Sunday, October 31, 2010

సరదాగా కాసేపు

జనం కాసేపు సరదాగా చూస్తే చాలు అదే పదివేలు అనుకుంటూ, దర్శకుడు వంశీ తీసిన తాజా చిత్రం ‘సరదాగా కాసేపు’. కేవలం కాసేపు సినీ జనాలను వినోదంలో ముంచడం తప్ప, మరే ఇతర ఐడియాలు, ఐడియాలజీలు పెట్టుకోకుండా తీసిన చిత్రమిది.. గడచిన కొద్ది సంవత్సరాలుగా వచ్చిన వంశీ చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా కాస్త బెటర్. అదే గతకాలపు వంశీ చిత్రాలను గుర్తుతెచ్చుకుంటే మాత్రం అభిమానులకు మళ్లీ కాస్త దిగులే. చిత్రం కథేమీ పెద్ద కొత్త కాదు. ఇద్దరు కుర్రాళ్లు... వాళ్లిద్దరు అటు ఇటుగా మారడం.., అందులోంచి కామెడీ పుట్టుకురావడం, అన్న కానె్సప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. అమెరికా నుంచి వచ్చిన జీవా-సనల కుమారుడు శ్రీనివాస్ పెళ్లిచూపుల కోసం హైదరాబాద్ బయల్దేరతాడు. డ్రయవర్ నరేష్ కూడా బయల్దేరతాడు. ఆహుతిప్రసాద్-జయలలితల పెళ్లికూతురు మధురిమ గుణగణాలు తెలుసుకోవడానికి వీలుగా ఇద్దరు అటుఇటు వేషాలుమార్చుకుంటారు. ఈ విషయం కాస్తా జీవా ముందుగానే వియ్యాలవారికి తెలియచేసేస్తాడు. కానీ మార్గమధ్యంలోనే అనుకోకుండా కుర్రాళ్లిద్దరూ వేషాలు మళ్లీ అటు ఇటు మార్చుకుంటారు. ఇది తెలియని వియ్యాలవారు డ్రయివర్‌కు మర్యాదలు, అసలు అల్లుడికి పనిష్‌మెంట్‌లు ఇస్తుంటారు. సందట్లో సడేమియాలా డ్రయివర్ నరేష్ కాస్తా పెళ్లికుమార్తె మధురిమతో ప్రేమలో పడతాడు. ఈ కథ ఎలా కంచికెళ్లిందన్నది సినిమా. వంశీ మార్కు కామెడీకి నరేష్ తోడయితే బ్రహ్మాండంగా వుండడానికి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. కానీ స్క్రిప్ట్‌లో అంతగా దమ్ములేకపోవడం, ప్రొడక్షన్‌లో కాస్త లోబడ్జెట్‌లో వెళ్లడం, పాటల్లో కాస్త కొత్తదనం లేకపోవడంతో అనుకున్నమేర విజయానికి చేరువకాలేక పోయింది. అయితే కొత్త మాటల రచయిత పడాల కలం ఫస్ట్ఫాలో కాస్త చిందులు తొక్కడంతో కాస్త నిలబడింది. కానీ సెకండాఫ్‌లో అందుకు పెద్దగా అవకాశం లేకపోయింది. పైగా సెకండాఫ్ డైలాగుల్లోనూ, ముఖ్యంగా క్లయిమాక్స్‌లోనూ వంశీ మార్కు కన్నా, ఇవివి సత్యనారాయణ మార్కు ఎక్కువగా కనపడడం విశేషం. సినిమా రెండోసగం స్క్రిప్ట్‌ను మరికాస్త డెవలప్ చేసుకుని వుంటే మరింత బాగుండేది. అలాగే క్లయిమాక్స్ కూడా.
