తెలుగు చలనచిత్ర చరిత్రలో వందలాది నిర్మాణ సంస్థలు, వేలాది చిత్రాలను అందించాయి. వాటిలో ప్రథమ పంక్తిలో పేర్కొనదగిన సంస్థ ‘విజయాప్రొడక్షన్స్’. 1908లో తెనాలిలో జన్మించారు చక్రపాణి (ఆలూరి వెంకట సుబ్బారావు). 1912లో కడప జిల్లా పొట్టెంపాడులో జన్మించారు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఈ ఇద్దరిలో చక్రపాణి సాహితీపరంగా ఉద్దండులైతే నాగిరెడ్డి వ్యాపారపరంగా నిష్ణాతులు. ఏ శుభ ముహూర్తంలో వారిరువురూ మిత్రులయ్యారో కానీ ఆ కలయిక ఫలితంగా రూపొందిన అద్భుతాలు ఎన్నో, వాటిల్లో చెప్పుకోదగ్గవి, పలు భాషల్లో ఆబాలగోపాలాన్ని అలరించిన ‘చందమామ’ ‘విజయచిత్ర’ మాసపత్రికలు. చలనచిత్ర నిర్మాణపరంగా ఉదాత్తస్థాయిలో చిత్రాలనందించింది ‘విజయా ప్రొడక్షన్స్’.
ఈ సంస్థ తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సుమారు 40 చిత్రాలు నిర్మించింది. వాటిలో తెలుగులో నిర్మించినవి 14 చిత్రాలు. అవి- షావుకారు (7.4.1950), పాతాళభైరవి (15.3.51), పెళ్లిచేసిచూడు (29.2.52), చంద్రహారం (6.01.54), మిస్సమ్మ (12.01.55), మాయాబజార్ (27.03.57), అప్పుచేసి పప్పుకూడు (14.1.59), జగదేకవీరుని కథ (9.8.61), గుండమ్మకథ (7.6.62), సత్యహరిశ్చంద్ర (22.4.65), సిఐడి (13.9.65), ఉమాచండీ గౌరీశంకరుల కథ (11.1.68), గంగ-మంగ (30.11.73), శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ (20.2.76) ఈ 14 చిత్రాలలో చివరి రెండు రంగులలో నిర్మించగా, మిగతా 12 బ్లాక్ అండ్ వైట్‌లో తీసారు. వాటిలో 8 సాంఘిక, 4 జానపద, 2 పౌరాణిక చిత్రాలు. ఈ చిత్రాల గురించి తెలుసుకునే ముందు వాటి సాంకేతిక వర్గాన్ని ముచ్చటించుకుందాం.
నిర్మాతలు: పై 14 చిత్రాలలో 11 చిత్రాలకు నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలు. అయితే మాయాబజార్ నిర్మాణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని, పొడచూపిన అభిప్రాయభేదాలను పురస్కరించుకుని దర్శకులు కె.వి.రెడ్డి పెట్టిన షరతులకు నాగిరెడ్డి, చక్రపాణి అంగీకరించడంతో 3 చిత్రాలకు (జగదేకవీరుని కథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ’ దర్శక నిర్మాతగా కె.వి.రెడ్డి వ్యవహరించారు.
దర్శకులు: ఈ సంస్థ నిర్మించిన 4 సాంఘిక చిత్రాలకు (షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు) ఎల్.వి.ప్రసాద్, 3 జానపద, 2 పౌరాణిక చిత్రాలకు కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ... కథ). ఒక జానపద, ఒక సాంఘిక చిత్రానికి (చంద్రహారం, గుండమ్మకథ) కమలాకర కామేశ్వరరావు, ఒక సాంఘిక చిత్రానికి పూర్తిగా (సిఐడి) మరో సాంఘిక చిత్రం (గంగ-మంగ) పాక్షికంగానూ, తాపీచాణక్య దర్శకత్వం వహిస్తూ కీర్తిశేషులు కాగా, ‘గంగ-మంగ’ చిత్రాన్ని వి.రామచంద్రరావు దర్శకత్వంలో పూర్తిచేసారు. ఆ సంస్థ నిర్మించిన చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్’కు దర్శకుని పేరు వేయకుండా సంచాలకునిగా చక్రపాణి పేరు, సహకారకునిగా బాపు పేరు వేయటం ఓ ప్రత్యేక విశేషం.
