బాలీవుడ్‌లో మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో అమీర్‌ఖాన్. తన ప్రతీ చిత్రం కొత్తగా, వైవిధ్యంగా ఉండేందుకు ఆయన తపిస్తుంటాడు. ఆయన తాజా చిత్రం ‘తీ ఇడియట్స్’ కూడా ఆ కోవలోకి చెందినదే. రొటీన్ కథే అయినప్పటికీ చక్కని టేకింగ్‌తో ఆద్యంతం ప్రేక్షకులను ఉల్లాసపరుస్తూ ముందుకు సాగే ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. లగాన్, రంగ్‌దేబసంతి, తారేజమీన్‌పర్, గజిని తర్వాత అమీర్ ఖాతాలో మరో మంచి సినిమా ఇది.
కథలోకి వెళితే...అదే రొటీన్ కథ. కథనం నడిపించడంలోనే దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ పూర్తి సాఫల్యత పొందాడు. రాంచో (అమీర్‌ఖాన్) ఓ సంపన్న కుటుంబం నుంచి ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చి రాజు రస్తోగి (షర్మాన్‌జోషి), ఫర్హాన్‌ఖురేషి (మాధవన్)లతో స్నేహం కుదిర్చుకొని అక్కడి నుంచి కాలేజీలో అల్లరి చిల్లర చేష్టలు చేస్తూ వీరు సహస్రబుద్ధే ప్రిన్సిపాల్ (బొమన్ ఇరానీ)కి పిచ్చకోపం తెప్పిస్తుంటారు. తిక్కశంకరయ్యలాంటి ఆ ప్రిన్సిపల్ కూతురు పియా (కరీనాకపూర్) ప్రేమలో పడతాడు రాంచో. వీళ్లు ముగ్గురు కాలేజీలో ఏ పనిచేసినా అది అందరి బాగుకోసమేకానీ ప్రిన్సిపాల్ వీళ్లని నానారకాలుగా బాధపెడ్తుంటాడు. ఓవిధంగా అతను తన మాటే చెల్లాలనుకునే మనస్తత్వమున్నవాడు. ఇక్కడ మరో సస్పెన్స్ ఏమిటంటే రాంచో అటు సైంటిస్టు చదువుతూనే ఇటు మరో స్నేహితుడికి ఇంజనీరింగ్ చదివి పట్టా చేసిస్తాడు. ఫర్హాన్‌కి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవ్వాలనే లక్ష్యముంటుంది. కానీ... తల్లిదండ్రులు బలవంతంగా అతనితో ఇంజనీరింగ్ చదివిస్తుంటారు. ఇక రాజు కుటుంబం చాలా బీదరికంలో కొట్టుమిట్టాడుతుంటుంది. అతనికి మంచి ఉద్యోగం సంపాదించుకొని కుటుంబానికి అండగా నిలవాలనుకుంటాడు. ఇలా వారి చదువులు అయిపోయి సడెన్‌గా రాంచో పత్తాలేకుండా పోతాడు. అప్పటికి ఫర్హాన్ తనకిష్టమైన ఫొటోగ్రాఫర్ సెలక్షన్‌కి అవకాశమొచ్చి అందులో సెలక్టవుతాడు. రాజుకి కూడా ఓ కంపెనీలో జాబ్ వస్తుంది. రాజు, ఫర్హాన్‌లు కలిసి రాంచో అడ్రస్ కనుక్కుని పియాని అతనితో కలిపిస్తారు. అప్పుడు ఏం జరిగిందనేదే ఆసక్తికరమైన అంశం.
ఇందులో ప్రతీ పాత్రకూ ప్రాధాన్యత కనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ సెంటిమెంటు, మెసేజ్ ఎంటర్‌టైన్‌మెంటు అన్ని సమపాళ్లలో కుదిరాయి. ప్రతీ ఫ్రేమ్‌ని చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు. కాకపోతే హీరోయిన్ అక్క డెలివరీ సీనే కాస్త ఇబ్బందిగా తోచింది. పిల్లలు అనుకున్న రంగంలో వారిని ప్రోత్సహిస్తేనే వాళ్ల భవిష్యత్తు బావుంటుందని తల్లిదండ్రులకి ఓ కనువిప్పు కలిగించారు. అలాగే రాంచో క్యారెక్టర్ స్నేహితుల మంచికోసం ఏమైనా చేయగల పాత్ర. మొత్తం మీద విధువినోద్‌చోప్రా బ్యానర్‌నుండి మంచి సినిమా వచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన మాటలు కూడా చక్కగా వున్నాయి. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ ఫర్వాలేదు
No comments:
Post a Comment