Saturday, December 18, 2010

అసలు... చం... ద్ర... ము...ఖి...కథేంటి?

1984-85 మధ్యలో... తిరువనంతపురం... కేరళ.
రూమ్‌లో పడుకుని నిద్రపోతున్నాడు మధు ముట్టమ్. అతను మలయాళ సినీ రచయిత. ఏడాది కిందట అతని మొదటి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు రెండో సినిమా కోసం కథ ఆలోచిస్తున్నాడు. ఎలాంటి కథ రాయాలి? అదెంత కొత్తగా ఉండాలి? ఆలోచిస్తూ భోజనం చేస్తున్నాడు, ఆలోచిస్తూ నడుస్తున్నాడు, ఆలోచిస్తూ పడుకుంటున్నారు. కొద్దికాలంగా అతనికి ఇదే ఆలోచన. ఆ రోజు కూడా ఆలోచిస్తూనే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ... హఠాత్తుగా... కలలాగా... అతనికి ఏదో ఫ్లాష్ అయింది.
దెయ్యం!
ఓ భూత్‌బంగ్లా... అందులో నాగవల్లి అనే దెయ్యం ఉందని అందరికీ భయం. ఒకప్పుడు అది రాజమహల్. ఇప్పుడు దాన్ని ఒక వ్యక్తి కొంటాడు. అతని భార్య గంగ. నాగవల్లి దెయ్యం ఆమెను పట్టుకుంటుంది. అప్పటి నుంచి ఇంట్లో అన్నీ విపరీతాలు జరుగుతుంటాయి. దెయ్యం పట్టిన గంగ తన భర్తనే చంపాలనుకుంటుంది. కాని భర్త ఫ్రెండు ఓ సైకియాట్రిస్ట్. అతనే హీరో. దెయ్యాన్ని పాతకాలం పద్ధతుల్లో వదలించడం పాత కథ. కాని దెయ్యం అనేది మానసికమైన బలహీనత... ముందు మనలోని భయాల్ని వదిలించుకుంటే ఎలాంటి దెయ్యాలు పట్టవు. కాబట్టి గంగకు సైకలాజికల్ ట్రీట్‌మెంట్ ఇస్తాడు హీరో. అదెలా జరిగింది?
ఠక్కున లేచాడు మధు. వెంటనే తనకు వచ్చిన ఐడియాని కాగితం మీద పెట్టేశాడు. అతనికి ఇప్పుడు లీలగా ఓ సినిమా మనస్సులోనే కనిపిస్తోంది. మరు ఉదయాన్నే అతను ఫాజిల్ ముందు నిలబడ్డాడు.
మలయాళంలో టాప్ డెరైక్టర్ ఫాజిల్. ఒక్క కేరళలో కాదు, దేశంలోనే టాప్ డెరైక్టర్స్‌లో ఒకడిగా ఫాజిల్‌కి గౌరవం ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో ఓ కాగితం ఉంది. అందులో రైటర్ మధు ముట్టమ్ రాసిన కథ చదువుతున్నాడు ఫాజిల్.
‘‘లైన్ బాగానే ఉంది. దీన్ని డెవలప్ చేసి చూపించు...’’ అన్నారు ఫాజిల్.
క్రియేటివిటి ఉన్న వ్యక్తి ఉత్సాహానికి ఎంత ప్రోత్సాహం ఉంటే అంత హుషారుగా ఉంటాడు.
ఫాజిల్ రెస్పాన్స్ మధులో నీరసం నింపింది. బాగానే ఉందన్నారు కాని ఎగ్జయిట్ కాలేదు. దాంతో మధు ముట్టమ్ ఆ కథను పక్కన పెట్టేశాడు. నాగవల్లి దెయ్యం... ఆ కాగితంలోనే ఉండిపోయింది. ఆ కాగితం ఎక్కడో మూలన పడిపోయింది.

******
మూడు నాలుగేళ్లు గడిచిపోయాయి. దర్శకుడు ఫాజిల్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. రైటర్ మధు ఏవో కథల మీద పనిచేస్తున్నాడు. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఓ రోజు ఫాజిల్ ఏదో ఫైలు కోసం వెతుకుతున్నారు. ఎక్కడో మూలన ఉంది రైటర్ మధు ఇచ్చిన నాగవల్లి కథ. ఆ కాగితం ఇప్పుడు రెపరెపలాడుతోంది... ఆయన దృష్టిలో పడేందుకేనా?
అన్ని ఫైల్సూ, కాగితాలూ తీసి చూస్తున్నారు ఫాజిల్. చివరికి ఈ కాగితం కూడా ఆయన కంటపడింది. తీసి చదివారు. ఇది మధు ముట్టమ్ రాసిన కథ... బాగుందే! అనుకున్నారు ఫాజిల్.
రొటీన్ సినిమాలు తీసి బోరు కొట్టినప్పుడు ఇలాంటి కథలు నచ్చుతాయి. విచిత్రంగా ఈ కథలో నాగవల్లి అనే దెయ్యం భయపెట్టడం లేదు, ప్రేమించేలా ఉంది. దెయ్యం అనే భయానికి సైకలాజికల్ ట్రీట్‌మెంట్. ఇందులో మెసేజ్ ఉంది. ఫాజిల్ మరి ఆలస్యం చేయలేదు. వెంటనే మధుకి కబురు పెట్టారు. కొద్దిరోజులు ఇద్దరూ కలిసి కథ వండేశారు. తర్వాత దాన్నే సినిమాగా తీశారు. అదే - మణిచిత్రతళు. అంటే నగిషీలు చెక్కిన తలుపు గడియ. అది ఓపెన్ చేస్తేనే కదా... అసలు కథంతా మొదలవుతుంది.
మలయాళం సినిమా సూపర్‌స్టార్స్ మోహన్‌లాల్, సురేశ్ గోపి హీరోలు. నాగవల్లి ఆవహించే గంగ పాత్రలో శోభన. అసలే గొప్ప క్లాసికల్ డ్యాన్సర్ శోభన. ఆ పాత్రలో చెలరేగిపోయింది. 1993 రిలీజ్ అయింది మణిచిత్రతళు. సూపర్‌హిట్. శోభనకు ఆ సంవత్సరం ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ప్రకటించారు.

Sunday, December 12, 2010

ఆ ఒక్కటీ అడక్కు - మనీ

ఇంకొక బాపతు వాళ్లు ఉంటారు. వీళ్లకు డబ్బు సంపాదించే సకల శక్తియుక్తులూ ఉంటాయి. అయినప్పటికీ సంపాదించరు. లక్ష్మీదేవి ఉన్నపళంగా వచ్చి వొడిలో కూర్చోవాలని కలలు గంటారు. లక్కు రావాలంటారు. జాతకాలను నమ్ముకుంటారు. అలాంటివాడే అటుకుల చిట్టిబాబు.
పనిని దైవంగా భావించి కష్టపడి పైకొచ్చిన రొయ్యల నాయుడు కూతురు రంభ అటుకుల చిట్టిబాబుని ప్రేమిస్తుంది. చిట్టిబాబుకు జాతకాల పిచ్చి. ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు కింగ్ అయిపోతావని ఎవరో జ్యోతిషుడు చెప్పడంతో అదే నిజం అని నమ్మి ఏ పనీ చేయకుండానే తనకు రాబోయే రాజయోగం గురించి కలలు కంటూ కాలక్షేపం చేస్తుంటాడు. ఇతనిలో తెలివి ఉంది కాని దానిని వాడటం లేదు అని గ్రహించిన రొయ్యలనాయుడు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి లక్ష ఎదురుకట్నం అడుగుతాడు. పెళ్ళి అయ్యాక ఆ లక్ష ఇస్తేనే శోభనం అని అడ్డు నిలుస్తాడు. చిట్టిబాబు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాలన్నీ అతనికే ఎదురు తగులుతాయి. చివరకు తల్లి, చెల్లెలు కూడా అవమానాల పాలై, చిట్టిబాబుని ఈసడించుకోవడంతో బుద్ధి తెచ్చుకుని తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి లక్ష రూపాయలు సంపాదిస్తాడు. చెల్లెలి పెళ్లి చేయించి, తన కాపురాన్ని నిలబెట్టుకుంటాడు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా కథ ఇది!
కొంతమందికి అవమానమే అచ్చుయంత్రం. ఆ అవమానం అయ్యాకే ఆ అచ్చుయంత్రం నుంచి నోట్ల కట్టలు పుట్టుకొస్తాయి.
గారడీలను మించిన గారడీ... ఇంద్రజాలాన్ని మించిన మాయాజాలం... డబ్బు. ఈ డబ్బు కళ్లజోడు పెట్టుకుని చూస్తే లోకమంతా ‘పచ్చ’గా, వెచ్చగా, తియ్యగా కనిపిస్తుంది. ‘మనీ’ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు అందుకే. మనీ మేక్స్ మెనీ ఫేసెస్ కూడా.
మనీ సినిమాయే చూడండి. ఇద్దరు హీరోలు... జె.డి. చక్రవర్తి, చిన్నా. ఇద్దరికీ ఆస్తిపాస్తులు లేవు. బిర్యానీ కాదు కదా, ప్లేటు మీల్స్‌కే వెతుకులాట. ఇంటద్దె కట్టలేక దొంగచాటుగా రూమ్‌లోకి అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి. ఉద్యోగాల వేటలో తిరిగి తిరిగి అలసిపోయిన వీరిద్దరికీ పక్కింటి ఆంటీ జయసుధ ‘మహాలక్ష్మి’లాగా కనిపిస్తుంది. ఆమె నడుస్తుంటే కోటి రూపాయల బ్యాంక్ లాకర్‌లా అనిపిస్తుంది. బాగా డబ్బున్న ఆమెను కిడ్నాప్ చేస్తే తమ కథ సుఖాంతం అవుతుందని జేడీ, చిన్నా ప్లాన్ చేస్తారు. మొత్తానికి కిడ్నాప్ చేస్తారు. మరో వైపు జయసుధ భర్త పరేశ్ రావెల్ ఎలాగైనా ఆమెను అడ్డు తప్పించి మొత్తం ఆస్తంతా సొంతం చేసుకోవాలని ప్లాను.
డబ్బు... మనుషుల్ని ఎలా మార్చివేస్తుందో కొత్తగా చూపించిన సినిమా మనీ. చేసిన తప్పును

డబ్బు

మనిషి బతకడానికి తిండి కావాలి. నీళ్లు కావాలి. ఇల్లు కావాలి. బట్ట కావాలి. ఇంకా చదువుకీ, తిరుగుడికీ, పెట్రోల్‌కీ, సరదాలకీ, సంతోషాలకీ, మిఠాయిలకీ, పెళ్లిళ్లకీ, పండుగలకీ... ఒక్కటని కాదు, ఈ భూప్రపంచం మీద మనిషి అడుగు తీసి అడుగు వేయాలంటే... కావలసింది డబ్బు.
డబ్బు ఉంటేనే మనిషికి బతుకు.
డబ్బు ఉంటేనే మనిషికి విలువ.
డబ్బు ఉంటేనే మనిషికి పవర్.
ఒక్క మాటలో చెప్పాలంటే...
డబ్బే మనిషిని ఛార్జ్ చేస్తుంది. డబ్బు సంపాదించినప్పుడే మనిషి రీఛార్జ్ అవుతాడు.

*****
సుమారు యాభై ఏళ్ల కిందట... ముంబైలోని ఓ రద్దీ రోడ్డులో... చెట్టు కింద చిన్న టీ కొట్టు. అక్కడే చాయ్ అమ్మేవాడొక సేఠు. దారినపోతూ టీ తాగడానికి ఆగేవాళ్లతో చెలాకీగా కబుర్లు చెబుతూ వాళ్లను హుషారెత్తిస్తూ చాయ్ అమ్మేవాడు. అలా అతని దగ్గర టీ తాగేవారిలో ఒక వ్యక్తి మాత్రం రోజూ వచ్చేవాడు. నెత్తిన బట్టల మూట పెట్టుకుని, ఒక్కోసారి నడి మధ్యాహ్నం వేళ నడుచుకుంటూ, ఒక్కోసారి సైకిల్ తొక్కుకుంటూ ఆ టీ కొట్టు దగ్గరే ఆగేవాడు. ఆ కుర్రాడి అవస్థ చూసి సేఠు జాలిపడి ఫ్రీగా చాయ్ ఇచ్చేవాడు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఉన్న ఆ కుర్రాడికి చాయ్ కాదు సాంత్వన. సాటి మనిషి తన కష్టాన్ని గుర్తించడమే గొప్ప ఊరట. ఆ గుర్తింపు కోసమే వచ్చేవాడు ఆ కురవ్రాడు. క్రమంగా అలా కొన్నాళ్లు వచ్చి... ఆ తర్వాత అటుగా రావడం మానేశాడు. ఆ చిన్న టీ కొట్టును చూసుకుంటూ సేఠు అలాగే ఉండిపోయాడు. ఓ రోజు ఓ ఖరీదైన కారు ఆ కొట్టు ముందు ఆగింది. అందులోంచి దిగాడు ఓ ఖరీదైన పెద్దమనిషి. నేరుగా సేఠు దగ్గరకు వచ్చి చాయ్ ఇమ్మని అడిగాడు. దగ్గరగా చూసి అప్పుడు గుర్తుపట్టాడా సేఠ్ - అతను గతంలో తన దగ్గర టీ తాగిన కురవ్రాడు. ఇప్పుడు పెద్దవాడయిపోయాడు. ధనికుడయ్యాడు. అయినా తనను మర్చిపోలేదు అతడు. గతంలో తాను ఫ్రీగా చాయ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా... అతను అదే స్థలంలో కొత్త టీ స్టాల్‌ని పెట్టుకోడానికి బోలెడంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడక్కడ ఓ పెద్ద టీ కార్నర్ వెలిసింది.
ఆ ధనికుడు - ధీరూభాయ్ అంబానీ.
కనుక ఇవాళ లేనివాడు కదా అని చులకనగా చూడకూడదు. ఏమో.. ఎవరు చూడొచ్చారు.. రేపెపుడైనా అతడికి జాక్‌పాట్ తగుల వచ్చు. లక్షలు వచ్చి పడవచ్చు. అతడు పడవలాంటి కారులో వచ్చి ఉంచు అని ఒక సూట్‌కేస్ మనకు యివ్వొచ్చు. బీ కేర్‌ఫుల్.

‘క్షణక్షణం’

డబ్బు చేతికి అందలేదే అనుకోవడం వల్ల వచ్చిన బాధ కంటే చేతికి అందిన డబ్బు చేజారితే వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.
‘క్షణక్షణం’లో పరేశ్‌రావెల్ ఎంతో ప్లాన్ చేసి బ్యాంకును కొల్లగొట్టాడు. కోటి రూపాయలు వచ్చాయి. కాని అవి వచ్చినంత సేపటిలో మాయమయ్యి హీరో హీరోయిన్‌లకు దొరికాయి. ఇక అక్కడి నుంచి సాగే వేట చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కామెడీగా ఉంటుంది.
‘నేను వందరూపాయలకు కూడా మర్డర్ చేసిన సందర్భాలున్నాయి’ అంటాడు పరేశ్‌రావెల్. అలాంటి వ్యక్తి కోటిరూపాయల కోసం ఎంతకైనా తెగిస్తాడు.
కోటి- కొండమీది కోతినైనా తెచ్చుకోవచ్చు.
ఐదు నక్షత్రాల పూటకూళ్ల ఇంట్లో దిగొచ్చు. సొంతవిమానం మాట్లాడుకొని ఆకాశంలో షికారు చేయవచ్చు.
ఇన్ని డబ్బు ఇస్తుంది కాబట్టే అదంటే అంత వెర్రి.
ఆ వెర్రిలో పడి మనిషితనాన్ని మర్చిపోకూడదు కదా. అదే మనం గుర్తు పెట్టుకోవాల్సిన నీతి.

ప్రేమపావురాలు -నువ్వొస్తానంటే నేనొద్దంటానా-మొఘల్-ఏ-ఆజమ్

ఇక ప్రేమకథలలో డబ్బు పాత్రకు కొదవే లేదు. డబ్బున్న అమ్మాయి - పేద అబ్బాయి, కుబేరుడైన అబ్బాయి - పేద అమ్మాయి ఈ కథలు నిన్న నేడు రేపు ఎల్లుండి కూడా ఉంటాయి. ప్రేమపావురాలు సినిమాలో సల్మాన్‌ఖాన్ చాలా పేదింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని అతడు ఐశ్వర్యవంతుడి కొడుకు. కష్టం తెలియనివాడు. సొంతంగా సంపాదించడం తెలియనివాడు. అందుకే అమ్మాయి తండ్రి ‘నెల రోజుల్లో రెండు వేలు సంపాదించి చూపించు, అప్పుడు నా కూతురిని యిచ్చి పెళ్లి చేస్తాను’ అంటాడు. సల్మాన్‌ఖాన్ ఆ రెండు వేలు సంపాదిస్తాడు. ప్రియురాలి పాటనే ఓదార్పుగా చేసుకొని కష్టపడి సంపాదిస్తాడు. దీనికి దగ్గరి కథే నువ్వొస్తానంటే నేనొద్దంటానా. అందులో హీరో డబ్బుసంపాదించి చూపిస్తే ఇందులో హీరో వ్యవసాయం చేసి చూపిస్తాడు.
ఇరువర్గాలు సమానంగా ఉంటే ప్రేమకథల్లో మజా లేదు. అనార్కలీ ఇంకో దేశపు రాకుమారి అయ్యుంటే మొఘల్-ఏ-ఆజమ్ కథే లేదు.
ఎవరికో ఒకరికి ఎక్కువో తక్కువో ఉండాలి. నడిమధ్యన డబ్బు ఒక ఆట ఆడాలి.
అదే అసలైన కిక్కు.

రాబిన్‌హుడ్-జెంటిల్‌మెన్-కిక్-శివాజీ

ఏకాలంలో అయినా డబ్బుకు లైను వేసి దానిని ఎత్తుకెళ్లేవాడు ఉంటాడు లోకంలో. అలాంటివాణ్ణి రాబిన్‌హుడ్ అంటారు. డబ్బున్నవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెట్టే రాబిన్‌హుడ్‌కు ప్రజలలో ఎప్పటికీ తరగని క్రేజ్. జెంటిల్‌మెన్‌లో అర్జున్ చేసింది అదే. పెద్దపెద్దవాళ్ల డబ్బును దొంగిలించి పేదవాళ్ల కోసం యూనివర్సిటీని కట్టాడు అర్జున్. తాజాగా ‘కిక్’ సినిమాలో రవితేజా చేసింది కూడా అదే. బడాబాబుల జేబుకొట్టి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే పేదపిల్లల కోసం హాస్పిటల్ కట్టిస్తాడతడు. ఇక శివాజీ అయితే ప్రతి ఊరినీ స్వర్గం చేయడానికి ఏకంగా దేశంలోని నల్లధనం మీదే దండెత్తాడు.
అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేసి 250 కోట్ల రూపాయల మొత్తంతో మన దేశంలో పెద్ద మెడికల్ కాలేజీ కట్టాలనే ఆశయంతో వస్తాడు శివాజి. తద్వారా పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలని కలలు కంటాడు. కాని కాలేజీలు పెట్టి విద్యను వ్యాపారంగా చూసే ఆదిశేషుకు అది నచ్చదు. అందుకని శివాజీ ప్రయత్నాలకు అడ్డుపడుతుంటాడు. తన పలుకుబడిని ఉపయోగించి శివాజీ కట్టిస్తున్న కాలేజీకి పర్మిషన్లు రద్దు చేయించి, దాన్ని నేల కూల్చివేయిస్తాడు. శివాజీని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తాడు. అయినా శివాజీ భయపడడు. గుంపులు గుంపులుగా ఉండే ఇలాంటి విలన్‌లపై సింహంలా సింగిల్‌గా కలబడతాడు. మూటలు మూటలుగా పేరుకొని ఉన్న నల్ల డబ్బును వెలికి తీయిస్తాడు.

శుభలగ్నం

డబ్బు ఒక్కోసారి కళ్లకు గంతలు కట్టొచ్చు. అప్పుడు మెడలో ఉన్న మాంగల్యం కూడా కనిపించకపోవచ్చు. కనుక డబ్బును ఒక కంట కాదు రెండు కళ్లతోనూ కనిపెడుతూ ఉండాలి. లేకుంటే బతుకు శుభలగ్నంలో ఆమనిలా తయారవుతుంది. మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన ఆమని కోటీశ్వరురాలైన ఒక అమ్మాయికి తన భర్తని కోటి రూపాయలకు అమ్మేస్తుంది. అమ్మేశాక భర్తను ఆ అమ్మాయితో పంచుకోలేక నానా బాధలు పడుతుంది. నోట్ల కట్టల మీద పడుకుంటే నిద్ర రాదు... ఎంత పేదవాడైనా భర్త కౌగిట్లో పడుకుంటేనే భార్యకు నిద్ర వస్తుంది అని చెప్పే కథ

‘ఛాలెంజ్’

చాలామందికి డబ్బు సంపాదించడం వచ్చు. అయినప్పటికీ డబ్బు సంపాదించడమే వాళ్లు జీవితం అనుకోరు. అలాంటి తెలివైన నిరుద్యోగి గాంధీ. పేదవాళ్లని చులకనగా చూస్తూ పేదరికాన్ని అవమానించే ధన అహంకారి రామ్మోహనరావు. వీళ్లిద్దరి మధ్య నడిచిన పోరాటమే ‘డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు’.
తన ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్ట్‌కు, టైపిస్ట్ పోస్ట్‌కు, బంట్రోతు పోస్ట్‌కు అర్హత గల అభ్యర్థులు కావాలని ఓ పత్రికలో ప్రకటన ఇస్తాడు రామ్మోహనరావు. నిజానికి అతని కంపెనీలో బంట్రోతు ఉద్యోగం మాత్రమే ఖాళీ ఉంటుంది. మరి మిగతా రెండు పోస్ట్‌లకు ప్రకటన ఎందుకు? అదే విషయం ఆరా తీస్తుంది అతని కూతురు హారిక. రామ్మోహనరావు పొగరుగా నవ్వేస్తాడు.
‘ఏ పోస్ట్‌కు ఎంతమంది అప్లయ్ చేస్తారో చూద్దాం అని సరదాగా చేశా’నంటాడు.
అన్ని పోస్ట్‌లకు లెక్కకు మించిన అప్లికేషన్స్ వస్తాయి. బంట్రోతు పోస్ట్‌కు మాత్రం ఒక్కటే అప్లికేషన్ వస్తుంది. అది కూడా స్టాంపులు లేకుండా! ఆ దరఖాస్తుదారుని పేరు గాంధీ. స్టాంపుల్లేని కవర్ పంపి... ఎదురు డబ్బు కట్టించి ఆ కవర్ తీసుకునేటట్లు చేసిన గాంధీ పొగరుబోతుతనానికి తగిన శాస్తి చేయాలనుకుంటాడు రామ్మోహనరావు. గాంధీని పిలిపించి ఇంటర్వ్యూ చేయకుండానే వెళ్లిపొమ్మంటాడు. గాంధీ అహం దెబ్బతింటుంది. ‘‘ఓ తెలివైన కుర్రాడు తలుచుకుంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టం ఏమీ కాదు’’ అని ఛాలెంజ్ చేస్తాడు.
దమ్ముంటే ఐదేళ్లలో యాభై లక్షలు సంపాదించమని ప్రతిసవాల్ విసురుతాడు రామ్మోహనరావు. అది అసాధ్యం అని నమ్ముతాడు రామ్మోహనరావు. గాంధీ ఛాలెంజ్‌ని ఎంత తేలికగా తీసుకుంటాడంటే... అతను గనుక గెలిస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని పందెం కాస్తాడు.
అహం దెబ్బతిన్న గాంధీ ఈ ఛాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకుంటాడు. ఐదేళ్లలో యాభై లక్షల రూపాయలు సంపాదించి రామ్మోహనరావు పొగరు అణగ్గొడతాడు

అరుణాచలం

నెలరోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి... అప్పుడే తండ్రి వారసత్వంగా ఇచ్చిన మూడువేల కోట్ల రూపాయలకు వారసుడవుతాడు... ఇది అరుణాచలం సినిమా కధ.  హీరో తన స్టైల్‌లో లక్ష్యాన్ని సాధించి తండ్రి ఆస్థికి వారసుడవుతాడు.