లోకి ఫొటోగ్రఫీ చాలా నీట్‌గా వుంది. టైటిల్స్ సమయంలో వెనె్నల్లో గోదారిని చిత్రీకరించిన తీరు బాగుంది. పాటల్లో కూడా ఫొటోగ్రఫీ కళ్లకు ఇబ్బంది పెట్టకుండా చూడ ముచ్చటగా వుంది. వంశీ స్టయిల్ చక్రి సంగీతంలో పాటలు చాలా వరకు విన్నట్లు అనిపించాయి. వంశీ రెండు పాటలు పాడారు. కానీ నిర్మొహమాటంగా చెప్పాలంటే స్వరంలో కొన్ని పదాలు ఎబ్బెట్టుగా వినిపించాయి. ముఖ్యంగా నిజమే.. నిజమా.. ఇధిగా...అన్నపుడు. మొదటి పాటలో చక్రి గొంతు కూడా అంతగా సూట్ కాలేదు. సినిమా మొత్తానికి ‘నీ పలుకులు’ పాట మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఈపాటకు చక్రి గొంతు బాగానే సరిపోయింది. ఎందరో ఔత్సాహికులు చిన్నతెరపై తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నపుడు, తమ సినిమా..తమ ఇష్టం అన్నట్లు పాడేయడం కన్నా, అటువంటి వారికి అవకాశం ఇస్తే బాగుండేదేమో. సినిమాలో పాటలకు చెట్ల నేపథ్యం, బిందెలు, చెంబులు వాడడం, ఇసుకలో అట్టసెట్టింగులు పెట్టి, వాడడంతో కాస్త ఓల్డ్ స్టయిల్ అనిపించింది. హంపీలో చిత్రీకరణ బాగుంది. అలా మరో రెండు లొకేషన్లు పెట్టుకున్నా బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే నరేష్ రాను రాను కామెడీలో మంచి ఈజ్‌ను కనబరుస్తున్నాడు. శ్రీనివాస్ తన ప్రతిభ ప్రదర్శించడానికి అంత అవకాశం ఏమీ ఇందులో లేదు. హీరోయిన్ మధురిమ కొన్ని చోట్ల అందంగా కనిపించింది. కానీ వంశీ తనదైన బొట్లు, కాటుకలు తగ్గించినా, ఇంకా కొన్ని చోట్ల అటు ఆహార్యమో, కళ్ల వెనుక మేకప్పో కాస్త ఎబ్బెట్టుగా కనిపించింది. ఆహుతి ప్రసాద్ పాత్ర, నటన జంధ్యాల సినిమాలను గుర్తుకు తెచ్చింది. (గతంలో సుత్తివేలు ఇటువంటి పాత్ర ఒకటి వేసాడు) జీవా, సన, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ్భగవాన్, జయలలిత తదితరులంతా పాత్ర మేరకు నటించారు. రెండు నిముషాల పాత్రకైనా కుర్రనటుడికి ముసలిగెటప్ వేసి పనిమనిషి తండ్రిగా నటింపచేయడం ఎబ్బెట్టుగా తేలిపోయింది. ఇలాంటి విషయాలే సినిమాను నాటకానికి దగ్గర చేస్తాయి.
చివరగా ఒక్క విషయం. ఏ ఆటగాడూ ఆడినన్నాళ్లూ సెంచరీలు కొట్టలేడు..ఒకేరకమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించలేడు. పైగా సృజనను నమ్ముకున్న కళాకారులకైతే కాలానుగుణ మార్పులు మరో పెద్ద సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో పరుగెక్కడ ఆపాలన్నది వారికి వారే నిర్ణయించుకోవాలి. లేకుంటే గతకాలపు మధురిమలు కూడా అభిమానుల మనసు నుంచి కనుమరుగైపోయే ప్రమాదం వుంది. మొత్తం మీద వంశీ అభిమానులను ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది తప్ప, ‘హమ్మయ్య’ అని మాత్రం అనిపించలేకపోయింది. ఇవివి స్క్రిప్ట్‌కు, వంశీ దర్శకత్వం వహిస్తే ఎలా వుంటుందో చూడాలనుకుంటే ‘సరదాగా కాసేపు’ చిత్రం చూడొచ్చు.

No comments:

Post a Comment