ఫ్యాక్షన్ కథా చిత్రాలు సినీ రచయితలకు ఓ మంచి వరం ఇచ్చాయి. భయం అనే నేపథ్యంలో ఫ్యాక్షనిస్టుల గుహల్లాంటి ఇళ్లకువెళ్లి తనకు కావలసిన తంతును ముగించుకుని రావడమే హీరో లక్ష్యంగా మార్చివేసాయి. అది ఊరిబాగుకోసమైనా, తన ప్రేమను గెలిపించుకునేందుకైనా కథ ఒక్కటే. హీరో విలన్ ఇంట్లోనే ఉంటూ వారిని వెర్రి వెంగళ్లప్పలా, తనకు అనుకూలంగా మార్చుకుంటూ హాస్యం అనే మరో రసాన్ని పిండుతూ ప్రేక్షకుడికి అదే పెద్ద బ్రహ్మ పదార్థంలా చూపిస్తూ సాగిపోవడమే కథానాయకుడి కథగా అనేక చిత్రాలు వచ్చాయి. ఇలాంటి కథలు ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో ఏదో రూపంలో కనిపించినవే! కథలో వైవిధ్యం చూపకపోతే చిత్రాన్ని చూడలేరని రచయిత, దర్శకులు ఎప్పటికి అర్థం చేసుకుంటారో మరి?
కథలోకి వెళితే.. రామ్ (తనీష్), భద్ర (ప్రణీత), గాలి సుబ్బారావు (చంద్రమోహన్) ఇంట్లోవుండి చదువుకుంటుంటారు. వారికి తోడుగా ఇంకో ముగ్గురు విద్యార్థులుంటారు. రామ్, భద్ర నిత్యం పోట్లాడుకుంటూనే, అనేక రకాల తిట్టు తిట్టుకుంటూ, ఎదుటివారిని ఇబ్బందిపెట్టే వెంగళాయి పనులుచేస్తూ మొదటి సగమంతా నానా హింస పెడతారు. తిట్టుకుని కొట్టుకుని చివరకు ప్రేమలో కూరుకుపోతారు. కట్‌చేస్తే ఇద్దరివి పక్కపక్క ఊళ్లే! రామ్ తండ్రి సత్తిబాబు (ఆహుతిప్రసాద్), భద్ర తండ్రి రాజాబాబు (చరణ్‌రాజ్) తమతమ ఊర్లకు పెద్దమోతుబరులు. ఇద్దరికీ మధ్య నిత్యం పగలు రగులుతుంటాయి. ఇద్దరూ బావ బావమరుదులే, చిన్ననాటి స్నేహితులే! వీరిద్దరి వైరంతో రెండు ఊళ్ళు విడిపోతాయి. ఆ ఊరి కాకి ఈ ఊరిలో తిరుగరాదు. ఈ ఊరి మనిషి ఆ ఊరిలోకి రాకూడదు. ఇలా ఉన్న రెండు ఊర్లకు చెందిన రామ్, భద్ర ఎలాగైనా ఇరువర్గాలను వొప్పించి పెళ్లి చేసుకుని, రెండు గ్రామాలను ఏకం చేయాలనుకుంటారు. సత్తిబాబు ఇంట్లో భద్ర, రాజాబాబు ఇంట్లో రామ్‌చేరి మంచివాళ్లుగా నటించడం మొదలు పెడతారు. ఎంతో పెద్ద ఫ్యాక్షనిస్టులనైనా, తెలివిగలవాళ్లనైనా అమాయకులనుచేసి ఆడిస్తూ, చివరికి తాము అనుకున్నది సాధించారా? లేదా? అన్నది మిగతా కథ.
గతంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘సీతారాముల కల్యాణం..లంకలో’, ‘బిందాస్’, ‘రెడీ’ చిత్రాలు ఈ చిత్రం చూస్తుంటే నీడల్లా గుర్తొస్తుంటాయి. ఎప్పుడో బావమరుదులు తమ చిన్నప్పుడే కలిసి స్నేహితులుగా తిరిగితే ఈరోజుల్లో ఇంత ఫాస్ట్ కల్చర్‌లోకూడా రామ్, భద్ర ఒకరికొకరు తెలియదనుకోవడం సినిమా కథామాయే! రెండు ఊళ్లమధ్య ఒకే వారధి ఫకీర్‌బాబా (విజయచందర్)ని ఇద్దరు విలన్లు ఆదరించడం విచిత్రం. మొదటి సగమంతా నాయకా నాయికల పోట్లాటలు, తిట్లతో నస పెడుతుంది. హీరోయన్ తన సంగీతం గొప్ప నిరూపించుకోవడానికి ఒక మనిషిని చంపాల్సిన అవసరం ఉందా? దానికి ప్రేక్షకులు నవ్వేంత సీనుందా? సన్నివేశాలను రాసుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా రాసుకోవడమేనా? ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు తోచింది రాసుకుంటూ పోవడమేనా? ప్రేక్షకుడికి ఈ సీను ఎంతవరకు నచ్చుతుంది, ఎంత ఆనందాన్నిస్తుంది? అనేది దర్శకుడు, రచయిత గుర్తెరగాలి. ఇద్దరూ తమ ఊర్ల కలయిక కోసం ప్రేమను త్యాగం చేయాలనుకోవడం ఒక్కటే అంశం ఈ చిత్రంలో ఫర్వాలేదనిపిస్తుంది. అసలు రెండు గ్రామాల మోతుబరుల పిల్లలు ఒకరినేపథ్యం ఒకరికి తెలియకుండా గాలి సుబ్బారావు ఇంట్లో ఎందుకు ఉన్నారన్న విషయంలో స్పష్టత లేదు. మొదటి సగమంతా గోలతో చిత్రాన్ని లాగించడం, ప్రేమించుకోవడానికి అన్నట్లు ఉంటుంది. కథను ఏదో పరుగెత్తించాలని పరిగెత్తినట్టు ఉంటుంది, కానీ అది ఎందుకు అలా జరిగింది? జరుగుతుందన్న ఆలోచన లేకుండా రాసేసుకున్నారు, తీసేసుకున్నారు.
నటనలో ప్రణీత పెద్ద కళ్లతో అందంగా కనిపించింది. తనీష్ ఇంకా పిల్లాడి గెటప్‌లోనే కనిపిస్తున్నాడు. పాత్రకు తగ్గట్టు అతని శరీర కదలికలు మారలేదు. లవర్‌బాయ్ పాత్రలుచేసే అతనికి ఇలాంటి పాత్రలు మొదటి సగం వరకు మాత్రమే సరిపోయంది. ఆహుతిప్రసాద్ బాగా నటించాడు. ‘కంప్యూటర్‌లో కాపురం చేయమన్నట్టు’, ‘రెండూళ్లండవు... రెండు స్మశానాలు మిగులుతాయి’ వంటి మాటలు ఫర్వాలేదు. ‘‘అందం విరిసిన బొమ్మలా...’’ పాట సంగీతపరంగా బాగుంది. ‘‘అమ్మాయే... అబ్బాయే’’ గాయకుని స్వరంగా కొత్తగా వినిపించింది. మిగతా సంగీతం ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఎడిటింగ్, నేపథ్య సంగీతం ఇబ్బంది పెడతాయి. దర్శకుడు ఓ సాదా సీదా చిత్రం స్థాయిలోనే తీశాడు. కొత్తదనమేమీ లేక, హాస్యంపాలు అసలు కనిపించక చిత్రం చూసే వాళ్లకు వేదన, రోదన కలిగించడం ఖాయం
No comments:
Post a Comment