మనిషి డబ్బును ఎంత తక్కువ ఆశిస్తే.. మనిషిగా అతని విలువ అంత పెరుగుతుందని చెప్పడానికి మనకో ‘అరుణాచలం’ ఉన్నాడు. ఎంత గొప్ప కథ... అరుణాచలానిది!
నా అనుకున్న వారందరి నిరాదరణకు గురవుతాడు అరుణాచలం. ఉన్న ఊరికి, అయిన వారికీ దూరంగా సిటీలో బతుకుతుంటాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో అతను కోటీశ్వరుడైన సింహాచలం కొడుకునన్న నిజం తెలుసుకుంటాడు. తండ్రి కష్టార్జితం అయిన 30 వేల కోట్ల రూపాయల ఆస్తి ట్రస్టీల చేతుల్లో ఉంటుంది. ఆ ఆస్తి అరుణాచలానికి చెందాలంటే ఒక నెల రోజుల్లో 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని తండ్రి షరతు విధిస్తాడు. ఆ షరతును అరుణాచలం నిరాకరిస్తాడు. వారసత్వంగా వచ్చే సంపదతో కాలు మీద కాలేసుకుని బతికేవాడు తన దృష్టిలో మగాడు కాడనీ, తల్లిదండ్రుల ఆస్తిని ఆశించకుండా కాయకష్టంతో చెమటోడ్చి భార్యాపిల్లలను పోషించేవాడే మగాడని అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు అరుణాచలం. కాని ఆ ట్రస్టీలు తన తండ్రి ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలనుకుంటున్న నిజం తెలుసుకుని, తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. తండ్రి కష్టార్జితాన్ని పాపాత్ముల పాలవ్వకుండా కాపాడటానికి కంకణం కట్టుకుంటాడు. నెల రోజుల్లో ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అంగీకరిస్తాడు. అరుణాచలాన్ని ఓడించడానికి వారు వేస్తున్న ఎత్తులను, కుట్రలను చిత్తు చేస్తూ... చివరకు అరుణాచలం విజేతగా నిలుస్తాడు. తండ్రి నుంచి సంక్రమించిన వేలాది కోట్ల రూపాయల ఆస్తిని పేద ప్రజలకు పంచి... మళ్లీ తను పెరిగిన ఊరికి తన వాళ్ల దగ్గరకు చేరుకుంటాడు.
అయితే, సమాజంలో మనకు అరుణాచలం లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.












సినిమా : వద్దంటే డబ్బు
తారాగణం : రామారావు ,షావుకారు జానకి ,పేకేటి శివరాం,జమున,రాజనాల (నాకు తెలిసిన వారు)
దర్శకుడు: స్వామి.వి ఆర్.

నాలుగు నెలలనుండి రాద్దామని అనుకుంటూ వాయిదా వేస్తూ వచ్చాను, ఇవ్వాళ కుదిరింది.


ఇక సినెమా కధ వద్దకు వస్తే రామారావు(పేకేటి శివరాం) ,శ్యాం(రామారావు) ఇద్దరు మంచి స్నేహితులు . రామారావు కవి ఐతే ,శ్యాం చిత్రకారుడు అన్నమాట. శ్యాం చాలా భయస్తుడు,అమాయకుడు ఐతే రామారావు మంచి మాటకారి ,తెలివి కలవాడు. కాని ఇద్దరికీ మంచి అవకాశాలు రాక చాలా కష్టపడుతూ వుంటారు. అప్పుడప్పుడు భోజనం కోసం శ్యాం గీసే చిత్రాలు అమ్ముతూవుంటారు .
రేఖ(జమున) ,రామారావు ప్రేమించుకుంటూ వుంటారు. ఈమె రేడియోలో గాయని.అప్పుడప్పుడు రామారావు రాసే కవిత్వాని పాడుతూవుంటుంది. అప్పుడప్పుడు వీరికి సహాయం కూడా చేస్తూ వుంటుంది.
సరోజ (షావుకారు జానకి) శ్యాం గీసే చిత్రాలకి పెద్ద అభిమాని .ఒక రోజు శ్యాం రేఖని చూసి ఆమె చిత్రం గీయాలనుకుంటాడు. అప్పుడు రేఖ తన స్నేహితురాలు సరోజని తీసుకు వచ్చి పరిచయం చేస్తుంది. అలా ఆమె చిత్రాన్ని గీస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమించుకుంటారు .

సరోజ బలవంతం మీద శ్యాం తమ ప్రేమగురించి ఆమె తండ్రితో చెప్పడానికి బయలుదేరుతాడు.సరోజ తండ్రి(రాజనాల) బాగా వున్నవాడు .అతను వీళ్ళ ప్రేమను పరీక్షింప తలచి శ్యాంకి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక నెలలోపు ఖర్చు చేసి రమ్మని చెబుతాడు. ఎవరికీ అప్పు ఇవ్వకూడదు అనే షరతు పెడతాడు. ఇక లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వీళ్ళు పడే పాట్లు చూడాలి. వీళ్ళు ఎంత ఖర్చు పెడదామనుకున్నా ఇంకా ఎక్కువ డబ్బులు తిరిగి వస్తూవుంటాయి.

చాలా హాస్యం వున్న సినిమా.ఇంటి అద్దె అడిగే ఇంటి యజమానురాలిని, అలాగే చేసిన అప్పు అడిగే సాయిబుని తప్పించుకోవటానికి వీళ్ళు పడేపాట్లు మొదటి భాగంలో మంచి హాస్యాన్ని పండిస్తే , లక్ష రూపాయలు ఖర్చు చేయడానికి వీళ్ళు పడే పాట్లు రెండో భాగంలో కడుపుబ్బా నవ్విస్తాయి.

పాటలు కూడా చాలా బాగుంటాయి. నాకు ఐతే " నాతొ అవుననవా " అనే పాట చాలా బాగా నచ్చింది. సంగీతం కళ్యాణం గారు .

ఈ సినెమా చూసే "బాబాయ్-అబ్బాయ్ ","అరుణాచలం" సినిమాలు తీసారు అనుకుంట. నేను ఎంత బాగా రాద్దామనుకున్నా ఇంతకంటే బాగా రాయలేకపోయాను.మీరు సినిమా చూడండి తప్పక నచ్చుతుంది ,నాది భరోసా.

జగదేకవీరుని కధ

ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రతాప్. చిన్నవాడు జగజ్జిత్తు. ప్రతాప్‌కున్న ఒకే కల. చలువరాతి మేడలో తూగుటుయ్యాలపై దేవకన్యలు ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణకుమారి, అగ్నితనయ తన చుట్టు చేరి సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కోరిక. అది తెలుసుకున్న తండ్రి కోపంతో దేశబహిష్కారం చేస్తాడు. అలా బయటకు వెళ్లిన ప్రతాప్ దేవకన్యలకోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెడుతుండగా కలిసిన దయ్యాల సాయంతో దేవకన్యలు జలకాలాడే చోటుకి వెళ్లి పొరపాటున శిలగా మారతాడు. కాని అతని తల్లి ప్రార్ధనలతో సంతోషించిన పార్వతీదేవి అతనికి మానవ రూపం రప్పిస్తుంది. ఇంద్రపుత్రిక జయంతి ఒకరోజు ఏమరుపాటుగా చేసిన తప్పుకు కోపించిన ముని శాపం ఇస్తాడు. దాని ప్రకారం ఆమె వస్త్రాలను దోచుకు పోయినవాడితో ఆమె పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది కాలానికి , తన వలువలు దోచిన ప్రతాప్‌ని జయంతి వరిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కామకూట రాజ్యానికి వెడతారు. కామాంధుడైన ఆ దేశపు రాజు జయంతి అందాన్ని చూసి వివశుడై వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించి తనే పతనమవుతాడు. ఆ రాజు చేసిన కుతంత్రంలో భాగంగా ముల్లోకాలకు వెళ్లిన ప్రతాప్ ఇంద్రకుమారి జయంతి స్నేహితురాళ్లని కూడా పెళ్లి చేసిని భూలోకానికి తిరిగొస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండగా. ఒకరోజు ప్రతాప్ లేని సమయంలో జయంతి అత్తగారిని మభ్యపెట్టి ప్రతాప్ దాచిన తన చీరెను తీసుకుంటుంది. అది లభించడంతో ఆమె శాపవిమోచనమవుతుంది. తన స్నేహితురాళ్లతో కలిసి స్వర్గానికి వెళ్లిపోతుంది. కాని ఆ దేవకన్యలందరూ తమ భర్తపై ప్రేమని చంపుకోలేకపోతారు. చివరగా దేవతలు పెట్టిన పరీక్షలో నెగ్గి ప్రతాప్ తన భార్యలను తీసుకుని భూలోకానికి వచ్చేసి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు.

Wednesday, November 17, 2010

తారే జమీన్ పర్

ఈచిత్ర కథనం ఎనిమిదేళ్ళ బాలుడు ఇషాన్ అవస్తీ గురించి తెలియజేస్తుంది. ఈ బాబు ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. ఇషాన్‌ది ఒక రంగుల ప్రపంచం. చదువుమీద కన్నా నక్షత్రాలు, రంగులు, పక్షులు, జంతువులు, గాలిపటాలన్నా చాలా ఇష్టం. చదువులో వెనకబడటంతో ఇషాన్ తల్లిదండ్రులు బోర్డింగ్ స్కూలుకి పంపిస్తారు. అందరూచిన్నచూపు చూపు చూసే ఇలాంటి పిల్లల్లో కూడా ఏదో ఒక ప్రతిభ ఉంటుందనే తెలిచెప్పే టీచర్ పాత్రలో ఆమిర్‌ఖాన్ నటించాడు.

టైటానిక్

ప్రముఖ హాలీవుడ్ దర్శకులు జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం ‘టైటానిక్’. కేట్ విన్‌స్లెట్, లియోనార్డో డి కాప్రియో నాయికానాయకులుగా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా అంతా ఒక ‘టైటానిక్ నౌక’. దాని మొదటి ప్రయాణంలోనే ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించారు జేమ్స్ కేమరూన్. చలన చిత్ర పరిశ్రమలోనే రికార్డులను బ్రేక్ చేసిన చిత్రంగానే కాక 11 ఆస్కార్‌లను కైవసం చేసుకున్న ప్రేమ కథా కావ్యం

దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే

సిమ్రన్ (కాజోల్) తండ్రి లండన్‌లో స్థిరపడిన భారతీయుడు. కూతురు పట్ల ఎంతో కఠినంగా ఉంటుంటాడు. తండ్రి అనుమతితో సిమ్రన్ తన స్నేహితులతో కలిసి యూరప్ ట్రిప్ వెళుతుంది. అక్కడ లండన్ నుండి వచ్చిన రాజ్ (షారుఖ్ ఖాన్) పరిచయం స్నేహంగా మారుతుంది. క్రమేణా రాజ్ సిమ్రన్‌ని ప్రేమిస్తాడు. కాని ఆమెకు ప్రేమంటే అయిష్టత ఉంటుంది. ఆమె తన తండ్రి నిశ్చయించిన వ్యక్తినే పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇంతకీ సిమ్రన్ రాజ్ ప్రేమను గుర్తిస్తుందా?

దిల్ తో పాగల్ హై

రాహుల్ (షారుఖ్‌ఖాన్) ఓ నాటక కంపెనీ దర్శకుడు. నిషా ఓ మంచి నృత్య కళాకారిణి. వారిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది. అయితే అది కేవలం తోబుట్టువుల మధ్య ఉండే అనుబంధం లాంటిదే. ఓరోజు అనుకోకుండా రాహుల్ మీద నిషాకు ప్రేమభావం కలుగుతుంది. నిషా తానింక నాటకాలు మానేసి లండన్ వెళ్ళాలనుకుంటుంది. దాంతో రాహుల్ తప్పనిసరి పరిస్థితిలో కొత్త డ్యాన్సర్‌ను వెదుక్కోవలసి వస్తుంది. కొత్త డ్యాన్సర్ పూజతో రాహుల్ ప్రేమలో పడతాడు. అయితే పూజ అప్పటికే అజయ్ (అక్షయ్ కుమార్)ని ప్రేమిస్తుంటుంది. చివరికి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో

Tuesday, November 16, 2010

మొదటి సినిమా-శ్రీను వైట్ల


‘నీకోసం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమై, మొదటి సినిమాకే ఏడు నంది బహుమతుల్ని గెలుచుకుని, ‘ఎవరీ సరికొత్త టేకింగ్ ఉన్న కుర్రాడూ..!?’ అని అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీను వైట్ల ‘ఆనందం’ తో ఎంత సక్సెస్ సాధించారో అందరికీ తెలుసు. అప్పటినుంచీ తన దిగ్విజయయాత్ర కొనసాగిస్తున్న శ్రీను వైట్ల గారు తన మొదటి సినిమా జ్ఞాపకాలని ఇలా పంచుకుంటున్నారు..

మాది తూర్పు గోదావరి జిల్లా లో రామచంద్రాపురం దగ్గర ఉన్న కందులపాలెం అనే పల్లెటూరు. నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు.. వాళ్ళు, అత్తయ్యలూ కలిసి చాలా పెద్ద ఫేమిలీ. అందరి మధ్యలో నా బాల్యం సరదాగా గడిచిపోయింది. ఎప్పుడు ఎలా మొదలైందో మొదలైందో తెలీదు కానీ చిన్నప్పటి నుంచీ సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్ళిపోయి ఏదో చెయ్యాలనే ఆలోచన చిన్నప్పటి నుంచే ఉండేది.. ఏమి చెయ్యాలో తెలీదు, అది ఎలా సాధ్యపడుతుందో కూడా ఆలోచించలేని వయసు. పైగా మాదొక చిన్న పల్లెటూరు, సినిమా రంగమంతా ఉండేది మద్రాసులో.. అస్సలు ఎక్కడా పొసగని దూరాలు. ఐనా నా ఆలోచనలన్నీ సినిమాల చుట్టూనే తిరుగుతుండేవి..
ఇంటర్మీడియట్‍కి వచ్చేసరికి, 1984 లో, కాకినాడ వెళ్ళి చదువుకుంటానని ప్రపోజల్ పెట్టాను. పక్కనే రామచంద్రాపురంలో కాలేజీ ఉన్నా, కాకినాడ ఎందుకు వెళ్తానన్నానంటే అక్కడైతే మనల్నెవరూ చూడరూ, విడిగా రూమ్ లో ఉంటూ ఇష్టమొచ్చినన్ని సినిమాలు చూడొచ్చు అని.. ఆ విధంగా 1984-86 మధ్యలో కాకినాడలో ఇంటర్మీడియట్‍ చదువుతూ ఎడాపెడా సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేవాడిని. ఫ్రెండ్స్ అందరూ హీరోల్ని ఆభిమానిస్తుంటే నేను మాత్రం మణిరత్నం గారిని అభిమానిస్తుండేవాడిని. డైరెక్టర్ కావాలన్న ఆలోచన అప్పట్లోనే ఉండేదేమో అంతగా గుర్తులేదు. చదువు విషయానికొస్తే, మరీ తప్పితే తిడతారు కాబట్టి పాసవడానికి కావల్సినంత చదివి ఎలాగైతేనేం ఇంటర్మీడియట్‍ పూర్తిచేశాను. కథలు వ్రాయడం, నాటకాలు వేయడం.. ఇలాంటివేమీ లేవు. ఉన్న టైమంతా సినిమాలు చూడ్డమే.!
తరువాత బి.ఎస్సీ చదవడానికి మళ్ళీ కాకినాదకే వచ్చాను. ఐతే ఇంక అప్పటికే సినిమా జ్ఞానమంతా ఒంటబట్టేసింది కాబట్టి మద్రాసు వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చేశాను. బి.ఎస్సీ లో చేరిన నాలుగైదు నెలలకే ఫీజులు కట్టడానికని ఇంట్లో ఇచ్చిన డబ్బులు జేబులో పెట్టుకుని బొకారో ఎక్స్‌ప్రెస్ ఎక్కేశాను మద్రాసుకి..!
మద్రాసు ఎలా ఉంటుందో తెలీదు.. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు.. ప్రయాణం మొదలైంది. ట్రైన్‍లో ఒక కుర్రాడు పరిచయమయ్యాడు. అతనిది మద్రాసు దగ్గరలోనే ఏదో ఒక ఊరు. అతని స్నేహితుడు జాస్తి చౌదరి అనే అతను మద్రాసులో ఉంటాడని చెప్పి అడ్రసూ ఇచ్చి, ఎప్పుడైనా వీలైతే కలుసుకోమని చెప్పాడు.. మన బుర్ర వేగంగా పనిచేసింది, ముక్కూ మొహం తెలీని మద్రాసులో దిగగానే ఏం చెయ్యాలో అప్పుడే నిర్ణయించుకున్నాను.
మద్రాసు సెంట్రల్ స్టేషన్‌లో దిగగానే తెలిసిందేమిటంటే అక్కడ సిటీ బస్సులన్నీ సమ్మె ఆ రోజు. చేతిలో జాస్తి చౌదరి అనే అపరిచిత స్నేహితుడి చిరునామా ఉంది. పాండీ బజార్.. ఎంత దూరం ఉంటుందో తెలీదు. నడవడం మొదలుపెట్టాను. అలా దాదాపు 15 కి.మీ. దూరం నడిచి వెళ్ళి జాస్తి చౌదరి రూమ్ తలుపు తట్టాను. రైల్లో కలిసిన కుర్రాడు నాకు బాగా ఫ్రెండు అనీ, అతనే నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడనీ నమ్మకం కుదిరేలా చెప్పాను. అతను సరేనని నేను తనతో మూడు రోజులు ఉండడానికి ఒప్పుకున్నాడు.. ‘అది చాలు, మిగతా విషయాలు మూడు రోజుల తర్వాత ఆలోచిద్దాంలే’ అని అక్కడ తాత్కాలికంగా సెటిలయ్యాను.
ఆ మూడు రోజుల్లోనే బయటికి భోజనానికి వెళ్ళినప్పుడు కృష్ణవంశీ పరిచయమయ్యాడు. ‘నాకు వసతి కావాలని’ అడిగితే తన రూమ్‌లో ఉండమని అన్నాడు. అలా కృష్ణవంశీ రూమ్మేట్‍గా సెటిలయ్యాను. చేతిలో డబ్బులున్నాయి కాబట్టి తిండికేమీ ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. అలా మద్రాసు వచ్చిన పదిహేను రోజులకి ఇంటికి ఉత్తరం వ్రాశాను.. ‘ఇలా మద్రాసులో ఉన్నాను, నాకోసమేమీ బెంగపడకండి, నేను క్షేమంగానె ఉంటున్నాను. నేనే మళ్ళీ ఉత్తరం వ్రాస్తాను’ అని. అప్పటికే ఇంట్లో వాళ్ళు నా కోసం తీవ్రంగా వెదుకుతున్నారంట.. నా అడ్రసు తెలిస్తే వచ్చి నన్ను లాక్కెళ్ళిపోవడం ఖాయం.. అందుకే అడ్రసు లేకుండా అప్పుడప్పుడూ నేనే ఉత్తరాలు వ్రాస్తుండేవాడిని. ( ఓ ఆరునెలల తరువాత ఇంటికి వెళ్ళి అందరినీ ఒప్పించి మద్రాసు చేరుకోవడం.. అదంతా మరో కథా. )
అలా కృష్ణవంశీ రూమ్‌లో చేరిన రెండు నెలలకే తను హైదరాబాదు వెళ్ళిపోయాడు. ఇంక రూమ్‌లో ఒక్కడినే మిగిలిపోయాను. ఎలాగైనా సినిమా రంగంలో చిన్న అవకాశం రావాలి అని తిరుగుతుండేవాడిని. అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు గారు అనే ప్రొడ్యూసర్ పరిచయమయ్యారు ( చిన్ని కృష్ణుడు, పడమట సంధ్యారాగం అనే సినిమాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది ) – నా ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు అనే డైరెక్టర్‍కి నన్ను పరిచయం చేశారు. అప్పుడాయన బాలకృష్ణగారితో ‘ప్రాణానికి ప్రాణం’ అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు గారి వద్ద ఆ సినిమాకి అప్రెంటిస్ గా చేరాను. అలా 1989 మార్చి నెలలో సినిమా రంగంలో నన్ను అడుగుపెట్టనిచ్చిన మొదటి సినిమా ‘ప్రాణానికి ప్రాణం’! సినిమా పుర్తయినంత వేగంగానూ అట్టర్ ఫ్లాప్ అయింది. ‘ఇదేంట్రా బాబూ, పని చేసిన మొదటి సినిమానే ఇలా బాల్చీ తన్నేసిందని’ అనుకుంటుండగా శివ రిలీజై రామ్ గోపాలవర్మ గారి పేరు ఆంధ్ర దేశమంతా మార్మోగిపోవడం మొదలైంది. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరదామని నేనూ హైదరాబాదు చేరుకున్నాను.
ఐతే ఆప్పటికే ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేరడానికి వచ్చిన వాళ్ళ క్యూ కొండవీటి చాంతాడంత ఉంది. అక్కడ వీలు కాకపోవడంతో ఏం చెయ్యాలా అని వెదుకుతుండగా ‘ప్రాణానికి ప్రాణం’ రోజుల్లో పరిచయమైన డైరెక్టర్ సాగర్ గారు ఎదురయ్యారు. ఆయన్ని ఒప్పించి అసిస్టెంట్ గా చేరాను.. ఆ సినిమా పేరు ‘నక్షత్ర పోరాటం’ ; నన్ను అసిస్టెంట్‍ని చేసిన మొదటి సినిమా అది..! ఆ విధంగా సాగర్ గారి వద్దనే ‘అమ్మ దొంగా’ సినిమా వరకూ పనిచేశాను. ‘అమ్మ దొంగా’ తరువాత సొంతంగా డైరెక్షన్ చెయ్యగలననే నమ్మకం కలిగి, అసిస్టెంట్ గా మానేసి, కథలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాను.
తొందరలోనే సాంబిరెడ్డి అనే ఆయన నాకు డైరెక్టర్ గా మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. సినిమా పేరు ‘అపరిచితుడు’ ; రాజశేఖర్ హిరో. మొదటి షెడ్యూలు అవగానే హీరోగారికీ నిర్మాత గారికీ వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల ఆ ప్రోజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ కథ మొదలైంది..! ‘ఏం చెయ్యాలి.. నిరాశ పడి లాభంలేదు. ప్రయత్నాలు కొనసాగించాల్సిందేనని’ అనుకుని మళ్ళీ కథల మీద కూర్చోవడం మొదలెట్టాను. అప్పుడు తయారయిందే ‘నీకోసం’ కథ.
నాతో బాటు పనిచేసిన కెమెరామేన్ నాగురించి కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్న బాల్‍రెడ్డి మిత్రబృందానికి చెప్పడంతో వాళ్ళే నా దగ్గరికి సినిమా తీద్దామని రావడం, ‘నీకోసం’ మొదలు పెట్టడం జరిగింది. రవితేజ, మహేశ్వరి కాంబినేషన్. సినిమా నిర్మాణం మొదలైతే ఐంది కానీ ఆది నుంచీ అన్నీ కష్టాలే. నిర్మాతలు తలా ఒక రెండు, మూడు లక్షలు వేసుకుని ప్రోజెక్టు మొదలెట్టారు, కానీ మధ్యలో బడ్జెట్ అయిపోవడం.. మళ్ళా నేనే ఎలానో మరికొంత పెట్టుబడి పెట్టడం.. అలా అష్ట కష్టాలూ పడి సినిమాని పూర్తి చేశాను. 38 లక్షల్లో 28 వర్కింగు డేస్‌లో తీసిన సినిమా పూర్తి కావడానికి మొత్తం సంవత్సరంన్నర పట్టింది.
ఆ సినిమా ప్రివ్యూ చూసిన నాగార్జున గారు నాకు డైరెక్షన్ ఆఫర్ ఇస్తానన్నారు. అలానే ఆ సినిమ చూసిన రామోజీరావు గారు మొత్తం ఆంధ్రాకి దాన్ని కొనుగోలు చేసి రిలీజ్ చేశారు. 1999 డిసెంబర్ 3 న రిలీజైంది. సినిమా బ్రహ్మాండమైన హిట్ కాకపోయినా కోటి రూపాయలు వసూలు చేసి కమర్షియల్‍గా సక్సెస్ అవడమే కాకుండా డైరెక్టర్‍గా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అదే సంవత్సరం 7 నంది అవార్డుల్ని కూడా గెలుచుకుంది.. ఉత్తమ కొత్త దర్శకుడిగా నాకు, ఉత్తమ స్క్రీన్‌ప్లే కీ, ద్వితీయ ఉత్తమ చిత్రంగా సినిమాకి కూడా అవార్డులొచ్చాయి. ఆ విధంగా నా దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా ‘నీకోసం’
ఆ సినిమా విజయంతో నామీద నమ్మకంతో రామోజీరావు గారు నాకు ‘ఆనందం’ సినిమాకి అవకాశం ఇచ్చారు. అదెంత కమర్షియల్‍ సక్సెస్ అయిందో మీఅందరికీ తెలుసు. ఇలా చెప్పాలంటే నన్ను దర్శకుడిగా అగ్రస్థాయిన నిలిపిన మొదటి సినిమా ‘ఆనందం’!
ఇన్నాళ్ళ అనుభవంలో తెలిసినదేమిటంటే.. ‘కేవలం సినిమాల మీద ఆసక్తి మాత్రం ఉంటే సరిపోదు. బాగా కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా తట్టుకునే ఓర్పు ఉండాలి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు బెదిరిపోకుండా నిలిస్తేనే ఎప్పటికైనా విజయం లభిస్తుంది.. కష్టపడే వాళ్ళకి అద్భుతమైన అవకాశాల్నిస్తుందీ చిత్రసీమ..! ఇదొక వండర్‍ఫుల్ ఫీల్డ్!’