రచనా విభాగం: చక్రపాణి 3 చిత్రాలకు (షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ), పింగళి నాగేంద్రరావు 6 చిత్రాలకు (పాతాళభైరవి, చంద్రహారం, మాయాబజార్, జగదేకవీరునికథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ...కథ), డి.వి.నరసరాజు 3 చిత్రాలకు (గుండమ్మకథ, సిఐడి, గంగ-మంగ), సదాశివబ్రహ్మం ఒక చిత్రానికి (అప్పుచేసి పప్పుకూడు), పాలగుమ్మి పద్మరాజు ఒక చిత్రానికి (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్) సంభాషణలు సమకూర్చారు. తొలి చిత్రం ‘షావుకారు’కు సముద్రాల అన్ని పాటలు రాయగా, మలి చిత్రం పాతాళభైరవి నుంచి 12వ చిత్రం -ఉమాచండీ... వరకు అన్ని చిత్రాలకు అద్భుతమైన గీతాలను సాహితీపరంగా అందించారు పింగళి నాగేంద్రరావు. విజయాసంస్థ అంటే పింగళి, పింగళి అంటే విజయాసంస్థ అన్నంత గొప్పగా ఆయా చిత్రాల్లోని మాటలు, పాటలు నాటికి నేటికి రసజ్ఞ ప్రేక్షకలోకాన్ని అలరించాయి, అలరిస్తున్నాయి. ‘పెళ్లిచేసిచూడు’ చిత్రానికి బాలనటులపై చిత్రీకరించిన రెండు గీతాలను ఊటుకూరి సత్యనారాయణ రాయగా, ‘గంగ-మంగ చిత్రానికి దాశరథి పాటలు రాసారు. చివరి చిత్రం ‘రాజేశ్వరీ.. క్లబ్’కు పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరధి కొసరాజు, గీత సాహిత్యాన్ని అందించారు.
సంగీతం: ఈ విభాగంలో అగ్రతాంబూలం ఘంటసాల మాస్టారుకే దక్కుతుంది. ఆ గానగంధర్వుడు ఏడు చిత్రాలకు (షావుకారు, పాతళభైరవి, పెళ్లిచేసిచూడు, చంద్రహారం, మాయాబజార్, గుండమ్మకథ, సిఐడి). స్వరసామ్రాట్ ఎస్.రాజేశ్వరరావు రెండు చిత్రాలకు (మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు), మధుర స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు 4 చిత్రాలకు (జగదేకవీరుని కథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ..కథ, శ్రీ రాజేశ్వరీ విలాస్...) సంగీతాన్ని సమకూర్చారు. కాగా, రమేష్‌నాయుడు ఒకేఒక చిత్రానికి (గంగ-మంగ) పనిచేసారు.
కళాదర్శకత్వం: ఆ చిత్రం సాంఘికమైనా పౌరాణికమైనా, జానపదమైనా ఆ సన్నివేశానికి, వాతావరణానికి తగ్గట్టు స్కెచెస్ వేసి పాత్రలకు రూపకల్పన చేసిన కళాస్రష్టలు మాధవపెద్ది గోఖలే, కళాధర్. వీరు తొలిచిత్రం ‘షావుకారు నుంచి 12వ చిత్రం ‘ఉమాచండీ.. కథ’ వరకు విజయా ఆస్థానంలో కళాదర్శకత్వం నిర్వహించారు. చివరి రెండు చిత్రాలకు ఆ బాధ్యతను ఎస్.కృష్ణారావు స్వీకరించారు.
ఛాయాగ్రణం: విజయవారి చిత్రాలంటే పరవశింపచేసే ప్రకృతి, కనువిందుచేసే అందాల చందమామ, అబ్బురపరచే రాజభవనాలు, భయోత్పాతాన్ని కలిగించే మాంత్రికుని గుహ, నాయికా నాయకుల వనవిహారం, నౌకా విహారం, ఊగే తూగే పూతీవెల సంచలనం, వీటన్నిటిని ‘షావుకారునుంచి గుండమ్మ కథ’వరకూ తెరపై అద్భుతంగా చిత్రీకరించిన ఛాయాగ్రాహకుడు ‘మార్కస్ బారట్లే’ ఆ తర్వాత ‘మాధవ్ బుల్‌బులే’ రెండు చిత్రాలకు (సిఐడి, ఉమచండీ) కమల్‌ఘోష్ (సత్యహరిశ్చంద్ర), మాధవరెడ్డి (గంగ-మంగ), సుందరంబాబు (శ్రీ.రా.కా.క్లబ్) తలా ఒక చిత్రానికి పనిచేసారు.
