వాల్ట్‌డిస్నీ కార్టూన్ ఫీచర్ ఫిల్మ్‌ల్లో టామ్ అండ్ జెర్రీకి వున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. అటు పిల్లల్లోనూ, ఇటు పెద్దల్లోనూ కూడా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే, ఎటువంటి మాటలు లేకుండా అలరిస్తాయా చిన్ని సినిమాలు. దీనికి కారణం చాలా సింపుల్. ఒక బలమైన క్యారెక్టర్, ఒక తెలివైన క్యారెక్టర్ మధ్య జరిగే యుద్ధం నుంచి పుట్టే హాస్యం జనానికి నచ్చడమే. పిల్లికి చెలగాటం..ఎలక్కి ప్రాణసంకటం అన్న సామెతకు, చూసేవారికి ఆనందం కూడా అని కలపాలన్నమాట. ఇటువంటి థీమ్‌తో 1923లో ‘అవర్ హాస్పిటాలిటీ’ అన్న మూకీ సినిమా వచ్చింది. ఎదుటివాడి కథలు నిస్సంకోచంగా కొట్టేసి, ‘కిచెన్ క్యాబినెట్’లో ఎవరో ఒకరి పేరు తగిలిస్తారని, మగధీర సమయంలోనే విమర్శలు ఎదుర్కొన్న రాజవౌళి అండ్ కో..ఇప్పుడు ఆ ‘అవర్ హాస్పిటాలిటీ’ సినిమాను సరాసరి తెలుగులో ‘మర్యాదరామన్న’గా అందించారు. పైగా సినిమాకు ముందు ఆ కథను సగర్వంగా వెల్లడి చేయడం, ఎస్.ఎస్.కాంచి చెప్పిన ఆ లైన్ అద్భుతంగా నచ్చి తీసాననడం, ఐమాక్స్ ప్రసాద్ బంధువు చెప్పిన విషయాల ఆధారంగా కథకు మెరుగులు దిద్ధామనడం లాంటి ప్రివ్యూ ‘షో’లు అనేకం రన్ చేసారు. ఎవరెన్ని చెప్పినా ఇది మాత్రం..పక్కా ‘అవర్ హాస్పిటాలిటీ’ కథే.
ఫ్యాక్షనిజం కారణంగా భర్తను పోగొట్టుకున్న ఓ మహిళ తన కుమారుడిని తీసుకుని రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చి, అతడిని పెంచి పెద్ద చేస్తుంది. ఆ కుర్రాడు రాము (సునీల్) సరైన ఆర్ధికస్తోమత లేక ఇబ్బంది పడుతున్న సమయంలో తనకు రాయలసీమలో అయిదు ఎకరాల పొలం వుందన్న సంగతి తెలుస్తుంది. దాంతో అది అమ్మి, ట్రాలీఆటోని కొనుక్కుందామని అక్కడికి బయలుదేరుతాడు. రైల్లో అపర్ణ అనే అమ్మాయి (సలోని) పరిచయం అవుతుంది. తన తండ్రికి ఎవరితోనైతే శతృత్వం వుందో, అతడి ఇంటికే వెళ్లడం, ఆ అమ్మాయి ఇల్లూ అదే కావడం మొదటి ట్విస్ట్. వచ్చిన వాడు శతృవు అని తెలిసిన రామినీడు (నాగినీడు), అతని కుమారులు, రామును చంపాలని అనుకుంటారు. కానీ రామినీడు తన ఇంట్లో రక్తం చిందడం ఇష్టంలేదని, గుమ్మం దాటగానే చంపుదామని అంటాడు. అక్కడి నుంచి మొదలవుతుంది టామ్ అండ్ జెర్రీ స్టోరీ. ఇంట్లోనే వుండాలని ఇతడు, అతడిని ఎలాగైనా గుమ్మం దాటించి, చంపాలని వీళ్లు పనే్న వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, చివరకి ఏం జరిగిందన్నది కథ.