Wednesday, November 10, 2010

గురు

గురుకాంత్ దేశాయ్ (అభిషేక్ బచ్చన్) ఏదో ఒకటి సాధించాలనే తపన ఉన్న యువకుడు. అతని తండ్రి గుజరాత్‌లోని ఒక గ్రామంలో ప్రధానోపాధ్యాయుడు. గురు ఆలోచనను వ్యతిరేకించి, నిరుత్సాహపరుస్తుంటాడు అతని తండ్రి. కానీ గురు తన కార్యసాధనకోసం టర్కీకి వెళ్తాడు. అక్కడ కొంతకాలం పనిచేశాక తిరిగి స్వగ్రామానికి వస్తాడు. ముంబైలో బిజినెస్ పెట్టాలని అతని ఆలోచన. కానీ దానికి తగ్గ పెట్టుబడి అతని దగ్గర లేదు. తండ్రి అందుకు సహకరించడు. దాంతో పెళ్లి చేసుకుని, ఆ కట్నంతో వ్యాపారం మొదలెట్టాలని నిర్ణయించుకుంటాడు. సుజాత (ఐశ్వర్యారాయ్)ని పెళ్లి చేసుకుని, బావమరిది జిగ్నేష్‌తో కలిసి ముంబై చేరుకుంటాడు. అక్కడ అతని వ్యాపారం ఎలా సాగింది? అక్కడ ప్రత్యర్థులతో ఎలా నెగ్గుకొచ్చింది? వ్యాపారంలో సక్సెస్ అయ్యాడా? లేదా?

డిస్కో డాన్సర్

అనిల్ (మిధున్ చక్రవర్తికి)కి పాటలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే ధనవంతుడైన ఓబెరాయ్ తన తల్లిని అవమానించడాన్ని కళ్లారా చూసి అతని మీద ద్వేషాన్ని పెంచుకుంటాడు. ఎలాగైనా డబ్బు, పలుకుబడి సంపాదించాలని పాటలు పాడటాన్నే వృత్తిగా మార్చుకొని మంచి సింగర్‌గా పేరు తెచ్చుకుంటాడు. అతని పాటల్ని ఇష్టపడిన ఓబెరాయ్ కూతురు అనిల్‌ని ప్రేమిస్తుంది. తన కూతురు ఒక స్ట్రీట్ సింగర్‌ని ప్రేమిస్తుందనే విషయం తెలుసుకున్న ఓబెరాయ్ అనిల్‌ని చంపాలని గిటార్‌లో కరెంటు పెడతాడు. ఆ తరువాత జరిగే

Sunday, October 31, 2010

త్రీ ఇడియట్స్

బాలీవుడ్‌లో మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న హీరో అమీర్‌ఖాన్. తన ప్రతీ చిత్రం కొత్తగా, వైవిధ్యంగా ఉండేందుకు ఆయన తపిస్తుంటాడు. ఆయన తాజా చిత్రం ‘తీ ఇడియట్స్’ కూడా ఆ కోవలోకి చెందినదే. రొటీన్ కథే అయినప్పటికీ చక్కని టేకింగ్‌తో ఆద్యంతం ప్రేక్షకులను ఉల్లాసపరుస్తూ ముందుకు సాగే ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. లగాన్, రంగ్‌దేబసంతి, తారేజమీన్‌పర్, గజిని తర్వాత అమీర్ ఖాతాలో మరో మంచి సినిమా ఇది.
కథలోకి వెళితే...అదే రొటీన్ కథ. కథనం నడిపించడంలోనే దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ పూర్తి సాఫల్యత పొందాడు. రాంచో (అమీర్‌ఖాన్) ఓ సంపన్న కుటుంబం నుంచి ఇంజనీరింగ్ చదువుకోవడానికి వచ్చి రాజు రస్తోగి (షర్మాన్‌జోషి), ఫర్హాన్‌ఖురేషి (మాధవన్)లతో స్నేహం కుదిర్చుకొని అక్కడి నుంచి కాలేజీలో అల్లరి చిల్లర చేష్టలు చేస్తూ వీరు సహస్రబుద్ధే ప్రిన్సిపాల్ (బొమన్ ఇరానీ)కి పిచ్చకోపం తెప్పిస్తుంటారు. తిక్కశంకరయ్యలాంటి ఆ ప్రిన్సిపల్ కూతురు పియా (కరీనాకపూర్) ప్రేమలో పడతాడు రాంచో. వీళ్లు ముగ్గురు కాలేజీలో ఏ పనిచేసినా అది అందరి బాగుకోసమేకానీ ప్రిన్సిపాల్ వీళ్లని నానారకాలుగా బాధపెడ్తుంటాడు. ఓవిధంగా అతను తన మాటే చెల్లాలనుకునే మనస్తత్వమున్నవాడు. ఇక్కడ మరో సస్పెన్స్ ఏమిటంటే రాంచో అటు సైంటిస్టు చదువుతూనే ఇటు మరో స్నేహితుడికి ఇంజనీరింగ్ చదివి పట్టా చేసిస్తాడు. ఫర్హాన్‌కి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అవ్వాలనే లక్ష్యముంటుంది. కానీ... తల్లిదండ్రులు బలవంతంగా అతనితో ఇంజనీరింగ్ చదివిస్తుంటారు. ఇక రాజు కుటుంబం చాలా బీదరికంలో కొట్టుమిట్టాడుతుంటుంది. అతనికి మంచి ఉద్యోగం సంపాదించుకొని కుటుంబానికి అండగా నిలవాలనుకుంటాడు. ఇలా వారి చదువులు అయిపోయి సడెన్‌గా రాంచో పత్తాలేకుండా పోతాడు. అప్పటికి ఫర్హాన్ తనకిష్టమైన ఫొటోగ్రాఫర్ సెలక్షన్‌కి అవకాశమొచ్చి అందులో సెలక్టవుతాడు. రాజుకి కూడా ఓ కంపెనీలో జాబ్ వస్తుంది. రాజు, ఫర్హాన్‌లు కలిసి రాంచో అడ్రస్ కనుక్కుని పియాని అతనితో కలిపిస్తారు. అప్పుడు ఏం జరిగిందనేదే ఆసక్తికరమైన అంశం.
ఇందులో ప్రతీ పాత్రకూ ప్రాధాన్యత కనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ సెంటిమెంటు, మెసేజ్ ఎంటర్‌టైన్‌మెంటు అన్ని సమపాళ్లలో కుదిరాయి. ప్రతీ ఫ్రేమ్‌ని చక్కగా తీర్చిదిద్దాడు దర్శకుడు. కాకపోతే హీరోయిన్ అక్క డెలివరీ సీనే కాస్త ఇబ్బందిగా తోచింది. పిల్లలు అనుకున్న రంగంలో వారిని ప్రోత్సహిస్తేనే వాళ్ల భవిష్యత్తు బావుంటుందని తల్లిదండ్రులకి ఓ కనువిప్పు కలిగించారు. అలాగే రాంచో క్యారెక్టర్ స్నేహితుల మంచికోసం ఏమైనా చేయగల పాత్ర. మొత్తం మీద విధువినోద్‌చోప్రా బ్యానర్‌నుండి మంచి సినిమా వచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆయన మాటలు కూడా చక్కగా వున్నాయి. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ ఫర్వాలేదు

'విజయ'చిత్ర వైభవం


తెలుగు చలనచిత్ర చరిత్రలో వందలాది నిర్మాణ సంస్థలు, వేలాది చిత్రాలను అందించాయి. వాటిలో ప్రథమ పంక్తిలో పేర్కొనదగిన సంస్థ ‘విజయాప్రొడక్షన్స్’. 1908లో తెనాలిలో జన్మించారు చక్రపాణి (ఆలూరి వెంకట సుబ్బారావు). 1912లో కడప జిల్లా పొట్టెంపాడులో జన్మించారు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఈ ఇద్దరిలో చక్రపాణి సాహితీపరంగా ఉద్దండులైతే నాగిరెడ్డి వ్యాపారపరంగా నిష్ణాతులు. ఏ శుభ ముహూర్తంలో వారిరువురూ మిత్రులయ్యారో కానీ ఆ కలయిక ఫలితంగా రూపొందిన అద్భుతాలు ఎన్నో, వాటిల్లో చెప్పుకోదగ్గవి, పలు భాషల్లో ఆబాలగోపాలాన్ని అలరించిన ‘చందమామ’ ‘విజయచిత్ర’ మాసపత్రికలు. చలనచిత్ర నిర్మాణపరంగా ఉదాత్తస్థాయిలో చిత్రాలనందించింది ‘విజయా ప్రొడక్షన్స్’.
ఈ సంస్థ తెలుగు, తమిళ, హిందీ, మళయాల, కన్నడ భాషల్లో సుమారు 40 చిత్రాలు నిర్మించింది. వాటిలో తెలుగులో నిర్మించినవి 14 చిత్రాలు. అవి- షావుకారు (7.4.1950), పాతాళభైరవి (15.3.51), పెళ్లిచేసిచూడు (29.2.52), చంద్రహారం (6.01.54), మిస్సమ్మ (12.01.55), మాయాబజార్ (27.03.57), అప్పుచేసి పప్పుకూడు (14.1.59), జగదేకవీరుని కథ (9.8.61), గుండమ్మకథ (7.6.62), సత్యహరిశ్చంద్ర (22.4.65), సిఐడి (13.9.65), ఉమాచండీ గౌరీశంకరుల కథ (11.1.68), గంగ-మంగ (30.11.73), శ్రీ రాజేశ్వరీవిలాస్ కాఫీక్లబ్ (20.2.76) ఈ 14 చిత్రాలలో చివరి రెండు రంగులలో నిర్మించగా, మిగతా 12 బ్లాక్ అండ్ వైట్‌లో తీసారు. వాటిలో 8 సాంఘిక, 4 జానపద, 2 పౌరాణిక చిత్రాలు. ఈ చిత్రాల గురించి తెలుసుకునే ముందు వాటి సాంకేతిక వర్గాన్ని ముచ్చటించుకుందాం.
నిర్మాతలు: పై 14 చిత్రాలలో 11 చిత్రాలకు నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలు. అయితే మాయాబజార్ నిర్మాణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని, పొడచూపిన అభిప్రాయభేదాలను పురస్కరించుకుని దర్శకులు కె.వి.రెడ్డి పెట్టిన షరతులకు నాగిరెడ్డి, చక్రపాణి అంగీకరించడంతో 3 చిత్రాలకు (జగదేకవీరుని కథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ’ దర్శక నిర్మాతగా కె.వి.రెడ్డి వ్యవహరించారు.
దర్శకులు: ఈ సంస్థ నిర్మించిన 4 సాంఘిక చిత్రాలకు (షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ, అప్పుచేసిపప్పుకూడు) ఎల్.వి.ప్రసాద్, 3 జానపద, 2 పౌరాణిక చిత్రాలకు కె.వి.రెడ్డి (పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ... కథ). ఒక జానపద, ఒక సాంఘిక చిత్రానికి (చంద్రహారం, గుండమ్మకథ) కమలాకర కామేశ్వరరావు, ఒక సాంఘిక చిత్రానికి పూర్తిగా (సిఐడి) మరో సాంఘిక చిత్రం (గంగ-మంగ) పాక్షికంగానూ, తాపీచాణక్య దర్శకత్వం వహిస్తూ కీర్తిశేషులు కాగా, ‘గంగ-మంగ’ చిత్రాన్ని వి.రామచంద్రరావు దర్శకత్వంలో పూర్తిచేసారు. ఆ సంస్థ నిర్మించిన చివరి చిత్రం ‘శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్’కు దర్శకుని పేరు వేయకుండా సంచాలకునిగా చక్రపాణి పేరు, సహకారకునిగా బాపు పేరు వేయటం ఓ ప్రత్యేక విశేషం.
రచనా విభాగం: చక్రపాణి 3 చిత్రాలకు (షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ), పింగళి నాగేంద్రరావు 6 చిత్రాలకు (పాతాళభైరవి, చంద్రహారం, మాయాబజార్, జగదేకవీరునికథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ...కథ), డి.వి.నరసరాజు 3 చిత్రాలకు (గుండమ్మకథ, సిఐడి, గంగ-మంగ), సదాశివబ్రహ్మం ఒక చిత్రానికి (అప్పుచేసి పప్పుకూడు), పాలగుమ్మి పద్మరాజు ఒక చిత్రానికి (శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్) సంభాషణలు సమకూర్చారు. తొలి చిత్రం ‘షావుకారు’కు సముద్రాల అన్ని పాటలు రాయగా, మలి చిత్రం పాతాళభైరవి నుంచి 12వ చిత్రం -ఉమాచండీ... వరకు అన్ని చిత్రాలకు అద్భుతమైన గీతాలను సాహితీపరంగా అందించారు పింగళి నాగేంద్రరావు. విజయాసంస్థ అంటే పింగళి, పింగళి అంటే విజయాసంస్థ అన్నంత గొప్పగా ఆయా చిత్రాల్లోని మాటలు, పాటలు నాటికి నేటికి రసజ్ఞ ప్రేక్షకలోకాన్ని అలరించాయి, అలరిస్తున్నాయి. ‘పెళ్లిచేసిచూడు’ చిత్రానికి బాలనటులపై చిత్రీకరించిన రెండు గీతాలను ఊటుకూరి సత్యనారాయణ రాయగా, ‘గంగ-మంగ చిత్రానికి దాశరథి పాటలు రాసారు. చివరి చిత్రం ‘రాజేశ్వరీ.. క్లబ్’కు పాలగుమ్మి పద్మరాజు, దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరధి కొసరాజు, గీత సాహిత్యాన్ని అందించారు.
సంగీతం: ఈ విభాగంలో అగ్రతాంబూలం ఘంటసాల మాస్టారుకే దక్కుతుంది. ఆ గానగంధర్వుడు ఏడు చిత్రాలకు (షావుకారు, పాతళభైరవి, పెళ్లిచేసిచూడు, చంద్రహారం, మాయాబజార్, గుండమ్మకథ, సిఐడి). స్వరసామ్రాట్ ఎస్.రాజేశ్వరరావు రెండు చిత్రాలకు (మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు), మధుర స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు 4 చిత్రాలకు (జగదేకవీరుని కథ, సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ..కథ, శ్రీ రాజేశ్వరీ విలాస్...) సంగీతాన్ని సమకూర్చారు. కాగా, రమేష్‌నాయుడు ఒకేఒక చిత్రానికి (గంగ-మంగ) పనిచేసారు.
కళాదర్శకత్వం: ఆ చిత్రం సాంఘికమైనా పౌరాణికమైనా, జానపదమైనా ఆ సన్నివేశానికి, వాతావరణానికి తగ్గట్టు స్కెచెస్ వేసి పాత్రలకు రూపకల్పన చేసిన కళాస్రష్టలు మాధవపెద్ది గోఖలే, కళాధర్. వీరు తొలిచిత్రం ‘షావుకారు నుంచి 12వ చిత్రం ‘ఉమాచండీ.. కథ’ వరకు విజయా ఆస్థానంలో కళాదర్శకత్వం నిర్వహించారు. చివరి రెండు చిత్రాలకు ఆ బాధ్యతను ఎస్.కృష్ణారావు స్వీకరించారు.
ఛాయాగ్రణం: విజయవారి చిత్రాలంటే పరవశింపచేసే ప్రకృతి, కనువిందుచేసే అందాల చందమామ, అబ్బురపరచే రాజభవనాలు, భయోత్పాతాన్ని కలిగించే మాంత్రికుని గుహ, నాయికా నాయకుల వనవిహారం, నౌకా విహారం, ఊగే తూగే పూతీవెల సంచలనం, వీటన్నిటిని ‘షావుకారునుంచి గుండమ్మ కథ’వరకూ తెరపై అద్భుతంగా చిత్రీకరించిన ఛాయాగ్రాహకుడు ‘మార్కస్ బారట్లే’ ఆ తర్వాత ‘మాధవ్ బుల్‌బులే’ రెండు చిత్రాలకు (సిఐడి, ఉమచండీ) కమల్‌ఘోష్ (సత్యహరిశ్చంద్ర), మాధవరెడ్డి (గంగ-మంగ), సుందరంబాబు (శ్రీ.రా.కా.క్లబ్) తలా ఒక చిత్రానికి పనిచేసారు.
విజయ చిత్రాల కథలను సంక్షిప్తంగా...
షావుకారు: ఇది ఇరుగుపొరుగు కుటుంబాల కథ. ఒకరి బిడ్డను తను కొడితే తన బిడ్డను దేవుడు కొట్టాడని సామెతకు ప్రతిరూపం ఈ చిత్రం. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ చిత్రం నాయకుడిగా ఎన్.టి.రామారావుకు, నాయికగా జానకికి తొలి చిత్రం.
పాతాళభైరవి: ఈ చిత్రం విజయా సంస్థ భవిష్యత్తుకు, నటులుగా ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసింది. ‘్ధర్యే సాహసే లక్ష్మీ’ అంటూ సామాన్యుడైన తోటరాముడు ఉజ్జయిని రాకుమారిని ప్రేమించడం, నేపాళ మాంత్రికుని చెరలో చిక్కిన రాకుమారిని రక్షించి, మాంత్రికుని రెండోసారి సంహరించడం ప్రధానాంశం.
పెళ్లిచేసిచూడు: వరకట్న సమస్యను హాస్యంతో రంగరించి తీసిన ఈ చిత్రంలో బాల పాత్రలకు (మాస్టర్ కుందు, బేబి గిరిజ, కందామోహన్) ప్రాధాన్యమివ్వడం చెప్పుకోదగ్గ అంశం. నాయకుడు ఎన్.టి.ఆర్, నాయిక జి.వరలక్ష్మి, జోగారావు కలిసి నాటకమాడి కట్నంకోసం వెంపర్లాడిన వెంకటపతికి (డా. శివరామకృష్ణయ్య) కనువిప్పు కలిగించడం ప్రధానాంశం.
చంద్రహారం: వరప్రసాదియైన చందనరాజు ప్రాణాలను దేవకన్య చంచల హరించటం, నాయిక గౌరి తన పాతివ్రత్య మహిమచే అతన్ని బ్రతికించుకోవటం కథాంశం.
మిస్సమ్మ: నిరుద్యోగ సమస్య ప్రధాన ఇతివృత్తం. పెళ్లికాని ఇద్దరు నిరుద్యోగులు బ్రతుకుతెరువుకోసం అవసరార్ధం దంపతులుగా నటించడం ఫలితంగా చిక్కుల్లో పడటం. చివరకు చిక్కుముడి విడిపోయి వారు దంపతులవటంతో కథ సుఖాంతం.
మాయాబజార్: తెలుగువారు గర్వించే ఈ చిత్రం గురించి ఎనె్నన్నో విశే్లషణాత్మక వ్యాసాలు వచ్చాయి. కాబట్టి దానిగురించి ముచ్చటించడం కంటే రంగుల్లో రూపొంది ప్రదర్శింపబడుతున్న ఆ చిత్రాన్ని చూసి అందుకు కారకుడైన క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్‌మోహన్‌ను, ఆ సంస్థ ‘గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్’ను విడుదలచేసిన సూపర్‌గుడ్ ఫిలింస్‌ను మనసారా అభినందించడం మన కర్తవ్యం.
అప్పుచేసిపప్పుకూడు: అప్పుచేయటం ఓ కళ. దాన్ని ఎగవేత అంతకుమించిన కళ అనే ప్రాతిపదికన రూపొందిన ఈ కథలో దర్శకులు ఎల్.వి.ప్రసాద్ అన్ని ప్రధాన పాత్రలను సన్యాసులుగా చూపడం ఓ స్పెషాలిటీ.
జగదేకవీరుని కథ: రాకుమారుడు ప్రతాప్ నాలుగు లోకాలకు చెందిన నలుగురు కథానాయికలను ప్రేమించి వివాహమాడిన వంచకులను శిక్షించడం మూలకథ. బి.సరోజాదేవి గ్లామర్ విలక్షణ భాషోచ్చారణ చిత్ర విజయానికి దోహదం చేసింది.
గుండమ్మకథ: షేక్‌స్పియర్ నాటకం (టేమింగ్ ఆఫ్ ది షూ) కథలోని ప్రధాన అంశాన్ని తీసుకొని రూపొందించిన ఈ చిత్రం చిత్రకథ, గీతాలు అందరికీ సుపరిచితమే. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, ఎస్.వి.ఆర్, సావిత్రి, జమున, సూర్యకాంతం, ఛాయాదేవి, యల్.విజయలక్ష్మి, హరనాథ్, రమణారెడ్డి, రాజనాల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంలో పాత్రల్నిబట్టి నటులా నటుల్నిబట్టి పాత్రలా అనేది విజ్ఞులైన ప్రేక్షకులకు ఒక పజిల్. సూర్యకాంతం పాత్రపరంగా టైటిల్ నిర్ణయించడం విశేషం.
సత్యహరిశ్చంద్ర: భారతీయ భాషల్లో 20సార్లు రూపొందిన ఈ చిత్రకథ అందరికీ సుపరిచితమే. కారణాలు ఏమైనా ఈ చిత్రం ప్రజాదరణకు నోచుకోలేదు.
సిఐడి: ఒక తమిళ చిత్రం ఆధారంగా తయారైన ఈ చిత్రంలో తండ్రి చలపతి (గుమ్మడి) సంఘవిద్రోహి. అతని కుమారుడు బాధ్యతగల ఇన్స్‌పెక్టర్ (రామారావు) ఈ రెండు పాత్రల నడుమ డ్రామా, మధ్యలో గ్లామరస్ కథానాయిక జమున అయినా విజయం అంతంతమాత్రమే.
ఉమాచండీ గౌరీశంకరుల కథ: నాయిక త్రిపాత్రభినయంతో రూపొందిన ఈ చిత్రానికి ముగ్గురు మహామహులు (కె.వి.రెడ్డి, పింగళి, సింగీతం శ్రీనివాసరావు) స్క్రీన్‌ప్లే వ్రాసినా ఫలప్రాప్తి దక్కలేదు.
గంగ-మంగ: ఈ చిత్రం తాలూకు విశేషమేమంటే నరసరాజు రాసిన ‘రాముడు-్భముడు’ చిత్రాన్ని హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా తీసారు. కథలోని హీరో ద్విపాత్రాభినయాన్ని హీరోయిన్‌పరంగా మార్చి ‘సీతా ఔర్ గీతా’ పేరుతో హిందీలో జి.పి.సిప్పి నిర్మించారు. అది సూపర్ హిట్ కావడంతో దాన్ని తెలుగులో వాణిశ్రీ ద్విపాత్రాభినయంతో కృష్ణ, శోభన్‌బాబు హీరోలుగా నిర్మించిన ఈ చిత్రం కూడా సో అనిపించింది.
శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్: మతాలకన్నా మానవత్వం విలువైనది. ఇది ప్రేమకు కూడా వర్తిస్తుంది. ఈ ప్రాతిపదికతో రూపొందిన ఈ చిత్రానికి చక్రపాణి సంచాలకునిగా వ్యవహరించగా బాపు సహకరించారు. నిర్మాణ దశలో చక్రపాణి మరణించగా, వారి స్మృతికి ఈ చిత్రాన్ని అంకితమిచ్చారు.
చరిత్రలోకాని, సినిమా చరిత్రలోకాని, వ్యక్తికికాని, వ్యవస్థకుకాని ఉత్తాన పతనాలు తప్పనిసరి. విజయావారి పతాకంలో ఆంజనేయుడు రెపరెపలాడుతుంటాడు. దానిపై క్రియా సిద్ధిఃసత్త్వేభవతి’ అన్న సంస్కృత పదాలు కనిపిస్తాయి. దీని భావాన్ని విజయా సంస్థకు అన్వయించుకుంటే, స్వభావసిద్ధమైన సత్తువ కథలోను, కథనంలోనూ పట్టు బిగువు వున్నవారి చిత్రాలను ప్రజలు ఆదరించారు, అందలమెక్కించారు. అవి కొరవడిన చిత్రాలను తిరస్కరించారు. ఏమైనా ఆ సంస్థ అందించిన ఆణిముత్యాలు వాటికి రూపకల్పన చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సదా స్మరణీయులు. ఈ వజ్రోత్సవ సందర్భంగా ఆ మహామహులను స్మరిస్తూ విజయ, వైభవ ప్రాభవాలను ప్రతీకగా రూపొందిన రంగుల హరివిల్లు ‘మాయాబజార్’ను చూసి మధురానుభూతుల్ని నెమరువేసుకుందాం. ఆ కళాస్రష్టలకు నివాళులర్పిద్దాం