విజయ చిత్రాల కథలను సంక్షిప్తంగా...
షావుకారు: ఇది ఇరుగుపొరుగు కుటుంబాల కథ. ఒకరి బిడ్డను తను కొడితే తన బిడ్డను దేవుడు కొట్టాడని సామెతకు ప్రతిరూపం ఈ చిత్రం. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ చిత్రం నాయకుడిగా ఎన్.టి.రామారావుకు, నాయికగా జానకికి తొలి చిత్రం.
పాతాళభైరవి: ఈ చిత్రం విజయా సంస్థ భవిష్యత్తుకు, నటులుగా ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసింది. ‘్ధర్యే సాహసే లక్ష్మీ’ అంటూ సామాన్యుడైన తోటరాముడు ఉజ్జయిని రాకుమారిని ప్రేమించడం, నేపాళ మాంత్రికుని చెరలో చిక్కిన రాకుమారిని రక్షించి, మాంత్రికుని రెండోసారి సంహరించడం ప్రధానాంశం.
పెళ్లిచేసిచూడు: వరకట్న సమస్యను హాస్యంతో రంగరించి తీసిన ఈ చిత్రంలో బాల పాత్రలకు (మాస్టర్ కుందు, బేబి గిరిజ, కందామోహన్) ప్రాధాన్యమివ్వడం చెప్పుకోదగ్గ అంశం. నాయకుడు ఎన్.టి.ఆర్, నాయిక జి.వరలక్ష్మి, జోగారావు కలిసి నాటకమాడి కట్నంకోసం వెంపర్లాడిన వెంకటపతికి (డా. శివరామకృష్ణయ్య) కనువిప్పు కలిగించడం ప్రధానాంశం.
చంద్రహారం: వరప్రసాదియైన చందనరాజు ప్రాణాలను దేవకన్య చంచల హరించటం, నాయిక గౌరి తన పాతివ్రత్య మహిమచే అతన్ని బ్రతికించుకోవటం కథాంశం.
మిస్సమ్మ: నిరుద్యోగ సమస్య ప్రధాన ఇతివృత్తం. పెళ్లికాని ఇద్దరు నిరుద్యోగులు బ్రతుకుతెరువుకోసం అవసరార్ధం దంపతులుగా నటించడం ఫలితంగా చిక్కుల్లో పడటం. చివరకు చిక్కుముడి విడిపోయి వారు దంపతులవటంతో కథ సుఖాంతం.
మాయాబజార్: తెలుగువారు గర్వించే ఈ చిత్రం గురించి ఎనె్నన్నో విశే్లషణాత్మక వ్యాసాలు వచ్చాయి. కాబట్టి దానిగురించి ముచ్చటించడం కంటే రంగుల్లో రూపొంది ప్రదర్శింపబడుతున్న ఆ చిత్రాన్ని చూసి అందుకు కారకుడైన క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్‌మోహన్‌ను, ఆ సంస్థ ‘గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్’ను విడుదలచేసిన సూపర్‌గుడ్ ఫిలింస్‌ను మనసారా అభినందించడం మన కర్తవ్యం.
అప్పుచేసిపప్పుకూడు: అప్పుచేయటం ఓ కళ. దాన్ని ఎగవేత అంతకుమించిన కళ అనే ప్రాతిపదికన రూపొందిన ఈ కథలో దర్శకులు ఎల్.వి.ప్రసాద్ అన్ని ప్రధాన పాత్రలను సన్యాసులుగా చూపడం ఓ స్పెషాలిటీ.
జగదేకవీరుని కథ: రాకుమారుడు ప్రతాప్ నాలుగు లోకాలకు చెందిన నలుగురు కథానాయికలను ప్రేమించి వివాహమాడిన వంచకులను శిక్షించడం మూలకథ. బి.సరోజాదేవి గ్లామర్ విలక్షణ భాషోచ్చారణ చిత్ర విజయానికి దోహదం చేసింది.
