన్ని సన్నివేశాల్లో హెయిర్‌స్టయిల్ వల్ల కొంచెం వయసు కనిపించినా, మరే సన్నివేశాల్లోనూ ఆమె వయసుకానీ, గృహిణి అన్న సంగతికానీ తెలియరాలేదు. పైగా కిలిమంజారో, ఇనుములో ఒక హృదయం, పాటల్లో ఆమె చాలా అందంగా కనిపించింది. డానీ పాత్ర మేరకు చేసాడు. చివరగా సినిమా గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే, రజనీ ఇమేజ్‌ను ఎంత మేరకు ఊహించుకోవచ్చో..ఆ లెవెల్‌కు గ్రాఫిక్స్‌ను కూడా ఊహించి, రెండింటిని కలగలపి, మాస్ నేల విడవకుండా శంకర్ చేసిన సక్సెస్‌ఫుల్, ప్లస్ అధ్భుతమైన ఫీట్ రోబో. అదే ది గ్రేట్ ఇండియన్ మ్యాజిక్.
No comments:
Post a Comment