అతిథి తుమ్ కబ్ జావోగి

ఈ ఆధునికయుగంలో సామాన్య మనిషి నాగరికత అనే ముసుగులో ఉండి యాంత్రిక జీవనానికి అలవాటుపడి సంబంధాలు, బంధుత్వాలను ఎలా విస్మరిస్తున్నాడో చూపడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ ‘అతిథి’ సినిమా. మనం మన పురాణాలలో, పుస్తకాలలో చదివాం ‘అతిథి దేవోభవ’ అని. సొంత తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేస్తున్న ఈరోజుల్లో ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే వారిపట్ల శ్రద్ధచూపించడంలో ఏవిధంగా వెనుకంజ వేస్తున్నామనే విషయాన్ని సహజంగానే దర్శకుడు చూపించాడు. ఈ లోకంలో చుట్టపుచూపున వచ్చి నెలలు తరబడి తిష్టవేసే ప్రబుద్ధులూ ఉన్నారు. కాని సహజంగానే వచ్చే బంధువులను మనం ఆదరిస్తున్నామా? వారిపట్ల సహనంతో సహకరిస్తున్నామా? అని దర్శకుడు ఈ సినిమాద్వారా సమాజాన్ని ప్రశ్నించాడు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న ఈ కాలంలో ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉన్నా, బంధువులు వచ్చినా వారు చూపించే ఆదరణ, మన జీవన విధానంపై, పిల్లల మనస్తత్వాలపై ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని చాలా చక్కగా హాస్యాన్ని జోడించి వివరించారు. పిల్లలు కేవలం ఇంగ్లీష్ చదువులకే పరిమితమవుతున్న ఈరోజుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మన మాతృభాష ఆవశ్యకత గురించి వివరించడంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఫైటింగ్‌లు, భారీ సెట్టింగులు, పాటలు ఆర్భాటం ఏమీలేకుండా కేవలం ఐదు పాత్రల మధ్యనే కథను నడిపించాడు దర్శకుడు.
ఇక కథ విషయానికి వస్తే..పునీత్ (అజయ్‌దేవగన్) సినిమాలలో కథలు రాసే రచయితగా పనిచేస్తుంటాడు. అతని భార్య మున్‌మున్ (కొంకణాసేన్) ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. వీరిద్దరికీ ఒక బాబు ఉంటాడు. ‘అతిథి దేవోభవ’ అనే మాటకు అర్థం కూడా తెలియని వీరి ఇంటికి అనుకోకుండా ఒకరోజు ఒక బంధువు రూపంలో లంబోధర్ బాబా (పరేశ్‌రావల్) వస్తాడు. ఆ వచ్చిన అతిథి వలన వీరు పడరాని కష్టాలు పడతారు. అతనిని ఇంటినుంచి పంపే ప్రయత్నంలో ఎన్నో ఎత్తులు వేయడం జరుగుతుంది. లంబోధర్ ప్రవర్తన వలన పునీత్ తనకు వచ్చిన రచయిత అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఇంట్లో అతిథి లంబోధర్ సేవలతో విసిగిపోయిన మున్-మున్ కూడా ఆఫీసులో తన పనిపై శ్రద్ధ చూపడంలో విఫలమవుతుంది. అతిథి వలన ఏర్పడిన కష్టాలను అధిగమించుటకు వారు ఏంచేశారు. లంబోధర్ వలన వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నవి అనేదే మిగతా సినిమా!
ఎప్పుడో వచ్చిన ‘మాలమాల్ వీక్లీ’ సినిమా తరువాత మళ్లీ ‘అతిథి’ సినిమాలో పరేష్ రావల్ గ్రామీణ వాతావరణంలో నటించి అందరినీ హాస్యంతో అలరించారు. మన వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగరీత్యా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటి ప్రభావాన్ని బంధువులమీద చూపించకూడదనీ, వారిపట్ల ప్రేమానురాగాలతో బాధ్యతాయుతంగా ఉండాలని చూపించారు. ఈ చిత్రం మొదలైనపుడు ‘అతిథి’ మాటకు అర్థం ఏమిటి? మన పురాణాలలో అతిథిని ఎలా సంభాషించుకున్నాం, ఈ కాలంలో అతిథికి ఇచ్చే గౌరవం ఏమిటి? అతిథివలన కలిగే నష్టం ఏమిటి? అనే విషయాలను కార్టూన్ చిత్రాల ఆధారంగా, జావేద్‌జాఫ్రీ సంభాషణలతో వివరించడం ఓ ప్రయోగమే. హాస్యపరంగా పరేశ్‌రావల్ ఇంతకుముందు వచ్చిన సినిమాలు ‘మాలమాల్ వీక్లీ’ ‘్భగమ్‌భాగ్’ ‘దే ధనాధన్’ స్థాయిలో లేకపోయినా ఫరవాలేదనిపిస్తుంది. పరేశ్‌రావల్‌తో చేసే ఏ సినిమా కథైనా చెప్పదలచుకున్నదానికి హాస్యాన్ని జోడించి చెప్పించడం గమనించదగ్గ విషయం.
ఇందులో వినాయకుని విశిష్టత, ఆదిదేవునిగా ఎందుకు పూజింపబడతాడో వివరించి చెప్పడం, తల్లిదండ్రుల ఆవశ్యకతను, మరచిపోతున్న మన పండుగల గురించి (పూజలు, హారతులు) చూపడం బాగుంది.
దుర్గామాతా 9 దిన్‌మే, గణేష్ జీ 11దిన్‌మే’ లేకిన్ అతిథిక విసర్జన్ కబ్‌హోగ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అజయ్‌దేవగన్‌తో చెప్పించిన ‘హమ్ మె యే సంస్కార్ నహీ కె అతిథిక సమ్మాన్‌కరే’ అనే డైలాగ్‌లో పంచ్ ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన ఓంకార సినిమాలోని ‘బీడీ జలైలే జిగర్ మే పియా’ అనే పాట ట్యూన్‌ను ఈ సినిమాలో దేవుని పాటకు వాడారు. అదే పాట ‘యే సంసార్’ ప్రేక్షకులను బాగా అలరించింది కూడా. ప్రీతమ్ సంగీతం సోసోగా వుంది. అజయ్‌దేవ్‌గన్, కొంకణాసేన్ తమ తమ పాత్రల్లో బాగానే రాణించారు. పరేశ్‌రావల్ వేషభాషలు గ్రామీణ వాతావరణాన్ని తలపించాయి. అసీమ్ బజాజ్ కెమెరా పనితనం బాగుంది. వినాయకుని విసర్జన సమయంలో ఆసుపత్రి సన్నివేశాలను బాగానే చిత్రించారు. అశ్విన్‌ధిర్ ఈ సినిమాలో నటించిన పాత్రల సంఖ్య విస్తరించి ఇంకా హాస్యానికి చోటు కల్పించివుంటే పరేశ్‌రావల్‌కి ఇది కూడా కామెడీ హిట్‌గా మిగిలేది. మొత్తం మీద ఫర్వాలేదనిపించే చిత్రమిది.

బెట్టింగ్ బంగార్రాజు

సినిమా మంచి చెడ్డలకు కలెక్షనే్ల కొలమానమని, వర్ధమాన హీరోలు బల్లకొట్టి చెబుతున్న కాలంలో, సినిమాకు ప్రణాళికా బద్ధంగా హైప్ తీసుకువచ్చి, వందలాది థియేటర్లలో విడుదల చేసి, జనానికి ‘అసలు’ విషయం తెలిసేలోగానే కావాల్సినన్ని కాసులు వసూలు చేసేసుకునే నిర్మాతులున్న ఈ రోజుల్లో, తమ ప్రతిభాపాటవాలకన్నా, కథాబలం కన్నా, హీరోయిన్ అంగాంగ ప్రదర్శనపైనే నమ్మకాన్ని పెంచుకుంటున్న దర్శకులున్న చోట, క్లీన్‌గా, హడావుడి లేకుండా, కామెడీ ప్రధానంగా చిన్న సినిమా తీయడం అంటే కాస్త ధైర్యం చేయాల్సిన విషయం. అయితే పైన చెప్పుకున్నవన్నీ పట్టని సంస్థ కాబట్టి, థియేటర్లు తెచ్చుకోగలగిన సామర్ధ్యం వున్న వారు కాబట్టి ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ‘బెట్టింగ్ బంగార్రాజు’ చిత్రాన్ని తీయగలిగింది. ఒకప్పుడు రిలీఫ్ కావాలంటే రాజేంద్రప్రసాద్ సినిమాలు చూడాలి..అనుకునే వారు ప్రేక్షకులు. మళ్లీ అలా అనిపించిన సినిమా ఈ ‘బెట్టింగ్ బంగార్రాజు’. అద్భుతమైన సినిమా అని కాదు..గొప్ప కథ అనీ కాదు.. కానీ, ప్రేక్షకులు హాయిగా నవ్వుకోగలిగిన సినిమా. ముఖ్యంగా వెకిలి..బూతు..చెత్త హాస్యం లేదు. ఎక్కడా బోర్ ఫీలవ్వాల్సిన పనిలేదు. గ్రాఫిక్ మాయాజాలంతో హీరో వెళ్లి ఢీకొంటే కొండ పగిలినట్లు చూపిస్తున్న సినిమాలు వస్తున్నాయి కాబట్టి, కాస్త సబ్జెక్ట్ అటు, ఇటుగా వున్నా పట్టించుకోనక్కరలేదు.
కథ విషయానికి వస్తే...దేనికైనా పందెం కాసే బంగార్రాజు (అల్లరి నరేష్), అతని చేష్టలతో అవమానభారం మోసే తండ్రి నారాయణ(గిరిబాబు). ఈ నేపథ్యంలో జరిగిన రెండు సంఘటనలతో, పట్నం వెళ్లి, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుడుతుంది అతడికి. పట్నంలో మాయదాసు (కృష్ణ్భగవాన్) బృందంతో కలుస్తాడు. అక్కడ దివ్య (నిధి) పరిచయమవుతుంది . తీరా ఆమెను తాను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె, అతనికి మరో ముగ్గురిని పరిచయం చేస్తుంది. ఆ ముగ్గురూ, రాయలసీమ ఫ్యాక్షనిస్టు (అమిత్), రియల్ ఎస్టేట్ వ్యాపారి (అక్షయ్), చదరంగం ఆటగాడు (సామ్రాట్). వాళ్లూ తనను ప్రేమిస్తున్నారని, అందరూ కలసి, పల్లెలోని తన ఇంటికి వచ్చి, కొన్నాళ్లుంటే, ఎవర్ని పెళ్లి చేసుకోవాలన్నది పెద్దలు నిర్ణయస్తారని చెబుతుంది. దాంతో సీన్ దివ్య ఇంటికి మారుతుంది. ఆ తరువాత పరిణామాలు ఎలా మారాయి..చివరకు దివ్య ఎవరిని చేసుకుందన్నది మిగతా కథ.
కథలో సాధ్యాసాధ్యాలు ఎలా వున్నా, స్క్రిప్ట్ పకడ్బందీగా తయారుచేసుకున్నాడు దర్శకుడు సత్తిబాబు. వీలయినంతవరకు తన పాయింట్‌ను కన్విన్సింగ్‌గా తెలియచెప్పడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఈ సినిమా వినోద సన్నివేశాల సమాహారం తప్ప మరేదీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకున్నాడు. ఆ విషయంలో చాలా బ్యాలెన్సింగ్‌గా వ్యవహరించాడు. ఏ క్యారెక్టర్‌ను ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేసాడు. ఫస్ట్ హాఫ్‌లో కృష్ణ్భగవాన్ బృందాన్ని వాడుకుంటే, సెకండాఫ్‌లో రఘుబాబు పూర్తిగా వినియోగించుకున్నాడు. రఘుబాబు కామెడీని సెకండాఫ్ మొత్తం వాడుకున్నా, బోర్ అనిపించకుండా, కాంబినేషన్లు మార్చి, జాగ్రత్త పడ్డాడు. రచయిత గంధం నాగరాజు కామెడీని బాగా డీల్ చేసాడు. శేఖర్‌చంద్ర సంగీతంలో..నీలిమేఘం పాట మెలోడియస్‌గా బాగుంది. అనంత్‌శ్రీరామ్ సాహిత్యం కూడా బాగుంది. మా ఇంటిమహలక్ష్మి.. ఫరవాలేదు.. మిగిలినవి సోసో... సినిమా రిచ్‌నెస్ గురించి పెద్దగా చెప్పుకోనక్కర లేదు కానీ, డ్రెస్‌ల విషయంలో మరి కాస్త జాగ్రత్త పడితే బాగుండేది. నటీనటులందరూ ఎవరి పాత్రమేరకు వారు బాగానే చేసారు. కొత్త అమ్మాయి నిధి హావభావాలు బానే వున్నాయి. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, సరదాగా కాలక్షేపం చేసి రావడానికి పూర్తిగా పనికొచ్చే సినిమా.

హౌస్‌ఫుల్


కమర్షియల్ సినిమాకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన సాజిద్ ఖాన్ - ఫాంటసీని నమ్ముకోడు. క్రైం జోలికి వెళ్లడు. ఉన్నంతలో లాజిక్‌కి దొరకడు. హృషీకేశ్ ముఖర్జీ అంటే బోలెడంత ఇష్టపడే సాజిద్ - ఈ మండువేసవిలో చిరునవ్వుల జల్లు కురిపించి ఆహ్లాదాన్ని పంచే విషయంలో ప్రేక్షకుల్ని ‘హౌస్‌ఫుల్’గా సాటిఫై చేస్తాడు. అదో తుత్తి. చల్లచల్లని కూల్‌డ్రింక్స్ తాగిస్తాడు. హృషీకేశ్ ముఖర్జీ కూడా అంతేకదా. లోబడ్జెట్ కథలతో ప్రేక్షకుల మదిని ఉర్రూతలూగించాడు. ఈ నేపథ్యాన్ని వొంటబట్టించుకున్న సాజిద్ మూడు గంటలపాటు ఏకధాటిగా ఏ క్షణం వృథా చేయకుండా నవ్వుల సంద్రాన్ని సునాయాసంగా ఈదేలా చేస్తాడు.
అందమైన అబద్ధం అప్పటికప్పుడు అవసరాల్ని గడిపేలా చేసినా - దాని తాలూకు నీలినీడలు మరిన్ని అబద్ధాలకు పునాదులు వేస్తారుూ ఇరుకున పెడతాయి అన్న సీరియస్ కానె్సప్ట్ నుంచీ - నీలి పొరలాంటి హాస్యాన్ని అల్లుకుని గజిబిజి గందరగోళాలకు తావివ్వకుండా - ముందు ఏం జరగబోతోందోనన్న ఆలోచనలోకి నెట్టకుండా - సాఫీగా ఏ/సి థియేటర్‌లో నవ్వుల్ని ఉగ్గబట్టుకునేలా చేసిన సాజిద్ కథ ఎటు చూసినా ‘హౌస్‌ఫుల్’. ‘లాఫింగ్ గ్యాస్’లో నవ్వుపుట్టించే లక్షణం ఉన్నట్టే - సాజిద్ ప్రతి సన్నివేశంలో నవ్వులను దొర్లించే లక్షణాలున్నాయి. అదో అందమైన అబద్ధం. ఒక్క అబద్ధాన్ని పాతేయటానికి వంద అబద్ధాల్ని మూట కట్టుకోవటం అంటే ఇదే. ఆ మాటకొస్తే- అరుష్ (అక్షయ్‌కుమార్)కి అబద్ధమంటే అసహ్యం. ఇతగాడు ప్రపంచంలోనే నీచాతి నీచమైన దరిద్రపుగొట్టు అదృష్టహీనుడు. ఎక్కడ కాలుమోపితే అక్కడ మటాష్. చిన్ననాటి ఫ్రెండ్ బాబ్ (రితేష్ దేశ్‌ముఖ్). ఇతగాడి భార్యామణి హేతల్ (లారాదత్తా). ఉద్యోగం దొరికేవరకూ అంటే ఓ మూడ్నాలుగేళ్లు ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోతానంటాడు అరుష్. కొత్తగా పెళ్లయిన జంట మధ్య. హేతల్ ఫ్లాష్ బ్యాక్‌లో బోలెడన్ని అబద్ధాలు. తండ్రికి ఇష్టంలేని పెళ్లి. దాంతో బాయ్‌ఫ్రెండ్ ప్లస్ మొగుడు కోటీశ్వరుడనీ, కార్లూ బంగళాలూ నౌకర్లు చాకర్లు బొచ్చుకుక్క ఉన్నాయంటుంది. వీటికి తోడు ఓ పిల్లాడు కూడా ఉన్నాడంటుంది. ఈ నేపథ్యంలో - హేతల్, బాబ్ బాస్ కూతురు దేవిక (జియాఖాన్)కి ‘్భరతీయ’ పెళ్లి సంబంధాలు చూస్తూండటంతో - సంప్రదాయసిద్ధంగా ఉంటుందని అరుష్‌కి ఇచ్చి పెళ్లి చేస్తారు. దీంతో నష్టజాతకుడు అనుకున్న అరుష్ 500 మిలియన్ల ఆస్తికి ఓనర్ అవుతాడు. ఇంతవరకూ బానే ఉంది. కానీ -సంఘం కట్టుబాట్లంటూ నాన్న వెర్రిమొర్రి ఆలోచనలతో - పక్కా భారతీయుణ్ణి వివాహం చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందన్న చిన్న లాజిక్‌ని అంటగట్టాడని, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాననీ, ఆస్తి చేతికి రావటంతోనే డైవోర్స్ ఇస్తానని ఘంటాపథంగా చెప్పి, తన బాయ్‌ఫ్రెండ్ బన్నీతో ఉండిపోతానని అంటుంది దేవిక. దాంతో ఫస్ట్‌నైట్ గురించి ‘ఐ డోన్ట్ నో వాట్టూ డూ’ అంటూ కలలు కంటున్న అరుష్ ఈ ఘోరాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడతాడు. ఎక్కడైనా హీరో హీరోయిన్‌ని రక్షిస్తాడు. కానీ ఈ నష్టజాతకుణ్ని శాండీ (దీపికా పదుకొనె) రక్షిస్తుంది. అరుష్ గురించి ఇటలీ హోటల్ యజమాని ‘జోక్’ అంటూనే - అతగాడి పెళ్లాం చనిపోయిందని, అందుకే ఆత్మహత్య చేసుకోబోయాడనీ - లేనిపోనివి చెప్తాడు. దాంతో - అరుష్ పట్ల ఉన్న సానుభూతి కాస్తా ప్రేమగా మారుతుంది శాండీ విషయంలో. ఇక అక్కడ్నుంచీ అబద్ధాల హోరు మొదలవుతుంది. ఓవైపు శాండీ, మరోవైపు హేతల్. శాండీ తన అన్నకి అరుష్ గురించి గొప్పగా చెబుతుంది. హేతల్ చెప్పిన అబద్ధాలన్నీ నిజమని నమ్మిన ఆమె తండ్రి - శాండీ అన్న కృష్ణ ఒకేసారి ఇటలీ వస్తున్నట్టు కబురు పంపుతారు. ఉన్నపళంగా - పెద్ద బంగళా, నెలల పిల్లాడు, కార్లూ.. నౌకర్లూ ఎక్కడ్నుంచీ వస్తారు. అందునా - తండ్రి పోలికలతో ఉన్న పిల్లాడు. ఈ అబద్ధాల కాపురం చివరికి క్లైమాక్స్‌లో ‘లాఫింగ్ గ్యాస్’తో బట్టబయలవుతుంది. ఇంత సీరియస్ సబ్జెక్ట్‌ని నవ్వుల నావలో వేసి హాస్య సంద్రంలో నడపటం ఆషామాషీ వ్యవహారం కాదు.
కొన్ని కొన్ని సన్నివేశాలు గుక్క తిప్పుకోనివ్వవు. అరుష్ చేసిన తింగరి పనికి (వాక్యూమ్ క్లీనర్‌తో ఇల్లు తుడవటం.. ఈ నేపథ్యంలో పెంపుడు చిలుక సైతం వాక్యూమ్ క్లీనర్‌లోకి వెళ్లిపోతుంది ఈకల్తో సహా) ప్రదా డార్లింగ్ (చిలుక) స్వర్గస్థురాలవుతుంది. అదే పేరుగల ‘పెట్’ ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్టంతా వెతికితే దొరికింది - ఏమిటి? అదే పేరుగల పులి. ఇక అదే సీక్వెన్స్‌లో పిల్లాడి విషయం. భారతీయుడిలా ఉండాలంటే - నీగ్రో పిల్లాడు దొరుకుతాడు. ఇక - పటూ -పటేల్ ‘స్లీప్ వాక్’.. ప్రతి అబద్ధాన్ని కప్పిపెట్టే ప్రయత్నంలో ‘హోమో సెక్సువల్’గా స్నేహితులిద్దరూ కనిపించటం - పటేల్‌ని వీడని నీడ. మేజర్ కృష్ణారావు ‘లై డిటెక్టర్’ వ్యవహారం.
ఇక - చిత్రీకరణ విషయానికి వస్తే - ఇటలీ, బకింగ్‌హామ్ ప్యాలెస్.. బీచ్ అందాలతోపాటు - ఓవైపు లారాదత్తా, మరోవైపు దీపికా పదుకొనె, ఇంకోవైపు జియాఖాన్ అందాల ఆరబోత. అసలే హాట్‌హాట్ వాతావరణం. ఆ సీన్‌లో అరకొర కాస్ట్యూమ్స్ ప్లస్ టూ పీస్ కాస్ట్యూమ్స్ ఉంటేనే రీజనబుల్‌గా - సీజనబుల్‌గా ఉంటుంది. వన్ షాట్ - త్రీ బర్డ్స్. రణధీర్ కపూర్, అర్జున్ పాల్, బొమన్ ఇరానీ - హాస్యాన్ని వొంటిచేత్తో నడిపించారు. మ్యూజిక్ ఫర్వాలేదు. హాస్యసన్నివేశాల మధ్య అంతగా వొంటబట్టదు. ఈ వేసంగిలో ‘బీచ్’ అర్ధనగ్న సీన్లతోపాటు ‘హౌస్‌ఫుల్’గా నవ్వుకోవాలంటే ఓకే.