సరే.., కథ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారన్న విషయం పక్కన పెడితే, ఇటువంటి చిన్న లైన్‌కు స్క్రీన్‌ప్లే ముఖ్యం. దాన్ని మూడు వంతుల వరకు రాజవౌళి బాగానే తయారుచేసుకున్నాడు. అందుకు తగ్గట్లు సపోర్టింగ్‌గా సలోని, బ్రహ్మాజీ, అతని తల్లితండ్రుల క్యారెక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. సినిమా మొదటి సగం స్క్రిప్ట్ ఫెర్‌ఫెక్ట్‌గా వుంది. రెండో సగంలో మొదటి సగం కూడా ఫరవాలేదు. కానీ ఆ తరువాత మాత్రం కొంచెం బోర్ కొడుతుంది. పైగా చివరలో సీన్‌కు కాస్త ఎమోషన్ తీసుకురావడం కోసం నేపథ్యంలో, శబ్ధాలు ఎక్కువ చేయడం కూడా ఇబ్బందిగా తయారైంది. కానీ మొదటి మూడు భాగాలు ఇచ్చిన ఊపుతో చివరి భాగం కూడా తోసుకువెళ్లింది. రాజవౌళి టేకింగ్ కొన్ని చోట్ల కొత్తగా వున్నా కొన్ని చోట్ల పాత టేకింగ్‌లు గుర్తుకు వచ్చాయి. ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాల్లో, హీరో పరిచయ సన్నివేశంలో. టెక్నాలజీని చిన్న సినిమాలకు కూడా వాడుకోవడం బాగుంది. మిణుగురుల సన్నివేశం, పాటల్లో సునీల్‌ను రెండుగా చూపించి, విభిన్న నృత్యాలు చేయించడం బాగుంది. పాటలు బాగున్నాయి. నేపథ్యంలో వాయిద్యాలతో పాటు, మాటల్ని కూడా వాడే కొత్త పద్ధతి మెచ్చుకోతగ్గది. ఫొటోగ్రఫీ నీట్‌గా వుంది. రామినీడు ఇంటిసెట్ డిజైనింగ్ కూడా అభినందించతగ్గది. కాంచి డైలగుల్లో రాయలసీమ డైలక్ట్ బాగుంది. కొన్ని సంభాషణలు మరీ కావాలని ఇరికించినట్లు వున్నాయి. అది కొత్త నటుడు నాగినీడు పలకడంలో తేడా వల్లకూడా కావచ్చు.
ఇక నటీనటుల్లో సలోని మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆ అమ్మాయి కళ్లలో మంచి స్పార్క్ వుంది. ఆ అమ్మాయి చిత్రమైన క్యారెక్టరైజేషన్ కూడా వెరైటీగా వుంది. బహుశా ఇటువంటి క్యారెక్టరైజేషన్ ఇదే మొదటిదేమో. ఈ క్యారెక్టర్‌తో బ్రహ్మాజీని జతకలిపి, రొమాంటిక్ కామెడీ డ్రా చేసిన రాజవౌళిని మెచ్చుకోవచ్చు. సునీల్ బాగా అండర్‌ప్లే చేసి ఆకట్టుకున్నాడు. డ్యాన్సుల్లో చాలా మంది యువహీరోల కన్నా బాగా చేసాడు. కొత్తనటుడు నాగినీడు ఆహార్యం ఓకె కానీ, డైలాగులు చెప్పిన తీరు కొన్ని చోట్ల కృతకంగా వుంది. కాంచి కనిపించిన కొద్దిసేపూ గోలగా వుంది. నటుడు రవితేజ సైకిల్‌కు చెప్పిన డబ్బింగ్ ఓకె.
కొసమెరుపు ఏమిటంటే, ఎవరికి తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా పట్నం వచ్చి, బతికిన హీరో తల్లి చిరునామా, బద్ధశతృవుకు తెలియదు కానీ, ఎమ్మార్వో ఆఫీసువాళ్లకి తెలియ డం. ఆ సంగతి తెలిసుంటే విలన్ ఎప్పుడో వచ్చి పగతీర్చుకుంటాడు కదా?
No comments:
Post a Comment