గుండమ్మకథ: షేక్‌స్పియర్ నాటకం (టేమింగ్ ఆఫ్ ది షూ) కథలోని ప్రధాన అంశాన్ని తీసుకొని రూపొందించిన ఈ చిత్రం చిత్రకథ, గీతాలు అందరికీ సుపరిచితమే. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, ఎస్.వి.ఆర్, సావిత్రి, జమున, సూర్యకాంతం, ఛాయాదేవి, యల్.విజయలక్ష్మి, హరనాథ్, రమణారెడ్డి, రాజనాల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంలో పాత్రల్నిబట్టి నటులా నటుల్నిబట్టి పాత్రలా అనేది విజ్ఞులైన ప్రేక్షకులకు ఒక పజిల్. సూర్యకాంతం పాత్రపరంగా టైటిల్ నిర్ణయించడం విశేషం.
సత్యహరిశ్చంద్ర: భారతీయ భాషల్లో 20సార్లు రూపొందిన ఈ చిత్రకథ అందరికీ సుపరిచితమే. కారణాలు ఏమైనా ఈ చిత్రం ప్రజాదరణకు నోచుకోలేదు.
సిఐడి: ఒక తమిళ చిత్రం ఆధారంగా తయారైన ఈ చిత్రంలో తండ్రి చలపతి (గుమ్మడి) సంఘవిద్రోహి. అతని కుమారుడు బాధ్యతగల ఇన్స్‌పెక్టర్ (రామారావు) ఈ రెండు పాత్రల నడుమ డ్రామా, మధ్యలో గ్లామరస్ కథానాయిక జమున అయినా విజయం అంతంతమాత్రమే.
ఉమాచండీ గౌరీశంకరుల కథ: నాయిక త్రిపాత్రభినయంతో రూపొందిన ఈ చిత్రానికి ముగ్గురు మహామహులు (కె.వి.రెడ్డి, పింగళి, సింగీతం శ్రీనివాసరావు) స్క్రీన్‌ప్లే వ్రాసినా ఫలప్రాప్తి దక్కలేదు.
గంగ-మంగ: ఈ చిత్రం తాలూకు విశేషమేమంటే నరసరాజు రాసిన ‘రాముడు-్భముడు’ చిత్రాన్ని హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా తీసారు. కథలోని హీరో ద్విపాత్రాభినయాన్ని హీరోయిన్‌పరంగా మార్చి ‘సీతా ఔర్ గీతా’ పేరుతో హిందీలో జి.పి.సిప్పి నిర్మించారు. అది సూపర్ హిట్ కావడంతో దాన్ని తెలుగులో వాణిశ్రీ ద్విపాత్రాభినయంతో కృష్ణ, శోభన్‌బాబు హీరోలుగా నిర్మించిన ఈ చిత్రం కూడా సో అనిపించింది.
శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్: మతాలకన్నా మానవత్వం విలువైనది. ఇది ప్రేమకు కూడా వర్తిస్తుంది. ఈ ప్రాతిపదికతో రూపొందిన ఈ చిత్రానికి చక్రపాణి సంచాలకునిగా వ్యవహరించగా బాపు సహకరించారు. నిర్మాణ దశలో చక్రపాణి మరణించగా, వారి స్మృతికి ఈ చిత్రాన్ని అంకితమిచ్చారు.
చరిత్రలోకాని, సినిమా చరిత్రలోకాని, వ్యక్తికికాని, వ్యవస్థకుకాని ఉత్తాన పతనాలు తప్పనిసరి. విజయావారి పతాకంలో ఆంజనేయుడు రెపరెపలాడుతుంటాడు. దానిపై క్రియా సిద్ధిఃసత్త్వేభవతి’ అన్న సంస్కృత పదాలు కనిపిస్తాయి. దీని భావాన్ని విజయా సంస్థకు అన్వయించుకుంటే, స్వభావసిద్ధమైన సత్తువ కథలోను, కథనంలోనూ పట్టు బిగువు వున్నవారి చిత్రాలను ప్రజలు ఆదరించారు, అందలమెక్కించారు. అవి కొరవడిన చిత్రాలను తిరస్కరించారు. ఏమైనా ఆ సంస్థ అందించిన ఆణిముత్యాలు వాటికి రూపకల్పన చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సదా స్మరణీయులు. ఈ వజ్రోత్సవ సందర్భంగా ఆ మహామహులను స్మరిస్తూ విజయ, వైభవ ప్రాభవాలను ప్రతీకగా రూపొందిన రంగుల హరివిల్లు ‘మాయాబజార్’ను చూసి మధురానుభూతుల్ని నెమరువేసుకుందాం. ఆ కళాస్రష్టలకు నివాళులర్పిద్దాం
No comments:
Post a Comment