మనసుదోచే సైన్స్‌ఫిక్షన్ - ఆరంభం

ఏ సినీ కథనైనా ఏ మాత్రం ఆలోచనల్లేకుండా - ఏ/సి థియేటర్‌లో గప్‌చిప్‌గా కూర్చుని - హాయిగా ఎంజాయ్ చేయ్యొ చ్చు. కానీ - ఈ కథ అలా కాదు. కాస్తంత శ్రద్ధగా చూడాలి. ఒక్కసారి మనసు పక్కకి మళ్లించారా? మళ్లీ మొదలెట్టాల్సిందే. అంతమాత్రానికే - ఇదేదో అర్థంకాని వ్యర్థ పదార్థం కాదు. సైన్స్ ఫిక్షన్ వైపు వెళుతూనే - ఒక్కోసారి మన ఆలోచనల్లోకి మనల్నే వెళ్లేలా చేస్తుంది. మన కలల్లోకి మనమే వెళ్లేలా ఉంటుంది. ఎటెన్షన్‌గా ఉండకపోతే - కాబ్ (లియోనార్డో డికాప్రియో) మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి జొరబడి అల్లకల్లోలం సృష్టిస్తాడు. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కలలు కననివాణ్ణి ఈ భూపెపంచకంమీద ఒక్కణ్ణి చూపించండి. ఏ తెల్లవారుఝామునో మగతా కమ్మే నిదురలో కూసింతసేపు కలల లోకంలో విహరించందే ఎవరి మనసూ ఆగదు. కొన్ని కలలు గుర్తుంటాయి. కొన్ని ఎక్కడో మొదలై ఎక్కడో ముగుస్తాయి. ఇంకొన్ని మస్తిష్కంలో రికార్డు కావు. మరికొన్ని ఏళ్ల తరబడి జ్ఞాపకం ఉంటాయి. కాన్షియస్ మైండ్‌లో కన్నా సబ్ కాన్షియస్ స్థితిలోనే ఆలోచనా స్రవంతి సుదీర్ఘంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోతుంది. కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ కానె్సప్ట్‌తో సాగిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఇన్‌సెప్షన్’.
ఊహకి సైతం అందని జాబ్ కాబ్ (లియోనార్డో)ది. ఆలోచనల్ని దొంగిలించటం. మదిలో మెదిలే ఐడియాలను సబ్‌కాన్షియస్ మైండ్ లో వెలికితీయటం. అతడిదో కలల ప్రపంచం. కలకి సరిహద్దులుండవు. ఏళ్ళ తరబడి ఎనె్నన్నో లోకాల్ని సృష్టించుకోవచ్చు. ఆ కలల్లోనే బతికేయ్యొచ్చు. ఆ కలల్తోనే జీవితాన్ని అందంగా అల్లుకోవచ్చు. కాబ్ తన భార్యని అలాంటి లోకంలోకి తీసుకెళ్తాడు.
ఇతడి టార్గెట్ రాబర్ట్ ఫిషర్ జూనియర్ (సిలియన్ మర్ఫీ). మల్టీబిలియన్ డాలర్ల కార్పొరేషన్‌కి అధిపతి. రాబర్ట్ తండ్రి చనిపోతూ ఒక లాకర్‌కి సంబంధించిన ‘కోడ్’ని చెబుతాడు. అందులో ఏముందో ఎవరికీ తెలీదు. రాబర్ట్ బిజినెస్ ప్రత్యర్థి సైటో (కెన్ వాటనెబ్) రాబర్ట్ ఆలోచనల్ని ముందుగానే పసిగట్టగలిగితే తన వ్యాపార సామ్రాజ్యానికి ఎదురే లేదని భావిస్తాడు. కాబ్‌కి ఈ పని అప్పజెబుతాడు. రాబర్ట్ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఏముందో తెలుసుకుంటే - లాకర్‌కి సంబంధించిన సమాచారం కూడా తెలుస్తుంది. కాబ్ తన అసిస్టెంట్‌గా ఆర్కిటెక్ట్ అరియాడ్నే (ఎల్లెన్ పేజ్)ని ఎంపిక చేస్తాడు. ఆమెను తన కలల ప్రపంచంలోకి పంపిస్తాడు. తన సబ్‌కాన్షియస్ మైండ్‌తో అరియాడ్నే ఆలోచనల్ని మళ్లిస్తుంటాడు. ఆర్థర్ (జోసెఫ్ గోర్డన్ లెవిట్), ఏమ్స్ (టామ్ హార్డీ), యూసుఫ్ (దిలీప్ రావ్)ల సహకారంతో రాబర్ట్‌ని కిడ్నాప్ చేస్తాడు కాబ్. ఇలా ప్రతి ఒక్కరూ కాబ్ సబ్‌కాన్షియస్ మైండ్‌తో మరో కలల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఇందులో మళ్లీ అనేకానేక స్థాయిలుంటాయి. వాటిని దాటుకుంటూ రాబర్ట్‌ని తమతోపాటు సబ్ కాన్షియస్ మైండ్‌ని వెతుక్కుంటూ వెళతారు. చివరికి రాబర్ట్ లాకర్‌కి సంబంధించిన ‘కోడ్’ని డీకోడ్ చేయగలిగారా? ఆ లాకర్‌లో ఏముంది? రాబర్ట్ తండ్రి చివరిసారిగా ‘నన్ను నువ్వు నిరాశ పరిచావ్?’ అని ఎందుకన్నాడు? కాబ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో తరచూ వచ్చి ప్రతి ఒక్కరినీ హత్య చేసేందుకు కాబ్ భార్య ఎందుకు చూస్తోంది? ఇలా అర్థంకాని అంశాలెన్నో బుర్రని వేడెక్కిస్తాయి. ఐతే - ఎక్కడా అది కలల ప్రపంచం అని కానీ, మరో లోకంలోకి వెళుతున్నట్టు గానీ కన్‌ఫ్యూజ్ కాకండా స్క్రీన్‌ప్లేని పకడ్బందీగా చేసుకుని నడిపించిన కథకుడు, దర్శకుడు క్రిస్ట్ఫర్ నెలోన్ ‘ఇన్‌సెప్షన్’ని అద్భుతంగా చిత్రీకరించాడు.
లేడీ ఆర్కిటెక్ట్‌ని తన కలల జగత్తులోకి పంపించే సన్నివేశంలోనూ - తాను సబ్ కాన్షియస్ మైండ్‌లో సృష్టించిన పాత్రలతోనూ - ప్రదేశాలతోనూ తీసుకెళ్లినప్పుడు - అక్కడ ఆర్కిటెక్ట్ ఊహించిన లోకాన్ని సరైన రీతిలో చిత్రీకరించారు. ఊహకి హద్దుల్లేవు. అలాంటిదే ఈ లోకం కూడా. ఇలాంటి లోకాలు ఈ చిత్రంలో బోలెడన్ని. ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో తనదైన సబ్ కాన్షియస్ మైండ్‌తో ప్రేక్షకుల్ని ఊహకు అందని లోకాలకు తీసుకెళ్లాడు

ఏం పిల్లో...ఏం పిల్లడో

ఫ్యాక్షన్ కథా చిత్రాలు సినీ రచయితలకు ఓ మంచి వరం ఇచ్చాయి. భయం అనే నేపథ్యంలో ఫ్యాక్షనిస్టుల గుహల్లాంటి ఇళ్లకువెళ్లి తనకు కావలసిన తంతును ముగించుకుని రావడమే హీరో లక్ష్యంగా మార్చివేసాయి. అది ఊరిబాగుకోసమైనా, తన ప్రేమను గెలిపించుకునేందుకైనా కథ ఒక్కటే. హీరో విలన్ ఇంట్లోనే ఉంటూ వారిని వెర్రి వెంగళ్లప్పలా, తనకు అనుకూలంగా మార్చుకుంటూ హాస్యం అనే మరో రసాన్ని పిండుతూ ప్రేక్షకుడికి అదే పెద్ద బ్రహ్మ పదార్థంలా చూపిస్తూ సాగిపోవడమే కథానాయకుడి కథగా అనేక చిత్రాలు వచ్చాయి. ఇలాంటి కథలు ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో ఏదో రూపంలో కనిపించినవే! కథలో వైవిధ్యం చూపకపోతే చిత్రాన్ని చూడలేరని రచయిత, దర్శకులు ఎప్పటికి అర్థం చేసుకుంటారో మరి?
కథలోకి వెళితే.. రామ్ (తనీష్), భద్ర (ప్రణీత), గాలి సుబ్బారావు (చంద్రమోహన్) ఇంట్లోవుండి చదువుకుంటుంటారు. వారికి తోడుగా ఇంకో ముగ్గురు విద్యార్థులుంటారు. రామ్, భద్ర నిత్యం పోట్లాడుకుంటూనే, అనేక రకాల తిట్టు తిట్టుకుంటూ, ఎదుటివారిని ఇబ్బందిపెట్టే వెంగళాయి పనులుచేస్తూ మొదటి సగమంతా నానా హింస పెడతారు. తిట్టుకుని కొట్టుకుని చివరకు ప్రేమలో కూరుకుపోతారు. కట్‌చేస్తే ఇద్దరివి పక్కపక్క ఊళ్లే! రామ్ తండ్రి సత్తిబాబు (ఆహుతిప్రసాద్), భద్ర తండ్రి రాజాబాబు (చరణ్‌రాజ్) తమతమ ఊర్లకు పెద్దమోతుబరులు. ఇద్దరికీ మధ్య నిత్యం పగలు రగులుతుంటాయి. ఇద్దరూ బావ బావమరుదులే, చిన్ననాటి స్నేహితులే! వీరిద్దరి వైరంతో రెండు ఊళ్ళు విడిపోతాయి. ఆ ఊరి కాకి ఈ ఊరిలో తిరుగరాదు. ఈ ఊరి మనిషి ఆ ఊరిలోకి రాకూడదు. ఇలా ఉన్న రెండు ఊర్లకు చెందిన రామ్, భద్ర ఎలాగైనా ఇరువర్గాలను వొప్పించి పెళ్లి చేసుకుని, రెండు గ్రామాలను ఏకం చేయాలనుకుంటారు. సత్తిబాబు ఇంట్లో భద్ర, రాజాబాబు ఇంట్లో రామ్‌చేరి మంచివాళ్లుగా నటించడం మొదలు పెడతారు. ఎంతో పెద్ద ఫ్యాక్షనిస్టులనైనా, తెలివిగలవాళ్లనైనా అమాయకులనుచేసి ఆడిస్తూ, చివరికి తాము అనుకున్నది సాధించారా? లేదా? అన్నది మిగతా కథ.
గతంలో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘సీతారాముల కల్యాణం..లంకలో’, ‘బిందాస్’, ‘రెడీ’ చిత్రాలు ఈ చిత్రం చూస్తుంటే నీడల్లా గుర్తొస్తుంటాయి. ఎప్పుడో బావమరుదులు తమ చిన్నప్పుడే కలిసి స్నేహితులుగా తిరిగితే ఈరోజుల్లో ఇంత ఫాస్ట్ కల్చర్‌లోకూడా రామ్, భద్ర ఒకరికొకరు తెలియదనుకోవడం సినిమా కథామాయే! రెండు ఊళ్లమధ్య ఒకే వారధి ఫకీర్‌బాబా (విజయచందర్)ని ఇద్దరు విలన్లు ఆదరించడం విచిత్రం. మొదటి సగమంతా నాయకా నాయికల పోట్లాటలు, తిట్లతో నస పెడుతుంది. హీరోయన్ తన సంగీతం గొప్ప నిరూపించుకోవడానికి ఒక మనిషిని చంపాల్సిన అవసరం ఉందా? దానికి ప్రేక్షకులు నవ్వేంత సీనుందా? సన్నివేశాలను రాసుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలు గుర్తించకుండా రాసుకోవడమేనా? ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు తోచింది రాసుకుంటూ పోవడమేనా? ప్రేక్షకుడికి ఈ సీను ఎంతవరకు నచ్చుతుంది, ఎంత ఆనందాన్నిస్తుంది? అనేది దర్శకుడు, రచయిత గుర్తెరగాలి. ఇద్దరూ తమ ఊర్ల కలయిక కోసం ప్రేమను త్యాగం చేయాలనుకోవడం ఒక్కటే అంశం ఈ చిత్రంలో ఫర్వాలేదనిపిస్తుంది. అసలు రెండు గ్రామాల మోతుబరుల పిల్లలు ఒకరినేపథ్యం ఒకరికి తెలియకుండా గాలి సుబ్బారావు ఇంట్లో ఎందుకు ఉన్నారన్న విషయంలో స్పష్టత లేదు. మొదటి సగమంతా గోలతో చిత్రాన్ని లాగించడం, ప్రేమించుకోవడానికి అన్నట్లు ఉంటుంది. కథను ఏదో పరుగెత్తించాలని పరిగెత్తినట్టు ఉంటుంది, కానీ అది ఎందుకు అలా జరిగింది? జరుగుతుందన్న ఆలోచన లేకుండా రాసేసుకున్నారు, తీసేసుకున్నారు.
నటనలో ప్రణీత పెద్ద కళ్లతో అందంగా కనిపించింది. తనీష్ ఇంకా పిల్లాడి గెటప్‌లోనే కనిపిస్తున్నాడు. పాత్రకు తగ్గట్టు అతని శరీర కదలికలు మారలేదు. లవర్‌బాయ్ పాత్రలుచేసే అతనికి ఇలాంటి పాత్రలు మొదటి సగం వరకు మాత్రమే సరిపోయంది. ఆహుతిప్రసాద్ బాగా నటించాడు. ‘కంప్యూటర్‌లో కాపురం చేయమన్నట్టు’, ‘రెండూళ్లండవు... రెండు స్మశానాలు మిగులుతాయి’ వంటి మాటలు ఫర్వాలేదు. ‘‘అందం విరిసిన బొమ్మలా...’’ పాట సంగీతపరంగా బాగుంది. ‘‘అమ్మాయే... అబ్బాయే’’ గాయకుని స్వరంగా కొత్తగా వినిపించింది. మిగతా సంగీతం ఆకట్టుకునే స్థాయిలో లేదు. ఎడిటింగ్, నేపథ్య సంగీతం ఇబ్బంది పెడతాయి. దర్శకుడు ఓ సాదా సీదా చిత్రం స్థాయిలోనే తీశాడు. కొత్తదనమేమీ లేక, హాస్యంపాలు అసలు కనిపించక చిత్రం చూసే వాళ్లకు వేదన, రోదన కలిగించడం ఖాయం

మర్యాద రామన్న

వాల్ట్‌డిస్నీ కార్టూన్ ఫీచర్ ఫిల్మ్‌ల్లో టామ్ అండ్ జెర్రీకి వున్న క్రేజ్ ఇంతా అంతా కాదు. అటు పిల్లల్లోనూ, ఇటు పెద్దల్లోనూ కూడా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే, ఎటువంటి మాటలు లేకుండా అలరిస్తాయా చిన్ని సినిమాలు. దీనికి కారణం చాలా సింపుల్. ఒక బలమైన క్యారెక్టర్, ఒక తెలివైన క్యారెక్టర్ మధ్య జరిగే యుద్ధం నుంచి పుట్టే హాస్యం జనానికి నచ్చడమే. పిల్లికి చెలగాటం..ఎలక్కి ప్రాణసంకటం అన్న సామెతకు, చూసేవారికి ఆనందం కూడా అని కలపాలన్నమాట. ఇటువంటి థీమ్‌తో 1923లో ‘అవర్ హాస్పిటాలిటీ’ అన్న మూకీ సినిమా వచ్చింది. ఎదుటివాడి కథలు నిస్సంకోచంగా కొట్టేసి, ‘కిచెన్ క్యాబినెట్’లో ఎవరో ఒకరి పేరు తగిలిస్తారని, మగధీర సమయంలోనే విమర్శలు ఎదుర్కొన్న రాజవౌళి అండ్ కో..ఇప్పుడు ఆ ‘అవర్ హాస్పిటాలిటీ’ సినిమాను సరాసరి తెలుగులో ‘మర్యాదరామన్న’గా అందించారు. పైగా సినిమాకు ముందు ఆ కథను సగర్వంగా వెల్లడి చేయడం, ఎస్.ఎస్.కాంచి చెప్పిన ఆ లైన్ అద్భుతంగా నచ్చి తీసాననడం, ఐమాక్స్ ప్రసాద్ బంధువు చెప్పిన విషయాల ఆధారంగా కథకు మెరుగులు దిద్ధామనడం లాంటి ప్రివ్యూ ‘షో’లు అనేకం రన్ చేసారు. ఎవరెన్ని చెప్పినా ఇది మాత్రం..పక్కా ‘అవర్ హాస్పిటాలిటీ’ కథే.
ఫ్యాక్షనిజం కారణంగా భర్తను పోగొట్టుకున్న ఓ మహిళ తన కుమారుడిని తీసుకుని రాయలసీమ నుంచి హైదరాబాద్ వచ్చి, అతడిని పెంచి పెద్ద చేస్తుంది. ఆ కుర్రాడు రాము (సునీల్) సరైన ఆర్ధికస్తోమత లేక ఇబ్బంది పడుతున్న సమయంలో తనకు రాయలసీమలో అయిదు ఎకరాల పొలం వుందన్న సంగతి తెలుస్తుంది. దాంతో అది అమ్మి, ట్రాలీఆటోని కొనుక్కుందామని అక్కడికి బయలుదేరుతాడు. రైల్లో అపర్ణ అనే అమ్మాయి (సలోని) పరిచయం అవుతుంది. తన తండ్రికి ఎవరితోనైతే శతృత్వం వుందో, అతడి ఇంటికే వెళ్లడం, ఆ అమ్మాయి ఇల్లూ అదే కావడం మొదటి ట్విస్ట్. వచ్చిన వాడు శతృవు అని తెలిసిన రామినీడు (నాగినీడు), అతని కుమారులు, రామును చంపాలని అనుకుంటారు. కానీ రామినీడు తన ఇంట్లో రక్తం చిందడం ఇష్టంలేదని, గుమ్మం దాటగానే చంపుదామని అంటాడు. అక్కడి నుంచి మొదలవుతుంది టామ్ అండ్ జెర్రీ స్టోరీ. ఇంట్లోనే వుండాలని ఇతడు, అతడిని ఎలాగైనా గుమ్మం దాటించి, చంపాలని వీళ్లు పనే్న వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, చివరకి ఏం జరిగిందన్నది కథ.
సరే.., కథ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారన్న విషయం పక్కన పెడితే, ఇటువంటి చిన్న లైన్‌కు స్క్రీన్‌ప్లే ముఖ్యం. దాన్ని మూడు వంతుల వరకు రాజవౌళి బాగానే తయారుచేసుకున్నాడు. అందుకు తగ్గట్లు సపోర్టింగ్‌గా సలోని, బ్రహ్మాజీ, అతని తల్లితండ్రుల క్యారెక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. సినిమా మొదటి సగం స్క్రిప్ట్ ఫెర్‌ఫెక్ట్‌గా వుంది. రెండో సగంలో మొదటి సగం కూడా ఫరవాలేదు. కానీ ఆ తరువాత మాత్రం కొంచెం బోర్ కొడుతుంది. పైగా చివరలో సీన్‌కు కాస్త ఎమోషన్ తీసుకురావడం కోసం నేపథ్యంలో, శబ్ధాలు ఎక్కువ చేయడం కూడా ఇబ్బందిగా తయారైంది. కానీ మొదటి మూడు భాగాలు ఇచ్చిన ఊపుతో చివరి భాగం కూడా తోసుకువెళ్లింది. రాజవౌళి టేకింగ్ కొన్ని చోట్ల కొత్తగా వున్నా కొన్ని చోట్ల పాత టేకింగ్‌లు గుర్తుకు వచ్చాయి. ముఖ్యంగా ఛేజింగ్ సన్నివేశాల్లో, హీరో పరిచయ సన్నివేశంలో. టెక్నాలజీని చిన్న సినిమాలకు కూడా వాడుకోవడం బాగుంది. మిణుగురుల సన్నివేశం, పాటల్లో సునీల్‌ను రెండుగా చూపించి, విభిన్న నృత్యాలు చేయించడం బాగుంది. పాటలు బాగున్నాయి. నేపథ్యంలో వాయిద్యాలతో పాటు, మాటల్ని కూడా వాడే కొత్త పద్ధతి మెచ్చుకోతగ్గది. ఫొటోగ్రఫీ నీట్‌గా వుంది. రామినీడు ఇంటిసెట్ డిజైనింగ్ కూడా అభినందించతగ్గది. కాంచి డైలగుల్లో రాయలసీమ డైలక్ట్ బాగుంది. కొన్ని సంభాషణలు మరీ కావాలని ఇరికించినట్లు వున్నాయి. అది కొత్త నటుడు నాగినీడు పలకడంలో తేడా వల్లకూడా కావచ్చు.
ఇక నటీనటుల్లో సలోని మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆ అమ్మాయి కళ్లలో మంచి స్పార్క్ వుంది. ఆ అమ్మాయి చిత్రమైన క్యారెక్టరైజేషన్ కూడా వెరైటీగా వుంది. బహుశా ఇటువంటి క్యారెక్టరైజేషన్ ఇదే మొదటిదేమో. ఈ క్యారెక్టర్‌తో బ్రహ్మాజీని జతకలిపి, రొమాంటిక్ కామెడీ డ్రా చేసిన రాజవౌళిని మెచ్చుకోవచ్చు. సునీల్ బాగా అండర్‌ప్లే చేసి ఆకట్టుకున్నాడు. డ్యాన్సుల్లో చాలా మంది యువహీరోల కన్నా బాగా చేసాడు. కొత్తనటుడు నాగినీడు ఆహార్యం ఓకె కానీ, డైలాగులు చెప్పిన తీరు కొన్ని చోట్ల కృతకంగా వుంది. కాంచి కనిపించిన కొద్దిసేపూ గోలగా వుంది. నటుడు రవితేజ సైకిల్‌కు చెప్పిన డబ్బింగ్ ఓకె.
కొసమెరుపు ఏమిటంటే, ఎవరికి తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా పట్నం వచ్చి, బతికిన హీరో తల్లి చిరునామా, బద్ధశతృవుకు తెలియదు కానీ, ఎమ్మార్వో ఆఫీసువాళ్లకి తెలియ డం. ఆ సంగతి తెలిసుంటే విలన్ ఎప్పుడో వచ్చి పగతీర్చుకుంటాడు కదా?

సరదాగా కాసేపు

జనం కాసేపు సరదాగా చూస్తే చాలు అదే పదివేలు అనుకుంటూ, దర్శకుడు వంశీ తీసిన తాజా చిత్రం ‘సరదాగా కాసేపు’. కేవలం కాసేపు సినీ జనాలను వినోదంలో ముంచడం తప్ప, మరే ఇతర ఐడియాలు, ఐడియాలజీలు పెట్టుకోకుండా తీసిన చిత్రమిది.. గడచిన కొద్ది సంవత్సరాలుగా వచ్చిన వంశీ చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా కాస్త బెటర్. అదే గతకాలపు వంశీ చిత్రాలను గుర్తుతెచ్చుకుంటే మాత్రం అభిమానులకు మళ్లీ కాస్త దిగులే. చిత్రం కథేమీ పెద్ద కొత్త కాదు. ఇద్దరు కుర్రాళ్లు... వాళ్లిద్దరు అటు ఇటుగా మారడం.., అందులోంచి కామెడీ పుట్టుకురావడం, అన్న కానె్సప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. అమెరికా నుంచి వచ్చిన జీవా-సనల కుమారుడు శ్రీనివాస్ పెళ్లిచూపుల కోసం హైదరాబాద్ బయల్దేరతాడు. డ్రయవర్ నరేష్ కూడా బయల్దేరతాడు. ఆహుతిప్రసాద్-జయలలితల పెళ్లికూతురు మధురిమ గుణగణాలు తెలుసుకోవడానికి వీలుగా ఇద్దరు అటుఇటు వేషాలుమార్చుకుంటారు. ఈ విషయం కాస్తా జీవా ముందుగానే వియ్యాలవారికి తెలియచేసేస్తాడు. కానీ మార్గమధ్యంలోనే అనుకోకుండా కుర్రాళ్లిద్దరూ వేషాలు మళ్లీ అటు ఇటు మార్చుకుంటారు. ఇది తెలియని వియ్యాలవారు డ్రయివర్‌కు మర్యాదలు, అసలు అల్లుడికి పనిష్‌మెంట్‌లు ఇస్తుంటారు. సందట్లో సడేమియాలా డ్రయివర్ నరేష్ కాస్తా పెళ్లికుమార్తె మధురిమతో ప్రేమలో పడతాడు. ఈ కథ ఎలా కంచికెళ్లిందన్నది సినిమా. వంశీ మార్కు కామెడీకి నరేష్ తోడయితే బ్రహ్మాండంగా వుండడానికి అవకాశాలు పుష్కలంగా వున్నాయి. కానీ స్క్రిప్ట్‌లో అంతగా దమ్ములేకపోవడం, ప్రొడక్షన్‌లో కాస్త లోబడ్జెట్‌లో వెళ్లడం, పాటల్లో కాస్త కొత్తదనం లేకపోవడంతో అనుకున్నమేర విజయానికి చేరువకాలేక పోయింది. అయితే కొత్త మాటల రచయిత పడాల కలం ఫస్ట్ఫాలో కాస్త చిందులు తొక్కడంతో కాస్త నిలబడింది. కానీ సెకండాఫ్‌లో అందుకు పెద్దగా అవకాశం లేకపోయింది. పైగా సెకండాఫ్ డైలాగుల్లోనూ, ముఖ్యంగా క్లయిమాక్స్‌లోనూ వంశీ మార్కు కన్నా, ఇవివి సత్యనారాయణ మార్కు ఎక్కువగా కనపడడం విశేషం. సినిమా రెండోసగం స్క్రిప్ట్‌ను మరికాస్త డెవలప్ చేసుకుని వుంటే మరింత బాగుండేది. అలాగే క్లయిమాక్స్ కూడా.
లోకి ఫొటోగ్రఫీ చాలా నీట్‌గా వుంది. టైటిల్స్ సమయంలో వెనె్నల్లో గోదారిని చిత్రీకరించిన తీరు బాగుంది. పాటల్లో కూడా ఫొటోగ్రఫీ కళ్లకు ఇబ్బంది పెట్టకుండా చూడ ముచ్చటగా వుంది. వంశీ స్టయిల్ చక్రి సంగీతంలో పాటలు చాలా వరకు విన్నట్లు అనిపించాయి. వంశీ రెండు పాటలు పాడారు. కానీ నిర్మొహమాటంగా చెప్పాలంటే స్వరంలో కొన్ని పదాలు ఎబ్బెట్టుగా వినిపించాయి. ముఖ్యంగా నిజమే.. నిజమా.. ఇధిగా...అన్నపుడు. మొదటి పాటలో చక్రి గొంతు కూడా అంతగా సూట్ కాలేదు. సినిమా మొత్తానికి ‘నీ పలుకులు’ పాట మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఈపాటకు చక్రి గొంతు బాగానే సరిపోయింది. ఎందరో ఔత్సాహికులు చిన్నతెరపై తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నపుడు, తమ సినిమా..తమ ఇష్టం అన్నట్లు పాడేయడం కన్నా, అటువంటి వారికి అవకాశం ఇస్తే బాగుండేదేమో. సినిమాలో పాటలకు చెట్ల నేపథ్యం, బిందెలు, చెంబులు వాడడం, ఇసుకలో అట్టసెట్టింగులు పెట్టి, వాడడంతో కాస్త ఓల్డ్ స్టయిల్ అనిపించింది. హంపీలో చిత్రీకరణ బాగుంది. అలా మరో రెండు లొకేషన్లు పెట్టుకున్నా బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే నరేష్ రాను రాను కామెడీలో మంచి ఈజ్‌ను కనబరుస్తున్నాడు. శ్రీనివాస్ తన ప్రతిభ ప్రదర్శించడానికి అంత అవకాశం ఏమీ ఇందులో లేదు. హీరోయిన్ మధురిమ కొన్ని చోట్ల అందంగా కనిపించింది. కానీ వంశీ తనదైన బొట్లు, కాటుకలు తగ్గించినా, ఇంకా కొన్ని చోట్ల అటు ఆహార్యమో, కళ్ల వెనుక మేకప్పో కాస్త ఎబ్బెట్టుగా కనిపించింది. ఆహుతి ప్రసాద్ పాత్ర, నటన జంధ్యాల సినిమాలను గుర్తుకు తెచ్చింది. (గతంలో సుత్తివేలు ఇటువంటి పాత్ర ఒకటి వేసాడు) జీవా, సన, ఎమ్.ఎస్.నారాయణ, కృష్ణ్భగవాన్, జయలలిత తదితరులంతా పాత్ర మేరకు నటించారు. రెండు నిముషాల పాత్రకైనా కుర్రనటుడికి ముసలిగెటప్ వేసి పనిమనిషి తండ్రిగా నటింపచేయడం ఎబ్బెట్టుగా తేలిపోయింది. ఇలాంటి విషయాలే సినిమాను నాటకానికి దగ్గర చేస్తాయి.
చివరగా ఒక్క విషయం. ఏ ఆటగాడూ ఆడినన్నాళ్లూ సెంచరీలు కొట్టలేడు..ఒకేరకమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించలేడు. పైగా సృజనను నమ్ముకున్న కళాకారులకైతే కాలానుగుణ మార్పులు మరో పెద్ద సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో పరుగెక్కడ ఆపాలన్నది వారికి వారే నిర్ణయించుకోవాలి. లేకుంటే గతకాలపు మధురిమలు కూడా అభిమానుల మనసు నుంచి కనుమరుగైపోయే ప్రమాదం వుంది. మొత్తం మీద వంశీ అభిమానులను ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది తప్ప, ‘హమ్మయ్య’ అని మాత్రం అనిపించలేకపోయింది. ఇవివి స్క్రిప్ట్‌కు, వంశీ దర్శకత్వం వహిస్తే ఎలా వుంటుందో చూడాలనుకుంటే ‘సరదాగా కాసేపు’ చిత్రం చూడొచ్చు.

బాలీవుడ్ క్లాసిక్స్

సినిమారంగం ఓ చిత్రమైన అయస్కాంతం. ఓ విచిత్రమైన సాలెగూడు. అన్ని వయసులవారినీ అది ఆకర్షిస్తుంది. ఒకసారి దాని ఆకర్షణలో పడ్డవారిని ఆ తరువాత నిలువనీయదు. సినిమారంగంలో తామూ ఒక భాగం కావాలన్న తపనతో ఇళ్లు వాకిళ్లూ వదిలి, స్టూడియోల చుట్టూ తిరిగి జీవితాలను వ్యర్థం చేసుకున్నవారు వేలూలక్షల్లో ఉంటారు. సినిమాను ఒక అద్భుతమైన కళగా, ఒక చక్కని వినోదంగా దాన్ని దూరంనుంచే ఆరాధించేవారూ ఉంటారు. ఓ మంచి సినిమా చూసి దాని గురించి పదే పదే తలుచుకుంటూ, పదిమందికీ దాని గురించి చెబుతూ, వాళ్లతోబాటు మళ్లీ మళ్లీ చూసేవాళ్లూ మంచి సినిమా ఆరాధకులూ ఉంటారు. వీళ్లందరికన్నా ఒక్క అడుగుముందుకువేస్తూ ఒక మంచి సినిమా గురించి వ్యాసాలు రాస్తూ, ‘ఈ సినిమాను ఈ కోణంలోంచీ చూడండి, మీకు మరిన్ని కొత్త అందాలు కనిపిస్తాయి’ అంటూ పనిగట్టుకుని మరీ పోరి, ఆ సినిమాను మీరు మరొక్కసారి చూసేంతవరకూ నిద్రపోలేనంతగా బాధపడేవారూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి సినిమా ప్రేమికుల్లో ఒకరు మహ్మద్ ఖదీర్ బాబు. ఆయన ‘సాక్షి‘ దినపత్రికలో రాసిన బాలీవుడ్ సినిమా పరిచయ వ్యాసాల సంకలనమే ‘బాలీవుడ్ క్లాసిక్స్’. సినిమాను అమితంగా ప్రేమించే మనుషులు మాత్రమే చేయగల ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంలో సాఫల్యం పొందినందుకు ఖదీర్‌కు అభినందనలు.
‘షోలే’తో ఆరంభించి, ‘మొఘల్-ఏ-ఆజమ్’ వరకూ మొత్తం యాభై సినిమాల గురించిన పరిచయ వ్యాసాలు ఈపుస్తకంలో ఉన్నాయి. ‘పరిచయ వ్యాసాలు’ అని ఎందుకు అంటున్నానంటే, ఇవేవీ సమగ్రమైనవికావు. వాస్తవానికి ఓ సినిమాను గురించి సమగ్రంగా, ‘ఇంక ఈ సినిమా గురించి చెప్పేందుకు, చర్చించేందుకు ఏమీలేదు’ అన్న తీరులో ఎవ్వరూ రాయలేరు. ఆఖరికి ఆ సినిమా తీసిన దర్శకులు, నిర్మాతలు అయినా సరే!! ప్రతీ సినిమాను ఖదీర్ తనదైన కోణంలో చూస్తూ, తనదైన ఆరాధనాభావంతో కొట్టుకుపోతూ రాసిన వ్యాసాలివి. ఒక సినిమా గురించి రాయడం మొదలుపెడితే ఇక ఆయన కలం పరవళ్లు తొక్కడమే! ఆ సినిమా అందాలను గురించి, దాని ప్రత్యేకతల గురించీ చెప్పుకుంటూ పోవడమే!! ఓ కవిత్వ ధారను ప్రవహింపచేయడమే. అందుకే, ఈ వ్యాసాల పరంపరలో చాలాచోట్ల పాఠకులకు ఆలోచించేందుకు కానీ, క్షణం ఆగి గుక్కతిప్పుకునేందుకు కాని ఖదీర్ అవకాశం ఇవ్వరు. ఖదీర్ కవి కాబట్టి, కవి నిరంకుశుడు కాబట్టి ఈ నియంతృత్వ ధోరణిని మనం భరించక తప్పదు. అయితే ఏ విషయం మీదైనా ఒక వ్యాసం రాస్తున్నప్పుడు లక్షలాదిమంది ప్రేమించే సినిమాలమీద రాస్తున్నప్పుడు కలంమీద, పరిగెత్తే భావాలమీద కొంచెం అదుపు ఉండాలేమో! లేకపోతే సంజీవ్‌కుమార్ లాంటి ఉత్తమ నటుడు, జాతీయ బహుమతి గ్రహీత గురించి రాస్తూ ‘నిజంగా ఒక అన్‌సంగ్ హీరో’ అనే వాక్యాలు (పేజీ 37), ‘నిగ్గదీసి అడుగు-సిరివెనె్నలకు వీలైంది’ (పేజీ 85) లాంటి అనవసర వాక్యాలు దొర్లవు. ఇలాంటి వాక్యాలను ఒక దినపత్రిక శీర్షికకు వ్యాసాన్ని సమయానికి ఇవ్వాలనే వేగంలో గుర్తించక రాస్తే రాయవచ్చునేమో గానీ, సంకలనం చేసేటప్పుడు మాత్రం చూసుకోవాలి. ఓ సినిమా ప్రేమికుడు సినిమాను అతిగా ప్రేమిస్తూ చేసే ఇలాంటి చిన్న చిన్న విషయాలు విస్మరిద్దాం. ఒక నిర్ణీత కాలంలోని మంచి బాలీవుడ్ చిత్రాలమీద మంచి పుస్తకంగా దీన్ని సాదరంగా ఆహ్వానిద్దాం.
చివర్న ఒక విషయం-సినిమాను ఎంతో అభిమానిస్తూ సినిమాను ఆరాధిస్తూ ఉండే ప్రేక్షకుడిగా, ‘బాలీవుడ్ క్లాసిక్స్’ పేరుతోనే వందకు మించిన బాలీవుడ్ సినిమాల మీద మొదటిసారిగా తెలుగులో అనేక వ్యాసాలు రాసిన రచయితగా ఖదీర్‌కు ఒక చిన్న అంశం గుర్తు చేయడం అవసరం. ‘బాలీవుడ్ క్లాసిక్స్’ అన్న పేరేమీ నా రిజిస్టర్డ్ ట్రేడ్‌నేమ్ కాదు. కానీ అదే పేరుతో ఒక వ్యాససంకలనం అప్పటికి సుమారు మూడేళ్ల ముందునుంచే సినిమా అభిమానుల మనసుల్లోనూ, మార్కెట్‌లోనూ పేరు తెచ్చుకుని ఉండగా, అదే పేరుతో మళ్లీ రాయడం దేనికీ...పైగా ఇదో కొత్త ఆలోచన అనడం దేనికీ? అన్నిటికీ మించి ఇందులో ఎంచుకున్నవన్నీ బాలీవుడ్ క్లాసిక్స్ కావు. అధిక శాతం బాలీవుడ్ సూపర్ హిట్స్ కాబట్టి ‘బాలీవుడ్ సూపర్‌హిట్స్’ పేరైతేనే ఈ సంకలనానికి చక్కగా సరిపోయి ఉండేది కూడానూ!!

అంజానా అంజానీ

‘వాట్ డు యు వాంట్ - టు డు బిఫోర్ యు డెత్’ - ఈ ఒకే ఒక్క గీతకి అనేకానేక మలుపులు. అనేకానేక సినీ కథలు. ఫ్రెంచ్ కథ ‘గర్ల్ ఆన్ ది బ్రిడ్జ్’తో మొదటి సన్నివేశం.. మొన్నామధ్య ‘ఇట్లు - శ్రావణి సుబ్రహ్మణ్యం’లోని సన్నివేశాలూ - ఆఖరికి పోస్టర్ కూడా నెగెటివ్ సిగ్నల్స్ ఇచ్చే మాదిరిగా ‘ఏన్ ఎడ్యుకేషన్’ చిత్ర సన్నివేశం - ఈ కథని ఎక్కడ్నుంచి ఎక్కడికో తీసుకెళ్లినా- దర్శకుడు సిద్దార్థ ఆనంద్ ‘ముద్దు ముద్దు’ సన్నివేశాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా - అది వృధా ప్రయాస. ఫలానా కథని... ఫలానా సన్నివేశాన్నీ ‘కొట్టేశామని’ నిజాయితీగా ఒప్పుకుని ఉంటే తీరు వేరేగా ఉండేదేమో? కానీ.. పాత హిందీ సినిమాల్లోని ‘లవ్ ఫార్ములా’లూ.. నిజమైన ప్రేమని గుర్తించి.. పశ్చాత్తాప పడటం.. ఎయిర్‌పోర్ట్ సీక్వెన్స్‌లూ - ఒకటి కాదు రెండుకాదు.. లాజిక్‌కి దొరకని ప్రశ్నలెన్నో. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి - లెంగ్త్ మితిమీరింది. అనుక్షణం - బాటిళ్లకి బాటిళ్లు మందు సేవనంతోనే ‘హీరోయిన్’ ప్రహసనం కొనసాగటం ఏవగింపు కలుగుతుంది. ఇదే ఇప్పటి ట్రెండ్ అంటే చేయగలిగిందేమీ లేదు.. ఒక్క విషయం చెప్పుకోవాలి. ఎడిటింగ్ విషయంలోనూ.. కథని చెప్పే తీరులోనూ.. సెంటిమెంట్‌ను పండించటంలోనూ - ముద్దు సన్నివేశాల చిత్రీకరణలోనూ చూపిన ప్రతిభ కథ పట్ల చూపిస్తే బావుంటుంది.
ఇదొక రొమాంటిక్ కామెడీ సినిమా. ఆకాశ్ (రణబీర్ కపూర్) ఒక కంపెనీ అధినేత. స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో కంపెనీ ‘షేర్’ పడిపోతుంది. కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి - స్నేహితుల మధ్య గొడవలు మొదలవుతాయి. ఆకాశ్ తీసుకున్న నిర్ణయాన్ని అంతా తప్పుపడతారు. చావొక్కటే శరణ్యమని భావిస్తాడు ఆకాశ్. అనుకున్నదే తడవుగా - ఆత్మహత్య చేసుకుందామని ‘బ్రిడ్జ్’ ఎక్కుతాడు. అప్పటికే హాయిగా మందు కొడుతూ చలాకీ ఉన్న కైరీ అక్కడ ఉంటుంది. ఆత్మహత్య చేసుకోటానికి వేరే ఆలోచన దేనికి? ఒక్కసారి దూకేస్తే సరి అంటూ ప్రోత్సహిస్తుంది కూడా. ఎందుకంటే - నేనూ కాసేపట్లో చచ్చిపోతాను కాబట్టి అంటుంది. అలా మొదలైన వారి ‘ఆత్మహత్యల’ ప్రహసనం అంతటితో ఆగిపోదు. ప్రయత్నాలూ జరుగుతూనే ఉంటాయి. అవన్నీ ఫెయిలవుతూనే ఉంటాయి. ఆఖరికి - ఇలా కాదని ‘ఆత్మహత్నా’ యత్నం లిస్ట్ తయారుచేసి - ఇంత చేసినా ఛావలేదంటే - ఏదో ప్రయోజనం కోసమేనని నిర్ణయించుకుంటారిద్దరూ. తమ తమ జీవితాల్లో ఏయే తీరని కోర్కెలు ఉన్నాయో వాటినన్నింటినీ తీర్చేసుకున్న తర్వాత చచ్చిపోదామని అనుకుంటారు. మధ్యమధ్యలో వీళ్ల ఎమోషన్స్.. న్యూయార్క్ సిటీ నుంచి లాస్ ఏంజిల్స్ నగరానికి ప్రయాణం... చివరికి శాన్‌ఫ్రాన్సిస్కోకి చేరటం - కథ బోలెడన్ని మలుపులు తిరిగి చిట్టచివరికి మళ్లీ అదే ముగింపులోకి వస్తుంది.
‘జాబ్‌లెస్ ఇన్ అమెరికా’ కథల్లో ఇదీ ఒక కథ అనుకుందాం. ఐతే - ‘ఆత్మహత్య మహా పాపం.. చచ్చి సాధించిందేమీ లేదు.. జీవించి సాధిద్దాం’ అన్న సీరియస్ కానె్సప్ట్‌ని ‘కామెడీ’గా చెప్పినా - అక్కడక్కడ యువత కోసం ‘వేడివేడి ముద్దు’ సీన్లు పెట్టినా - కాలేజీ ఎగ్గొట్టి కుర్రాళ్లు రాకపోవటానికి కారణం ఇందులో అసలు కథ లేకపోవటం. కథ ఎక్కడో చూసినట్టుందే అన్న భావన రావటం. ఈ సినిమాలో రణబీర్ నటన కంటె - ప్రియాంకా చోప్రాకే ఎక్కువ మార్కులు పడతాయి. ఒక విధంగా కథని నడిపించింది కూడా. కుర్రాళ్లని తన అందాలతో మత్తెక్కించింది. విశాల్-శేఖర్ సంగీతం ఫర్వాలేదు. ‘ఆస్ పాస్ ఖుదా’ పాట బాగుంది. చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతకు చక్కటి సందేశాన్ని అందించారీ చిత్రం ద్వారా. కానీ - అది ఎంతవరకు బుర్రల కెక్కుతుందో తెలీదు.

రోబో

రజనీ ‘రోబో’ అచ్చంగా ఇండియన్ మేడ్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాస్ ప్రేక్షకులను దృష్టిలో వుంచుకుని శంకర్ తయారు చేసిన టైలర్‌మేడ్. వందలాది కోట్లు పెట్టగల దమ్మూ, ధైర్యం వున్న మారన్ లాంటి నిర్మాత దొరికితే హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగల సత్తా వున్న జనం మన దగ్గరా వున్నారని, అంతటి ఊహాశక్తి, కల్పనా చాతుర్యం మనకూ వున్నాయని స్పష్టం చేసిన సినిమా ఇది. కేవలం హాలీవుడ్ స్థాయి సినిమా తీయడం ఒకటే లక్ష్యం కాకుండా, మన సినీ అభిమాన జనాల ‘లెవెల్’ను మర్చిపోకుండా తీయడంతో కచ్చితంగా గురిని చేధించగలిగింది. అదే కనుక తీసేది అంతర్జాతీయ స్థాయి సినిమా అనుకుని, ‘మేధావితనపు’ పోకడలు పోయి, సీరియస్‌గా తీసి వుంటే, పరిస్థితి వేరేలా వుండేది. అందువల్లనే సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ కొరవడినా, మన జనం అస్సలు పట్టించుకోలేదు. అవన్నీ చర్చించే ముందు కొద్దిగా కథను చూస్తే...
రోబోల యుగం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎలా వుంటుంది..రోబోల కారణంగా వచ్చే లాభ నష్టాలు ఏమిటన్నది సాదా సీదా ప్రేక్షకుడికి అర్ధమయ్యేలా అల్లిన కథ ఇది. డాక్టర్ వశీ (రజనీకాంత్) అన్ని విధాలా పరిపూర్ణమైన రోబోను తయారుచేసి, రక్షణ రంగానికి ఇచ్చి, జననష్టాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో విజయం సాధించి, అచ్చం తనలాంటి ఓ రోబోను తయారుచేస్తాడు. అదే చిట్టి (రజనీకాంత్). తీరాచేస్తే, చిట్టి రోబో మనుషుల్లా ఆలోచించలేదు కాబట్టి, సైన్యంలోకి అనుమతి ఇవ్వమంటారు రక్షణ రంగ నిపుణులు. దాంతో మళ్లీ శ్రమించి, ఆ రోబోకు మానవ ఆలోచనలు, మంచి చెడ్డలు అలవాటు చేస్తాడు. దీంతో కథ అడ్డం తిరిగి, ఆ చిట్టి కాస్తా, వశీ ప్రియురాలు సన (ఐశ్వర్యరాయ్)ను తాను కూడా కోరుకోవడం ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో చిట్టిని ధ్వంసం చేస్తాడు వశీ. మరోపక్క విదేశీ విద్రోహులతో చేతులు కలిపిన డాక్టర్ బోరా (డానీ) ధ్వంసమైన చిట్టిని మరమ్మతు చేసి, చెడు ఆలోచనలు కలిగిన రోబోగా తయారుచేస్తాడు. దీంతో ప్రారంభమైన విధ్యంసం ఎలా, ఏ తీరాలకు చేరిందన్నది మిగిలిన కథ.
ఇది ముమ్మాటికీ దర్శకుడు శంకర్ సినిమా. దీనికి రజనీ సూపర్ స్టార్‌డమ్ తోడయింది. రజనీ కాకుండా ఇంకెవరు ఈ సినిమా చేసినా ఓ కామెడీ సినిమాగా మిగిలిపోయి వుండేదంటే, ఆశ్చర్యం లేదా అతిశయోక్తి కాదు. కథను అల్లుకోవడం దగ్గర నుంచే దర్శకుడు శంకర్ తన సృజన అంతా ప్రదర్శించాడు. కథలో రోబోల మంచి చెడ్డలు చర్చించాలి..అవి సామాన్య జనానికి పట్టేటట్లు..అర్ధం అయ్యేటట్లు వుండాలి. అందుకు అనుగుణమైన సీన్లు రాసుకోవడం తొలి విజయం. ఇక్కడ హాలీవుడ్ సినిమా ప్రియులు ఏమనుకుంటారు , లాజిక్ వుందా లేదా అన్నవేవీ శంకర్ పట్టించుకోలేదు. సినిమా విజయానికి మూలమైన మాస్ మెంటాలిటీనీ మర్చిపోలేదు. రోబో మాగ్నెటిక్ పవర్‌కు రౌడీ మూక కత్తులన్నీ ఆకర్షించబడి, అతగాడు అమ్మవారిలా కనిపించి, భక్తులు జేజేలు పలకడం..రోబో వందలాది మందికి వంట చేయడం, క్షణాల్లో బోలెడు పుస్తకాలు చదివేయడం, గోరింటాకు డిజైన్లు వేయడం, అచ్చంగా దక్షిణాది, అందునా తమిళ ప్రేక్షకుల నాడిని పట్టుకోవడమే. ఇక ఇటు హీరో అటు విలన్ రెండూ రజనీకాంత్ అన్నట్లుగా కథ అల్లుకోవడం, వేన వేల రజనీకాంత్‌లతో సినిమాను దాదాపు 45 నిమషాలపాటు నడపడం కూడా ఇదే కోవకు చెందుతుంది. రజనీ సినిమా అంటేనే దాదాపు తొంభై అయిదు శాతం సీన్లు అతని చుట్టూనే తిరుగుతాయి. ఈ సినిమాలో వున్నవి నాలుగే ముఖ్యమైన పాత్రలు. రజనీ,రజనీ,ఐశ్వర్య,డానీ. దీంతో తొంభై ఎనిమిది శాతం సీన్లు రజనీతో నిండాయి. ఇది మరో పెద్ధ కమర్షియల్ ఎలిమెంట్. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది శంకర్ ఇమాజినేషన్. సాధారణంగా మరే దర్శకుడైనా అరడజను హాలీవుడ్ సినిమాల స్ఫూర్తిగా, వాటికి నకలుగా, మరోసారి టెక్నికల్ వర్క్ చేయించి వుండేవాడు. అలాకాకుండా దాదాపు నూటికి తొంభైపాళ్లు తన ఊహాశక్తికి పదునుపెట్టి సీన్లు సృష్టించాడు. అందునా చివరి నలభై అయిదునిమషాల గ్రాఫిక్ వర్క్స్ వెనుక శంకర్ ఊహాశక్తి(కొండకచో గాడ్జిల్లా తదితర సినిమాలు గుర్తుకు వచ్చినా) అపారంగా వుంది. ఈ సీన్లలో వేలాది మంది రజనీలతోనే ఫీట్లు చేయించాలన్న ఆలోచన, వాటితో చేసిన మాయాజాలం ఇవ్వాళ థియేటర్లు దద్ధరిల్లేలే చేస్తోంది. శంకర్ ఊహాశక్తికి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, హాలీవుడ్ స్పెషలిస్ట్‌లు స్టాన్ విన్స్‌టన్ స్టూడియా నిపుణులు జీవం పోసారు. దీనికి పోరాట సన్నివేశాలను డిజైన్ చేసిన పీటర్ హెయిన్స్, వూ పింగ్, కృషి తోడయింది.
ఇక శంకర్ స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. ముఖ్యంగా సినిమా మొదటిసగంలో ఒక్క అనవసర సన్నివేశం లేకుండా జాగ్రత్తపడ్డాడు. చిట్టి క్యారెక్టర్‌తోనే కామెడీ పండించి, ఫస్ట్ఫా ముగించి, సెకండాఫ్‌కు శ్రీకారం చుట్టాడు. అందుకు తగ్గట్లే ఎడిటింగ్ పనితనం తోడ్పడింది. నిజానికి సెకండాఫ్ స్క్రిప్ట్ కాస్త నిడివి ఎక్కువైందని అనిపించినా, చివరి నలభై అయిదునిమషాల గ్రాఫిక్ మాయాజాలం, దాన్ని కాస్తా తెలియకుండా చేసింది. సాంకేతిక విషయాల్లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన సంగతి రెహమాన్ నేపథ్యసంగీతం. అతను నేపథ్యసంగీతం అందించిన మంచి సినిమాల్లో రోబో కచ్చితంగా వుండి తీరుతుంది. కానీ పాటలకు అంత మంచి ట్యూన్లు సమకూరలేదు. అయితే శంకర్ చిత్రీకరణ మాయాజాలంలో ఆ లోటు చాలా వరకు కనిపించలేదు. ఎప్పటిలాగానే ఒక్కో పాటను ఒక్కో థీమ్‌తో చిత్రీకరంచారు. కానీ కిలిమంజారో పాటలో ఐశ్వర్య ధరించిన దుస్తుల నిడివి మరీ ఘోరంగా వుంది. ఒక సన్నివేశంలో ఆమె కాలు తిప్పిన భంగిమలో, ఆ కురచుదుస్తులు ఇబ్బందికరంగా అనిపించాయి. బహుశా సినిమాకు అదే అయిటమ్ సాంగ్ అనుకోవాలనేమో. ‘నీలో వలపు’, ‘కిలిమంజారో’ లొకేషన్లు సినిమా భారీ తనానికి అద్ధం పట్టాయి.
నటీనటుల విషయానికి వస్తే ఇది రజనీ విశ్వరూపానికి అద్ధంపట్టిన సినిమా. అసలే రజనీ జిమ్మిక్కులు..దానికి రోబో మాయలు తోడయితే, సూపర్‌మ్యాన్, స్పయిడర్‌మ్యాన్ లాంటి సినిమాలన్నీ కలిపి చూసినట్లే. పైగా రజనీ వయసును అరవై ఒక్క ఏళ్ల నుంచి ఒక్కసారి దాదాపు సగానికి తగ్గించిన చిత్రం...ఈ చిత్రంలోనే చూడగలం. ఇందులో రజనీ రెండు పాత్రలు పోషించినా, మూడు కింద లెక్క. సైంటిస్ట్ రజనీ, మంచి రోబో రజనీ, చెడ్డరోబో రజనీ. ఈ మూడిండికి బాడీ లాగ్వేంజ్, మూడ్స్, మ్యానరిజమ్, ఇలా అన్నింటిలోనూ స్పష్టమైన వైవిధ్యాన్ని కనబర్చాడు. ఇక ఐశ్వర్య చాలా స్లిమ్‌గా అందంగా కనిపించింది. అయితే కొన్ని సన్నివేశాల్లో హెయిర్‌స్టయిల్ వల్ల కొంచెం వయసు కనిపించినా, మరే సన్నివేశాల్లోనూ ఆమె వయసుకానీ, గృహిణి అన్న సంగతికానీ తెలియరాలేదు. పైగా కిలిమంజారో, ఇనుములో ఒక హృదయం, పాటల్లో ఆమె చాలా అందంగా కనిపించింది. డానీ పాత్ర మేరకు చేసాడు. చివరగా సినిమా గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే, రజనీ ఇమేజ్‌ను ఎంత మేరకు ఊహించుకోవచ్చో..ఆ లెవెల్‌కు గ్రాఫిక్స్‌ను కూడా ఊహించి, రెండింటిని కలగలపి, మాస్ నేల విడవకుండా శంకర్ చేసిన సక్సెస్‌ఫుల్, ప్లస్ అధ్భుతమైన ఫీట్ రోబో. అదే ది గ్రేట్ ఇండియన్ మ్యాజిక్.

బృందావనం

రాకొడితే ఏమవుతుంది..కిక్కు తలకెక్కుతుంది. అదే రెండు ‘రా’లు కలిపికొడితే ఏమవుతుంది..మరింత కిక్కెక్కుతుంది. బృందావనం సినిమా విషయంలో జరిగిందిదే. కలిసుందాం‘రా’... బావగారూ బాగున్నా‘రా’ అనే రెండు సినిమాలు కలిపితే, ‘బృందావనం’ అవుతుంది.
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో...ఎందుకు నచ్చుతుందో... ఎలా ఆలోచిస్తారో అన్నది ఓ బ్రహ్మపదార్ధం. అది అర్ధం చేసుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన నాటి నుంచీ మేధావులంతా తలమునకలై తపస్సు చేస్తూనే వున్నారు. అయినా ఫలితం అంతంతమాత్రం. బృందావనం సినిమా హిట్టయి, జనం చూస్తున్నారంటే, ఇలా అనుకోకతప్పదు. ఎందుకలా అనుకోవాలి... అని ఆలోచించే ముందు సినిమా కథ(లు) ఒకసారి తెలుసుకోవాలి.
ఆడుతూ పాడుతూ తిరిగే క్రిష్ (ఎన్టీఆర్) తండ్రి ఓ కోటీశ్వరుడు (ముఖేష్‌రుషి). కథానాయకుడు చాలా సినిమాల్లో లాగే ఫ్రెండ్ ప్రేమ పెళ్లి చేయడానికి హోరాహోరీ యుద్ధాలు సాగిస్తాడు. అదీ ఇంట్రడక్షన్. అతనికో ప్రియురాలు ఇందు (సమంత). కష్టాలు లేకుండా జీవితం సాగిపోతోందనుకుంటే, ప్రియురాలి, ప్రాణస్నేహితురాలు భూమి(కాజల్)ని, ఇబ్బందుల్లోంచి తప్పించడానికి ఓ ప్రేమనాటకం ఆడాల్సి వస్తుంది. భూమి తండ్రి రామ్‌ప్రసాద్(ప్రకాష్‌రాజ్)కు, అతని సవతి తమ్ముడు (శ్రీహరి)కి మధ్య వున్న తగవులు, ఊర్ల మధ్య గొడవలు.. ఉమ్మడి కుటుంబం.. వగైరా వ్యవహారాలెన్నో వుంటాయి. ఈ సమస్యలన్నీ చక్కదిద్ది రెండు కుటుంబాలు ఒకదగ్గరికి చేరడంతో కథ విశ్రాంతికి చేరుతుంది. అంటే ప్రేక్షకులు కలిసుందాం రా.. సినిమా దాదాపు చాలా వరకు చూసేసినట్లే.
ఇక రెండవ సినిమా, బావగారూ బాగున్నారా విశ్రాంతి తరువాత ప్రారంభమవుతుంది. ఇందు, భూమి వరసకు అక్కచెల్లెళ్లన్న సంగతి అప్పుడే బయటపడుతుంది కాబట్టి. ఒక పక్క భూమితో క్రిష్ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతుంటాయి.. మరోపక్క ఏమి చేయాలో తెలియక నైన్టీన్ సెవెంటీస్‌లోలా హీరో.. ‘హీరోయిన్లు’ విరహగీతాలాలపిస్తుంటారు.. ఇలాంటి కథ ఎలా ముగించాలి..ఇద్దరు హీరోయిన్లలో ఒకరు చావనన్నా చావా లి..త్యాగమన్నా చేయాలి..లేదా..ఆ మూ డో ఆప్షనేమిటో..శోభన్‌బాబు, జగపతిబాబు సినిమాలు చూసి తరించిన వారందరికీ తెలుసు. అదే జరిగింది.
ఇక మరి ఇలా రెండు కథలు మిక్సీలోవేసి రుబ్బితే, సినిమా జనానికి ఎందుకు నచ్చుతోంది..అన్నది పెద్ద ప్రశ్న. దీనికి కారణం ఒక్కటే. దర్శకుడు వంశీపైడిపల్లి స్క్రిప్ట్ వర్క్. పెద్దగా గజిబిజి లేకుండా, స్ట్రయిట్‌గా నెరేట్ చేసిన తీరు. రెండవది దర్శకుడు సినిమాకు కావాల్సిన మసాలాలన్నీ కచ్చితంగా సమపాళ్లలో రంగరించాడు కనుక. ఇక దానికి సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, యాక్షన్ సన్నివేశాలకు రూపకల్పన చేసిన రామ్‌లక్ష్మణ్ అద్భుతంగా తమ వంతు సహకారం అందించారు. కథలో ఎంత పాత వాసనలున్నా, కొత్తగా, వీలయినంత అందంగా చూపించడానికి ఛోటా, యాక్షన్ సన్నివేశాలను మరింత విభిన్నంగా రూపొందించడానికి రామ్‌లక్ష్మణ్ తమ సృజనకు మరింత పదునుపెట్టారు. ఆనంద్‌సాయి ఆర్ట్ డైరక్షన్ సినిమాకు నిండుతనాన్నిచ్చింది. మొత్తం మీద ఇలా అన్నీ కలిసొచ్చి, సినిమా మాస్ జనాలకు పట్టేలా తయారైకూర్చుంది. దీనికితోడు ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు, కళ్ల నీళ్ల తడి కనిపించే సీన్లు మహిళాప్రేక్షకుల కోసం వుండనే వున్నాయి. సినిమాలో సాంకేతికంగా వెనకబడినదేదైనా వుందంటే అది థమన్ సంగీతం ఒకటే. నేపథ్య సంగీతం, అన్ని సన్నివేశాల్లోనూ భారీగా వినిపించింది. పాటలు సినిమాలో చిత్రీకరణ హడావుడికే తప్ప బయట వినేందుకు వీలుగా లేవు.
ఇక నటీనటులందరికీ (ప్రకాష్‌రాజ్, శ్రీహరి, కోటా, తనికెళ్ల, ఆహుతిప్రసాద్, రఘుబాబు, బ్రహ్మానందం, వేణుమాధవ్, ముఖేష్‌రుషి, అజయ్‌వగైరా) ఇటువంటి పాత్రలు పాతవే. ఒక్క ఎన్టీఆర్‌కు తప్ప. సగం సన్నివేశాల్లో ఇంతవరకు చేయని పాత్రను చేయాల్సి వచ్చింది. సినిమాలో ఓ డైలాగ్ వుంది..‘కొత్తగా వుందని ట్రయ్ చేసా..అసలు స్వరూపం లోపల వుండనే వుంది’ అని. కొత్త తరహా పాత్రను ఎన్టీఆర్ బాగానే చేసాడు. ఇక కాజల్, సమంతా కూడా పాత్రలకు బాగానే సరిపోయారు. అవసరమైన సన్నివేశాల్లో వారి ముఖాల్లో ఫీలింగ్స్‌ను గమనించే అవకాశాన్ని దర్శకుడు, ఫొటోగ్రాఫర్, ప్రేక్షకులకిచ్చారు. చాలా సినిమాల్లో హీరోయిన్లకు ఈ అవకాశం దక్కడం లేదు. పైగా ఓ మాస్ పాటలో ఇద్దరు హీరోయిన్లు, ఇద్ధరు వ్యాంప్‌లకు తీసిపోని చందంగా యథాశక్తి గెంతి, సినిమా విజయానికి తమ వంతు సాయం అందించారు. పైగా ఆ పాటలో పదాలు కూడా అలాగే వున్నా యి.. ‘రా..రా..కుమ్మెయ్‌రా..ఏదో చేసేయ్‌రా’ అంటూ.. ఇవన్నీ చాలవా.. నిర్మాత దిల్‌రాజు గట్టెక్కడానికి.

ఝూఠా హి సహి

‘జానే నాతు.. యా జానే న’.. సినిమా చూశారా? ఇమ్రాన్‌ఖాన్ - జెనీలియా డిసౌజా ‘కెమిస్ట్రీ’కి తగ్గట్టు మలిచిన దర్శకుడు అబ్బాస్ తైర్వాలాని అభినందించకుండా ఉండలేం. మరి ఈ సినిమాకి వెళ్లే ముందు ఆ మాత్రం ‘ఎక్స్‌పెక్టేషన్స్’ ఉంటాయి. ఇక ఎ.ఆర్.రెహమాన్ సుమధుర సంగీతం. రెండేళ్ల తర్వాత మళ్లీ తెర మీదికి వస్తున్న అబ్బాస్ - రెహమాన్‌ల చిత్రం ‘అబద్ధం’గా మిగిలిపోతుందా? లేక ప్రేక్షకుల ఊహ నిజమవుతుందా? ఐతే - మొట్టమొదటిగా చెప్పొచ్చేదేమిటంటే - ఏ సినిమాకి ఆ సినిమానే. ఈ సినిమాకి ఈ సినిమానే. అన్ని కథలు ఒక్కలా ఉండవు అన్నది. సింగిల్ లైన్ (వన్ లైఫ్) స్టోరీకి ఎన్నో అంశాలను అతికించటంలో అక్కడక్కడ తడబడ్డా.. స్లో మోషన్‌లో గాడిలో పడింది. ఇటీవలి కాలంలో వస్తున్న బాలీవుడ్ చిత్రాలన్నీ విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకోవటం వెనుక ఉన్న కారణాల్ని పరామర్శించకుండా (ఉదా.అంజానె.. అంజాని - హౌస్‌ఫుల్.. ఒకటి కాదు (?) ఎన్నో.) లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అన్న రైమ్ దగ్గరికి వెళ్దాం. (అంజానె అంజాని కథ కూడా బ్రిడ్జి దగ్గరే మొదలై బ్రిడ్జి దగ్గరే ముగుస్తుంది. ఆత్మహత్యల కానె్సప్ట్ బ్రిడ్జి కానె్సప్ట్ అక్కడా ఇక్కడా ఒక్కటే. తప్పు ఎవరిదో తెలీదు).
సింగిల్ లైన్ కథలో - సిద్దార్థ (జాన్ అబ్రహాం) జీవితం సింపుల్‌గా నడిచిపోతూంటుంది. ‘కాగజ్ కే ఫూల్’ సెకండ్ హ్యాండ్ బుక్‌స్టాల్ నడుపుతూ అతడితోపాటు కాసినోవా ఉదిత్ గుజ్జు అమిత్, పాకిస్తానీ ఒమర్, అతడి ప్రెగ్నెంట్ చెల్లెలు అలియా, అలియా బాయ్‌ఫ్రెండ్ నిక్.
‘దోస్త్ ఇండియా’ అనే హెల్పింగ్ ఆర్గనైజేషన్ కరపత్రంలో సిద్దార్థ ఫోన్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఆ ఆర్గనైజేషన్ ‘ఆత్మహత్య’లు చేసుకోబోతున్న వారికి ఉచితంగా కౌనె్సలింగ్ చేస్తుంది. ఇకనేం? అన్ని కాల్స్ సిద్దార్థకి వచ్చేస్తూ అర్ధరాత్రిళ్లు ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒకరోజు మిష్కా (పాఖీ) సిద్దార్థకి ఫోన్ చేస్తుంది. ఆమె కథ చెబుతుంది. బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడంటుంది. ఇక్కడ్నుంచీ కథ ఎంతో ‘స్లో’గా నడుస్తూ రొమాంటిక్ కామెడీలోకి దిగుతుంది. ఒక్కో పాత్ర ఒక్కో సమస్యతో సతమతమవుతూ కామెడీని సృష్టిస్తుంది. ‘్ఛజ్ యువర్ లవ్ బిఫోర్ ఇట్స్ టూ లేట్’ అన్న కోణంలో క్లైమాక్స్‌కి చేరుతుంది. మిష్కా తన బాయ్‌ఫ్రెండ్ కరీం (మాధవన్)ని కలిసిందా? సిద్దార్థగా పరిచయమైన ఫోన్ ఫ్రెండ్ ‘్ఫదా’ పరిస్థితి ఏమిటి? మిష్కా చివరికి ఎవరిని కోరుకుంది? అన్న ప్రశ్నలను చివరికంటా కొనసాగిస్తే ‘ఝూఠా హి సహి’ ముగుస్తుంది.
తాజాగా రిలీజవుతున్న చిత్రాలన్నింటిలోనూ ఏదో ఒక సీరియస్ కానె్సప్ట్‌ని తీసుకోవటం.. దాని చుట్టూ కథ అల్లుకోవటం (అంజానె.. అంజానీలో ‘ఆత్మహత్యల’ నేపథ్యం - క్రూక్‌లో ‘్భరతీయులపై ఆస్ట్రేలియన్ల దాడి’.. నాకౌట్‌లో బ్లాక్ మనీ) ఇది మంచి పరిణామం. కాకపోతే క్లైమాక్స్ లన్నీ ఎయిర్‌పోర్ట్ నుంచి బ్రిడ్జ్‌ల దగ్గరికి మారినట్టున్నాయి. అదీ కూడా మారితే బావుణ్ణు.
లండన్ లొకేషన్స్.. కెమెరా వర్క్‌తో కన్నుల పండువగా ఉన్నాయి. ఎ.ఆర్.రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. పాటలు వినసొంపు. జాన్ అబ్రహాం నటన ఓకే. కృతికగా మానసి స్కాట్ ఫర్వాలేదు. కేరెక్టర్ లెంగ్త్ తక్కువ. పాఖీ నటన కూడా ఓకే. బాలీవుడ్ సినిమాల్లో కనిపించే ప్రేమ ‘సెంటిమెంట్’ ఈ చిత్రంలోనూ మనసుని టచ్ చేసింది

Saturday, October 30, 2010

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం

శ్రావణి (తనూరాయ్) సుబ్రహ్మణ్యం(రవితేజ)లు వైజాగ్ బీచ్‌లో పరిచయం అవుతారు. వారు అక్కడకు వచ్చింది ఆత్మహత్యచేసుకోవాలని. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో ఒకరికొకరు వివరించుకొని ఒక ఒప్పందానికి వస్తారు

సత్తే పే సత్తా - మా అన్నయ్య బంగారం

ఇది ఏడుగురు అన్నదమ్ముల కథ. రవి (అమితాబ్ బచన్) ఇంట్లో అందరికన్నా పెద్దవాడు. చిన్నతనం నుంచి తమ్ముళ్ళ అలనాపాలనా అన్నీ తానే చూసేవాడు. తల్లిదండ్రి తానే అయి వారిని పెంచుతాడు. వారిదొక అందమైన కుటుంబం. ఒకరి నుంచి ఒకరికి విడతీయలేని అనుబంధం. రవి తరచుగా పక్క ఊరికి వెళ్ళినప్పుడు ఇందు (హేమమాలిని)తో పరిచయం అవుతుంది. అది కాస్తా ప్రేమగా మారి వారిద్దరూ పెళ్ళిచేసుకుంటారు.

అసలు విషయమేమిటంటే అత్తగారింట్లో అడుగుపెట్టేవరకు తన భర్తకి ఇంత పెద్ద కుటుంబం ఉందనే విషయం ఇందుకి తెలియదు ...! ఈ విషయాన్ని ఇందు జీర్ణించుకోలేకపోతుంది. ఆకుటుంబంలో ఇందు ఎలా మెలగిందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో, ఆ తరవాత జరిగిన కథేంటో

గతంలో మన పెద్దవాళ్లు ఉమ్మడి కుటుంబాలను ఇష్టపడేవారు. ఇప్పుడొస్తున్న మనుషులు బాగా చదువుకున్నా మనసులు కుంచించుకుపోయి చిన్న కుటుంబాలంటేనే ఇష్టం పెంచుకుంటున్నారు. ఎక్కువమంది వుంటే ఎక్కువ పనిచేయాలని వాళ్ల భయం. పనిని చూసి భయపడే జాతిలోకి మానవజాతి వెళ్లిపోతోంది. పనిచేయలేని, బలంలేని మనుషుల సమాజాన్ని మనమే (సమిష్టి కుటుంబాలను నాశనం చేసి) నిర్మించుకుంటున్నాం. చిన్న కుటుంబాలు, అందులో పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టాలనుకునే వాళ్లు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. ఎంతసేపు ఏకాంతం, ఏకాంతం అంటూ ఏడుస్తున్నారే గానీ నలుగురు కలిసి నవ్వేచోట వసంతం విరబూస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి మనస్తత్వం వున్న ఓ అమ్మాయి ఓ పెద్దకుటుంబంలోకి వస్తే ఎలా ఉంటుంది అన్న పాయింటుతో సాగిన చిత్రమే మా అన్నయ్య బంగారం. కథాపరంగా... శివాజీ (రాజశేఖర్)కు ఆరుగురు తమ్ముళ్లు. తల్లిదండ్రులు తన చిన్ననాటనే చనిపోగా తమ్ముళ్లకు తానే అన్నీ అవుతాడు. తముళ్ల కోరికతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని మంజు (కమలినీ ముఖర్జీ)ని తన ఇల్లాలిగా ఆహ్వానిస్తాడు. పెద్ద కుటుంబంలో తన అక్క నందిని (ఝాన్సీ) అనుభవించిన పనిమనిషి హోదాను మరిచిపోలేని మంజు పెద్దకుటుంబాలను ఇష్టపడదు. శివాజీ బాబాయి (జయప్రకాష్‌రెడ్డి) వంద అబద్ధాలాడినట్టుగా తమ్ముళ్ల విషయం దాచిపెట్టి పెళ్లి జరిపిస్తాడు. నిజాన్ని గ్రహించిన మంజు తన పుట్టింటికి వెళ్లిపోతుంది. శివాజీ తమ్ముళ్లున్న ఆ ఇంట్లో అడుగుపెట్టనని మొరాయిస్తుంది. అన్నయ్య బాధ చూడలేక తమ్ముళ్లు త్యాగం చేసి వదినని ఇంటికి ఎలా రప్పించారన్నది మిగతా కథ.
కథలో పెద్ద విషయం కనిపించదు. గతంలో చెల్లెలి కాపురంపై అక్క పెత్తనం చేసే చిత్రాలు మనకు వచ్చాయి. ఆ చిత్రాల్లో వున్నట్టు ఈ కథలో స్పష్టత కరువైంది. ఒక్క అన్నకు ఐదుగురు చెల్లెళ్ల కథలు కూడా మనం చూసాం. ఇప్పుడు చెల్లెళ్ల బదులు తమ్ముళ్లు వచ్చారు. అయితే చిత్రమంతా ఒకేగాటున కట్టినట్టుగా అదేకథపైనే నడుస్తుంది. కామెడీకి ఎక్కడా స్థానం లేదు. పావలా శ్యామల, ఎల్బీ శ్రీరాం, బ్రహ్మానందంలు ఒకటీ రెండు షాట్స్‌లో కనిపించినా ఏమాత్రం హాస్యం పండించలేదు. అన్నదమ్ముల మధ్య సెంటిమెంటు కూడా బలంగా చూపే ప్రయత్నం జరగలేదు. ఎంతసేపూ బిర్యానీలు తెచ్చి తమ్ముళ్లకు తినిపిస్తే సరిపోతుందా? హీరో తన తమ్ముళ్లకు, కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే సన్నివేశాలు మాత్రం బాగా వచ్చాయి. తమ్ముళ్లందరు వదినకోసం ఒక్కొక్కరు ఇల్లు విడిచి వెళ్లిపోయే సన్నివేశాలను బాగా తీసారు. అసలు అబద్ధాలపై చేసిన పెళ్లిలో ఎప్పటికైనా తిప్పల పాలు కాకతప్పదని చెప్పే ప్రయత్నం చేసినా, స్క్రిప్ట్‌లో దమ్ము లేకపోడంతో చాలా సన్నివేశాలు తేలిపోతాయి. తరువాత వచ్చే సన్నివేశం ఏదో, అది ఎలా ఉండబోతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. దాంతో చూసేవారికి ఉత్సాహం రాదు. సోసోగా సాగిపోతుందని అర్ధమవుతుంది. ‘సూర్యుడెప్పుడొస్తాడో చెప్పగలం, చంద్రుడెప్పుడొస్తాడో చెప్పగలం, అటు ఇటు కాకుండా అసుర సంధ్యలో వదిలి వెళ్లిన ఆమె ఎప్పుడొస్తుందో చెప్పలేం’ అని ఓ డైలాగ్ వుంది. సెంటిమెంట్ అవసరమే! కానీ మాటల్లో ఓపలేనంత బరువైన డైలాగుల సెంటిమెంట్ అవసరమా? అన్న అనుమానం వస్తుంది. తమ్ముళ్ల పాత్రలన్నీ ఆటలో అరటిపండ్లే! వాటికి పెద్ద ప్రాధాన్యత లేదు.
నటనలో రాజశేఖర్ తన పాత పద్ధతినే పాటిస్తూ వెళ్లాడు. కమలినీకి నటించే పాత్ర వున్నా, స్క్రిప్ట్‌లో బలం లేకపోవడంతో వెలవెలబోయింది. మిగతా వాళ్లంతా సోసోనే. ఎస్.ఎ.రాజ్‌కుమార్ సంగీతంలో ‘నీ అసలు పేరు’, ‘మళ్లీ మళ్లీ మనసు తుళ్లి తుళ్లి’ పాటలు ఫరవాలేదు. నేపధ్యసంగీతం హోరు ఎక్కువైంది. పరుచూరి మాటలు గుర్తుంచుకునేలా ఏం లేవు. ప్రసాద్‌బాబు కెమెరా బాగా పనిచేసింది. ముఖ్యంగా పాటల్లో విజువల్స్ బాగున్నాయి. దర్శకత్వపరంగా పెద్దగా చెప్పుకునేదేం లేదు. సోసోగా సాదాసీదాగా తీసాడు. హీరో రాజశేఖర్ ఇక ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కథలకు స్వస్తి చెప్పి కొత్తదనం వున్న కథలను ఎంచుకుంటే అతడి కెరీర్ మరికొంతకాలం సజావుగా సాగగలదు. మొత్తం మీద ఈ అన్నయ్య రొటీన్ చిత్రాల జాబితాలోనే చేరిపోయాడు.

హేరా ఫేరి

శ్యామ్ (సునీల్ షెట్టి) వాళ్ళ నాన్న సర్వీస్‌లో ఉన్నప్పుడే, ఆఫీస్‌లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. ఆ ఉద్యోగం కోసం శ్యామ్ ముంబై వస్తాడు. అతనికి అనుకోకుండా అనురాధ (బిపాసా బసు) పరిచయం అవుతుంది. అనురాధది కూడా శ్యామ్‌లాంటి కేస్! తనూ ఉద్యోగంకోసం ముంబై వస్తుంది. బాబురావ్ (పరేష్ రావల్) చాలా పెద్ద కోటీశ్వరుడు. అతని ఇంట్లో తక్కువ అద్దెకు దిగుతాడు శ్యామ్. అదే అపార్ట్‌మెంట్‌లో రాజు (అక్షయ్ కుమార్) అద్దెకు ఉంటాడు. అతనికి ఉద్యోగం ఉండదు. ఈ ముగ్గురికి అటూ ఇటూ తేడాతో ఒకే సమస్య డబ్బు. ఒకరోజు వీళ్ళకు ఓ కిడ్నాప్ విషయమై మాట్లాడుకుంటున్న ఫోన్ క్రాస్ కనెక్ట్ అవుతుంది. దానిని వీళ్ళంతా సొమ్ము చేసుకోవాలనుకుంటారు. ఆ ప్లాన్‌లో భాగంగా ఈ కోతిమూక చేసే అల్లరి

ఖుద్దార్

హరి (సంజీవ్ కపూర్) సీమ (తనూజ)ను పెళ్లాడుతాడు. హరికి ఇద్దరు తమ్ముళ్లు (సవతితల్లి కొడుకులు) ఉంటారు. వాళ్లు గోవింద్ (అమితాబ్ బచ్చన్), రాజేష్ (వినోద్ మెహ్ర). ఒకరోజు తన భర్త హరి లేని సమయం చూసి గోవింద్, రాజేష్‌లను ఇంట్లో నుంచి పంపించేస్తుంది సీమ. వాళ్లిద్దరు బొంబాయి చేరి అక్కడ రోడ్ల మీద అడుక్కుంటారు. గోవింద్ రాత్రి పగలూ బాగా కష్టపడి చిన్నతమ్ముడైన రాజేష్‌ను బాగా చదివిస్తాడు.

రాజేష్ బాగా చదువుకొని మంజూ (బిందియా గోస్వామి)ని పెళ్ళి చేసుకుంటాడు. అనుకోని సంఘటనల మూలంగా గోవింద్ ఒక హత్య కేసులో, రాజేష్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుంటారు. ఈ విషయమై అన్నదమ్ములు ముగ్గురూ అనుకోని విధంగా న్యాయస్థానంలో కలుసుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ అన్నయ్య హరి అక్కడ న్యాయవాది. వారిద్దరి కేసులూ ఆయన దగ్గరికే వస్తాయి. ఆ తరువాత ఏం జరిగిందో

బోల్ రాధా బోల్

కిషన్ (రిషికపూర్) తల్లి సుమిత్రాదేవితో కలిసి ఉంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన వాళ్ళకు వ్యాపారాలుంటాయి. తమ గ్రామంలో మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించడం కోసం కిషన్‌ను తల్లి ఆ గ్రామానికి పంపుతుంది. కిషన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించి, గ్రామస్తులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాడు. అక్కడ అతను రాధ (జుహీచావ్లా)ను కలిసి, ఆమెతో ప్రేమలో పడతాడు. రాధను పెళ్ళి చేసుకుంటానని చెప్పి, తిరిగి తల్లి దగ్గరకు వెళతాడు. అతను తిరిగి వెళ్లేసరికి ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. అక్కడ తన పేరుతో ఇంకొకతను వచ్చి, తనే కిషన్ అని చెప్పి ఉంటాడు. చిత్రమైన విషయమేంటంటే కిషన్ తల్లి, అతని పెంపుడు కుక్క కూడా అతనే కిషన్ అని నమ్ముతారు. తనే అసలైన కిషన్ అని ఎలా నిరూపించుకున్నాడనేది

చాందిని

యష్ చోప్రా నిర్మించి, దర్వకత్వం వహించిన ఈ చిత్రం 1989సం॥బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. అంతేకాకుండా తెలుగు పరిశ్రమనుండి హిందీ పరిశ్రమకు వెళ్ళిన శ్రీదేవి నెం.1 స్థానం పొందటానికి ఈ చిత్రం ఎంతో దోహదపడింది. ఇక కథ విషయంలోకి వస్తే.. రోహిత్ ఒక ఫంక్షన్‌లో చాందినిని చూసి ప్రేమిస్తాడు. అతని కుటుంబ స్థాయికి తగిన అమ్మాయి చాందిని కాదని పెద్దలు వద్దంటారు. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాని అనుకోకుండా జరిగిన ప్రమాదంలో రోహిత్‌కి నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అతని కుటుంబసభ్యులు చాందిని వల్లే ఈ ప్రమాదం జరిగిందని అతణ్ణి మర్చిపొమ్మని ఆమెను బలవంతం చేయగా ఆమె అక్కడనుంచి ముంబై వెళ్ళిపోతుంది. అక్కడ లలిత్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు.

కోయీ...మిల్‌గయా

సంజయ్ మెహ్రా (రాకేష్ రోషన్) సైంటిస్ట్. అతను గ్రహాంతర జీవితం మీద రీసెర్చ్ చేస్తాడు. కంప్యూటర్ నుండి అంతరిక్షానికి సందేశం పంపిస్తాడు. దానికి సమాధానం వస్తుంది. తన విజయాన్ని తనవాళ్ళతో పంచుకోవాలనుకునే సమయానికి ప్రమాదంలో చనిపోతాడు. అతని భార్య సోనియా (రేఖ) రోహిత్ (హృతిక్ రోషన్)కి జన్మనిస్తుంది. రోహిత్ తన తండ్రి వాడిన కంప్యూటర్‌ని తన స్నేహితురాలు నిషా (ప్రీతి జింటా) సహాయంతో ఉపయోగిస్తాడు.

బాషా

మాణిక్యం (రజనీకాంత్) ఆటోడ్రైవర్. అనవసరమైన విషయాలలో గొడవలు పడకుండా ఎంతో నిజాయితీగా తన వృత్తిని చేసుకుంటూ చెల్లెళ్లని, తమ్ముడిని చదివిస్తుంటాడు. ఒక ధనవంతుని కూతురైన ప్రియ (నగ్మా) మాణిక్యంలోని మంచితనం, నిరాడంబరత్వం చూసి ప్రేమిస్తుంది. మాణిక్యాన్ని తన తండ్రికి పరిచయం చేయడానికి వారి ఇంటికి ప్రియ ఆహ్వానిస్తుంది. ప్రియ తండ్రి మాణిక్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు.

శుభలగ్నం

అమాయకత్వాన్ని, అత్యాశని తనలో దాచుకున్న ఓ అభాగ్యురాలైన భార్య కథ ఇది. అందని పళ్లకు అర్రులు చాపొద్దని భర్త ఎంత చెప్పినా వినకుండా.. అవసరాలకోసం, ఖరీదైన జీవితం కోసం తన భర్తను ఓ కోటీశ్వరుడి కూతురికి కోటి రూపాయలకు అమ్ముకుంటుంది ఇందులో కథానాయిక పాత్ర. తన భర్త, పిల్లలు తనతోటే ఉంటారు కదా అనే ధైర్యంతోనే ఆ పనికి ఒడిగడుతుంది ఆ అమాయకురాలు. తన భర్తను ఆ కోటీశ్వరుడి కూతురుకి ఇచ్చి పెళ్లి కూడా చేస్తుంది. కాని పెళ్లి ఆయిన మరునాటి నుంచి భర్త, పిల్లలు తనకు దూరమైపోతుంటే తట్టుకోలేకపోతుంది. నా భర్తను నాకు ఇచ్చేయమని కొత్తగా వచ్చిన తన సవతితో పోట్లాటకు కూడా దిగుతుంది. చివరకు ఆ అమాయకురాలి జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో

మేజర్ చంద్రకాంత్

అణువణువునా దేశభక్తి నింపుకున్న మిలటరీ మేజర్ చంద్రకాంత్ ఉద్యోగ విరమణ పొంది ఇంటికి చేరతాడు. తన కంటి ముందు అన్యాయం జరిగితే సహించలేని చంద్రకాంత్, సిటీలో ఎంపి చేస్తున్న దుర్మార్గాలకు అడ్డు నిలుస్తాడు. సాక్ష్యాధారాలతో సహా ఎంపిని కోర్టుకు ఈడ్చి.. జైలుకు పంపాలని చూస్తాడు. కాని ఎంపి చంద్రకాంత్ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టి, చంద్రకాంత్‌ని ఒంటరివాడిని చేస్తాడు. కాని ఈ పోరాటంలో చంద్రకాంత్‌కి తన కొడుకు అండగా నిలుస్తాడు. ఈ పోరాటంలో చంద్రకాంత్ తన ప్రాణాలను కోల్పోతాడు.

హమ్ దిల్ దే చుకే సనమ్

నందిని (ఐశ్వర్యారాయ్) హిందూస్తానీ సంగీత విద్వాంసుడు పండిట్ దర్బార్ కూతురు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. పండిట్ దర్బార్ ఆ కుటుంబానికి పెద్ద. సమీర్ (సల్మాన్‌ఖాన్) పండిట్ వద్ద సంగీతం నేర్చుకోవడానికి ఇటలీ నుంచి వస్తాడు. నందిని, సమీర్ ప్రేమలో పడతారు. వాళ్ల ప్రేమను పండిట్ అంగీకరించకుండా, సమీర్‌ను పంపించివేస్తాడు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ధనవంతుడైన వన్‌రాజ్ (అజయ్ దేవ్‌గన్) నందినిని ప్రేమిస్తాడు. అతను తన తండ్రి ద్వారా ఆ విషయాన్ని పండిట్‌కు తెలియజేస్తాడు. పండిట్ ఆ సంబంధం ఒప్పుకుని, నందినికి ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తాడు. పెళ్లి తర్వాత నందిని వన్‌రాజ్‌తో కలిసి జీవించడానికి నిరాకరిస్తుంది. దాంతో, వన్‌రాజ్ ఆమెను సమీర్ వద్దకు ఇటలీకి తీసుకువెళతాడు. అక్కడ చాలా అన్వేషణ అనంతరం చిట్టచివరకు సమీర్‌ను కలుసుకుంటారు

నో ఎంట్రీ

కిషన్ (అనిల్‌కపూర్) ముక్కుసూటి మనిషి, కాని అతని భార్య కాజల్ (లారాదత్తా) ఏవేవో ఊహించుకుని గొడవలు పడుతుంటుంది. మరి ఇంకో పక్క ప్రేమ్ (సల్మాన్‌ఖాన్) విషయానికొస్తే చాలామంది అమ్మాయిలతో తిరుగుతున్నా భార్య పూజ(ఈషా డియోల్) అంటే చాలా ఇష్టం, అలాగే పూజకి ప్రేమ్ గురించి అన్నీ తెలిసినా, భర్త మీద ఉన్న ప్రేమతో ఎప్పటికైనా మారతాడనుకుంటుంది. ప్రేమ్ వేసిన ప్లాన్‌లో భాగంగా కాల్ గర్ల్ బాబీ(బిపాసాబసు)ని కలుస్తాడు కిషన్. బాబీ, కిషన్ కలిసున్న ఫొటోలను కాజల్‌కి చూపించి కిషన్‌ని ఇరుకున పెట్టాలని ప్రేమ్ వేసిన ప్లాన్ వల్ల చివరకు ఏం జరిగిందో

హమ్

టైగర్(అమితాబ్ బచ్చన్) తండ్రి భక్తియార్ (డానీ)దగ్గర బాడీగార్డ్‌గా పనిచేస్తుంటాడు. అతడు పనివాళ్ళపట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. ఒకసారి టైగర్ స్నేహితుడిని భక్తియార్ చంపేస్తాడు. ఆధారాలను సేకరించి భక్తియార్‌ని పోలీసులకు అప్పచెబుతాడు. ఆ కోపంతో భక్తియార్ మనుషులు టైగర్ తండ్రిని చంపేస్తారు. టైగర్ తన ఇద్దరు తమ్ముళ్ళని ఊరికి దూరంగా తీసుకొని వెళ్ళి పెంచి పెద్దచేస్తాడు

యమదొంగ

ఈ సోషియో ఫాంటసీ సూపర్‌హిట్ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. రాజా (ఎన్.టి.ఆర్)పేరుమోసిన దొంగ. మహి(ప్రియమణి) ధనవంతుల ఇంట్లో పుట్టినా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మేనమామల దగ్గర బాధలు పడుతుంటుంది. మహి పేరుమీదున్న ఆస్తిని ఆమెను చంపి ఎలాగైనా చేజిక్కించుకోవాలని మేనమామలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా తప్పించుకొని రాజా ఆశ్రయం పొందుతుంది. కోట్లకు వారసురాలని తెలుసుకున్న రాజా ఆమెను వారి ఇంటికి పంపితే ఎక్కువ డబ్బు తీసుకోవచ్చని ఆశపడతాడు. కాని అక్కడకు వెళ్ళిన తరువాత ఆమెను డబ్బుకోసం ఎన్నో బాధలు పెడుతున్నారని తెలుస్తుంది. ఇంతకీ మహిని, ఆస్తిని కాపాడతాడా?

యారానా

కిషన్ (అమితాబ్ బచ్చన్) బిషన్ (అమ్జాద్ ఖాన్)లు చిన్ననాటి స్నేహితులు. ధనవంతుడైన బిషన్ ముంబైలో మామయ్య దగ్గర ఉంటాడు. బీదవాడైన కిషన్ మంచి గాయకుడు. అతనికి మంచి అవకాశాలు కల్పించాలని బిషన్ ముంబైకి తీసుకొని వచ్చి భరత్‌జీ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తాడు. కిషన్ మంచి గాయకుడు అవుతాడు. ఇతని ప్రతిభను గుర్తించిన బిషన్ మామయ్య, అతని కొడుకు తమ స్వార్థం కోసం వాడుకుంటారు. ఆ తరువాతజరిగే

హే బేబీ

అరుష్ (అక్షయ్ కుమార్) తన్మే (రితేష్ దేశ్‌ముఖ్) అలీ (పర్దీన్ ఖాన్)లు సిడ్నీలో ఉంటుంటారు. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మాయితో జీవితాన్ని గడిపేస్తుంటారు. ఒకరోజు వారి ఇంటి ముందు ఒక పాప ఉంటుంది. ఆ పాప ఎవరికి సంబంధించినదో తెలుసుకొని వారికి అప్పగించాలనే తాపత్రయంలో వారి జీవన విధానాన్ని మార్చుకుంటారు. ఇంతకీ ఆ పాప ఎవరికి సంబంధించినది?

బేటా

రాజు (అనిల్ కపూర్) తల్లి చిన్నతనంలోనే చనిపోతే అతని తండ్రి నాగిని (అరుణా ఇరానీ)ని పెళ్ళిచేసుకుంటాడు. రాజు సవతి తల్లి అంటే ఎంతో ప్రేమగా ఉంటాడు. కాని ఆమె మాత్రం రాజు తనకు బానిసగా చేసి రాజు తండ్రిని బంధించి ఇంటిమీద, ఆస్తిమీద పెత్తనం చలాయిస్తుంది. ఈ విషయం అమాయకుడైన రాజు గమనించడు. అనుకోని పరిస్తితులలో రాజు సరస్వతి (మాధురీ దీక్షిత్)ని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. నాగిని చేసే అరాచకాలకు సరస్వతి బాగా బుద్ధి చెబుతుంది. ఇంతకీ రాజు తన తల్లి నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడా?

నమస్తే లండన్

ఇండియాలో పుట్టి పెరిగిన మన్మోహన్ మల్హోత్రా(రిషి కపూర్) లండన్‌లో స్థిరపడతాడు. కొన్ని సంవత్సరాల తరువాత కూతురు జస్మిత్ (కత్రినా కైఫ్)ని తీసుకొని ఇండియా వస్తాడు. తన కూతురికి ఇండియన్‌కి ఇచ్చి పెళ్ళిచేయాలనే కోరికతో ఉంటాడు. ఆ కారణంగా జస్మిత్ అంగీకారం తెలుకోకుండానే అర్జున్ సింగ్ (అక్షయ్ కుమార్)కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కొన్నిరోజుల తరవాత జస్మిత్‌కి ఇండియా వాతావరణం నచ్చక లండన్ వెళుతుంది. అక్కడ తన స్నేహితుడు చార్లెస్‌ని పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న అర్జున్ జస్మిత్, చార్లెస్‌ని కలపాలనుకుంటాడు

సాగర్

రాజా (కమల్ హాసన్) మోనా (డింపుల్ కపాడియా)లు చిన్ననాటి స్నేహితులు. వీరు సముద్రపు ఒడ్డున ఉండే ఒక గ్రామంలో నివసిస్తుంటారు. రాజా మోనాని ఆరాధిస్తుంటాడు. ఆర్థికంగా బాగా స్థిరపడిన తరువాత పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. ఇదిలా ఉండగా కమలాదేవి అనే కోటీశ్వరాలు ఆ గ్రామంలో చేపలపరిశ్రమ పెట్టాలనుకుంటుంది. ఆమె మనవడు రవి (రిషికపూర్) మోనా ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న కమలాదేవి మోనా, రవి మధ్య మనస్పర్ధలు వచ్చేలా చేస్తుంది.

హల్‌చల్

ఈ చిత్రం రెండు కుటుంబాల పగ, ప్రతీకారాల మధ్య తిరుగుతుంటుంది. అంగార్ చంద్ (అమ్రిష్‌పురి) లక్ష్మీదేవి(లక్ష్మి) కుటుంబాల మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటుంది. అంగార్‌చంద్ నలుగురు కొడుకులలో చిన్నవాడైన జై (అక్షయ్ ఖన్నా) లా కాలేజీలో చదువుతుంటాడు. లక్ష్మీదేవి మనవరాలైన అంజలి (కరీనా కపూర్) కూడా అదే కాలేజీలో చదువుతుంటుంది. వీరిద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి అంజలికి వేరే సంబంధం చూస్తుంది. ఆ తరువాత జరిగే కథనాన్ని

రేస్

రన్‌వీర్ (సయీఫ్ ఆలీఖాన్) రాజీవ్(అక్షయ్ ఖన్నా)లు అన్నదమ్ములు. రన్‌వీర్ బిజనెస్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంటాడు. రాజీవ్ మాత్రం తాగుడుకి బానిసైపోతాడు. సెక్రటరీ సోఫియా (కత్రినా కైఫ్)రన్‌వీర్‌ని ప్రేమిస్తుంది. రన్‌వీర్ సానియా(బిబాసా బసు) పెళ్ళిచేసుకోవాలనుకుంటారు. రాజీవ్ సానియాని చూసి ఆమెను తనకిచ్చి పెళ్ళిచేస్తే తాగుడు మానేస్తానని ప్రమాణం చేస్తాడు. తమ్ముడు మారాలనే ఉద్దేశ్యంతో సానియాతో పెళ్ళి జరిపిస్తాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పురాదు. రన్‌వీర్ సానియాతో సన్నిహితంగాఉండటం రాజీవ్ చూస్తాడు. ఆ తరువాత జరిగే పరిణామాలు

రామ్తేరీ గంగా మైలీ

గంగా సింగ్ (మందాకిని)తన సోదరుడు కరమ్తో గంగోత్రి నదికి దగ్గరలో నివసిస్తుంటారు. ఒకరోజు కలకత్తా కాలేజీ విద్యార్థి అయిన నరేంద్ర సాహే(రాజీవ్ కపూర్) గంగానది పుట్టుపూర్వోత్తరాలు, పవిత్రత గురించి రీసెర్చ్ చేయడానికి గంగ, అతని సోదరుడి సహాయం కోరతాడు. వీరిపరిచయం ప్రేమగా మారి పెళ్ళిచేసుకుంటాడు. కొన్నిరోజులకు నరేంద్ర తల్లిదండ్రులను ఒప్పించి గంగను తీసుకొనివెళతానని వారి ఊరు వెళతాడు. భర్త, కొడుకు క్షేమం కోసం రిషీకేస్ వెళుతుంది.

అక్కడ కొన్ని కారణాల వలన ఆమె చూపును కోల్పోతుంది. భగవత్ చౌదరి అనే రాజకీయకుడు ఆమెను రక్షించి ఆశ్రయం కల్పిస్తాడు. గంగ, నరేంద్ర కలుస్తారా? నరేంద్ర తల్లిదండ్రులను ఒప్పించి భార్యగా స్వీకరిస్తాడా?

సంగమ్

అనాధ అయిన సుందర్ (రాజ్‌కపూర్) ధనవంతుడైన గోపాల్ (రాజేంద్రకుమార్) రాధ(వైజయంతిమాల)ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. సుందర్ రాధను ప్రేమిస్తాడు. కాని రాధ తల్లిదండ్రులు అనాథ అయిన సుందర్‌తో పెళ్లికి ఇష్టపడరు. పట్టుదలతో ఎయిర్ ఫోర్స్‌లో చేరి డబ్బు సంపాదించి రాధను పెళ్ళిచేసుకుంటానని వెళతాడు. ఈలోగా సుందర్ ఒక ప్రమాదంలో చనిపోయాడని తెలిసి రాధ తల్లిదండ్రులు గోపాల్‌తో పెళ్ళి చేయడానికి నిశ్చయిస్తారు. వీరిద్దరు ఒకటవుదామనుకునే తరుణంలో సుందర్ ప్రమాదం నుంచి బయటపడి తిరిగి వస్తాడు. ఇపుడు రాధ సుందర్‌ని పెళ్ళి చేసుకుంటుందా? లేక గోపాల్‌ని పెళ్ళి చేసుకుంటుందా?